Saturday, August 23, 2014

Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము
--
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    గాలి దూరే దారి లేకుండా తలుపులన్నీ ముయ్యగట్టుకుని గదిగదికీ ఏసీలు పెట్టుకోవటం.. వెలుతురు చొరబడే సందు లేకుండా చేసుకుని పట్టపగలు కూడా కృత్రిమ లైట్ల కింద గడపటం.. ఇదో ఘనతగా, ఇదే ఆధునికతగా భావిస్తున్న ఈ రోజుల్లో మనమేం కోల్పోతున్నామో.. దేనికి చేరువ అవుతున్నామో.. చదవండి!
    మంచి మాటలు.. ఎప్పుడూ చప్పగానే అనిపించొచ్చు. ఏవో సుద్దులు చెబుతున్నారని విసుక్కోవచ్చు. ఉదాహరణకు ఇంట్లోకి 'గాలీ-వెలుతురూ' ధారాళంగా రావాలని ఎవరైనా చెప్పారనుకోండి.. ఏదో పాత పాటేలెమ్మని మనం తలకంతగా ఎక్కించుకోకపోవచ్చు.
    కానీ మీకో విషయం తెలుసా?
    ఆరుబయటి గాలికీ, చక్కటి వెలుతురుకూ... ఔషధాలను తలదన్నే గొప్ప ప్రభావం ఉంది. ఎంత గొప్ప అంటే... ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకుంటున్న శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ను మించిన సత్ఫలితాలు వీటితో కనబడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనా రంగంలో అనూహ్యంగా కొన్నికొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. అప్పటికి అవేమంత పెద్ద విషయాల్లా అనిపించకపోవచ్చుగానీ.. వాటి ప్రాముఖ్యం తర్వాతెప్పుడో తెలిసొస్తుంది. అలాంటిదే ఈ సంఘటన!
1968. వేడి గాలి చెవులను తాకుతున్న ఓ వేసవి రాత్రి.
మైక్రోబయాలజిస్టులు హెన్రీ డ్రూట్‌, కేఆర్‌ మే ఇద్దరూ బ్రిటన్‌ రక్షణ పరిశోధనా భవనం మేడ మీద నిలబడి తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. బయట ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులు ఏ సమయంలోనైనా జీవాయుధాలను ప్రయోగిస్తే ఏం చెయ్యాలి? బాంబుల్లో వ్యాధికారక సూక్ష్మక్రిములను దట్టించి.. ఏ లండన్‌ మీదో జారవిడిస్తే మన పనేమిటి? ఆ సూక్ష్మక్రిములు వాతావరణంలో ఎంతకాలం బలీయంగా ఉంటాయి? వాటిని ఎదుర్కొనేదెలా? సమాధానం కోసం చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. ఒక దువ్వెన చుట్టూ సాలెగూడు దారాలు చుట్టి.. దాని మీద మనకు సర్వసాధారణంగా జబ్బులు తెచ్చిపెడుతుండే 'ఈ.కోలీ' బ్యాక్టీరియా ఎక్కించి.. మేడ మీద గాలిలో ఉంచారు. ధారాళంగా గాలి వీస్తున్న ఆ ఆరుబయలు వాతావరణంలో.. 2 గంటలు కూడా తిరక్కముందే ఆ బ్యాక్టీరియా పూర్తిగా చచ్చిపోయింది. ఇక అదే రకం దువ్వెనను తీసుకువెళ్లి.. అంతే వెచ్చదనం, అంతే తేమ ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టిచూశారు.. 2 గంటల తర్వాత కూడా బ్యాక్టీరియా బ్రహ్మాండంగా బతికే ఉంది. బ్యాక్టీరియా లోపల బతికి ఉండటానికీ, ఆరుబయటి గాలిలో అట్టే సమయం బతకలేకపోవటానికీ కారణం ఏమిటి? దీనర్థం.. ధారాళమైన గాలిలో బ్యాక్టీరియాను చంపేదేదో ఉంది! లోపల వాతావరణంలోకి వచ్చేసరికి అది కరవు అవుతోంది! విషయం అర్థమైంది. ఇక అదేమిటో కనిబెట్టాలని లోతుగా పరిశోధనలు మొదలుపెట్టారు ఇద్దరూ. తాత్కాలికంగా దానికి 'ఓపెన్‌ ఎయిర్‌ ఫ్యాక్టర్‌' అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతలోనే జీవయుధాల భయాలు వీడిపోయాయి, వీళ్ల పరిశోధనలూ నిలిచిపోయాయి!

