ఊపిరితిత్తులలో నిండి ఉండే గాలి - రెండు వంతులు పారంకైమా ఒక వంతు శ్వాసనాళాలలో ఉంటుంది. ఎక్స్‌రే కిరణాలలో ఘన పదార్థాలు ద్రవపదార్థాలు కనిపించినంత స్పష్టంగా ఈ గాలి కనిపించదు. కనుక ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి. లంగ్ పారంకైమాలో నీరు చేరినప్పుడు, నిమ్ము వచ్చినప్పుడు, లేదా కంతులు వంటి ఘనదార్థాలున్నా అవి ఊపిరితిత్తులలో తెల్లని మచ్చలుగా కనిపిస్తాయి.
ఛాతీలో ఉండే వ్యాధులను గుర్తించడానికి పలురకాల పరీక్షలు అవసరం. వీటిలో ప్రధానమైనది ఛాతీ ఎక్స్‌రే. వ్యాధి అసలు ఉందో లేదో, ఉంటే అది ఏ రకమైన వ్యాధి? ఇతర వ్యాధులతో పోలిస్తే ఏ విధంగా భిన్నమైనది? జబ్బు తీవ్రత ఏమిటి? వాడాల్సిన మందులేమిటి? వ్యాధి పూర్తిగా తగ్గిందా? లేదా?-తదితర విషయాలన్నింటి గురించి జవాబు కనుక్కోవడానికి ఛాతీ ఎక్స్‌రే ముఖ్యమైనది.
కఫం శ్వాసనాళాల ద్వారానే బైటికి వస్తుంది. శ్వాసనాళాల వ్యాధులు బ్రాంకైటిస్, బ్రాంకిఎక్టేసిస్‌లలో శ్వాసనాళాల గోడలలో ఉండే మ్యూకస్ గ్లాండ్స్‌లో కఫం తయారవుతుంది. ఛాతి ఎక్స్‌రేలో సాధారణంగా శ్వాసనాళాలు కనిపించవు. చాలా రోజులుగా జబ్బు పడినప్పుడు మాత్రం అవి సన్నని తీగలలాగా కనించవచ్చు. గొంతును, ఊపిరితిత్తులకు కలిపే పెద్ద శ్వాసనాళం ట్రేకియా. దీనిలో ఉండే గాలినిబట్టి ఎక్స్‌రే మధ్య భాగంలో చూడవచ్చు. కాని ట్రేకియా నుండి శాఖలుగా మారే శ్వాస నాళాలు (బ్రాంకై) స్పష్టంగా కనిపించవు.
కఫం సాధారణంగా శ్వాసనాళాల జబ్బుల లక్షణమే అయినా, ఒక్కొక్కసారి ఊపిరితిత్తులలో ఉండే మెత్తని భాగం - పారంకైమా జబ్బుల వలన రావచ్చు. న్యుమోనియా, లంగ్ ఆబ్సెస్ వంటి వ్యాధులలో పారంకైమాలో జమ అయ్యే కఫం ఆ భాగానికి దగ్గరలో ఉండే శ్వాసనాళాల ద్వారా దగ్గినప్పుడు బైటికి వస్తుంది. పలు రకాల పారంకైమా జబ్బులు ఛాతీ ఎక్స్‌రేలో చూడటానికి వీలవుతుంది.
ఊపిరితిత్తులలో నిండి ఉండే గాలి, రెండు వంతులు పారంకైమా, ఒక వంతు శ్వాసనాళాలలో ఉంటుంది. ఈ గాలి ఎక్స్‌రే కిరణాలలో ఘన పదార్థాలు, ద్రవపదార్థాలు కనిపించినంత స్పష్టంగా కనిపించదు. కనుక ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి. లంగ్ పారంకైమాలో నీరు చేరినప్పుడు, నిమ్ము వచ్చినప్పుడు, లేదా కంతులు వంటి ఘనదార్థాలున్నా అవి ఊపిరితిత్తులలో తెల్లని మచ్చలుగా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల మొత్తం పరిమాణంలో కుడివైపు ఉండే ఊపిరితిత్తి 45 శాతం, ఎడమవైపున ఉండే ఊపిరితిత్తి 55 శాతం ఉంటాయి. ప్రక్కటెముకల ఆధారంగా ఊపిరితిత్తుల పరిమాణం మామూలుగా ఉందా? లేక ఏమైనా తేడాలున్నాయా? అనే విషయాన్ని గమనించవచ్చు. కుడి వైపు 5-6 పక్కటెముకల వరకూ కుడి ఊపిరితిత్తి, ఎడమవైపు ఊపిరితిత్తి దీనికంటే రెండు మూడు సెంటీమీటర్లు క్రిందగా ఉండటం సర్వసాధారణం. కడుపులో ఉండే అవయవాలన్నింటి నుండి ఊపిరితిత్తులను వేరుగా చేసే పొర డయాఫ్రం. కుడివైపున ఈ పొర క్రింద కాలేయం తెల్లగానూ , ఎడమవైపున జీర్ణకోశం నలుపుగానూ కనబతాయి.
