Friday, January 3, 2014

Brain surgery and awareness,మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • మెదడు
మన మనుగడకు మూలాధారం! మన ఆశలకూ, ఆలోచనలకూ.. అనుబంధాలకూ, ఆశ్చర్యాలకూ.. మేధకూ.. చివరికి బాధలకూ... అన్నింటికీ అదే భాండాగారం! ఎంత కీలకమో అంత సున్నితం! అందుకే 'శిరోధార్యం'లా.. మన తలలో పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్ల మధ్య.. దృఢమైన కపాల ఎముకల గూడులో.. నీటి అలల నడుమ.. సుతారంగా తేలుతుంటుంది మన మెదడు! అక్కడి నుంచే అణువణువునూ నియంత్రిస్తూ.. ఆపాదమస్తకాన్ని శాసిస్తూ.. అంతా తానై మన జీవితాన్ని నడిపిస్తుంటుంది.

అందుకే మెదడులో ఏదైనా సమస్య తెలెత్తిందంటే భయంతో కంపించిపోతాం. ఇక ఆ సమస్యను తొలగించేందుకు మెదడు మీద కత్తి పెడతారంటే... ఎంత భయం ముసురుకుంటుందో అనూహ్యం! కపాల ఎముక తెరిచి... మెదడును ముట్టుకుని.. దాన్ని మరమ్మతు చేస్తారన్న వూహే వణుకుపుట్టిస్తుంది. కానీ మన ఆధునిక వైద్యరంగం, 'న్యూరో సర్జరీ' విభాగం ఈ దిశగా ఎంతో పురోగమించింది. నిత్యం మెదడు మీద అత్యంత క్లిష్టమైన సర్జరీలను సునాయాసంగా పూర్తిచేస్తూ.. మనిషికి భరోసాగా నిలబడుతున్న ఈ విభాగంపై అవగాహన పెరిగిన కొద్దీ మనలో భయాలు తొలగిపోతాయి. అందుకే దీనికి సంబంధించిన ఎన్నో అబ్బురపరిచే అంశాలు .

మన మెదడు ఓ విస్మయాల పుట్ట! నిజంగా చెప్పాలంటే అదో కొవ్వు ముద్ద. తనకంటూ ఒక ఆకృతి ఉండదు. బయటకు తీసి బల్ల మీద పెడితే ముద్దలా, సుద్దలా కూలబడుతుంది. అలాంటి మన మెదడు.. పుర్రె ఎముక గూడులో నీళ్లలాంటి ద్రవంలో తేలియాడుతూ.. ఆ ద్రవం ఒత్తిడికే ఆ ఆకృతిలో ఉంటుంది. మన మెదడు గురించి ఇటువంటి వింతలూ, విశేషాలూ ఎన్నో! ఇదే కాదు, మెదడుకు చేసే సర్జరీలూ ఇంతే ఆసక్తికరం.

