Friday, January 31, 2014

Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌)

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... నారు పోసిన వాడు నీరు పొయ్యడా.... అన్నది మనందరి నమ్మకం! గర్భం విషయంలో కూడా చాలామంది ఇలాగే అనుకుంటూ.. ఒకసారి గర్భం వస్తే చాలు.. ఇక తర్వాత అంతా సజావుగానే

జరిగిపోతుందని భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదుగానీ.. గర్భం విషయంలో మాత్రం అన్నిసార్లూ ఇలాగే జరగాలనేం లేదు. పైగా గర్భం పోవటం.. కడుపు నిలబడకపోవటమన్నది

మనందరం అనుకునేంత అరుదైన సమస్యేం కాదు. దాదాపు ప్రతి ఆరు గర్భాల్లో ఒకటైనా ఇలా అర్ధాంతరంగానే ముగిసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే చాలకాలంగా వైద్యరంగం గర్భం

పోవటం.. (మిస్‌ క్యారేజ్‌) పైన లోతుగా దృష్టిపెడుతోంది.

కారణమేదైనా, గర్భం దాల్చిన తొలి వారాల్లోనే జరిగినా లేక ఆ తర్వాత జరిగినా.. అర్ధాంతరంగా గర్భం పోవటమన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను మిగిల్చే అంశమే. గర్భం పోవటమన్నది

చాలా రకాలుగా జరగొచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు ముక్కలన్నీ బయటకువెళ్లిపోయి గర్భసంచీ శుభ్రం కావటానికి వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు.

ఇందుకోసం వైద్యులు మందులు ఇస్తారు. అవసరమైతే కొన్నిసార్లు మత్తు ఇచ్చి, చిన్నాపరేషన్‌ చేసి శుభ్రం చెయ్యాల్సి రావచ్చు. అయితే ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో

అనుమానాలు ముసురుకుంటాయి.మళ్లీ గర్భం వస్తుందా? రాదా? అసలు ఎందుకిలా జరిగింది? ఒకవేళ వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? మళ్లీ గర్భం కోసం ఎప్పుడు

ప్రయత్నించొచ్చు? ఇలాంటి సందేహాలు అనంతం.


గర్భం ఎందుకు పోతుంది?
తొలివారాల్లో గర్భం పోవటానికి చాలావరకూ క్రోమోజోముల లోపమే కారణం కావచ్చు. దీన్నో రకంగా జన్యుపరమైన పొరపాటు అనుకోవచ్చు. ఇది చాలా వరకూ ఆ గర్భానికి సంబంధించినదే కాబట్టి

మళ్లీ ఇలా జరగకపోవచ్చు కూడా. అయితే గర్భిణి వయసు పెరుగుతున్న కొద్దీ.. 35 ఏళ్లు పైబడితే ఇటువంటి జన్యుపరమైన పొరపాట్లకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి 35 ఏళ్లు పైబడిన గర్భిణులకు

గర్భంపోయే ముప్పు కాస్త ఎక్కువ ఉంటుదని గుర్తించాలి.

అలాగే- గర్భిణులు పొగతాగినా, మద్యం తాగినా, అలాగే అధిక బరువు ఉన్నా, గర్భాశయంలో నిర్మాణపరంగా ఏవైనా లోపాలున్నా, లేక గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) బలహీనంగా ఉన్నా,

దీర్ఘకాలిక వ్యాధులేవైనా ఉన్నా, మధుమేహం ఉండి - అది అదుపు తప్పినా.. ఇటువంటి సందర్భాల్లో కూడా గర్భం నిలబడకుండా మధ్యలోనే పోయే ముప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది.

