ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తల్లిగర్భంలో బిడ్డకు తలెత్తే లోపాలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పిండం ఎదిగే క్రమంలో తల్లిగర్భంలో తలెత్తే లోపాలు, పుట్టుకతో వచ్చే చాలా అవకరాలను నేడు సమర్థంగా చక్కదిద్దే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డకు ఏదో సమస్య ఉందని తెలియగానే విపరీతంగా ఆందోళనలో కూరుకుపోవాల్సిన పనిలేదు. ఆ సమస్య ఏమిటి? దాన్ని అధిగమించేందుకు మన ముందున్న మార్గాలేమిటి? దీనికి వైద్యులు ఎటువంటి సహాయం అందిస్తారన్నది తెలుసుకుని.. అవగాహన పెంచుకుని.. దాన్నిబట్టి ఒక నిర్ణయానికి రావటం ప్రధానం.
లోపం..
స్త్రీపురుష సమాగమంలో ఏకమయ్యేది సూక్ష్మాతిసూక్ష్మమైన అండం, శుక్రం! కంటికి కనిపించని ఆ రెండూ కలిసి ఏర్పడే ఓ అతి చిన్న ఏక కణం... ఎన్నో అవయవాలతో, వ్యవస్థలతో నడయాడుతుండే.. ఓ పండంటి బిడ్డగా పురుడుపోసుకోవటం.. ప్రకృతిలోకెల్లా ఓ అత్యద్భుత పరిణామం! పైకి చాలా సహజంగా జరిగిపోతున్నట్టే అనిపించినా నిజానికి ఇదో సంక్లిష్టమైన జీవ నిర్మాణ ప్రక్రియ. అందుకే ఈ క్రమంలో ఎక్కడైనా తేడాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పిండం వేగంగా మార్పులు చెందే క్రమంలో 3 నుంచి 8 వారాల మధ్య ఇటువంటి తేడాలొచ్చి.. అవే లోపాలుగా తయారవుతుంటాయి. చాలా రకాల లోపాలకు బీజాలు 5వ వారంలో పడుతుంటాయి. కొన్నిసార్లు ఒక్కటే లోపం ఉండొచ్చు.. కొన్నిసార్లు చాలారకాల లోపాలు కలగలిసి ఉండొచ్చు. వీటిని గుర్తించేందుకే గర్భిణులకు వైద్యులు మధ్యమధ్యలో స్కానింగులు చేస్తుంటారు. సాధారణంగా పిండదశలో తలెత్తే పలురకాల లోపాలు 18-28 వారాల మధ్య చేసే స్కానింగులో బయటపడతాయి. అయితే ఈ లోపాలన్నీ కూడా ప్రమాదకరమైనవేం కాదు. వీటిలో చాలా లోపాలు తల్లి కడుపులోనే... కాన్పు అయ్యేలోపే సర్దుకుంటుంటాయి కూడా. కొన్ని లోపాలు అలా మిగిలిపోయినా వాటివల్ల తీవ్రమైన నష్టమేమీ ఉండదు. ఇక కొన్ని లోపాలను బిడ్డ పుట్టగానే ఆపరేషన్ చేసి చాలా వరకూ చక్కదిద్దచ్చు. ఇటువంటి ఆపరేషన్ల విషయంలో ఇప్పుడు 'పీడియాట్రిక్ సర్జరీ' విభాగం ఎంతో పురోగమించింది కూడా.
గుర్తించేదెలా?
