ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చెమట బాగా పోయడము -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఉక్కపోయటం సహజం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థలోని భాగంగానే మనకు చెమట వస్తుంటుంది. ఎక్రైన్, అపోక్రైన్ అనే స్వేదగ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నాడీవ్యవస్థ స్పందించి.. చర్మం ఉపరితలం మీద నీటిని విడుదల చేసేలా ఎక్రైన్ గ్రంథులను ప్రేరేపిస్తుంది. తర్వాత ఆ నీరు ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. చెమటలో నీటితో పాటు ఉప్పూ ఉంటుంది. అలాగే శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రించే ఎలక్ట్రోలైట్ల ఆనవాళ్లు కూడా ఉంటాయి. ఇక అపోక్రైన్ గ్రంథులేమో నూనెతో కూడిన చెమటను విడుదల చేస్తాయి. చెమట పోసినప్పుడు చర్మం జిడ్డుగా ఉండటానికి కారణం ఇదే. వ్యాయామం చేసినప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు, జ్వరం వచ్చినపుడూ చెమట అధికంగా వస్తుండటం తెలిసిందే. నెలసరి నిలిచిపోయిన మహిళల్లోనూ ఎక్కువే. అయితే కొందరికి మామూలు సమయాల్లోనూ చెమట విపరీతంగా వస్తూనే ఉంటుంది. దీన్నే హైపర్‌హైడ్రోసిస్ అంటారు. ముఖ్యంగా పాదాలు, అరచేతులు, చంకల్లో ఎక్కువగా చెమట వస్తుంటుంది. ఇది ప్రమాదకరమైన సమస్యేమీ కాదు గానీ చాలా చికాకు కలిగిస్తుంది. కొన్నిసార్లు పనులకూ ఆటంకం కలుగుతుంది. కాగితాలు పట్టుకుంటే తడిసిపోవటం, మూతలు తీయటం వంటివి చేస్తుంటే పట్టుదొరక్కపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరైతే ఇతరులతో కరచాలనం చేయటానికీ వెనకాడుతుంటారు.
చెమట అధికంగా పోసేవారి చర్మం ఒకరకమైన వాసన వేస్తుంటుంది కూడా. నిజానికి దీనికి కారణం చెమట కాదు. అసలు చెమట ఎలాంటి వాసనా వేయదు. స్వేదగ్రంథుల నుంచి విడుదలయ్యే కొవ్వు పదార్థాలను చర్మం మీదుండే
బ్యాక్టీరియా విడగొట్టే క్రమంలో ఇలా వాసన వేస్తుంటుంది. అసలు చెమట కన్నా ఈ వాసనే చాలా ఇబ్బంది పెడుతుందన్నా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా షూ ధరించేవారిలో ఇది మరింత అధికం.
ఎవరికి ఎక్కువ?
సాధారణంగా మన శరీరం నుంచి రోజుకి సుమారుగా ఒక లీటరు చెమట ఉత్పత్తి అవుతుంది. ఇది ఆయా వ్యక్తులు, వాతావరణం, చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే హైపర్‌హైడ్రోసిస్ బాధితుల్లో దీనికన్నా దాదాపు 2-3రెట్లు ఎక్కువగా చెమట ఉత్పత్తి అవుతుంది. దీనికి కొన్ని జబ్బులూ దోహదం చేయొచ్చు. వూబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వీటికి ఉదాహరణలు. అయితే వీటికి చికిత్స తీసుకుంటే స్వేద సమస్యా తగ్గుతుంది. చెమట ఉత్పత్తి కావటాన్ని నియంత్రించే నాడులు సరిగా పనిచేయకపోయినా.. ఆయా భాగాల్లో నిరంతరం చెమట పోయొచ్చు. చాలామంది చెమట సమస్యను వైద్యులతో చెప్పుకోరు. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించటం మంచిది. దీనికి ప్రస్తుతం మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవనశైలిలోనూ, చేసే పనుల్లోనూ కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకు ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
* కొందరికి మసాలాలు, మద్యం వంటివి తీసుకుంటే చెమట ఎక్కువ పట్టొచ్చు. అందువల్ల చెమటను ప్రేరేపించే వాటిని గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మేలు.
* శరీరం చెమట వాసన వేస్తుంటే డియోడరెంట్ స్ప్రేలను ఉపయోగించొచ్చు.
* నైలాన్ వంటి బిగుతైన దుస్తులను ధరించకపోవటం మంచిది.
* తెలుపు లేదా నలుపు రంగు దుస్తులను ధరిస్తే చెమట పోసినా బయటకు అంతగా కనబడదు.
* తేమను పీల్చుకునే మందంగా, మృదువుగా ఉండే సాక్స్ ధరించాలి. కనీసం రెండు రోజులకు ఒకసారైనా సాక్స్‌ను మారుస్తుండాలి.
* లెదర్, కాన్వాస్ షూ ధరించాలి.
Courtesy with : sukhibhava@eenadu news paper.
- ==========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.