Tuesday, August 31, 2010

గాల్‌ బ్లాడర్‌ స్టోన్స్‌-నివారణ ,పసరతిత్తిలో రాళ్ళు , Gall Blader Stones and Treatment


Gall Stones :

పిత్తాశయం(గాల్‌బ్లాడర్) పొట్టకు కుడివైపున లివర్ కింది భాగంలో బేరీపండు ఆకారంలో ఉంటుంది. కాలేయం నుంచి ప్రవాహం మాదిరిగా వచ్చే పైత్యరసంను పిత్తాశయం నిలువ ఉంచుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు నిలువ ఉంచుకున్న పైత్యరసాన్ని బయటకు పంపించడం జరుగుతుంది. పైత్యరసంలో నీరు, కొలెస్టరాల్, ఫ్యాట్స్, బైల్ సాల్ట్స్, ప్రొటీన్స్, బైల్‌రూబిన్ ఉంటాయి.

భారత దేశంలో పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఆహారపు అలవాట్లలో మార్పే ప్రధాన కారణం. పాశ్చాత్య దేశాల్లో 60 ఏళ్లు దాటిన వారిలో 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. లావుగా ఉన్నవాళ్లలో, ఆడవారిలో, 50 సంవత్సరాలు వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందుకు కారణాలు, కాలేయంలో విడుదలైన పైత్యరసం పిత్తాశయంలో ఎక్కువకాలం నిల్వ ఉండడం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి.కాల్షియమ్‌కి ఇతర ఖనిజాలు తోడై ఈ రాళ్లు ఏర్పడతాయి. దీనికి కొలెస్ట్రాల్‌, పిగ్మెంట్స్‌ కలుస్తాయి. కొన్నిసార్లు వీటన్ని కలయికతో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయం కండరాలు సరిగ్గా సంకోచించక పోవడం వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. ఈ రెండింటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

పైత్యరసంలో ఎక్కువ శాతంలో కొలెస్టరాల్, బైల్‌రూబిన్ ఉన్నట్లయితే అప్పుడు పైత్యరసం గట్టిపడి రాళ్లుగా మారుతుంది. పిత్తాశయంలో కొలెస్టరాల్ స్టోన్స్ లేక పిగ్మెంట్ స్టోన్స్ అని రెండు రకాల రాళ్లు ఏర్పడతాయి. కొలెస్టరాల్ స్టోన్స్ పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొలెస్టరాల్ ఘనీభవించగా ఏర్పడిన రాళ్లు ఇవి. పిగ్మెంట్ స్టోన్స్ బైల్‌రూబిన్ వల్ల ఏర్పడతాయి. పిత్తాశయంలో ఒకటి లేక రెండు పెద్ద రాళ్లు ఏర్పడవచ్చు. చిన్నసైజులో ఉంటే అంతకంటే ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది.

తీసుకున్న ఆహారంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం, ఊబకాయం, గర్భనిరోధక మా త్రలు ఎక్కువ రోజులు వాడడం, గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భం దాల్చి నప్పుడు గాల్‌ బ్లాడర్‌ సరిగా వ్యాకోచించకలేకపోవడం వల్ల పిత్తాశ యంలో రాళ్లు ఏర్పడతాయి. అరుదుగా రక్తకణాలు ఎక్కువగా పగిలి పోవటం వలన కూడా రాళ్లు ఏర్పడవచ్చు. బహు అరుదుగా క్లోమం క్యాన్సర్‌, పిత్తాశయం క్యాన్సర్‌ వలన రాళ్లు ఏర్పడతాయి.

లక్షణాలు: 10 శాతం మందిలో ఎటువంటి ఇబ్బంది కలుగజేయవు. వేరే కారణాల కోసం పరీక్ష చేసినప్పుడు ఇవి బయటపడవచ్చు. కొన్ని సార్లు కుడివైపు కడుపు పై భాగంలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వీపు కూ డా పాకుతుంది. వ్యాపిస్తుంది. వాంతులొస్తాయి. కొద్దిగా తినడంతోనే కడుపు నిండిపోయిన భావం కలుగుతుంది. త్రేన్పులు రావడం, గుం డెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా గాల్‌ బ్లాడర్‌కు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు జ్వరం రావచ్చు. పిత్తాశయంలోని రాయి కిందకు జరినప్పుడు సంబంధిత కామెర్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది.