  • కీలకంలో అత్యంత కీలకం!
మెదడులోని భాగాలన్నీ కీలకమైనవే అయినా... కొన్ని ప్రాంతాలు మరింత కీలకం! వీటినే 'ఎలోక్వెంట్‌ ఏరియా'లంటారు. వీటికి ఏపాటి నష్టం జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు మన రెండు చెవులకూ పైభాగాన ఉండే మెదడు భాగం (మోటార్‌ కార్టెక్స్‌) దెబ్బతింటే.. ఏ వైపు దెబ్బతిందో దానికి అభిముఖంగా ఉండే శరీర భాగం బలహీనపడుతుంది. అలాగే స్పర్శలను తెలియజెప్పే 'సెన్సరీ కార్టెక్స్‌', మాటలకు కేంద్రమైన 'బ్రోకాస్‌' ప్రాంతం, జ్ఞాపకశక్తికి కీలకమైన 'హిప్పోకాంపస్‌', 'టెంపోరల్‌' లంబిక.. ఇలా ఏవి దెబ్బతిన్నా సమస్యే. మరోవైపు ఫ్రాంటల్‌, టెంపోరల్‌, ఆక్సిపిటల్‌ లంబికలకు ఆపరేషన్‌ చేసి, వీటి నుంచి కొంత భాగాన్ని తొలగించినా కూడా చెప్పుకోదగ్గ సమస్యలుండవు. అందుకే మెదడు సర్జరీల్లో.. ఎక్కడ ఎంత వరకూ తియ్యచ్చు? దేన్ని ముట్టుకోకూడదు? అన్నది కీలకం. ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు న్యూరో సర్జన్లు 'నావిగేషన్‌' వంటి అత్యాధునిక విధానాలను అనుసరిస్తుంటారు.
  • నొప్పి తెలియదు!
మన ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ మనకు తెలియజెప్పేది మెదడే అయినా.. స్వయానా దాని నొప్పులు మాత్రం దానికి తెలియవు. మెదడును ముట్టుకున్నా, సర్జరీ చేసినా, కొంత భాగం తొలగించినా కూడా నొప్పి ఉండదు. సర్జరీ సమయంలో తల మీద ఉండే చర్మాన్ని కట్‌చేసి తెరిచేప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. సాధారణంగా మెదడు సర్జరీలన్నీ పెద్దమత్తు (జనరల్‌ అనస్థీషియా) కిందే చేస్తారు. కానీ మెదడులోని కీలక ప్రాంతాల్లో కణితుల్లాంటివి ఉంటే, అవసరాన్ని బట్టి స్థానికంగా మత్తు ఇచ్చి సర్జరీ పూర్తి చేస్తారు. మెదడు మీద కొన్ని ప్రాంతాల్లో చేత్తో ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుందిగానీ కొన్ని ప్రాంతాల్లో అదీ తెలియదు. సాధారణంగా మెదడులోని నాడీకణాలన్నీ విద్యుత్‌ ప్రచోదనాలకే ఉత్తేజితమై, ప్రేరణ పొందుతాయి. అందుకే స్థానిక మత్తుతో ఆపరేషన్‌ చేస్తుంటే అవసరాన్ని బట్టి కొన్ని మెదడు ప్రాంతాలను గుర్తించేందుకు కరెంట్‌తో ప్రేరేపిస్తుంటారు కూడా!
  • మాట్లాడుతూనే సర్జరీ