* ఇవేవీ కాదు: గర్భంపోతే.. తామేదో తప్పు చేశామనీ, అందుకే ఇలా జరిగిందని చాలామంది తమను తాము నిందించుకుంటుంటారు. ముఖ్యంగా బరువులు ఎత్తటం వల్లనో, పని ఎక్కువగా చెయ్యటం

వల్లనో, మలబద్ధకంగా ఉంటే బలంగా ముక్కటం వల్లనో, మానసిక ఒత్తిడికి లోనవ్వటం వల్లనో, శృంగారంలో పాల్గొనటం వల్లనో, లేకపోతే ఏవో తినకూడనివి తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో

తామే మథనపడుతుంటారు. కానీ ఇవేవీ గర్భస్రావానికి కారణం కావు. ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకుని ఎక్కువగా మథనపడాల్సిన పని లేదు. వైద్యులు కూడా వరసగా రెండుమూడు

దఫాలుగా గర్భం పోతుంటేనే కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్షల వంటివి చేయిస్తారు.

ఏది కాదు.. ఏది అవును?
గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో కొద్దికొద్దిగా, ఎప్పుడన్నా ఎరుపు కనబడటం సహజం. దానర్థం గర్భం పోతోందనేం కాదు. సాధారణంగా ఈ సమయంలో వీరికి నొప్పి ఉండదు. దీన్నే 'థ్రెటెన్డ్‌

మిస్‌క్యారేజ్‌' అంటారు. వీరిలో చాలామందికి మెల్లగా స్రావం ఆగిపోతుంది, లోపల బిడ్డ కూడా ఆరోగ్యంగానే పెరుగుతుంది. చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది గర్భం పోయే వరకూ వెళుతుంది.
గర్భం పోతుంటే.. లక్షణాలేమిటి?
* పొత్తికడుపులో తెరలుతెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం.. గర్భం పోయేటప్పుడు కనబడే సాధారణ లక్షణాలివి. క్రమేపీ యోని నుంచి ఎర్రటి రక్తపు గడ్డల్లా, కణజాలం, ముక్కల వంటివి

బయటకు రావచ్చు. దీనర్థం గర్భం పోయిందనే. నొప్పి దీని ప్రత్యేక లక్షణం.

* కొంతమంది గర్భిణులకు చిత్రంగా... నొప్పి, స్రావం వంటి లక్షణాలేవీ ఉండవు. లోపల బిడ్డ పెరుగుదల ఆగిపోతుంది, లేదా అది చనిపోతుంది. అయినా లోపలే ఉండిపోతుంది. ఉన్నట్టుండి వేవిళ్లు

ఆగిపోవటం, రొమ్ముల్లో సలపరింత తగ్గిపోవటం.. వంటి లక్షణాలు మాత్రమే ఉండొచ్చు. వీరి విషయంలో చాలాసార్లు వైద్యులు పరీక్షించే వరకూ కూడా గర్భం పోయిన విషయం బయటపడదు. (దీన్నే

వైద్యులు 'మిస్డ్‌ మిస్‌క్యారేజ్‌' అంటుంటారు.)

*కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపునొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇది తప్పకుండా వైద్యుల దృష్టికి

తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. వీరికి పిండం గర్భసంచీలో కాకుండా ఫలోపియన్‌ ట్యూబుల్లో పెరుగుతూ (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ), అది చిట్లిపోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా

ఆపరేషన్‌ చెయ్యాల్సిన అసవరం కూడా రావచ్చు.
ఆసుపత్రికి వెళ్లాలా?
గర్భం దాల్చిన తర్వాత ఏ రూపంలో రుతుస్రావం కనబడినా తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. ఎందుకంటే రుతుస్రావం కనబడటానికి గర్భం పోవటం ఒక్కటే కారణం కానవసరం

లేదు. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటివి చేసి కారణం ఏమిటన్నది నిర్ధారిస్తారు. స్కానింగులో పిండం గుండె కొట్టుకుంటోందంటే చాలావరకూ గర్భస్రావం కాదనే అర్థం. గుండె కొట్టుకోవటం

