Monday, October 21, 2013

Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Can not we prevent heart diseases?,గుండె జబ్బులను నివారించలేమా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె జబ్బులు వచ్చిన తరువాత పరుగులు తీయడమే తప్ప, ఆ జబ్బులు రాకుండా నివారించే విధానాల పట్ల చాలా మంది ఆసక్తి చూపడం లేదు. దాని పరిణామంగానే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే క్రమంలో గుండె సర్జరీల సంఖ్య పెరుగుతోంది. ఆ పరిస్థితికి తావు లేకుండా జీవన శైలి మార్పులతో, ప్రకృతితో జీవనం సాగించడం ద్వారా గుండెను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవచ్చని అంటున్నారు వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. సత్యలక్ష్మి. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే....

గుండె జబ్బు అనగానే గుండెపోటు రావడం, విలవిల్లాడుతూ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం. దాదాపు ప్రతి ఒక్కరి మనసులో ఇదే దృశ్యం కదలాడుతూ ఉంటుంది. సమస్య ఏ స్థాయిలో ఉన్నా గుండె జబ్బు నుంచి బయటపడటానికి సర్జరీ ఒక్కటే పరిష్కారం అన్న భావన కూడా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ స్థిరపడిపోయింది. దీనికంతా సినిమాలా? నవలలా? విస్తృతమైన వ్యాపార ప్రకటనలా? ఏవైతేనేమిటి? ఆ భావనైతే అందరిలో మకాం వేసింది. దీనికి గుండె శస్త్ర చికిత్సలు బాగా అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమే. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులకు సంబంధించి రొటీన్ టెస్ట్‌లలో వచ్చే రిపోర్టుల ఆధారంగా డాక్టర్ ప్రమేయం లేకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు . కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారూ నాకు సర్జరీ చేయండి అంటూ తమకు తామే సిద్ధమయ్యే పరిణామాలు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఒక అనివార్య పరిస్థితిలోనే యాంజియోగ్రామ్ చేయించుకోవాలనే విషయం మరిచిపోయి అదొక రొటీన్ విధానంగా తీసుకోవడం మొదలలయ్యింది. పేషంట్లు తమకు తామే నిర్ణయించుకుని ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి యాంజియోగ్రామ్ చేయించుకుని సాయింత్రానికి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కానీ, యాంజియోగ్రామ్ వల్ల కూడా ఒక్కోసారి దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న విషయం వారు తె లుసుకోవడం లేదు. అయితే, సమస్య ఉందో లేదో తెలుసుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ వారికి సమస్య రాకుండా నివారించుకునే విధానాల పట్ల ఉండడం లేదు. సైన్స్ బాగా అందుబాటులోకి వ చ్చే క్రమంలో దాని సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయమైన అవగాహనలో మనకన్నా పాశ్యాత్యులే ముందు ఉన్నారు. అందులో భాగంగా 1970లోనే డీన్ అర్నిష్ అనే వ్యక్తి 'లైఫ్ స్ట్రైల్ హార్ట్ ట్రయల్స్' అన్న పేరిట సరియైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులనుంచి ఎలా బయటపడవచ్చో తెలియచేశారు. ఎంతో లోతైన అధ్యయనం చేసి, క్లినికల్ ట్రయల్స్ చేసి గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకుల్ని ఏ సర్జరీ లేకుండానే అవి కరిగిపోయేలా చేసి తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావచ్చో కనుగొన్నారు. కాకపోతే జీవన శైలి విషయంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి.

ఏది విశిష్ట జీవన శైలి?
గుండె జబ్బులకైనా, మరే ఇతర జబ్బుల కైనా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలే కారణం. అయితే, శరీరంలో పేరుకుపోయిన కలుషితాలు, మలినాలే కాదు, శరీర అవసరం లేని లేదా శరీర అవసరానికి మించి శరీరంలో ఏది ఉన్నా, అది విషపదార్థంగానే పరిగణించబడుతుంది. ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉన్నా అవి విషపదార్థమే అవుతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. వ్యాధికి మూలం విషపదార్థాలు కారణం కాబట్టి, వాటిని తొలగించడమే ఆ వ్యాధికి చికిత్స. ప్రకృతి వైద్య చికిత్సలోని మూల సూత్రమే ఇది.