కానీ ఇన్నేళ్ల తర్వాత.. ఇప్పుడీ పరిశోధనా పత్రాల దుమ్ముదులిపి.. వీటి ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం కనబడుతోంది. కారణం.. అద్భుత అస్త్రాలనుకుని రంగం మీదికి తెచ్చిన యాంటీబయాటిక్స్‌.. వ్యాధికారక బ్యాక్టీరియా ముందర పూచికపుల్లల్లా ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి! ఈ యాంటీబయాటిక్స్‌కు అలవాటుపడిపోతున్న సూక్ష్మక్రిములు మహా మొండిగా.. దేనికీ లొంగకుండా తయారై.. మన ఉనికికే పెనుసవాల్‌ విసురుతున్నాయి. దీంతో క్షయ, న్యుమోనియా, గనోరియా వంటి సమస్యలను ఎదుర్కొనటం ఇప్పుడు మహా కష్టంగా తయారవుతోంది. మరి ఈ మొండి బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు వాళ్ల పరిశోధనల్లో వెల్లడైన కిటుకులేమైనా ఉపయోగపడతాయేమో..?
నైటింగేల్‌ చెప్పిందిదే!
ధారాళమైన, స్వచ్ఛమైన గాలిలో ఏదో మహత్తు ఉందన్న విషయం కొత్తగా కనిబెట్టిందేం కాదు. క్రిమియన్‌ యుద్ధ సమయంలోనే ఇది బయటపడింది. ఆ యుద్ధ సమయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇరుకిరుకు ఆసుపత్రుల్లో కంటే.. యుద్ధక్షేత్రంలోనే ఉండిపోయిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవటాన్ని గమనించారు పరిశోధకులు. ఈ కిటుకు తెలుసుకున్న విఖ్యాత నర్సు ఫ్లారెన్స్‌ నైటింగేల్‌.. ఆసుపత్రి గదులకు ఉన్న కిటికీలూ, దర్వాజాలూ బార్లా తెరిచి ఉంచటం వంటి జాగ్రత్తలతో ఆసుపత్రుల్లో మరణాల రేటును గణనీయంగా తగ్గించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఇదే సూత్రాన్ని ఆమె బ్రిటన్‌ ఆసుపత్రుల్లో కూడా ప్రవేశపెట్టారు. ''రోగి చుట్టూ ఎప్పటికప్పుడు కొత్తగాలి వస్తుండటం, తాజా గాలి ఆవరిస్తుండటం చాలా అవసరం. అప్పుడుగానీ రోగి వూపిరితిత్తుల్లోనూ, చర్మం మీదా ఉండే రుజాగ్రస్త కశ్మలాలు కొట్టుకుపోవు'' అని ఆమె తన నోట్సులో ప్రత్యేకంగా రాసుకున్నారు. ఈ జాగ్రత్తల వల్ల రోగులు త్వరగా కోలుకోవటం చూసిన ఆసుపత్రులు ఇదే నమూనాలను పాటిస్తూ రోగులను ఉంచే గదులకు- కింది నుంచి పైవరకూ పెద్దపెద్ద కిటికీలు అమర్చి.. లోపలికి గాలి ధారాళంగా ప్రసరించేలా చర్యలు చేపట్టారు. ఇలాంటి గదులను ప్రత్యేకంగా 'ఫ్లారెన్స్‌ వార్డులని' పిలవటం కూడా ఆరంభించారు. గాలి ధారాళంగా లోపలికి రావటం వల్ల- గాలి ద్వారా వ్యాపించే రోగకారక సూక్ష్మక్రిముల సంఖ్య పల్చబడి, వాటి ప్రభావం తగ్గటమే కాదు.. అవి చాలా వరకూ నశించిపోతున్నాయని కూడా పోర్టన్‌ డౌన్‌ పరిశోధనల్లో వెల్లడైంది.