మాటలకు, సంభాషణలకు కీలకమైన 'బ్రోకాస్‌' ప్రాంతం వంటి వాటికి సర్జరీ చెయ్యాల్సి వస్తే- మనం ఎంత ప్రాంతం తొలగిస్తున్నామన్నది తెలుసుకోవటం ముఖ్యం. లేకపోతే సర్జరీ తర్వాత రోగి మాట్లాడలేకపోవచ్చు కూడా. అందుకే స్థానికంగా మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేస్తూ... రోగిని మాట్లాడమని, అంకెలు లెక్కించమని చెబుతూ బ్రోకాస్‌ ప్రాంతాన్ని కరెంట్‌తో ప్రేరేపిస్తారు. ఆ ప్రాంతం ప్రేరేపితమైతే వెంటనే లెక్కించటం ఆగిపోతుంది. ఆగిపోయిందంటే అది 'బ్రోకాస్‌' ప్రాంతమని గుర్తించి, ఆ ప్రాంతంలో కణితి ఉన్నా.. దాన్ని ముట్టుకోకుండా, మిగతా ప్రాంతంలోని కణితిని తొలగించి సర్జరీ పూర్తి చేస్తారు. 'మోటార్‌ కార్టెక్స్‌' విషయంలోనూ ఇంతే. ఇవి రోగి స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు చేసే సర్జరీలన్న మాట!
  • అపోహ
చాలామంది మెదడులోని కొంత ప్రాంతాన్ని తొలగిస్తే రోగికి మానసికసమస్యలు తలెత్తుతాయని, పిచ్చివాళ్లవుతారని.. రకరకాలుగా భయపడుతుంటారు. అది నిజం కాదు. కొన్నికొన్ని భాగాలను తొలగించినప్పుడు ఆ ప్రాంతం నిర్వహించే పనులను మెదడులోని మిగతా భాగాలు చేపడుతుంటాయి. కాబట్టి చాలామందిలో పెద్ద తేడా కనబడదు. మెదడుకు ఈ సర్దుబాటు శక్తి ఉంది. కీలక ప్రాంతాలు తప్పించి, మిగతా మెదడులో కణితుల వంటివి వచ్చి, కొద్దిభాగం తొలగించినా కూడా సాధారణ జీవితం గడపటానికి పెద్ద ఇబ్బందేం ఉండదు.
మెదడు సర్జరీ: ఎలా చేస్తారు?
ముందు మెదడులో ఏ ప్రాంతానికి సర్జరీ చెయ్యాలో కచ్చితంగా గుర్తించి.. ఆ ప్రాంతంలో తలపై గల చర్మాన్ని వలిచి పక్కకు తీస్తారు. అప్పుడు ఆధునిక పరికరాలతో ఆ కాస్త ప్రాంతం పుర్రె ఎముకకు కోతబెట్టి, దాన్ని తీసి పక్కనబెడతారు. పుర్రె ఎముక తియ్యగానే కింద 'మినింజెస్‌' అనే పొరలు కనబడతాయి. వాటిని కత్తిరించి ఒకవైపునకు తీస్తే కింద ద్రవంలో (సీఎస్‌ఎఫ్‌) మెదడు ప్రత్యక్షంగా కనబడుతుంది. దానిపైన సర్జరీ పూర్తి చేస్తారు. వెంటనే మళ్లీ మినింజెస్‌ను కప్పి కుట్టేసి, ఎముకను తెచ్చి యథాస్థానంలో అమర్చి, పైన చర్మాన్ని మూసి కుట్లేస్తారు. మనం ఒంటి మీద చర్మం ఎక్కడైనా కట్‌ చేస్తే క్రమేపీ అది మానిపోయి, పూడుకుపోతుంది. కానీ మెదడు ఇలా కాదు.. అది కలుస్తుందిగానీ... ఆ ప్రాంతం పనితీరు మెరుగవ్వదు. అందుకే ఎప్పుడూ కూడా మెదడులో అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల ద్వారానే సర్జరీ చెయ్యాలని చూస్తుంటారు.
  • లంబికల అమరిక :
* నుదురు వెనకాలే ఉండే మెదడు భాగం ఇది. ఈ లంబికల్లో కణుతుల వంటివి పెరిగితే భావోద్వేగపరమైన సమస్యలు ఎక్కువ. కణుతులు లంబికలకు పైవైపున ఉంటే మానసిక కుంగుబాటు వంటి సమస్యలు ఎక్కువ, అదే కిందివైపు ఉంటే తిట్టటం, కొట్టటం వంటి ఉద్రేకపూరిత ప్రవర్తనలు ఎక్కువ. అలాగే వెనక వైపున వస్తే శరీర భాగాల కదలికలు ప్రభావితమవుతాయి.