ఆగిపోతే గర్భం పోయిందని అర్థం. ఒకవేళ స్కానింగులో ఇంత స్పష్టంగా తెలియకపోతే ఒకటిరెండు వారాల తర్వాత మళ్లీ స్కానింగుకు రమ్మని చెబుతారు. గర్భం పోయిందని నిర్ధారణ అయ్యి.. ఇతరత్రా

సమస్యలేవీ లేకపోతే... చాలామందికి ముక్కలవీ కొద్దిరోజుల్లో సహజంగానే రుతుస్రావంతో కలిసి బయటకు వెళ్లిపోయి మెల్లగా రుతుస్రావం ఆగిపోతుంది. దీనికి 14 రోజుల వరకూ పట్టొచ్చు. ఇతరత్రా

సమస్యలేవైనా ఉంటే మాత్రం వైద్యులు ఇలా సహజంగా అదే వెళ్లిపోతుందని వదిలెయ్యకుండా చికిత్సా మార్గాలను సూచిస్తారు. ముఖ్యంగా ముక్కలన్నీ శుభ్రంగా బయటకువెళ్లిపోవటానికి మందులను

సూచిస్తారు. ఇందుకు నోటి ద్వారా తీసుకునే మాత్రలుంటాయి, కొన్నింటిని యోనిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో గర్భసంచీలోనిదంతా బయటకు వెళ్లిపోతుంది. దీనికోసం ఆసుపత్రిలో చేరాల్సిన

పని కూడా ఉండదు. దీనివల్ల ఓ మూడు వారాల వరకూ రుతుస్రావం అవ్వచ్చుగానీ, ఇదేమంత ఎక్కువగా ఉండదు. మూడు వారాల తర్వాత గర్భనిర్ధారణ పరీక్ష చేసి చూసుకోవటం అవసరం.

కొద్దిరోజుల్లో రక్తస్రావం ఆగకపోయినా, మరీ ఎక్కువ అవుతున్నా వైద్యులు చిన్నాపరేషన్‌ సూచించొచ్చు. మందులు కుదరకపోయినా, లేక మందులతో సరిగా అవ్వకపోయినా అప్పుడు వైద్యులు కొద్దిగా

మత్తు ఇచ్చి.. గర్భాశయ ముఖద్వారాన్ని వెడల్పుచేసి, లోపల మిగిలిపోయిన ముక్కల వంటివాటన్నింటినీ బయటకు తీసేస్తారు. దీంతో సమస్య సర్దుకుంటుంది. దీని తర్వాత జ్వరం వచ్చినా, లేక

దుర్వాసనతో స్రావాలు వస్తున్నా, పొత్తికడుపులో నొప్పి వస్తున్నా ఇన్ఫెక్షన్‌ వచ్చిందేమోనని అనుమానించి వైద్యులకు చూపించుకోవటం చాలా అవసరం. దీన్ని కూడా యాంటీబయాటిక్స్‌తో

సమర్థంగానే నయం చెయ్యొచ్చు.
మానసికంగానూ కోలుకోవాలి!
గర్భం పోయినట్లు తెలియగానే కాస్త బాధగా, వెలితిగా అనిపించటం సహజం. గర్భం కావాలనుకున్నది కాకపోయినా.. అది పోయిందని తెలిసినప్పుడు ఎంతోకొంత వేదనగా అనిపించొచ్చు. ఈ

సమయంలో మనసులో భావాలను ఇతరులతో పంచుకోవటం చాలా ఊరటనివ్వచ్చు. గర్భం వచ్చిన విషయం, అది పోయిన విషయం కుటుంబంలోని వారికి, స్నేహితులకు తెలియకూడదని

అనుకుంటుంటే వైద్యులతోగానీ, కౌన్సెలర్‌తోగానీ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మనసులో రకరకాల భావోద్వేగాలు రేగుతూ.. పరిస్థితులు గందరగోళంగా అనిపించే అవకాశాలే ఎక్కువ.