రాళ్ల బాధలు
చాలామందిలో ఏ ఇబ్బందీ తెచ్చిపెట్టని ఈ రాళ్లు.. కొందరిలో మాత్రం చాలా సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ రాళ్లు పిత్తాశయం నుంచి బయటపడితే సమస్య ప్రాణాంతకంగానూ తయారవుతుంది.

1. బయటకు జారి.. ఇరుక్కోవటం: పిత్తాశయంలోని రాళ్లు బయటకు వచ్చి.. పైత్యరసనాళంలో ఇరుక్కుపోవటం మరో ముఖ్యమైన సమస్య. ఒకసారి రాయి పైత్యరస నాళంలోకి జారితే దానివల్ల కామెర్లు (అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌) రావచ్చు. రాయి పైత్యరసనాళంలో అడ్డుపడినప్పుడు ప్రధానంగా- జ్వరం, చలి, కామెర్లు, కడుపునొప్పి.. ఈ నాలుగు లక్షణాలూ కనబడతాయి. ఈ లక్షణాలను బట్టే వైద్యులు రాయి ఇరుక్కుందని తేలికగా చెప్పెయ్యగలుగుతారు.

2. క్యాన్సర్‌: ఇది మన ప్రాంతంలో కొంత అరుదే. రాళ్లు ఉన్న వారందరికీ క్యాన్సర్‌ రావాలనేం లేదు. కానీ క్యాన్సర్‌ వచ్చిన వారందరికీ రాళ్లు ఉంటున్నాయి. దీనికి జన్యుపరమైన అంశాలు కారణం కావచ్చు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. మామూలుగా 2-3 మి.మీ. మందం ఉండే పిత్తాశయం గోడలు.. లోపల రాళ్ల కారణంగా 5-6 మి.మీ. కంటే మందంగా తయారై.. క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి.

3. చీము పట్టటం: రాయి పిత్తాశయం మూతి వద్దకు వచ్చి ఇరుక్కుపోయి బాధలు మొదలైతే... ఉన్నట్టుండి పిత్తాశయం వాచి, తీవ్రమైన కడుపునొప్పి ఆరంభమవుతుంది. దీన్నే 'అక్యూట్‌ కోలిసిస్త్టెటిస్‌' అంటారు. క్రమేపీ పిత్తాశయంలో ఇన్ఫెక్షన్‌ పెరిగి.. ఆ పసరు తిత్తి మొత్తం చీము పట్టినట్టవుతుంది. దీన్ని 'ఎంపయిమా ఆఫ్‌ గాల్‌బ్లాడర్‌' అంటారు. దీనిలో పసరుతిత్తి నిండా చీము చేరిపోయి ఉంటుంది. అప్పుడు బయటి నుంచి లోపలికి ఒక గొట్టం అమర్చి అందులోని చీమునంతా బయటకు తీసేసి, తర్వాత సర్జరీతో పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది.

4. పాంక్రియాటైటిస్‌: రాళ్లతో వచ్చే అత్యంత ప్రమాదకరమైన సమస్య ఇది. పిత్తాశయంలోని రాయి కిందకు జారి.. ఆ పైత్యరసనాళం చివర్లో ఉన్న క్లోమగ్రంథి నాళానికి అడ్డుపడితే.. పైత్యరసం క్లోమంలోకి వెళ్లి.. ఆ క్లోమ గ్రంథి వాపు మొదలవుతుంది. దీన్నే 'పాంక్రియాటైటిస్‌' అంటారు. ఇది అత్యంత తీవ్రమైన సమస్య. ఇదిముదిరితే 40% మందిలో ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందుకే ఈ సమస్య తలెత్తినప్పుడు అత్యవసరంగా ఎండోస్కోపీ ద్వారా ముందు ఆ అడ్డుపడిన రాయిని తీసేసి, ఆ తర్వాత మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం అవసరం.