* వినికిడి, జ్ఞాపకాలు, దృశ్యరూప జ్ఞాపకాలు, ముఖ్యంగా మాటలు, సంభాషణలకు కీలక ప్రాంతం ఇది.

* చెవి పైభాగాన ఉండే లంబికలు. సాధారణ స్పర్శలతో పాటు నొప్పి, వేడి-చల్లదనం వంటివన్నీ మనకు తెలియజెప్పే భాగాలివే. భాష, అంకెలు, లెక్కలు, గణకాలన్నింటికీ కూడా ఇవే కీలకం. అలాగే మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ఏవి ఎక్కడుంటాయి? అన్న పరిసర స్పృహకు కూడా ఇదే కారణం. ఈ లంబికలో కణితుల వంటివి పెరిగి, ఇది దెబ్బతింటే మనం ఇంటికి వెళ్లటం, ఇంట్లో ఏ గది ఎక్కడుందో తెలియటం కూడా కష్టం కావచ్చు.

* తల వెనక భాగాన ఉంటుంది. పరిమాణంలో చిన్నదైనా కంటి చూపునకు కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైనా కణితి పెరిగితే చూపు సమస్యలు తలెత్తుతాయి.
  • సాధారణ దుష్ప్రభావాలు
మెదడుకు సర్జరీ అనగానే చాలామంది రకరకాల దుష్ప్రభావాల గురించి భయపడుతుంటారు. నిజానికి 90% మెదడు సర్జరీలు విజయవంతంగా పూర్తవుతాయి. కేవలం ఓ 10% కేసుల్లో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. మొత్తానికి ఇతర సర్జరీలతో పోలిస్తే మెదడు సర్జరీలతో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం కాస్త ఎక్కువనే చెప్పాలి. కాకపోతే ఇవన్నీ కూడా తాత్కాలిక దుష్ప్రభావాలు. దీర్ఘకాలం మిగిలిపోయేవి కేవలం 1-2% మాత్రమే ఉంటాయి.

తక్షణ దుష్ప్రభావాలు
*మగత: సర్జరీ సమయంలో ఏదైనా తేడా వస్తే రోగి మత్తు నుండి త్వరగా బయటకు రాలేకపోవచ్చు. లేదంటే స్పృహకు కీలకమైన హైపోథాలమస్‌ వంటివి దెబ్బతింటే 4-5 రోజులు మగతగా ఉంటారు. ఇలాంటి వారిని కొద్దిరోజులు 'ఐసీయూ'లో ఉంచి చికిత్స చేస్తే క్రమేపీ మెలకువలోకి వస్తారు.

* ఫిట్స్‌: సర్జరీ సమయంలో ఎంతోకొంత మెదడు చికాకుకు గురవుతుంది. దీనివల్ల సర్జరీ తర్వాత ఫిట్స్‌ రావచ్చు. ఏ రకమైన మెదడు సర్జరీకైనా ఈ బెడద తప్పదు. అందుకే వారికి మూర్ఛ రాకుండా మందులు ఆరంభించి, వాటిని క్రమేపీ కొంతకాలానికి తగ్గిస్తారు.

* రక్తస్రావం: మెదడులో రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. శరీరంలోని మిగతా భాగాల్లో అయితే సర్జరీ సమయంలో రక్తనాళాలను కట్టటం, నొక్కటం వంటివి చేసి రక్తస్రావం ఆపొచ్చు. కానీ మెదడులో సూక్ష్మమైన రక్తనాళాలుంటాయి కాబట్టి అది సాధ్యం కాదు. అందుకే సర్జరీ సమయంలో వాటిని రసాయనాలతో ఆపటం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు సర్జరీ తర్వాత బీపీ పెరగటం వంటివి జరిగితే మెదడులో రక్తస్రావం కావచ్చు. ఇలా చిన్న రక్తం గడ్డ ఏర్పడితే మందులతో తగ్గించొచ్చుగానీ.. మరీ పెద్దగా ఉంటే మాత్రం మళ్లీ సర్జరీ చేసి.. మొత్తం తెరిచి, దాన్ని తొలగించాల్సి వస్తుంటుంది.

* గాలి-నీరు: సర్జరీ సమయంలో మెదడు పొరల్లో ఉండే నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో దాని స్థానంలో గాలి చేరి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి ఆ గాలి లోపల వ్యాకోచించి పీడనం పెంచుతుంది. దీంతో రోగికి మగత, ఫిట్స్‌ వంటివి రావచ్చు. వీరికి బయటి నుంచి అధిక మొత్తంలో ఆక్సిజన్‌ ఇస్తే శ్వాస ప్రక్రియ ద్వారా ఆ గాలి మెల్లగా బయటకుపోయి, దాని స్థానంలో ఆక్సిజన్‌ చేరుతుంది. సమస్య సర్దుకుంటుంది. ఇది పని చెయ్యకపోతే- చిన్న రంధ్రం చేసి, ఆ గాలిని బయటకు లాగెయ్యాల్సి ఉంటుంది.

