Thursday, March 13, 2014

Nicotin Addiction ,నికోటిన్‌ మానలేని వ్యథ

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Nicotin Addiction ,నికోటిన్‌ మానలేని వ్యథ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...దాదాపు సిగరెట్టు తాగేవాళ్లందరికీ తెలుసు... అది మంచి అలవాటు కాదని! మరి ఎందుకు మానలేకపోతున్నట్టు??-ఎందుకంటే సిగరెట్టు తాగకుండా ఉండలేరు కాబట్టి. మరి ఎందుకు ఉండలేరు?
ఒక్కటే కారణం. నికోటిన్‌! ఇదో పెద్ద వల. నిజానికి నికోటిన్‌ దానికి అదేగా ఏమంత చెడేం చెయ్యదు. అది చేసేదల్లా మాటిమాటికీ సిగరెట్టు తాగాలని అనిపించేలా తహతహలాడించటమే! అయితే అదొక్కటి చాలు.. జరగాల్సిన నష్టం జరిగిపోవటానికి. ఎందుకంటే మనం నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ సిగరెట్టు తాగుతుంటే... దీంతో పాటే సిగరెట్టులో ఉండే బోలెడు హానికర వ్యాధి కారకాలు.. ముఖ్యంగా క్యాన్సర్‌ కారకాలు మన ఒంట్లో చేరిపోతుంటాయి. అవి చెయ్యాల్సిన నష్టం అవి చేసేస్తుంటాయి.

అంటే.. ముందు నికోటిన్‌ వల వేస్తుంటుంది... ఆ తర్వాత క్యాన్సర్‌ కారకాలు ఒళ్లంతా కబళిస్తుంటాయి! దీనర్థమేమిటి? మనం నికోటిన్‌ తహతహ నుంచి బయటపడగలిగితే చాలు.. సిగరెట్టుకు స్వస్తి చెప్పటం తేలిక. నికోటిన్‌ గురించి మరింత సమగ్రంగా తెలుసుకోవటం ద్వారానే ఇది సాధ్యం.
ఒకటి.. రెండు.. మూడు.. వేగంగా టకటకా పది అంకెలు లెక్కపెట్టండి. ఈ కొద్ది సమయం చాలు.. మనం పీల్చిన సిగరెట్‌ పొగ ద్వారా నికోటిన్‌ మెదడును చేరటానికి! ఒక్కసారి అది మెదడును చేరిందంటే వెంటనే చురుకుదనం పెరిగినట్లు అనిపిస్తుంది. ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఆందోళన ఏదో తొలగిపోయినట్లుగా కాస్త తృప్తిగా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇదే 'పొగ' తాగినప్పుడు కలిగే అనుభూతి. నికోటిన్‌ వల్ల ఇటువంటి అనుభూతి కలిగే మాట వాస్తవమేనని ఇప్పుడు వైద్యపరిశోధనా రంగం కూడా అంగీకరిస్తోంది. చిత్రమైన విషయమేమంటే నికోటిన్‌ ఇన్నాళ్లుగా అంతా అనుకుంటున్నంతటి చెడ్డ పదార్థమేమీ కాదని, కాకపోతే నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ ఈ క్రమంలో సిగరెట్లకు బానిస కావటమే అసలు సమస్య అని వీరు చెబుతున్నారు. ఎందుకంటే పొగాకులో నికోటిన్‌ ఒక్కటే కాదు.. దాదాపు 4,000 రకాల రసాయనాలుంటాయి. వీటిలో దాదాపు 19 క్యాన్సర్‌ కారకాలు, చాలా తీవ్రమైనవి ఉన్నాయి. పొగ తాగినప్పుడు నికోటిన్‌తో పాటే ఇవన్నీ కూడా ఒంట్లో చేరిపోతాయి. ఇదే అసలు సమస్య. నికోటిన్‌ కోసం తహతహలాడుతూ సిగరెట్లు తాగుతున్న కొద్దీ ఈ దుష్ప్రభావాల తీవ్రతా పెరిగిపోతుంటుంది.