5. కొవ్వు తింటే అజీర్ణం: కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తిన్న తర్వాత అజీర్ణం, అసౌకర్యం తలెత్తుతుంటే రాళ్ల కారణంగా పిత్తాశయం సరిగా సంకోచించక, దానిలోని పైత్యరసం సాఫీగా పేగుల్లోకి రావటం లేదని అర్థమవుతుంది. దీన్ని 'ఫ్యాటీ డిస్పెప్సియా' అంటారు. దీనికి ఆహారం తినక ముందు, తిన్న తర్వాత అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తే- పిత్తాశయం సరిగా సంకోచిస్తోందా? లేదా? తెలుస్తుంది. ఒకవేళ సంకోచాలు సరిగా లేవని తేలితే.. రాళ్ల వల్ల వారిలో ఇతరత్రా సమస్యల్లేకపోయినా కూడా.. సర్జరీ చేసి పిత్తాశయాన్ని తొలగించాల్సి వస్తుంది.

గుర్తించడం ఎలా?

* ఎక్సేరే పరీక్షలో రాళ్లు నూటికి 90 శాతం కనిపించవు. వీటిని కను గొనేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మంచి పద్ధతి. ఈ పరీక్షలో 99 శాతం గుర్తించవచ్చు. ఆహారం ఏమీ తీసుకోకుండా పరీక్ష చే యించుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కామె ర్లు ఉంటే కాలేయానికి సంబంధించిన పరీక్షలు కూడా చేయిం చుకోవాలి. గాల్‌స్టోన్స్‌తో పాటు క్లోమంగాని, ఉదరం సంబం ధించిన వ్యాధులు గాని ఉంటే సి.టి స్కాన్‌ చే యించుకోవాలి.

పిత్తాశయంలో రాళ్లతో ఏర్పడే చిక్కులు (complications):
* ఎల్లప్పుడూ కడుపు నొప్పి ఉండడం, కామెర్లు రావడం, ఇన్‌ఫెక్షన్స్‌ రావడం, గాల్‌ బ్లాడర్‌ అం తా చీము పట్టడం, పేగులకు అతుకులు రావడం వంటి సమ స్యలు తలెత్తుతాయి. గాల్‌ బ్లాడర్‌ కి రంధ్రం పడి పైత్య రసం పొట్ట లోకి రావచ్చు


చికిత్స: గాల్‌స్టోన్స్‌ ఉన్నా ఎటు వంటి ఇబ్బందులు లేకుంటే వై ద్యం అవసరం లేదు. అనేక రాళ్లు ఉన్నప్పుడు, ఒక రాయి మాత్రమే ఉన్నా, దాని పరిమాణం ఒక సెం టీమీటర్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, షుగర్‌(Diabetes) ఉన్నప్పుడు, ఇది వరకు ఒకటి, రెండు సార్లు నొప్పి వచ్చినట్లయితే చికిత్స అవసరమవుతుంది. గాల్‌బ్లాడర్‌ చీము పట్టి న ప్పుడు, గాల్‌స్టోన్స్‌ వల్ల కామెర్లు వచ్చినప్పుడు కూడా వైద్యం తీసుకోవాలి.

ఔషధాలతో చికిత్స : మందులను తీసుకోవడం వలన కొంతమందిలో రాళ్లు కరుగవచ్చు. ఈ వైద్యం ఆరునెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు కొందరకి సరిపడవు. అరుగుదల సమస్య ఏర్పడుతుంది. మోషన్స్‌ (విరోచనాలు)ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఈ చికిత్స తీసుకోవడం ఆపేయగానే మరలా రా ళ్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ చికిత్సను ప్రస్తుతం వైద్యు లు సూచించడం తగ్గించారు.

లిథోట్రిప్సి : రాళ్లను తొలిగించేందకు ఇదొక పద్ధతి. దీనిని శస్తచ్రికిత్స లేకుండా చేస్తారు. ఈ విధానంలో రాళ్లు బాగా లోపలికి ఉన్నప్పుడు తొలిగించడం ఇబ్బంది అవుతంది. అన్నిసార్లు పూర్తిగా రాళ్లను కరిగిం చకపోవచ్చు. ఈ వైద్యం చేయించుకున్న తరువాత కొన్ని రోజులకు మరలా రాళ్లు తయారు కావచ్చు.

శస్త్ర చికిత్స : ఎప్పటికైనా సర్జరీ మంచి పద్ధతి. ఎందుకంటే గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడడమే కాదు, గాల్‌ బ్లాడర్‌పైనున్న పొరకూడా చాలాసార్లు దెబ్బతిని ఉంటుంది. గాల్‌స్టోన్స్‌తో పాటు, గాల్‌ బ్లాడర్‌ లేకుండా తీసేస్తే రోగికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.