ముఖ్యంగా భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం దక్కుతోందా? ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎలా ఉన్నాయి? త్వరగా కోలుకుని రోజువారీ పనుల్లోకి వెళ్లిపోవాల్సిన అవసరం ఉందా? భవిష్యత్తులో మళ్లీ

గర్భం వస్తుందా? లేదా అన్న భయాలు.. ఇలాంటివన్నీ కలిసి.. మానసికంగా కల్లోలం రేగినట్లుండొచ్చు. వైద్యులు, లేదా కౌన్సెలర్ల సలహా తీసుకుంటే ఆత్మవిశ్వాసం, సాంత్వన లభిస్తాయి.
గర్భం పోయిన తర్వాత...
* గర్భం పోయిన తర్వాత.. చాలామందికి కొద్దిరోజుల్లో రుతుస్రావం ఆగిపోతుంది. కొందరికి మాత్రం రెండు వారాల వరకూ పట్టొచ్చు. మొత్తానికి చాలామందిలో ఎర్ర గడ్డల వంటివి పడొచ్చుగానీ

రుతుస్రావం మరీ ఎక్కువగా పోదు. బహిష్టు సమయంలో మాదిరిగానే కొద్దిగా నొప్పి ఉండొచ్చు. ఈ నొప్పికి కావాలంటే సాధారణ నొప్పి నివారణ మందులు తీసుకోవచ్చు.

* గర్భం పోయిన 4-6 వారాల తర్వాత మళ్లీ బహిష్టు మొదలవ్వచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, దుర్వాసన ఉన్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. లోపల ఏదైనా ముక్క

మిగిలిపోయి, ఇన్ఫెక్షన్‌ ఆరంభమైతే ఇటువంటి లక్షణాలు కనబడతాయని గుర్తించాలి.

* రుతుస్రావం ఆగిపోయి, సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ కొద్దిపాటి విశ్రాంతి కూడా మంచిదే.

* గర్భం కావాలనుకుంటున్నవారు.. గర్భం పోయిన వెంటనే మళ్లీ ప్రయత్నించకుండా.. కనీసం ఒక రుతుచక్రం (బహిష్టు) అన్నా సాధారణంగా వచ్చి వెళ్లే వరకూ ఆగటం మంచిది. ఈ సమయంలో

గర్భనిరోధకాలు వాడుకోవచ్చు.

* గర్భం పోతే వెంటనే రక్తం గ్రూపు ఏమిటో చూపించుకోవాలి. ఒకవేళ గర్భిణిది నెగిటివ్‌ గ్రూపు అయితే.. గర్భం పోగానే 'యాంటీ డీ' ఇంజక్షన్‌ తీసుకోవటం అవసరం.
మరోసారి...?
గర్భం పోయిన తర్వాత చాలామందికి పట్టుకునే పెద్ద భయం.. మళ్లీ గర్భం వస్తుందా? రాదా? వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? అన్నది. నిజానికి గర్భం పోవటమన్నది

చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. దీనికి కూడా చాలాసార్లు కడుపులో ఉన్న పిండం సజావుగా లేకపోవటమే కారణమవుతుంటుంది. వరసగా రెండుసార్లు గర్భం పోవటమన్నది 5%

కంటే తక్కువమందిలోనే జరుగుతుంది, ఇక వరసగా మూడుసార్లు పోవటమన్నది 1% కంటే కూడా తక్కువ. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులుపడాల్సిన పని లేదు. గర్భం పోయిన

తర్వాత సహజంగా ఒక రుతుచక్రం అయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించొచ్చు. గర్భం వచ్చి, రెండు కంటే ఎక్కువసార్లు పోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం-పొగ వంటివాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలియాసిడ్‌ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా

చూసుకోవటం.. ఇవన్నీ తర్వాతి గర్భాలు ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేసే అంశాలు.
తరచూ పోతుంటే..?
మొదటి 23 వారాల్లోపే గర్భం పోతుండటం, ఇలా వరసగా మూడుసార్ల కంటే ఎక్కువగా జరిగితే దాన్ని వైద్యులు 'రికరెంట్‌ మిస్‌క్యారేజ్‌' అంటారు. ఇది మానసికంగా ఎంతో వేదన మిగిల్చే పరిస్థితి.