'దమ్ము' లాగటంలోనూ!
నికోటిన్‌ కోసం తహతహ అన్నది క్రమేపీ పెరిగే రకం! అందుకే మొదట్లోరోజుకు ఒకటిరెండు సిగరెట్లు తాగినవాళ్లే క్రమేపీ సంఖ్య పెంచుకుంటూ పోతుంటారు. అలాగే పొగను కూడా అంతా ఒకే రకంగా పీల్చరు. కొందరు గాఢంగా, వూపిరితిత్తుల నిండా పీలిస్తే కొందరు పైపైన అలా పీల్చి, ఇలా వదిలేస్తుంటారు. పొగతాగే వారందరికీ కూడా- తమకు కావాల్సినంత స్థాయిలో నికోటిన్‌ను భర్తీ చేసుకోవటమన్న విద్య, ఆ నైపుణ్యం ఎంతోకొంత తెలిసే ఉంటుంది. అందుకే పొగను పీల్చే తీరు.. నికోటిన్‌కు ఏ స్థాయిలో బానిస అయ్యారన్న దాన్ని పట్టి చూపుతుంది. పొగను ఎలా, ఎంతగా, ఎంతసేపు పీలిస్తే తృప్తిగా ఉంటోందన్నది కీలకం. పొగ పీల్చినప్పుడు ఎంత నికోటిన్‌ వెళుతోంది? అది ఆశించిన స్థాయిలో ఉంటోందా? లేదా? అన్న దాని మీద ఆధారపడి ఉంటోందని గుర్తించారు మేయోక్లినిక్‌ పరిశోధకులు. ప్రతి సిగరెట్టులోనూ సుమారు 10 మిల్లీగ్రాముల నికోటిన్‌ ఉంటుంది. కానీ ఎవరూ మొత్తం పొగ పీల్చలేరు, అలాగే పిల్చిన మొత్తాన్ని వూపిరితిత్తులు గ్రహించలేవు కాబట్టి మొత్తమ్మీద ఒక సిగరెట్టు నుంచి 2-3 మిల్లీగ్రాముల నికోటిన్‌ మాత్రమే రక్తంలో కలుస్తుంది. చూడటానికి ఇది చాలా చిన్నమొత్తంగానే అనిపించొచ్చుగానీ మనల్ని బానిసగా మార్చుకోవటానికి ఈ మాత్రం చాలు. పైగా సిగరెట్టు తాగటం ఆరంభించిన 5 నిమిషాల్లోపే పొగతాగేవారి రక్తంలో నికోటిన్‌ మోతాదు 1-2 మిల్లీగ్రాములకు చేరుకుంటోందని పరిశోధకులు అంచనా వేశారు. కానీ చాలామందిలో సిగరెట్టు తాగిన సుమారు 2 గంటల్లోపే దీని స్థాయి సగానికి సగం పడిపోతోంది. దీంతో మళ్లీ నికోటిన్‌ కోసం శరీరం, మెదడు వెంపర్లాట ఆరంభిస్తాయి. అయితే శరీరం నుంచి నికోటిన్‌ పూర్తిగా ఎప్పటికి తగ్గిపోతుందన్నది వ్యక్తికీ, వ్యక్తికీ మారిపోతుంటాయి. చాలామందిలో ఒక్కసారి పొగ తాగిన తర్వాత నికోటిన్‌ 6-8 గంటల పాటు శరీరంలోనే ఉండిపోతోంది. వేగంగా నికోటిన్‌ ఒంట్లోంచి వెళ్లిపోయేవారు నికోటిన్‌కు బానిసలయ్యే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.

మరో ముఖ్య విషయం- పొగతాగే వారి మెదడులో నికోటిన్‌ను గ్రహించే రిసెప్టార్ల సంఖ్య 2-3 రెట్లు ఎక్కువగా పెరిగిపోతోంది. ఒకసారి వీటి సంఖ్య పెరిగితే ఇక మళ్లీ తగ్గటమంటూ ఉండదు. ఇవి నిరంతరాయంగా నికోటిన్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. అందుకే ఒకసారి నికోటిన్‌.. అంటే పొగకు బానిస అయినవాళ్లు దాన్ని మానటం చాలా కష్టంగా తయారవుతుంది.