కడుపులో పిండం ఎదుగుదలను అంచనా వేసి లోపాలేమైనా తలెత్తుతున్నాయా? అన్నది తేల్చిచెప్పేందుకు ఇప్పుడు చాలా రకాల పరీక్షా పద్ధతులున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- ఆల్ట్రాసౌండ్ స్కానింగ్. దీనిలో- ఏ వారానికి పిండం ఎదుగుదల ఎంత ఉండాలో అలాగే ఉందా? ఆ క్రమంలో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయా? ఉమ్మనీరు తగినంతగా ఉందా? మాయ ఎలా ఉంది? తల్లి నుంచి బిడ్డకు బొడ్డు తాడు గుండా రక్తప్రసారం బాగుందా? తదితర అంశాలన్నీ తెలుస్తాయి. 11-14 వారాల మధ్య స్కానింగు (ఎన్‌టీ స్కాన్) చేసి పిండం మెడ దగ్గరి ముడతల మందం ఎంత ఉందన్నది చూస్తారు. ఈ మందాన్ని బట్టి బిడ్డకు తీవ్రస్థాయి క్రోమోజోముల లోపాలుగానీ, బుద్ధిమాంద్యం వంటి తీవ్ర సమస్యలుగానీ తలెత్తే అవకాశం ఉందేమో అంచనా వేస్తారు. ఇక 18-23 వారాల మధ్య ఇలాంటిదే మరో స్కానింగు (టిఫా స్కాన్) చేసి... బిడ్డలో నిర్మాణపరంగా ఎక్కడెక్కడ లోపాలు తలెత్తే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలన్నీ ఒక పద్ధతి ప్రకారం క్షుణ్ణంగా పరీక్షిస్తారు. సాధారణంగా ఎటువంటి పెద్ద, చిన్న లోపాలున్నా దీనిలో గుర్తించే వీలుంటుంది. ఇక పిండం గుండె పనితీరు ఎలా ఉంది? దానిలో రక్తప్రసారం బాగుందా? తదితర వివరాలు తెలుసుకునేందుకు 'ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ' పరీక్ష చేస్తారు. ఇది కూడా తల్లి పొట్ట మీది నుంచి చేసే స్కానింగు వంటిదే. ఇవి కాకుండా సాధారణంగా 23-28 వారాల మధ్య చేసే 'త్రీడీ', 'ఫోర్‌డీ' స్కానింగులతో బిడ్డ స్వరూపం, కొంత వరకూ అంతర్గత అవయవాల నిర్మాణాన్ని కూడా తెలుసుకోవచ్చు. వీటికి తోడు గర్భిణులందరికీ కొన్ని రక్తపరీక్షలు చేసి 'ఆల్ఫా ఫీటో ప్రోటీన్' వంటివి చూస్తే మరికొంత సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ బిడ్డలోని లోపాలను పట్టిచూపించే సాధారణ పరీక్షా విధానాలు. అయితే ఏదైనా బలమైన అనుమానం తలెత్తితే.. 10-12 వారాల మధ్య మాయ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం (కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్), 15-20 వారాల మధ్య తల్లి పొట్ట మీది నుంచి సూదితో ఉమ్మనీరు తీసి పరీక్షించటం (ఆమ్నియోసెంటిసిస్) వంటివి కూడా చాలా సమాచారాన్ని అందిస్తాయి.
లోపాలుంటే...?
ఏదైనా లోపం తలెత్తుతోందని గుర్తించినప్పుడు రకరకాల విభాగాలకు చెందిన వైద్యనిపుణులతో చర్చించి.. లోపం స్వభావం ఏమిటి? దానివల్ల బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? చక్కదిద్దే మార్గాలేమిటి? అన్నది చర్చించి.. తల్లిదండ్రులకు సమగ్రంగా వివరిస్తారు. తల్లీబిడ్డలిద్దరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరాన్ని బట్టి ఐసీయూ వంటి సదుపాయాలున్న పెద్ద ఆసుపత్రిలో కాన్పు చేసి.. వెంటనే బిడ్డ సంరక్షణ బాధ్యత చేపడతారు.
లోపాలుంటే.. మార్గాలు?
1. పిండ దశలోనే మరమ్మతులు చెయ్యటం.. ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న వినూత్న విధానం. ప్రస్తుతానికి ఇలా చాలా కొద్ది సమస్యలను మాత్రమే చక్కదిద్దచ్చు. ముఖ్యంగా పిండానికి మూత్రాశయం మూసుకుపోయి, మూత్రం లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలను షంట్ అమర్చటం ద్వారా కొంత వరకూ సరిచేస్తున్నారు. పిండంలో గుండె సమస్యల వంటివి చక్కదిద్దే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తానికి పిండానికే మరమ్మతులు చేసే నైపుణ్యం ఇంకా అందుబాటులో లేదనే చెప్పాలి.
2. గర్భాన్ని అలాగే కొనసాగించి.. బిడ్డ పుట్టగానే లోపాన్ని చక్కదిద్దటం: ప్రస్తుతం చాలా సమస్యల విషయంలో ఇది సాధ్యమవుతోంది. గర్భంలోనే సమస్యను గుర్తించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని.. మంచి సదుపాయాలున్న ఆసుపత్రిలో కాన్పు చేసి వెంటనే బిడ్డకు సంరక్షణ కల్పించి.. క్రమేపీ లోపాన్ని సరిదిద్దటం.. ఇప్పుడిలా చాలా సమస్యలను చక్కదిద్దచ్చనే చెప్పొచ్చు.