ఎప్పుడు ఈ చికిత్స అవసరం : నొప్పి వచ్చిన మూడు రోజులలో సర్జరీ చేయించుకుంటే మంచిది. ఈ మూడు రోజుల్లో వీలు కుదర కపోతే మూడు వారాల తరువాత చేయించుకోవాలి. శస్త్ర చికిత్సలో 1.ఓపెన్‌, 2.ల్యాప్రోస్కోపి కొలిసిస్టెక్టమీ అనే రెండ రకాలున్నాయి.

ల్యాప్రోస్కోపి :1970లో ఈ విధానం మొదలైంది. ఇది ఆపరేషన్‌ రూపురేఖల్ని మార్చి వేసింది. కేవలం ఒక సెంటీమీటర్‌ కోతతో ఈ ఆపరేషన్‌ చేయవచ్చు. ఈ శస్త్ర చికిత్సను చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ఆస్పత్రులో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండాల్సి వస్తుంది. నొప్పి చాలా తక్కువ. పనికి తొందరగా వెళ్లవచ్చు. ఆపరేషన్‌ తరువాత వచ్చే ఇబ్బందులు, కుట్టు చీము పట్టడం వంటి సమస్యలు ఉండవు.
తేలికైన సర్జరీ

పిత్తాశయంలో రాళ్ల కారణంగా నొప్పి వంటి బాధలు మొదలైతే సర్జరీ చేసి మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం అవసరం. చాలామంది కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా.. అనుకుంటూ ఉంటారు. కానీ రాళ్ల కారణంగా పిత్తాశయం ఒకసారి వాచి, చీముపట్టిన తర్వాత.. దాని లోపలి పొరల స్వభావంలో తేడాలు వచ్చేస్తాయి. ఫలితంగా లోపల తరచూ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. అరుదుగా ఇది క్యాన్సర్‌గా కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం పిత్తాశయాన్ని తొలగించటం ఉత్తమం.

* పిత్తాశయంలో రాళ్ల సమస్యకు... మొట్టమొదటిసారిగా 1881లో కాల్‌ ఆండర్స్‌ అనే వైద్యుడు శస్త్రచికిత్స చేశారు. అంతకు ముందు లక్షణాలను బట్టి మందులు ఇచ్చేవారు గానీ చాలామంది మరణించేవారు.

* 1881లో మొత్తం పొట్ట తెరిచి సర్జరీ చేశారు. అప్పట్లో ఈ సర్జరీ చాలా క్లిష్టమైనది, రిస్కుతో కూడుకున్నది. ఎందుకంటే పిత్తాశయం కాలేయం కిందగా ఇరుక్కున్నట్టు ఉంటుంది, దీనిచుట్టూ కేవలం ఒక్క సెంటీ మీటర్‌ ప్రాంతంలోనే కీలకమైన రక్తనాళాలు, నిర్మాణాలు ఉంటాయి. ఇంత చిన్న ప్రాంతంలో ఏవీ దెబ్బతినకుండా సర్జరీ చెయ్యటమన్నది పెద్ద సవాల్‌లా ఉండేది. 1881లో మొట్టమొదటి సర్జరీ చేస్తే.. దాదాపు వందేళ్ల తర్వాత 1989లో మొదటగా దీన్ని ల్యాప్రోస్కోపీ పద్ధతిలో తొలగించారు. ఈ విధానంలో పొట్ట తెరవాల్సిన పని లేదు. పొట్ట మీద కేవలం మూడు రంధ్రాలువేసి.. వాటి ద్వారా కెమెరా గొట్టం పంపి.. టీవీ తెర మీద పెద్దగా చూస్తూ.. సర్జరీ చేస్తారు. రోగి త్వరగా కోలుకుని మర్నాటికే ఇంటికి వెళ్లిపోవచ్చు. అందుకే ఇది ప్రామాణిక చికిత్సగా నిలిచింది.