జీర్ణకోశంలో గాలి ఉండటం వలన అది ఎక్స్‌రేలో నలుపుగా కనిపిస్తుంది. దీనిని ఫండల్ గ్యాస్ అని అంటారు. ఈ ఫండల్ గ్యాస్ ఆధారంగా ఊపిరితిత్తులలో ఏది కుడి, ఏది ఎడమ అని నిర్ధారించవచ్చు. అరుదుగా పుట్టకతో వచ్చే అవయవ లోపం వలన ఒక్కొక్కసారి జీర్ణకోశం కుడివైపుకు, కాలేయం ఎడమవైపున, అలాగే గుండె కుడివైపున ఉండవచ్చు. దీనిని సైటస్ ఇన్‌వర్సస్ అని అంటారు.
రెండు ఊపిరితిత్తుల మధ్య భాగంలో గుండె తెలుపుగా కనబడుతుంది. సన్నగా ఎత్తుగా ఉండే వారిలో పొడవుగా ఫ్లస్ ఆకారంలోనూ, పొట్టిగా, లావుగా ఉండే వారిలో గుండ్రని ఆకారంలో కొద్దిగా ఎడమవైపు ఒంపుతో కనిపిస్తుంది. మూడింట రెండువంతుల గుండె ఎడమవైపు, ఒక వంతు కుడివైపు వ్యాపించి ఉంటాయి. గుండె పరిమాణం. ఆకారాలను బట్టి సుమారుగా గుండె జబ్బు ఏమై ఉంటుందో ప్రాథమిక అంచనాకు రావచ్చు.
గుండె పరిమాణం పెరిగిందా? లేదా? అనే విషయం కొంత వ్యవధితో తీసిన ఎక్స్‌రేలను పొల్చి గుర్తించవచ్చు. 1.5 నుంచి 2 సెంటీమిటర్ల వెడల్పు పెరిగితే గుండె పరిమాణం పెరిగిందని అనుకోవచ్చు. ఒకే ఎక్స్‌రే ఉన్నప్పుడు గుండె 15 సెంటీమిట ర్లకంటే వెడల్పుగా ఉంటే గుండె పెరిగిందని నిర్థారించవచ్చు. కొన్ని సార్లు ఎక్స్‌రే తీస్తున్నప్పుడు ఊపిరి తీసుకుని సరిగ్గా నిలపని పక్షంలో కూడా ఏ జబ్బు లేకుండానే గుండె పెద్దదిగా కనిపిస్తుంది.
గుండెనుండి వెళ్లే రక్తనాళాలు, కుడి వెంట్రికల్ నుండి పల్మనరీ ఆర్జరీలు, ఎడమ వెంట్రికల్ నుండి అయోర్టా గుండె పై భాగం నుంచి శాఖలుగా మారుతాయి. ప్రధానంగా ఎక్స్‌రేలో కనిపించేది - అయోర్టా. ఇది గుండె నుండి కుడివైపుగా పైకి వెళుతూ మధ్య భాగాన్ని దాటి ఎడమవైపు కిందికి వంగి థొరాసిక్ అయెర్టాగా మారుతుంది. కుడి ఎడమలలో దీనికి ఆనుకుని పల్మనరీ ఆర్టరీ శాఖలు ఊపిరితిత్తులలోని కింది భాగాలకు వెళుతున్నప్పుడు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా గుండె వెనుక భాగం నుంచి వెళుతుంటాయి కనుక కనిపించవు.