మొత్తానికి ఇవన్నీ కూడా తాత్కాలికమైన దుష్ప్రభావాలే. వీటిని వైద్యులు సమర్థంగా ఎదుర్కొంటారు.
  • అపోహ
మెదడుకు సర్జరీ అంటే చాలామంది.. తలపైని పుర్రె ఎముక మొత్తాన్ని డిప్పలాగా కట్‌ చేసి పక్కనపెట్టి.. మెదడుకు మరమ్మతుచేసి.. మళ్లీ దాన్ని వెనక్కిపెట్టేస్తారని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మెదడులో ఏ ప్రాంతంలో సమస్య ఉందో ముందే గుర్తిస్తారు కాబట్టి.. కేవలం ఆ కాస్త భాగం దగ్గర మాత్రమే పుర్రె ఎముకను కట్‌ చేసి, మెదడు సర్జరీ పూర్తిచేస్తారు. డిప్పలా మొత్తం తియ్యటం ఉండదు.

  • నావిగేషన్‌: మెదడు మొత్తం ఓ మ్యాప్‌
మెదడు మీద సర్జరీ చేసేటప్పుడు.. తాము ఏ ప్రాంతాన్ని ముట్టుకుంటున్నామో, ఎక్కడున్నామో సర్జన్లకు తెలియటం అత్యంత కీలకం. ఇందుకోసం అద్భుతంగా ఉపయోగపడే పరిజ్ఞానం 'నావిగేషన్‌'. దీనికోసం ఆపరేషన్‌ థియేటర్లో 'ఇన్‌ఫ్రారెడ్‌ కెమేరాలు' అమర్చి ఉంటాయి. సర్జరీకి ముందు రోజే రోగి మెదడులో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాలు ఎలా ఉన్నాయనే వివరాలన్నింటినీ ఒక మ్యాప్‌లాగా దానిలో నిక్షిప్తం చేస్తారు. సర్జరీ రోజున రోగిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లగానే తలకు కెమేరాలకు అనుసంధానించిన ఫ్రేమ్‌ను అమరుస్తారు. ఇక అక్కడి నుంచీ అది కచ్చితంగా సర్జన్‌- మెదడు మీద ఏ ప్రాంతంలో ఉన్నారో, ఆ ప్రాంతం ఎలాంటిదో, దాన్ని తొలగించవచ్చో లేదో ఎప్పటికప్పుడు (జీపీఎస్‌ లాగా..) హెచ్చరిస్తుంటుంది. కాబట్టి తప్పు జరిగే ఆస్కారమే ఉండదు. కణితుల వంటివి మెదడు ఉపరితలం మీద ఉంటే స్పష్టంగా కనబడతాయిగానీ లోపలగా ఉంటే వాటిని గుర్తించటం కష్టం. ఇలాంటి సందర్భాల్లో 'నావిగేషన్‌' పరిజ్ఞానం బాగా ఉపకరిస్తుంది. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా.. దాన్ని చేరుకోవటానికి తల మీద పెద్ద ప్రాంతం తెరవాల్సి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్‌ సాయంతో కచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి.. అక్కడే తెరిచి... వాటిని తొలగించొచ్చు.