మానాలంటే కష్టం
నికోటిన్‌ ఒకవైపు ఈ రిసెప్టార్లను ప్రేరేపిస్తూనే 'డోపమైన్‌' అనే రసాయనం ఉత్పత్తిని పెంచటం ద్వారా సంతోషం, తృప్తి వంటి భావనలు కలిగేలా కూడా చేస్తుంది. నికోటిన్‌ అందగానే మెదడు చురుకుదనం పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత, వేగం వంటివి పెరిగే మాటా నిజమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. నికోటిన్‌ అందితే అంతా బాగున్నట్టు అనిపించటం, నికోటిన్‌ అందకపోతే ఏదో చికాకుగా అనిపించటం.. ఇదీ పొగకు బానిసలను చేసే అంశం! అందుకే పొగ తాగే వారు, పొగకు బానిసలైన వారంతా 'నికోటిన్‌' వల నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించటం చాలా చాలా అవసరం. నికోటిన్‌ అందకపోతే.. అంటే సిగరెట్టు మానేస్తే క్రమేపీ ఒంట్లో నికోటిన్‌ స్థాయి తగ్గిపోయి.. రకరకాల ఇబ్బందికర లక్షణాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు, మగత, చికాకు, తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవటం వంటి సమస్యలు మొదలై.. ఇవి మరే పనీ చేసుకోనివ్వకుండా వేధిస్తాయి. దీన్ని తగ్గించేందుకు నికోటిన్‌ను ప్యాచ్‌ల వంటి రకరకాల రూపాల్లో ఇచ్చే ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయిగానీ వీటి ఫలితాలు ఏమంత ఆశాజనకంగా ఉండటం లేదు. అందుకే నికోటిన్‌ అవసరం లేకుండానే ఇటువంటి ప్రేరేపణ అందించే సురక్షిత విధానమేదైనా ఉందా? అన్న దిశగా నేటి వైద్యపరిశోధనా రంగం విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది.

అపోహలు
* టెన్షన్‌ తగ్గుతుందా?
పొగ తాగితే టెన్షన్‌ తగ్గి, హాయిగా విశ్రాంతిగా అనిపిస్తుందన్నది అపోహ. కేవలం నికోటిన్‌ కోసం వెంపర్లాటను మాత్రమే, అదీ కొద్దిసేపు మాత్రమే తగ్గిస్తుంది. ఆ తహతహ తగ్గి, కాస్సేపు హాయిగా అనిపిస్తుందో లేదో.. మళ్లీ చికాకు, తహతహ మొదలే!

* మజాగా ఉంటుందా?
దమ్ము లాగితే మజాగా ఉంటుందన్నది పెద్ద అపోహ. పొగ పీల్చటంలో హాయి ఏముండదు. పీల్చకపోతే హాయిగా ఉండదు కాబట్టి పీలుస్తారు. అంతే! రక్తంలో నికోటిన్‌ స్థాయి తగ్గటాన్ని భరించలేరు.

* ఎప్పుడన్నా ఒక్కటికేం?
పెద్ద అలవాటేం కాదు, సరదాకి ఏదో ఎప్పుడన్నా ఒక్కటి కాలుస్తానన్నది పెద్ద భ్రమ. నికోటిన్‌ అందుతున్న కొద్దీ శరీరం దానికి అలవాటుపడిపోతూ.. క్రమేపీ ఇంకా ఎక్కువ మోతాదులో అందితేగానీ తహతహ తగ్గదు. దీంతో రోజుకు ఒకటి కాస్తా రెండుమూడు, అరపెట్టె, పూర్తిపెట్టె.. ఇలా పెరిగిపోతుంటాయి.