నైటింగేల్‌ వార్డులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ పెద్దపెద్ద కిటికీలన్నీ దక్షిణం వైపు గోడలకు ఉంటాయి. దీనివల్ల గదుల్లోకి చక్కగా ఎండ కూడా పడుతుంటుంది. దీంతో సూర్యరశ్మికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ప్రజలను విపరీతంగా కబళిస్తున్న క్షయ వ్యాధి పీడితులకు ఈ వార్డులు ఎంతో మేలు చేశాయి. సూర్యరశ్మి కేవలం గాలిలోనూ, చర్మం మీద ఉన్న క్రిములను నిర్మూలించటమే కాదు.. ఒంట్లో విటమిన్‌-డి ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక వ్యవస్థలో కొత్త ఉత్తేజాన్ని తేవటం ద్వారా క్షయ క్రిములను కూడా నిర్మూలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో క్షయ వ్యాధి పీడితుల కోసం ప్రపంచవ్యాప్తంగా గాలీవెలుతురూ ధారాళంగా వచ్చే 'సోలార్‌ క్లినిక్స్‌' పుట్టుకొచ్చాయి. మన దేశంలో కూడా ఇదే పద్ధతిలో 'టీబీ శానిటోరియాలు' నిర్మించారు. మెల్లగా శాస్త్రవేత్తలు పరిశోధించి.. సూర్యకాంతిలోని యూవీ కాంతి (అల్ట్రా వయొలెట్‌-అతినీల లోహిత కిరణాలు) సూక్ష్మక్రిములను అంతం చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆసుపత్రులన్నీ యూవీ కాంతిని ప్రసరింపజేసే ప్రత్యేక లైట్లను వినియోగించటం మొదలుపెట్టాయిగానీ వాటివల్ల చర్మం క్యాన్సర్లు, కంటి శుక్లాల వంటి దుష్ప్రభావాలు పెరుగుతుండటంతో వాటి వినియోగం తగ్గిపోయింది. (ఇప్పటికీ ఆపరేషన్ల కోసం వాడే పరికరాల మీద సూక్ష్మక్రిములేవీ లేకుండా శుభ్రం (స్టెరిలైజ్‌) చెయ్యటానికి యూవీ లైట్‌ను వాడుతూనే ఉన్నారు) మొత్తానికి వ్యాధికారక సూక్ష్మక్రిములను ఎదుర్కొనేందుకు 'గాలీ-వెలుతురు'.. ఈ రెంటికీ కీలక పాత్ర ఉందని ప్రపంచవ్యాప్తంగా అంతా గుర్తించారు.
ప్రపంచం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉంది. ఇది తీవ్రవాదాన్ని మించిన, చమురును మించిన, ఇంకా చెప్పాలంటే నీటిని కూడా మించిన సంక్షోభం. 'యాంటీబయాటిక్స్‌' సంక్షోభం! మానవాళి ఉనికికే పెను సవాల్‌లా తయారవుతున్న ఈ సమస్యకు.. ఎంతోకొంత పరిష్కారం మన చుట్టూ ఉన్న గాలీ-వెలుతురులోనే ఉందంటూ విఖ్యాత శాస్త్రపత్రిక 'న్యూసైంటిస్ట్‌' అందించిన కథనం కొత్త ఆలోచనలకూ.. సరికొత్త పరిష్కారాలకూ తలుపులు తెరుస్తోంది.

కొత్త అస్త్రాలు దొరికాయి!
అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ అత్యంత శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందు 'పెన్సిలిన్‌'ను ఆవిష్కరించటం ఆధునిక వైద్యరంగ చరిత్రలో పెను విప్లవం! ఎంత అంటే ఇక వ్యాధికారక సూక్ష్మక్రిములపై మనిషి విజయం సాధించేశాడనీ.. ఇన్ఫెక్షన్లన్నవి ఇక కనుమరుగైపోవటం తథ్యమని అంతా ఒక విపరీత విశ్వాసంలోకి వెళ్లిపోయారు కూడా. ఇక మీదట సూక్ష్మక్రిముల కారణంగా ఏ ఇన్ఫెక్షన్‌ వచ్చినా రామబాణంలా యాంటీబయాటిక్‌ మాత్రను ప్రయోగిస్తే చాలు, ఠకీమని అది తగ్గిపోవటం ఆరంభమైంది. కొత్తకొత్త యాంటీబయాటిక్స్‌ పుట్టుకురావటం కూడా మొదలైంది. ఈ కొత్త ఉత్సాహంలో 1960ల నుంచీ కూడా ఇటు వైద్యరంగం, అటు పరిశోధనా రంగం దాదాపుగా గాలీ, వెలుతురు గురించి పూర్తిగా పట్టించుకోవటం మానేశాయి. హాస్పిటళ్లలో నైటింగేల్‌ వార్డులూ కనుమరుగయ్యాయి. తలుపులు మూసేసి ఏసీలు పెట్టటం, అవసరమైతే లోపలి గాలి మార్పు కోసం యంత్రాలు, మెకానికల్‌ వెంటిలేషన్‌ మీద ఆధారపడటం పెరిగింది. కొత్త కొత్త యాంటీబయాటిక్స్‌ కుప్పలుతెప్పలుగా మార్కెట్‌ను ముంచెత్తాయి. గత 30 ఏళ్లుగా ఏడాదికి సగటున ఒక కొత్త యాంటీబయాటిక్‌ అయినా మార్కెట్లోకి వస్తూనే ఉంది. కానీ గత పదేళ్లుగా ఈ అస్త్రాల మీదా, వీటి శక్తిసామర్థ్యాల మీదా అనుమానాలు బయల్దేరాయి. ఎందుకంటే..
మనం ఎంత అత్యాధునికమైన, ఎంత ఖరీదైన యాంటీబయాటిక్‌ వాడటం మొదలుపెట్టినా సూక్ష్మక్రిములు లొంగటం లేదు. పైగా వాటికి త్వరగా అలవాటుపడిపోయి.. మహా మొండిగా తయారవుతున్నాయి. దీంతో 1970లలో, 80లలో యాంటీబయాటిక్స్‌తో చాలా తేలికగా తగ్గిపోయిన క్షయ, న్యుమోనియా, గనోరియా లాంటి వ్యాధులు కూడా ఇప్పుడు దేనికీ లొంగకుండా తిరిగి పెను సమస్యలుగా తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మొండి ఇన్ఫెక్షన్లు వ్యాపించటమన్న సమస్య మరింతగా పెరుగుతోంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో అయితే కనీసం 9 శాతం మందికి ఆసుపత్రుల్లోనే కొత్తగా ఇన్ఫెక్షన్లు అంటుకుంటున్నాయి. వీటన్నింటికీ తోడు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే యాంటీబయాటిక్స్‌ సంఖ్య కూడా ఏటికేడాది తగ్గిపోతోంది. 1990ల తర్వాత ఇటువంటి కొత్తతరం యాంటీబయాటిక్స్‌ కోసం ప్రయత్నిస్తున్న సంస్థల సంఖ్య 18 నుంచి 4కు పడిపోయింది. దీనర్థం ఏమిటి??? మన తూణీరంలో అస్త్రాలు తగ్గిపోతున్నాయి. ఉన్నవి పదును కోల్పోయాయి.. కొత్తవి పుట్టటం లేదు. మరోవైపు శత్రువులు.. అంటే రోగ కారక క్రిములు మహా మొండిగా విజృంభిస్తున్నాయి! క్షయలాంటి వ్యాధులైతే ఎన్ని మందులు వాడినా లొంగని 'మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌' రకాలుగా ప్రబలుతున్నాయి. ఇదీ ఇప్పుడు మనం ఉన్న విపత్కర స్థితి!

ఏమిటి మార్గం???