3. గర్భస్రావం చెయ్యటం: బిడ్డలో లోపాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, ఏ రకమైన వైద్యసేవలు అందించినా బిడ్డ మనుగడ, సాధారణ జీవనం కష్టమని గుర్తించినప్పుడు గర్భస్రావం చేయించుకునే అవకాశం గురించి కూడా వైద్యులు చర్చిస్తారు.
ఆదుకునే వైద్యం
మన మెదడు, వెన్నుపాము చుట్టూ నీరులాంటి ద్రవం (సీఎస్‌ఎఫ్) ఉంటుంది. దీని ప్రవాహ మార్గంలో ఎక్కడన్నా అవరోధాలు తయారైతే ఈ ద్రవం ఎక్కువైపోయి.. తల పెద్దగా కనబడుతుంటుంది. మెదడులోని ఆ చుట్టుపక్కల భాగాలన్నీ నొక్కుకుపోయి.. మెదడు దెబ్బతినొచ్చు. దీన్నే 'హైడ్రోసెఫాలస్' అంటారు. దీనివల్ల తర్వాత్తర్వాత బిడ్డ కదలికలు దెబ్బతినటం, మేధస్సు పెరగకపోవటం వంటి రకరకాల దుష్ప్రభావాలు రావచ్చు. ఈ సమస్యను 18-23 వారాల మధ్య చేసే 'టిఫా స్కానింగు'లోనే గుర్తించొచ్చు. ప్రతి 2000 కాన్పుల్లో ఒకరు ఇటువంటి లోపంతో పుడుతుంటారు. ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువ. వీరిలో చాలామందికి ఇతరత్రా సమస్యలూ ఉండే అవకాశమూ ఉంది. కొన్నిసార్లు వీరిలో క్రోమోజోముల లోపాలూ ఉండొచ్చు కాబట్టి ఉమ్మనీరు తీసి పరీక్షిస్తారు. ఇక అప్పటి నుంచీ బిడ్డ మెదడు సైజు గమనిస్తూనే ఉంటారు.
* సాధారణంగా- బిడ్డ పుట్టిన తర్వాత.. మెదడు చుట్టూ చేరిపోయిన నీరు తగ్గేందుకు ఒక ఆపరేషన్ చేసి మెదడు నుంచి పొట్టలోకి ఒక గొట్టం (వి.పి.షంట్) అమరుస్తారు.
* ఆందోళనకరం- మెదడులో నీరు చేరే ప్రాంతమైన వెంట్రికల్స్ 15ఎంఎం కంటే పెద్దగా అయినా.. మెదడు కార్టెక్స్ పరిమాణం 1.5 సెం.మీ. కన్నా తక్కువగా ఉన్నా... తలసైజు వేగంగా పెరుగుతున్నా పరిస్థితి బాగలేదనే అర్థం. ఇటువంటి బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధారణ జీవనం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
తల్లి కడుపులో పెరుగుతున్న పిండానికి కిడ్నీల్లో నీరు చేరి, అది పెరగుతుండటం సమస్యే. దీన్ని 'హైడ్రోనెఫ్రోసిస్' అంటారు. కిడ్నీల్లో నుంచి బయటకొచ్చే మూత్రనాళాల దగ్గర ఏదైనా అవరోధం ఏర్పడితే కిడ్నీల్లో ఇలా మూత్రం పెరిగి నీరు చేరినట్లవుతుంది. దీనికి చాలా అంశాలు కారణం కావచ్చు. దీన్ని 20-24 వారాలప్పుడు చేసే స్కానింగులో గుర్తిస్తారు. వాపు స్వల్పంగా ఉంటే (మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్) దీనివల్ల బిడ్డ కిడ్నీలకు పెద్దగా ఇబ్బందేం ఉండదు.
* సాధారణంగా- సమస్య ఒక కిడ్నీకే ఉన్నప్పుడు క్రమేపీ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత 4 వారాలకు పరిస్థితి ఒకసారి గమనించి.. అప్పుడు అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచెయ్యచ్చు. ఇలా హైడ్రోనెఫ్రోసిస్ సమస్యతో పుట్టిన బిడ్డల్లో 33% మందికే ఇటువంటి సర్జరీ అవసరమవుతుంటుంది. మిగతా వారికి ఏ ఇబ్బందీ ఉండదు.