  • ఇవీ సర్జరీలు--కణితులకు సర్జరీ
  •  
మెదడుకు సంబంధించిన సమస్యల్లో కణితులు ముఖ్యమైనవి. ఇవి మెదడులో ఎక్కడైనా రావచ్చు. వీటిలో దాదాపు 60% క్యాన్సర్‌ కణితులే. సాధారణ కణితిని సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ కాన్సర్‌ కణితులను తొలగించటంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివీ అవసరమవుతాయి. మెదడులో వచ్చే క్యాన్సర్‌ కణితుల్లో 4 గ్రేడులు ఉంటాయి. సాధారణంగా ఇతరత్రా క్యాన్సర్లు 1వ దశతో మొదలై.. క్రమేపీ ముదిరి 4వ దశకు చేరతాయి. కాబట్టి తొలిదశలో గుర్తిస్తే వాటిని దాదాపు నయం చేసే వీలుంటుంది. కానీ మెదడు కణితులు ఇలా కాదు. అవి క్రమేపీ ఒక దశ నుంచి మరోదశకు వెళ్లటమన్నది ఉండదు. మొదలవుతూనే 3వ, 4వ దశల్లో కూడా ఉండొచ్చు. కణితి 1, 2 గ్రేడుల్లో ఉంటే చికిత్సతో దాదాపు పదేళ్ల వరకూ కూడా బాగానే జీవించగలుగుతారు. 4వ దశ కణితులు తీవ్రమైనవి, వీరు ఎక్కువకాలం జీవించటం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగులో అది గ్రేడ్‌-1, 2 లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన పనిలేదు. అది పెరుగుతుంటే, 2-3 సెం.మీ. కంటే పెద్దగా ఉంటే సర్జరీ అవసరం. ఇక 3, 4 దశల్లో ఉంటే సర్జరీతో పాటు రేడియేషన్‌, కీమోథెరపీలూ అవసరమవుతాయి. అలాగే ఫ్రాంటల్‌, టెంపోరల్‌ లంబికల్లో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకూ సాధారణ జీవితం గడపగలుగుతారు. మెదడు మధ్య భాగంలో అంటే బేసల్‌ గాంగ్లియా, థాలమస్‌, కార్పస్‌ కలోజమ్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే కణితులు మాత్రం ఉద్ధృతంగా ఉంటాయి.

* అందుకే ఎప్పుడైనా సరే- తీవ్రమైన, విడవని తలనొప్పి, వాంతులు, చూపు సమస్యలు, ఫిట్స్‌ వంటి లక్షణాలు ఉన్నట్టుండి మొదలైతే వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులకు చూపించుకుని, మెదడులో కణితులు లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

* సర్జరీ: కణితులు కీలక ప్రాంతాల్లో వస్తే వాటిని పూర్తిగా తొలగించటం సాధ్యం కాకపోవచ్చు. మాటలు, కదలికలకు కీలకమైన ప్రాంతాలను గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితులను తొలగిస్తారు. మిగిలిపోయిన వాటిని రేడియో థెరపీ, కీమోథెరపీలతో నయం చేసే ప్రయత్నం చేస్తారు.

* కణితి మెదడు మధ్యలో వస్తే- మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరుచేసి చూడటం కష్టం కావచ్చు. ఇలా పొరపాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ తేడా గుర్తించేందుకు- మైక్రోస్కోపు, నావిగేషన్‌ వంటి పరిజ్ఞానాలు ఉపయోగపడతాయి. ఒకవేళ మైక్రోస్కోపుతో గుర్తుపట్టలేమనుకుంటే సర్జరీకి ముందు రోజు- 'డై' రంగు మందు తాగిస్తారు. ఆ రంగు రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి మెదడులోని కణితుల్లో ఎక్కువగా చేరుతుంది. సర్జరీ సమయంలో అక్కడ 'ఫ్లోరసెంట్‌ లైట్‌' వేస్తే కణితి స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు దాన్ని తొలగించటం తేలిక. అదీ కష్టమనుకుంటే మెదడు కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కేవలం కణితి కణాలను మాత్రమే ధ్వంసం చేసే 'అల్ట్రాసోనిక్‌ ఆస్పిరేటర్‌' సాయంతో కణితిని నిర్మూలిస్తారు.

* సర్జరీ కాని సర్జరీ: హైపోథాలమస్‌, థాలమస్‌, బ్రెయిన్‌ స్టెమ్‌ వంటి కీలక ప్రాంతాల్లో సర్జరీ సాధ్యం కాని చిన్న కణితులు ఉంటే- కత్తిపెట్టాల్సిన పని లేకుండా కేవలం రేడియేషన్‌ ద్వారా కచ్చితంగా కణితిని గుర్తించి దాన్ని తొలగించేందుకు 'రేడియో సర్జరీ' ఉపకరిస్తుంది. దీనికోసం గామానైఫ్‌, నోవాలిస్‌, సైబర్‌నైఫ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధారణ కణితుల కోసం వాడతారు.

