Thursday, May 29, 2014

Chronic Rhematoid arthritis,దీర్ఘకాలిక రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌(వ్యాధి )

  •  

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దీర్ఘకాలిక రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌(వ్యాధి )- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌. దీనివల్ల కీళ్లు వాచి, గట్టిపడి నొప్పి పెడతాయి. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా వస్తుంది.

కారణాలు :
దీనికి సరైన కారణం తెలియదు. కాని ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే శరీరంలోని సహజ రక్షక వ్యవస్థ కీళ్లపైన దాడి చేస్తుంది.

లక్షణాలు :
చేతులు, ముఖ్యంగా చేతి వేళ్లు, మణికట్లు, మోచేతులు, కాలి మడమ, మోకాళ్లు, మెడ భాగంలోని కీళ్లలో నొప్పి, కీళ్లు గట్టిగా ఉండటం, వాచిపోవడం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు. ఎక్కువ సమయం పడుకుని, కూర్చుని లేచిన తరువాత కీళ్లు గట్టిపడటం ఎక్కువ అవుతుంది. ఇది తగగ్డానికి గంటనుంచి కొన్ని గంటల సమయం పట్టవచ్చు. కీళ్ల సమస్యలు మాత్రమే కాకుండా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు. కీళ్ల నొప్పులు వాటికవే తగ్గిపోవచ్చు. దీనిని రెమిషన్‌ అంటారు.

కీళ్ల నొప్పులకు ఇతర కారణాలు :
ఆస్టియో ఆర్థరైటిస్‌ : కీళ్ల రాపిడి, గాయాలు కావడం వల్ల ఎముకలపై ఉండే మృదువైన కార్టిలేజ్‌ పొర దెబ్బ తింటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లాగా అన్ని భాగాల్లో కాకుండా, ఏదో ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మాత్రం వేలి కొసలనుంచి మోకాళ్లు, తుంటి భాగాల కీళ్ల వరకూ ప్రభావం చూపిస్తుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లాగా ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులైన
  • ల్యూపస్‌ జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌,
  • సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌, 
  • ఆస్టియో ఆర్థరైటిస్‌ :
  • అంకైలోసింగ్‌ స్పాండిలైటిస్‌--------లాంటి వ్యాధులు కూడా కీళ్లపై దాడి చేస్తాయి.

ఇతర భాగాలపై ప్రభావం :
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల కీళ్లు మాత్రమే కాకుండా, చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె,మెదడు, రోగ నిరోధక కణాలపై కూడా ప్రభావం పడవచ్చు.

నిర్ధారణ :
శారీరక పరీక్షలు, ఎక్స్‌రే, ఆర్‌ఎ, ఇఎస్‌ఆర్‌, యాంటి సిపిసి, సిబిపిలాంటి రక్త పరీక్షల ద్వారా గుర్తిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను తొలిదశలోనే గుర్తుపట్టడానికి కీళ్లకు హెచ్‌ఆర్‌యుయస్‌ వంటి ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

చికిత్స
:
ఈ వ్యాధికి జీవితాంతం చికిత్స తీసుకోవాలి. మందులతోపాటు వ్యాయామం, జీవనశైలి మార్పులు అవసరమవుతాయి. తొందరగా చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది. రుమటాలజిస్ట్‌ పర్యవేక్షణలోనే చికిత్స జరగాలి. మెథట్రెక్సేట్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, సల్ఫాసలజైన్‌, స్టిరాయిడ్స్‌ను వాడాల్సి వస్తుంది. ఈ మందులకు లొంగకపోతే బయలాజిక్స్‌లాంటి ఆధునిక చికిత్సలు ఇవ్వాలి.

జాగ్రత్తలు :
- అలసిపోగానే విశ్రాంతి తీసుకోవాలి.
- వంటగదిలో వస్తువుల ద్వారాకాని, తలపు గొళ్లేల వ్లకాని ఎటువంటి గాయాలు తగలకుండా చూసుకోవాలి.
- లక్షణాలు తీవ్రతంగా ఉంటే చేతి కర్ర సహాయంతో కాని, వాకర్స్‌ ద్వారా కాని నడవాలి.
- సమతులాహారం తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శస్త్ర చికిత్స ఎప్పుడు అవసరం?--
మందులు, ఫిజికల్‌ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమ వుతుంది. శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ చేయాల్సి వస్తుంది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పటికీ చాలామంది స్త్రీలు గర్భం దాల్చగలరు. ఆరోగ్యకరమైన బిడ్డలను పొందగలరు. గర్భం దాల్చిన సమయంలో ఈ వ్యాధికి వాడే కొన్ని మందులను ఆపవలసి ఉంటుంది. ప్రసవం తరువాత చాలామందిలో మొదటి మూడు నెలలలోపు వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు మందులు మళ్లి వాడాలి.

పోషకాహారం :
చేపనూనె వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా ఉండటానికి తగినంత కాల్షియం, విటమిన్‌ డి అందేలా చూసుకోవాలి. సాచురేటెడ్‌ కొవ్వు, కొలెస్టరాల్‌, ఉప్పు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

వ్యాయామం చేయవచ్చా? --
ఆర్థరైటిస్‌ వ్యాయామం మూడు రూపాల్లో చేయవచ్చు. స్ట్రెచింగ్‌, స్ట్రెంతనింగ్‌, కండిషనింగ్‌ వ్యాయామాలు చేయాలి. మోకాళ్లు, మడమలు, పాదాల్లో సమస్య ఉన్నప్పుడు ఈత మంచి వ్యాయామం. కాల్లు,పాదాల్లో సమస్య లేకపోతే సైకిలింగ్‌, వాకింగ్‌ బాగా తోడ్పడుతాయి.

వంశపారంపర్యమా?
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంశపారంపర్యంగా రాదు. కొన్ని కొన్ని రకాల జన్యువులు మాత్రం ఈ వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వందమందిలో తల్లిదండ్రులు, పిల్లల్లో వచ్చే అవకాశం నలుగురికి ఉంఉటంది. సాధారణ జనాభాలో ప్రతి వందమందిలో ఒకరు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బారినపడే అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాధిగ్రస్తుల పిల్లల్లో 25 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

- డాక్టర్‌ శశికాంత్‌-ఆర్థోపెడిక్‌ సర్జన్‌--కేర్‌ హాస్పిటల్‌,--బంజారాహిల్స్‌--హైదరాబాద్‌ @andhraprabha - Tue, 20 May 2014,
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.