వ్యసనంలా తయారయ్యే విషయంలో హెరాయిన్‌, కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలకు ఏమాత్రం తీసిపోదని, తనకు బానిసగా మార్చేసుకునే విషయంలో మద్యం కంటే కూడా నికోటిన్‌ మరింత ప్రభావవంతమైనదని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఒకసారి నికోటిన్‌కు బానిసలైతే దాన్ని వదిలించుకోవటం హెరాయిన్‌ కంటే కూడా కష్టం!
మున్ముందు ఇదే మందు?
మార్ఫీన్‌, కొకైన్‌ వంటివి మాదక ద్రవ్యాలే అయినా నొప్పి తెలియకుండా చెయ్యటం నుంచి రకరకాల వైద్యపరమైన ప్రయోజనాలకు వీటిని 'ఔషధం'గా వాడుతున్నారు. ఇప్పుడు నికోటిన్‌కు ఇటువంటి వైద్యపరమైన ప్రయోజనాలు కొన్ని ఉన్నట్టు గుర్తించటం విశేషం. ముఖ్యంగా మతిమరుపు వ్యాధులు, పార్కిన్సన్స్‌, మానసిక చిత్రభ్రాంతులు, స్కిజోఫ్రీనియా వంటి సమస్యలకు దీన్ని ఔషధంగా ఇవ్వటం వల్ల కొంత ప్రయోజనం ఉంటోంది. కాబట్టి మున్ముందు 'నికోటిన్‌' ఒక మందుగా మన ముందుకు రావటం ఖాయం. కాకపోతే ఈ నికోటిన్‌ కోసం పొగను ఆశ్రయిస్తే మాత్రం తిప్పలు తప్పవు.
నికోటిన్‌ దుష్ప్రభావాలు
* రక్తం: గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది
* వూపిరితిత్తులు: శ్వాసనాళాలు కుంచించుకుపోతుంటాయి
* కండరాలు: నొప్పులు, వణుకులు మొదలవుతాయి
* జీర్ణ మండలం: వికారం, నోరు పొడిబారటం, అజీర్ణం, గుండెల్లో మంట
* కీళ్లు: నొప్పులు
* మెదడు: తల తిరగటం, తలనొప్పి, నిద్ర చికాకులు, పిచ్చి కలలు
* గుండె: గుండె వేగం అస్తవ్యస్తం, బీపీ పెరిగిపోవటం, గుండెలోని కీలక రక్తనాళాలు సంకోచిస్తుండటం
* హార్మోన్లు: ఇన్సులిన్‌ స్థాయులు పెరిగిపోవటం లేదా ఇన్సులిన్‌ పనితీరు మందగించి నిరోధకత రావటం
ఎంతగా బానిసలయ్యారు?
* పొద్దున్నే లేవగానే సిగరెట్‌ ముట్టించాల్సి వస్తోందా?
* గుడి, బడి, లైబ్రరీ, బస్సులు, సినిమా హాళ్ల వంటి పొగ నిషిద్ధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు పొగ తాగకుండా ఉండటం కష్టంగా ఉంటోందా?
* రోజుకు ఒకటికి మించి సిగరెట్లు తాగొద్దన్నప్పుడు ఆ ఒక్కటీ మీరు పొద్దున్నే లేస్తూనే తాగెయ్యాలనుకుంటున్నారా?
* రోజు మొత్తమ్మీద మిగతా సమయంతో పోలిస్తే ఉదయం పూటే ఎక్కువ తాగుతున్నారా?
* జ్వరం, జలుబు వంటివి వచ్చినప్పుడు కూడా సిగరెట్లు ఆపలేకపోతున్నారా?
.... వీటిలో కొన్నింటికి సమాధానం 'అవును' అయినా మీరు నికోటిన్‌కు బానిస అవుతున్నారనే అర్థం!

స్థానం తప్పు
నికోటిన్‌ కొంత వరకూ మంచిదే గానీ... సమస్యంతా అది సిగరెట్లలో ఉంటుంది! అందుకే పొగ తాగేవారంతా నికోటిన్‌ను వేరుగా, సిగరెట్టును వేరుగా చూడలేకపోతున్నారు. నికోటిన్‌ను చర్మం మీద అంటించుకునే ప్యాచ్‌ల రూపంలో, లేదా బబుల్‌గమ్‌లు, ఇన్‌హేలర్లు, ముక్కు ద్వారా కొట్టుకునే స్ప్రేల వంటి రకరకాల రూపాల్లో ఇచ్చినా దాన్ని మానసికంగా తేలికగా ఆమోదించలేకపోతున్నారని పరిశోధకులు అంటున్నారు. కొందరు నికోటిన్‌ ప్యాచ్‌ల వంటివి వాడి, పొగ నుంచి బయటపడగలిగినా త్వరలోనే మళ్లీ పాత అలవాటుకు మళ్లిపోతున్నారు. అందుకే వైద్యులు మానసికంగా పొగను వదిలించుకునే సంసిద్ధత కూడా చాలా ముఖ్యమని, అందుకు కౌన్సెలింగ్‌ ఉపకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

source : Sukhibhava @eenadu news paper
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.