* ముక్క తియ్యటం: మెదడు మధ్య భాగమైన థాలమస్‌, బేసల్‌ గాంగ్లియా వంటి ప్రాంతాల్లో క్యాన్సర్‌ కణుతులు వస్తే వాటిని పూర్తిగా తొలగించటం కష్టం. వీరికి- తల మీద చిన్న రంధ్రం చేసి.. దాని ద్వారా తలకు ఫ్రేమ్‌ బిగించి.. కణితి కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో అక్కడి నుంచి ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. దీన్ని 'స్టీరియోటాక్సీ బయాప్సీ' అంటారు. దానిలో వచ్చే ఫలితాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలతో చికిత్స చేస్తారు.
  • మూర్ఛకు సర్జరీ
మూర్ఛకు చాలా వరకూ మందులతోనే చికిత్స చేస్తారుగానీ ఓ 30% మందికి మాత్రం 2, 3 రకాల మందులు వాడినా ఫలితం కనబడదు. ఇలాంటి వారికి సర్జరీతో ఫలితం ఉంటుంది. మందులు వాడినా నెలకు 2, 3 సార్లకు మించి ఫిట్స్‌ వస్తూ, రెండేళ్లకు పైగా బాధపడుతుంటే వారికి మందులన్నీ ఆపేసి.. ఆసుపత్రిలో చేర్చి ఫిట్‌ వచ్చినప్పుడు ప్రత్యేకమైన 'వీడియో ఈఈజీ' తీస్తారు. దీనిలో ఫిట్‌కు మూలమైన భాగం ఏది, విద్యుత్‌ సమస్య ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఎమ్మారై చేసి.. ఆ ప్రాంతంలో ఏదైనా తేడా ఉందా? అన్నదీ చూస్తారు. రెంటిలోనూ ఒకే ప్రాంతంలో తేడా ఉందని గుర్తిస్తే- వారికి సర్జరీ చేసి ఆ ప్రాంతాన్ని తొలగించొచ్చు. దాంతో మూర్ఛ నుంచి చాలా వరకూ విముక్తి వస్తుంది. చాలామందికి ఈ సమస్య టెంపోరల్‌ లంబికలో ఉంటుంది. దాన్ని తొలగించినా పెద్ద నష్టం ఉండదు. కీలకమైన ప్రాంతం నుంచి వస్తుంటే మాత్రం వారికి సర్జరీ సిఫార్సు చెయ్యరు. ఒక్కోసారి మెదడులో ఒక ప్రాంతమని కాకుండా... ఒక అర్ధభాగం మొత్తం మూర్ఛకు కారణమవుతుంటుంది. అప్పుడు 'హెమీస్పెరాటమీ' అనే సర్జరీ చేసి.. మెదడులోని రెండు అర్ధభాగాల మధ్యనా ఉండే అనుసంధానాలను కత్తిరిస్తారు. ఇందుకు కంప్యూటర్‌ 'నావిగేషన్‌' పరిజ్ఞానం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
  • పార్కిన్సన్‌కు సర్జరీ
వాస్తవానికి మన మెదడు ఎప్పుడూ అతిగా పని చేసేందుకే ప్రయత్నిస్తుంటుంది. కానీ మెదడులోని మరికొన్ని భాగాలు దాన్ని ఎప్పటికప్పుడు అదుపులో పెడుతుంటాయి. ఇలా మెదడు సమతౌల్యంతో పని చేస్తుంటుంది. అతి చురుకుదనానికి 'బేసల్‌ గాంగ్లియా' భాగం మూలమైతే దాన్ని నియంత్రించేది 'ఫ్రాంటల్‌ లోబ్‌'. ఈ ప్రచోదనాలు ప్రసరించేందుకు సహకరించే రసాయనం డోపమైన్‌. ఏదైనా కారణాన ఈ డోపమైన్‌ ఉత్పత్తి పెరిగినా, తగ్గినా మెదడు అతిగా పని చేస్తూ.. కండరాల వణుకు, కంపనం, బిగువు వంటివి పెరిగి సమస్యాత్మకంగా తయారవుతాయి. ఈ సమయంలో నియంత్రణ పెంచేందుకు కొన్ని కేంద్రాలను ధ్వంసం (లీజనింగ్‌) చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకు 'స్టీరియో టాక్టిక్‌' విధానంలో కచ్చితమైన కేంద్రాన్ని గుర్తించి అక్కడ ఎలక్ట్రోడ్‌ను అమర్చి, విద్యుత్‌తో ప్రేరేపించటం ద్వారా రోగికి కండరాల బిగువు తగ్గుతోందేమో గమనిస్తారు. సర్జరీ సమయంలో రోగిని మెలకువగానే ఉంచుతారు. అలా తగ్గితే 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌' ద్వారా దాన్ని ధ్వంసం చేస్తారు. కొందరికి 'హైఫ్రీక్వెన్సీ పేస్‌మేకర్‌' వంటి పరికరంతో 'డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌' చేస్తారు. ఇది కాస్త ఖరీదైనది.