ఊపిరితిత్తులలోకి పల్మనరీ ఆర్టరీతో పాటు పల్మనరీ వీన్స్, శ్వాసనాళాలు కలిసి ముఖద్వారంలో తెల్లని మచ్చగా కనబడుతుంది. దీనిని హైలం అంటారు. కుడి హైలం కంటే ఎడమవైపు హైలం 2 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల వలన వచ్చే కంతులు, కేన్సర్ ట్యూమర్లు ఈ హైలమ్ దగ్గర తెల్లని గడ్డలు మాదిరిగా కనిపిస్తాయి. కేన్సర్ గడ్డలు ఇక్కడే కాకుండా, ఊపిరితిత్తులలోని ఇతర భాగాలలో కూడా రావచ్చు. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే గడ్డలుకాని, నిమ్ము కాని ఎక్స్‌రేలో కనిపించవు.
కాల ర్‌బోన్ కాని, ఎముకల వెనుక కాని, గుండె వెనుకకాని ఉండే వ్యాధులు కూడా అవి అడ్డురావడం వలన ఎక్స్‌రేలో కనిపించవు. అప్పుడు వివిధ కోణాలలో ఛాతీ ఎక్స్‌రేలు తీయాల్సి ఉంటుంది. ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులకు మధ్య ఉండే భాగం ఫ్లూరల్ కేవిటీ. ఇది సాధారణంగా ఎక్స్‌రేలో కనిపించదు. రెండు పొరల మధ్య ఉండే ఈ కేవిటీలో నీరు, చీము, గాలి చేరినప్పుడు మాత్రమే దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
రెండు ఊపిరితిత్తుల మధ్య ఉండే భాగం మీడియాస్టినమ్, గుండె కూడా ఈ భాగానికి చెందినదే. గుండెతో పాటు శ్వాసనాళాలు, రక్తనాళాలు కూడా దీనిలో కనపడుతాయి. లింఫ్ గంధ్రులు కూడా వీటిలో ఉంటాయి. ఈ అవయవాలలో జబ్బులు ఉన్నప్పుడు మీడియాస్టినమ్ పెద్దదిగా ఉంటుంది. ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి వ్యాధి లక్షణాలతో కలిపి అది ఏ అవయవానికి చెందినదో గుర్తించవచ్చు. పలు రకాల ట్యూమర్లు కూడా ఈ భాగంలో కనిపిస్తాయి. జబ్బు మొదలైనప్పుడు వ్యాధి లక్షణాలు పైకి కనిపించినా, అదిలో ఎక్స్‌రే లో కనిపించకపోవచ్చు. చాలా చిన్నవిగా మొదలయ్యే ఇలాంటి వ్యాధులు రానురాను పెరిగి, ఒకటి రెండు వారాలు, నెలల తరువాత ఎక్స్‌రేలో కనిపించేంతగా పెరగవచ్చు. కనుక వ్యాధిని గురించిన అనుమానం వచ్చినప్పుడు మొదటి ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటే, మరొకసారి ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది.
జబ్బు తగ్గుతన్నప్పుడు కూడా దానిని నిర్ధారించడానికి మరలా ఎక్స్‌రేలు అవసరమవుతాయి.
సి. టి. స్కాన్: ఛాతీ ఎక్‌సరే లో కనిపించని వ్యాధులను నిర్దారించడానికి ఉపయోగపడే పరీక్షే ఇది. ప్రారంభదశలో ఉన్న న్యూమోనియా, క్షయ , ఐ.ఎల్.డి., కేన్సర్, లింఫ్ గ్రంథులు, ట్యూమర్లను ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ప్లూరల్ వ్యాధులు, బ్రాంకిఎక్టేసిస్‌లను కూడా ఈ పరీక్ష ద్వారా గుర్తింవచ్చు.
డాక్టర్ బి. శ్యామ్ సుందర్ రాజ్--శ్రేష్ఠ హాస్పిటల్,అమీర్‌పేట్, హైదరాబాద్.-9394018040 @andhraprabha - Tue, 20 May 2014,
- ===========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.