* ఆందోళనకరం- పిండం రెండు కీడ్నీల్లోనూ నీరుచేరినా, కిడ్నీలతో పాటు మూత్రనాళం-మూత్రాశయం కూడా ఉబ్బిపోయినా, ఉమ్మనీరు చాలా తక్కువగా ఉన్నా, కిడ్నీల నుంచి మూత్రాన్ని బయటకు తెచ్చే నాళం వ్యాసార్థం 20 ఎంఎం కంటే ఎక్కువగా ఉన్నా, కిడ్నీల కణజాలం బాగా క్షీణించినా తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
పిండం దశలో మన మెదడు, వెన్నుపాము వంటివన్నీ కూడా ఒకే రకమైన గొట్టం కణజాలం (న్యూరల్ ట్యూబ్) నుంచి తయారవుతాయి. ఈ క్రమంలో ఈ గొట్టం ఎక్కడన్నా ఒకచోట పూడకుండా ఉండిపోతే.. అక్కడి నుంచి లోపలి నాడులు, పొరలన్నీ ఒక బుడిపెలా బయటకు తోసుకొస్తాయి. దీన్నే 'మైలో మినింగోసీల్' అంటారు. ఇది 4-6 వారాల మధ్యే తలెత్తే లోపం.
* దీన్ని సాధారణ స్కానింగుల్లో గుర్తించొచ్చు. అనుమానం వస్తే స్పష్టత కోసం ఎమ్మారై చేయిస్తారు. ఇతరత్రా మరేమన్నా సమస్యలున్నాయేమో కూడా చూస్తారు. వెన్ను లోపం అంత తీవ్రంగా లేనప్పుడు కొందరిలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. పుట్టగానే సాధ్యమైనంత త్వరగా వెన్ను పూడ్చేందుకు ఆపరేషన్ చేస్తారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో నడవలేకపోవటం, మలమూత్రాలపై పట్టులేకపోవటం వంటి తీవ్ర ఇబ్బందులూ ఉండొచ్చు.
* ఆందోళనకరం- వెన్ను మీద సమస్య మరీ పెద్దదిగా ఉన్నప్పుడు, పిండం కదలికలు సరిగా లేనప్పుడు, పిండం మూత్రాశయం నిండటం-ఖాళీ అవ్వటం సరిగా లేనప్పుడు, దీనితో పాటు మెదడులో నీరు చేరే 'హైడ్రోసెఫాలస్' సమస్య కూడా ఉన్నప్పుడు ఫలితాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాల్లో వైద్యులు రకరకాల మార్గాల గురించి చర్చిస్తారు.
పొట్టలోని పేగులనూ, ఛాతీలోని వూపిరితిత్తులనూ వేరుచేస్తూ మధ్యలో డయాఫ్రమ్ పొర ఉంటుంది. అన్నవాహిక.. ఈ మందపాటి పొర మధ్య నుంచే కిందికి వెళుతుంటుంది. పిండం ఎదుగుదలో కొందరికి కింది నుంచి పేగులు ఈ పొర గుండా పైకి తోసుకొచ్చి.. వూపిరితిత్తులను నొక్కేస్తుంటాయి. (డయాఫ్రమాటిక్ హెర్నియా) ఇది స్కానింగులో బయటపడుతుంది. ఇలా నొక్కేస్తుండటం వల్ల వీరిలో వూపితిత్తులు సరిగా తయారవ్వకపోవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే గుండె, రెండు వూపిరితిత్తులూ కూడా నొక్కుకుపోతాయి.
* ఒకవైపు వూపిరితిత్తి మాత్రమే నొక్కుకుపోతూ సమస్య అంత తీవ్రంగా లేనప్పుడు పరిస్థితిని గమనిస్తూ కాన్పు అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చేయటం మంచిది. తర్వాత బిడ్డకు కృత్రిమ శ్వాస కల్పించి ఆపరేషన్ చేస్తారు.
* ఆందోళనకరం- దీన్ని తొలివారాల్లోనే గుర్తించినా, ఇది కుడివైపున్నా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉన్నా, కొంత లివర్ కూడా ఛాతీలోకి తోసుకుపోయినా, వూపిరితిత్తుల ఎదుగుదల తీవ్రంగా దెబ్బతిన్నా.. ఇతరత్రా మార్గాల గురించి చర్చిస్తారు.
వూపిరితిత్తుల్లో నీటితిత్తుల్లాంటి గడ్డ తయారవ్వటం (సీసీఏఎమ్) మరో సమస్య. సాధారణంగా ఇది పిండంలో ఒకవైపు వూపిరితిత్తిలో వస్తుంది. మగపిల్లల్లో ఎక్కువ. ఇది స్కానింగుల్లో బయటపడేదే.
* సాధారణంగా వీటిలో కొన్ని కాన్పు అయ్యేలోపే.. లోపలే తగ్గిపోతాయి. కాన్పు వరకూ ఉంటే.. ప్రసవం తర్వాత సర్జరీతో తొలగిస్తారు. శ్వాస బాగుంటే సర్జరీ కూడా 2-6 నెలల తర్వాత చెయ్యచ్చు.