  • పక్షవాతం - సర్జరీ
మెదడులోని రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం రావచ్చు. దీన్ని 'హెమరేజిక్‌ స్ట్రోక్‌' అంటారు. ఇలాంటప్పుడు మెదడు వాచి ఉబ్బినట్లవుతుంది. కానీ అది పెరగటానికి వీల్లేకుండా పుర్రె ఎముక గట్టిగా అడ్డుపడుతుంటుంది కాబట్టి మెదడు వాచిన కొద్దీ లోపల్లోపలే నొక్కుకుపోతూ దెబ్బతినిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి.. ఆ వైపు పుర్రె ఎముకను కట్‌ చేసి మెదడు నొక్కుకుపోకుండా ఖాళీ కల్పించే సర్జరీ చేస్తారు. అలా కట్‌ చేసిన పుర్రె ఎముకను తాత్కాలికంగా డొక్కలో చర్మం కింద ఉంచుతారు. ఎముక తొలగించిన తర్వాత తల పైన చర్మాన్ని కుట్టేస్తారు. మొదట్లో మెదడు వాపు వల్ల అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుందిగానీ ఐదారు వారాల్లో రక్తస్రావం దానంతట అదే సర్దుకుంటుంది. క్రమేపీ మెదడు వాపు తగ్గి అక్కడ సొట్టలా తయారవుతుంది. ఇక ఆ సమయంలో- మళ్లీ సర్జరీ చేసి, డొక్కలో పెట్టిన పుర్రె ఎముకను తెచ్చి తిరిగి తల మీద ఉంచి కుట్టేస్తారు.

వాస్తవానికి ఇది పక్షవాతానికి చికిత్స కాదు. రక్తనాళాలు చిట్లి మెదడు వాస్తున్నప్పుడు.. మిగతా మెదడు భాగం నొక్కుకుపోయి దెబ్బతినకుండా రక్షించుకునేందుకు చేసే చికిత్స. ఇలా చెయ్యకపోతే మిగిలిన మంచి భాగం కూడా దెబ్బతింటుంది. చాలామంది దీన్ని పక్షవాతం తగ్గించే సర్జరీ అనుకుంటూ.. ఈ సర్జరీ చేసినా పక్షవాతం పరిస్థితి మెరుగవ్వలేదని విమర్శిస్తుంటారు. వాస్తవానికి ఇది బాగున్న మెదడు భాగాలను రక్షించుకునే సర్జరీనేగానీ పక్షవాతం, దాని దుష్ప్రభావాలను తగ్గించేది కాదు.

* ఇవే కాదు, మెదడుకు క్షయవంటి రకరకాల సందర్భాల్లో కూడా మెదడుకు సర్జరీలు అవసరమవుతుంటాయి.

Courtesy with Dr.Manas Panigrahi(Neuro-surgeon)KIMS hos.Hyd@sukhibhava of eenadu news paper.
  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.