* తాజాగా బొడ్డు దగ్గర ఒక్క రంధ్రంతోనే (సింగిల్‌ పోర్టు) పిత్తాశయాన్ని తొలగించే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకా అత్యాధునికంగా- స్త్రీలకు పొట్ట మీద ఎక్కడా రంధ్రం వెయ్యాల్సిన అవసరం లేకుండా కేవలం యోని ద్వారం గుండానే పరికరాలు పంపించి పిత్తాశయాన్ని తొలగించే విధానం (నోట్స్‌) కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం దీన్ని చాలాకొద్ది కేంద్రాల్లోనే చేస్తున్నారు, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

గర్భిణుల్లో..
హార్మోన్ల ప్రభావంతో పిత్తాశయంలో రాళ్ల సమస్య స్త్రీలలో ఎక్కువ. అప్పటికే రాళ్లున్న వారు గర్భం ధరిస్తే.. సమస్యలు మొదలయ్యే అవకాశాలుంటాయి. హార్మోన్ల మార్పులకు తోడు గర్భిణులు కొవ్వు అధికంగా ఉండే బలవర్ధక ఆహారం అధికంగా తీసుకోవటం కూడా దీనికి దోహదం చేస్తుంది. గర్భిణుల్లో ఈ సమస్య వస్తే 1-3 నెలల్లో సాధారణంగా సర్జరీని వాయిదా వెయ్యటానికి ప్రయత్నిస్తారు. 3-6 నెలల గర్భిణుల్లో సర్జరీ చెయ్యటం సురక్షితమే. 6-9 నెలల మధ్య చెయ్యచ్చుగానీ సర్జరీ సంక్లిష్టంగా తయారవుతుంది. కేవలం నొప్పి మాత్రమే అయితే మొదటి మూడు నెలల్లో మందుల వంటివి ఇచ్చి.. 3-6 నెలల మధ్య సర్జరీ చేసి తొలగిస్తారు.
బాధల్లేకపోయినా సర్జరీ?
రాళ్లు మూలంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా కూడా కొందరిలో ఆపరేషన్‌ చేసి పిత్తాశయాన్ని తీసెయ్యటం ఉత్తమం. ఎవరెవరి కంటే..
* వంశంలో పిత్తాశయ క్యాన్సర్‌ చరిత్ర ఉండి.. ఇప్పుడు వీరికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినా
* సికిల్‌సెల్‌ ఎనీమియా వంటివి ఉండి, పిత్తాశయంలో రాళ్లు వచ్చినా
* గుండె, కిడ్నీల వంటివి మార్పిడి చేయించుకుంటున్న వారికి
* మధుమేహుల్లో పిత్తాశయంలో రాళ్లు ఉండి, ఇన్ఫెక్షన్‌ వస్తే అది చాలా తీవ్రంగా ఉండొచ్చు. కాబట్టి అసలా పరిస్థితి రాకుండా ముందే పిత్తాశయాన్ని తీసెయ్యటం మంచిదన్న భావన ఉంది.
* మన దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేని, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి.. రాళ్ల వల్ల ఎప్పుడైనా హఠాత్తుగా సమస్య తలెత్తితే 48 గంటల్లోపు వైద్యం అందే వెసులుబాటు ఉండదు కాబట్టి వారు ముందు జాగ్రత్తగా సర్జరీ చేయించుకోవటం మేలని భావిస్తారు.

--డా|| జి.వి.రావు-చీఫ్‌ ఆఫ్‌ సర్జరీ ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌-ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ-హైదరాబాద్‌

జాగ్రత్తలు : కొవ్వు పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. నాన్‌ వెజిటేరియన్‌ తగ్గించాలి. గర్భ నిరోధక మాత్రలు వాడకాన్ని తగ్గించాలి.ఈ పిత్తాశయం తొలగిస్తే ప్రమాదమని కొంతమంది భావిస్తుంటారు. దీనికి భయపడనవసరం లేదు. కొవ్వు పదార్థాలు అరగడానికి పైత్యరసం ఉపయోగపడుతుంది. ఈ రసం కాలేయం నుంచి స్రవించి, పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. దీనిని తొలిగిస్తే కాలేయంలో విడుదలయిన పైత్యరసం నేరుగా పేగుల్లోకి వచ్చి ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాని ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. అయితే తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు తీసుకుంటే అందరిలాగే సాధారణ జీవితం గడపవచ్చు.


  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.