* ఆందోళనకరం- గడ్డ పెద్దగా ఉండి, గుండె మరో వైపునకు తోసుకుపోయినప్పుడు, ఒళ్లంతా నీరు చేరినప్పుడు, బిడ్డలో లక్షణాలన్నీ తల్లిలో కూడా కనబడుతూ తల్లికి కూడా హాని జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు... దీని గురించి తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది.
పిండం కిడ్నీలు 5వ వారం నుంచే పని చేస్తుంటాయి. ఇవి తయారు చేసిన మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండి.. అప్పుడప్పుడు ఉమ్మనీటిలో కలుస్తుంటుంది. కొన్నిసార్లు ఈ విసర్జన మార్గం మూసుకుపోయి విసర్జన ఆగిపోతుంది. ఇది మగపిల్లల్లో ఎక్కువ. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సమస్య ఓ మోస్తరుగా ఉంటే కాన్పు తర్వాత దశలవారీగా సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.
* ఆందోళనకరం- ఉమ్మనీరు బాగా తక్కువున్నప్పుడు, పిండం మూత్రాశయం ఎప్పుడూ ఖాళీగానే కనబడుతున్నప్పుడు, పిండం కిడ్నీల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు, కిడ్నీలూ, మూత్రనాళాలన్నీ ఉబ్బిపోయి, మూత్రాశయం మాత్రం చిన్నగా ఉండిపోయినప్పుడు సమస్య తీవ్రంగా ఉందని అర్థం.
అరుదుగా మరికొన్ని...
* బయటే పేగులు: చాలా అరుదుగా.. అంటే 5-10 వేల కాన్పుల్లో ఒకరికి... పొట్టలోపలి పేగుల వంటివి బయటే ఉండిపోతాయి. ఇలాంటివి మగపిల్లల్లో ఎక్కువ. వీటిని స్కానింగులో గుర్తిస్తారు. పేగులు మరీ ఎక్కువగా బయట లేకపోతే.. పుట్టగానే వాటిని లోపలికి నెట్టేస్తూ సర్జరీ ద్వారా చక్కదిద్దచ్చు. పేగులు చాలా భాగం బయట ఉంటే.. ముందు పేగులను బయట ఒక సైలాస్టిక్ తిత్తిలో ఉంచి, 7-10 రోజుల్లో క్రమంగా వాటిని లోపలికి పంపిస్తూ లోపాన్ని సరిచేస్తారు.
* గొట్టాలు కలిసిపోవటం: అన్నవాహిక, గాలి గొట్టం పక్కపక్కనే ఉంటాయి. పిండం దశలో ఈ రెండూ ఒక గొట్టం నుంచే తయారవుతాయి. కానీ అరుదుగా.. ప్రతి 4000 కాన్పుల్లో ఒకరికి.. ఈ అన్నవాహిక సరిగా తయారవ్వక ఈ గొట్టాలు రెండూ కలిసిపోయే ఉండొచ్చు. (ట్రెకియో-ఈసోఫేగల్ ఫిస్టులా) ఇది కూడా మగపిల్లల్లోనే ఎక్కువ. అన్నవాహిక లేకపోవటం వల్ల లాలాజలం వంటివి నేరుగా వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి న్యుమోనియా వంటి సమస్యలు ముంచుకొస్తాయి. బిడ్డ పుట్టగానే సర్జరీలతో దీన్ని చక్కదిద్దుతారు.
* పొట్టలో కణుతులు.. పొట్టలో ఏ ప్రాంతంలోనైనా నీటి తిత్తుల వంటివి రావచ్చు. ఇవి ఎక్కడొచ్చినా పొట్టకు సాగే గుణం ఉంది కాబట్టి వీటి ఒత్తిడి వల్ల ఇతరత్రా సమస్యలు రావటం తక్కువే. వీటిని స్కానింగుల్లో గుర్తిస్తారు. వీటితో పాటుగా ఇతరత్రా సమస్యలు కూడా ఉంటే తప్పించి... సాధారణంగా వీటివల్ల పెద్ద సమస్యలేమీ ఉండవు. కాన్పు తర్వాత.. వీటిని సర్జరీ చేసి తొలగించొచ్చు. ఫలితాలు కూడా బాగుంటాయి.
--Courtesy with Dr.A.Narendrakumar , professor , Paediatric surgery , hyderabad@eenadu sukhibhava.
- =========================
Visit my website - > Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.