గుండె రక్తనాళాల్లో అడ్డుంకులు రావడానికి కూడా శరీరంలోని విషపదార్థాలే కారణం. కాకపోతే ఒకప్పుడు గుండె నాళాల్లో అడ్డంకులు రావడానికి ఒకప్పుడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే కారణం అనుకునే వారు. అయితే ఆ అడ్డంకులు రావడానికి రక్తనాళాల్లో చేరిన కొవ్వు కణాల్లో వాపు ఏర్పడటం రక్తస్రావం కావడమే కారణమని కొత్తగా కనుగొన్నారు. ఈ రక్తస్రావం వల్ల రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు రావడానికి దారి తీస్తోందని స్పష్టం చేశారు. దీనికి శరీరంలో జరిగే ప్రతికూల చర్యలే కారణంగా కనపడుతున్నాయి. దీనికి తీసుకునే ఆహార పానీయాలు, మలబద్దకంతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా కారణంగా ఉంటున్నాయి. మన శరీరంలో కొన్ని వేల మైళ్ల నిడివిగల రక్తనాళాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ అనేది అంతటి సంకీర్ణమైన వ్యవస్థ. ఈ స్థితిలో ఎవరైనా ఎన్ని చోట్ల అని బైపాస్ సర్జరీ చేయించుకుంటారు? ఎన్నిసార్లని చేయించుకుంటారు? ఇది అవసరమా?

అసలైన ప్రత్యామ్నాయం
సర్జరీ కాకుండా ఆ స్థితినుంచి కాపాడే శాస్త్రీయమైన మరే మార్గమూ లేదా? రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండగలిగే స్థితిని కలిగించలేమా? అంటే చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా....క్రమం తప్పకుండా రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం. శ్రమ లేదా వాయామాల ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి, అడ్డంకులు ఏర్పడిన సమయాల్లో కూడా ప్రాణాపాయం ఏర్పడకుండా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అలా కాకుండా మందుల మీదే పూర్తిగా ఆ«ధారపడితే, ఆ మందుల తాలూకు దుష్ప్రభావాలతో సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకే శరీర వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.
8 ఆహార విషయాలు కూడా అంతే ముఖ్యం.

అందుకు వీలైనంత మేరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంటే ఉడికించిన వాటి కంటే ప్రకృతి నుంచి నేరుగా తీసుకునే ఆహార పదార్థాలు ఎంతో శ్రేష్టమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీన్ ఆర్నిశ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతాడు. అందులో 90 శాతం మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవాలంటాడు. అలాగే ఉప్పు, మసాలాలు అతిగా వాడటం, రసాయనాలు, వస్తువుల్ని నిలువ ఉంచే ప్రిజర్వేటర్లు లేని పదార్థాలు తీసుకోవడం ఎంతో మేలు. అలాగే పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాల మోతాదును గణనీయంగా తగ్గించడం అవసరం. హెచ్‌డిఎల్ లేదా కొలెస్ట్రాల్ మన శరీరంలో కొవ్వుగా మన శరీరంలో నిలువె ఉంటుంది. అది మన అవసరానికి ఉపయోగపడుతుంది. అదే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అయితే రక్తంలో కలిసిపోయి రక్తనాళాల్లో అడ్డుపడి గుండె జబ్బులకు దారి తీస్తుంది.

ఆహార నియమాలు
8 రక్తప్రసరణలో ఈ అంతరాయాలేవీ రాకుండా ఉండాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. ఆహార పానీయాల్లో సిట్రస్ అంటే సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, విరివిగా తీసుకోవాలి. శరీరం బరువును బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో బియ్యం, గోదుమలకే పరిమితం కాకుండా, కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తీసుకోకపోవడం అన్ని విధాలా మేలు.

రోజూ ఒకే రకమైన ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరం అందులోని పోషకాలను సంగ్రహించే విషయంలో అనాసక్తి చూపుతుంది. అందువల్ల వాటిని తినడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. పైగా గోదుమల్లో గ్లూటన్ అనే జిగట పదార్థం పలురకాల అలర్జీలకు కారణమవుతుంది. అంతకు మించి ఇది మలబద్దకానికి కూడా కారణమవుతుంది. మలబద్దకం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇవి పరోక్షంగా గుండెజబ్బులకు రక్తనాళాల అంతరాయానికి కారణమవుతాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పీచుపదార్థాల్లో జీర్ణమయ్యేవి, జీర్ణం కానివి అంటూ రెండు రకాలుగా ఉంటాయి. వీటిలో జీర్ణమయ్యే పీచుపదార్థం ఎక్కువ మేలు చేస్తుంది. ఇది పేగుల్లో ఉంటూ మనకు ఉపయోగకరంగా ఉండే బ్యాక్టీరియాను పోషించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ జాగ్రత్తలన్నీ జీవక్రియలు సవ్యంగా జరిగి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

Courtesy with : డాక్టర్ కె. సత్యలక్ష్మి,డైరెక్టర్, వేమన యోగ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్,బేగంపేట్, హైదరాబాద్@salaka of Andhrajyoti newspaper.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.