సూక్ష్మ శత్రువులను ఎదుర్కొనటం కోసం పరిశోధనా రంగం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. వాటిని చంపటం కాకుండా కేవలం వాటి ఉద్ధృతిని అడ్డుకోవటం కోసం 'కోరం బ్లాకింగ్‌' మందుల కోసం ప్రయత్నిస్తున్నారు.. దీనివల్ల సూక్ష్మక్రిముల్లో నిరోధకత అంతగా రాదని భావిస్తున్నారు. అలాగే వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేందుకు జన్యుమార్పిడి వైరస్‌లను ప్రయోగించే 'ఫేజ్‌ థెరపీ' విధానాలూ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ విజయానికి చాలా దూరంలో ఉన్నాయి. మరి మనం ఇప్పుడేం చెయ్యాలి? దీనికి చాలామంది శాస్త్రవేత్తల సమాధానం.. మూలాల్లోకి వెళ్లటమే మంచిదని! వైద్యాన్ని ఎక్కడ వదిలేశామో అక్కడికి వెళ్లి వెతుక్కుందామంటున్నారు. యాంటీబయాటిక్స్‌ రాక మునుపు మనం ఎక్కడున్నామో.. ఏయే విధానాలను అనుసరించామో.. మళ్లీ ఆ పాఠాలను ఒక్కసారి చదువుకుందామంటున్నారు.
కేవలం ఒంటి మీద ఎండ పడితేనో.. లేకపోతే గాలి తగిలితేనో.. జబ్బులన్నీ తగ్గిపోతాయని అనుకోవటం అత్యాశే అవుతుంది. అంతమాత్రాన ఆ రెంటికీ ఉన్న.. అమూల్యమైన శక్తిని మనం తక్కువచేసి చూడటానికి లేదు. పాతవిధానాల్లో ప్రయోజనకరమైనవి లేవనుకోవటం తప్పు. ఎందుకంటే తరచుగా చేతులు కడుక్కోవటం వల్లనే చాలా జబ్బులు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చనీ, చాలా జబ్బులు తగ్గిపోతాయని గుర్తించినప్పుడు చాలామంది దాని విలువను గుర్తించలేదు. కానీ ఇప్పుడు అదే విధానం.. అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఆసుపత్రుల్లో నర్సులు తరచుగా చేతులు కడుక్కోవాలన్న నిబంధన పెట్టిన తర్వాత బ్రిటన్లో ఎంఆర్‌ఎస్‌ఏ, క్లోస్ట్రీడియం వంటి మొండి బ్యాక్టీరియాల వ్యాప్తి బాగా తగ్గినట్లు గుర్తించారు. ఇళ్లలో కూడా మనం తరచుగా చేతులు కడుక్కోవటం వల్ల జబ్బుల బారినపడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇదే తీరులో మనం గాలీ, వెలుతురు ప్రయోజనాలను కూడా గుర్తించాల్సిన అవసరం వచ్చిందంటున్నారు పరిశోధకులు. ఈ దిశగా లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు లిమా, పెరూ వంటి దేశాల్లోని ఆసుపత్రుల్లో అధ్యయనాలు కూడా చేశారు. యాంత్రికంగా పని చేసే మెకానికల్‌ వెంటిలేషన్‌ సదుపాయాల మీద ఆధారపడుతున్న ఆసుపత్రుల్లో కంటే కిటికీలూ, తలుపులూ తెరవటానికి వీలున్న పాత కాలపు ఆసుపత్రుల్లోనే గాలి ప్రసారం బాగుందని గుర్తించారు. దీంతో లిమాలోని కొన్ని ఆసుపత్రులకు కొత్తగా కిటికీలు అమర్చటం, వెలుతురు వచ్చేలా పైకప్పును సరిచెయ్యటం వంటి చర్యలూ చేపట్టారు. ఈ మార్పులు సాధ్యం కాని భవనాల్లో ఏం చెయ్యాలన్న దాని మీదా బోలెడంత కుస్తీలు పట్టి చివరికి.. క్షయ వార్డుల్లో యూవీ కిరణాలు ప్రసరించేలా ఆ లైట్లను పైకప్పు వైపు తిప్పి అమర్చారు. దీనివల్ల ఆ కిరణాలు నేరుగా రోగుల మీద పడవు.. గది పైభాగంలో ఉండే సూక్ష్మక్రిములను నిర్మూలిస్తాయి. ఇలా చేసిన తర్వాత వార్డుల్లో క్షయ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కూడా గుర్తించారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరూ, బ్రెజిల్‌, రష్యా వంటి