దాదాపు వందమందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంటుంది. వీరిలో ప్రత్యేకమైన సమస్యలేమైనా ఉన్నాయా? అని వైద్యులు లోతుగా పరీక్షిస్తారు. ఇందుకోసం కొన్ని రక్తపరీక్షలు, క్రోమోజోముల పరీక్షలు,

అల్ట్రాసౌండ్‌ వంటివి చేయిస్తారు. మరీ అవసరమైతే హిస్టెరోస్కోపీ, సోనోహిస్టెరోగ్రామ్‌ వంటివి చేయిస్తారు. వయసు ఎక్కువగా ఉండటంతో పాటు గతంలో గర్భాలు ఎన్ని ఎక్కువసార్లు పోతే.. మళ్లీ పోయే

రిస్కు అంత ఎక్కువగా ఉంటుంది. వైద్యులు జన్యుపరమైన లోపాల వంటివన్నీ చూస్తారు. అలాగే గర్భాశయ నిర్మాణం ఎలా ఉందన్నదీ పరిశీలిస్తారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌)

గర్భం పూర్తయ్యే వరకూ బిగువుగా ఉండాలి. కానీ కొద్దిమందిలో ఇది మధ్యలోనే బిగువు సడలిపోయి, 3-6 నెలల మధ్యే గర్భం పోయేలా చేస్తుంది. వీరిని అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో ముందుగానే

గుర్తించొచ్చు. ఇలాంటి వారికి వైద్యులు ముందస్తు జాగ్రత్తగా సర్విక్స్‌కు ఒక కుట్టు వేస్తారు. అండాశయాల్లో నీటితిత్తులు (పాలి సిస్టిక్‌ ఓవరీ) సమస్య ఉన్న వారికి హార్మోన్లు అస్తవ్యస్తమై గర్భం

పోవచ్చన్న భావన ఉందిగానీ పాలిసిస్టిక్‌ సమస్య వల్లే ఇలా జరుగుతుందని చెప్పేందుకు ప్రత్యేక ఆధారాలేవీ లేవు. అవసరాన్ని బట్టి వైద్యులు వీరికి హార్మోన్‌ చికిత్సలు అందిస్తారు. తరచూ గర్భాలు

పోతున్న వారిలో 15% మందికి 'యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబోడీ'లనేవి ఉంటాయి. వీటివల్ల గర్భం నిలబడే అవకాశాలు తక్కువ. వీరికి వైద్యులు పరిస్థితిని బట్టి రకరకాల చికిత్సా విధానాలు

సూచిస్తారు. తరచూ గర్భస్రావాలు ఎందుకు అవుతున్నాయన్నది అందరి విషయంలోనూ ఇదమిత్థంగా గుర్తించటం కష్టం కావచ్చు. ఒకవేళ గుర్తించలేకపోయినా దిగులుపడాల్సినదేమీ లేదు,

ఎందుకంటే ఏకారణమూ తెలియకుండా తరచూ గర్భస్రావాలు అవుతున్న 60-70 శాతం మంది కూడా.. ఆ తర్వాత చక్కగా గర్భం దాల్చి, పండంటి బిడ్డలను కంటున్నట్టు స్పష్టంగా గుర్తించారు.

కాబట్టి బెంబేలు పడిపోవాల్సిందేమీ లేదు, ఆశావహంగా ఉండటం ముఖ్యం!

Courtesy with : Dr.Pranathi Reddy (Rainbow hos.Hyd)@eenadu sukhibhava(28-Jan-14).
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.