దేశాలన్నింటిలోనూ ఆసుపత్రుల్లో ఈ ఏర్పాటు మీద ఆసక్తి పెరుగుతోంది, ముఖ్యంగా మహామొండి సమస్యగా భావించే 'హెచ్‌ఐవీ-క్షయ' రెండూ కలగలిసి ఉన్న వారి వార్డుల్లో ఈ ఏర్పాటు చాలా అవసరమని భావిస్తున్నారు. లండన్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాస్సిటల్‌ కూడా ఛాతీ సమస్యలతో వచ్చే రోగులు వేచి ఉండే గదిలో ఈ రకం యూవీ లైట్లను ఏర్పాటు చేసింది. మన శరీరంలో జీవకణాల పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి యూవీ కిరణాలు కేవలం ఉపరితలం వరకే చేరుకుంటాయి. కానీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కణాలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా యూవీ ప్రభావానికి లోనై సమూలంగా నాశనమైపోతాయి. అందుకే మనకే ఇబ్బందీ కలిగించకుండా, సూక్ష్మక్రిములను అంతం చేసే యూవీ లైట్ల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా గాలిలో ఏముందని ఈ లాభం???
సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాలు సూక్ష్మజీవులను నిర్మూలిస్తున్నాయి కాబట్టి ఎండతో లాభం ఉందని గ్రహించాం. బాగానే ఉందిగానీ.. మరి తాజా గాలి వల్ల జరిగేదేమిటి? పోర్టన్‌ డౌన్‌ పరిశోధకుల బృందం దీని మీదా విస్తృతంగా కృషి చేసి చివరికి- తాజా గాలిలో ఉండే 'హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌' అనేవి సూక్ష్మక్రిములను చంపుతున్నాయని గుర్తించింది. వాతావరణంలోని నీరు, ఓజోన్ల మధ్య నిరంతరం జరుగుతుండే ప్రతిచర్యల నుంచి ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ పుట్టుకొస్తున్నాయని, ఈ చర్యలకు గాలిలో మొక్కల నుంచి వెలువడే జీవ రసాయనాలు ఉత్ప్రేరకాలుగా దోహదం చేస్తున్నాయని వీరు గుర్తించారు. చిత్రమేమంటే ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ అట్టే కాలం ఉండవు, అందుకే ఎప్పటికప్పుడు తాజా గాలి వీస్తుండటం ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించటంతో బ్రిటన్‌కు చెందిన కొన్ని సంస్థలు ఈ హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌ను కృత్రిమంగా తయారుచేసే చిన్నచిన్న యంత్రాలను తయారుచేసి కూడా.
ఇదంతా చూసిన తర్వాత...
మన ఆసుపత్రుల్లోకి, మన ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలీ వెలుతురు రావటం ఎంత అవసరమో ప్రత్యేకంగా గుర్తించటం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సాధ్యమైనంత వరకూ ఇళ్లలో, ఆసుపత్రుల్లో సహజ సిద్ధమైన, ధారాళమైన గాలీవెలుతురు ఉండేలా చూడాలని సిఫార్సు చేస్తోంది. ఈ విషయంలో ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ కృషిని మరువద్దని కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. కాబట్టి గాలీ వెలుతురూ.. ఇళ్లలోకి బాగా రావాలని ఎవరైనా చెబితే.. ఏదో పాతకాలం మాట అని కొట్టిపారెయ్యకండి! సాధ్యమైనంత సహజ సిద్ధమైన జీవితాన్ని గడపండి! ఈ ప్రకృతిలో మనల్ని కాపాడే సహజసిద్ధమైన ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. వాటిని గౌరవించటం ఒక్కటే.. మనం మనకు చేసుకోగలిగిన గొప్ప మేలు!
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.