Monday, October 7, 2013

Hormone replacement therapy(HRT)in woman,స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)


  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --స్త్రీలలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    కొన్నిరకాల అనారోగ్యాలు రావడానికి హార్మోన్లలో మార్పులు చోటుచేసుకోవడం ఎంత వాస్తవమో.. కొన్నిరకాల సమస్యల్ని నివారించడంలోనూ వాటి వాడకం అంతే కీలకం. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)గా పరిగణించే ఆ వైద్యం వల్ల లాభాలెంతో.. సమస్యలూ అంతే స్థాయిలో ఎదురవుతాయి. అందుకే వాటిని అవసరాన్ని బట్టే వాడాలి తప్ప అతిగా కాదు.

చాలామంది మెనోపాజ్‌ తరవాత మాత్రమే హార్మోన్లతో అవసరం ఉంటుందనుకుంటారు కానీ.. మహిళలకు ఎదురయ్యే కొన్నిరకాల అనారోగ్యాలకు హార్మోన్లనే మందులుగా ఇస్తారు. రుతుక్రమం మొదలైంది మొదలు మెనోపాజ్‌ వరకూ ఈ హార్మోన్లను వివిధ దశల్లో ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సి రావచ్చు. హార్మోన్‌ థెరపీ అంటే స్త్రీ హార్మోన్లుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ల మేళవింపుతో చేసే చికిత్స. ముందు వీటిని ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

  • అధిక రక్తస్రావం అదుపులో..
కొందరికి నెలసరి సమయంలో అధికరక్తస్రావం బాధిస్తుంది. అప్పుడు సమస్య తీవ్రతను బట్టి హార్మోన్లను గర్భనిరోధక మాత్రల రూపంలో ఇస్తారు. దాంతో అధికరక్తస్రావం తగ్గి, నెలసరి ఓ క్రమపద్ధతిలో వస్తుంది. అవి గర్భనిరోధక సాధనంగానూ పనిచేస్తాయి. ప్రొజెస్టరాన్‌ అనే హార్మోన్‌ని మాత్ర రూపంలో ఇవ్వడం వల్ల హార్మోన్ల అసమతుల్యతతోపాటూ, అధికరక్తస్రావం కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు ఐయూడీ (మిరేనా) రూపంలోనూ చిన్న పరికరాన్ని అమరుస్తారు. ఇది తక్కువ స్థాయిలో లెవనోజెస్ట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దాంతో అధికరక్తస్రావం, నెలసరిలో వచ్చే నొప్పీ తగ్గుతాయి. గర్భం కూడా రాదు.

  • ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌):
నెలసరికి రెండువారాల ముందునుంచీ కొందరిలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. అదే పీఎంఎస్‌. ముఖ్యంగా మూడ్‌స్వింగ్స్‌, చిరాకు, ఒత్తిడి, ఆందోళన, అతికోపం, నిద్రలేమి, తలనొప్పి, ఆకలి తగ్గడం, కొన్నిరకాల పదార్థాలు మాత్రమే తినాలనిపించడం, వక్షోజాల్లో నొప్పి, చర్మం, జుట్టులో తేడా.. లాంటివి ఆ రోజుల్లో తొంభైశాతం మందిలో కనిపిస్తాయి. అవి చాలా తీవ్రస్థాయిలో బాధించి, భరించలేని పరిస్థితి ఉన్నప్పుడు హార్మోన్లను మాత్రలుగా ఇస్తారు. కేవలం ఈస్ట్రోజెన్‌ని ప్యాచ్‌ రూపంలో సూచిస్తారు. ఈ ప్యాచ్‌ ప్రొజెస్టరాన్‌ హార్మోను విడుదలయ్యేలా చేస్తుంది. అయితే ఇది గర్భనిరోధక సాధనంగా పనిచేయదు. దీన్ని వాడుతున్నప్పుడు గర్భం కూడా దాల్చకూడదు.

  • ఎండోమెట్రియోసిస్‌:
కొన్నిసార్లు ఎండోమెట్రియం పొర కటివలయం, గర్భసంచి చుట్టూ, అండాశయాలు, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఏర్పడుతుంది. దాంతో నెలసరి నొప్పి, అధికరక్తస్రావం, కలయిక సమయంలో బాధ, పొత్తికడుపు నొప్పి, గర్భం రాకపోవడం, అలసట లాంటివి ఎదురవుతాయి. ఇలాంటప్పుడు హార్మోన్ల చికిత్స వల్ల అండం విడుదల అవదు. అదే సమయంలో ఎండోమెట్రియం పొర కూడా పల్చబడుతుంది. ఈ సమస్యకు సాధారణంగా కంబైన్డ్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్‌ లేదా ప్యాచ్‌ని సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి వాడటం వల్ల కూడా అండం విడుదల అవదు. అవసరాన్ని బట్టి ఆంగ్ల టి ఆకారంలో ఉండే చిన్న పరికరాన్నీ గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇది తక్కువ స్థాయిలో ప్రొజెస్టరాన్‌ని విడుదల చేస్తుంది. దానివల్ల కొందరికి నెలసరి కూడా రాకపోవచ్చు. గర్భం దాల్చాలనుకునేవారు మాత్రం డాక్టర్‌ సలహాతో ఇతర మాత్రల్ని వాడాల్సి రావచ్చు.

  • గర్భధారణ వాయిదాకీ..
గర్భం రాకూడదనుకున్నప్పుడు కూడా హార్మోన్లనే రకరకాల పద్ధతుల్లో సూచిస్తారు వైద్యులు. అలాంటప్పుడు ఉపయోగించే పద్ధతుల్లో కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌ ఒకటి. సన్నగా ప్లాస్టిక్‌ ట్యూబ్‌లా ఉండే దీనిలో ప్రొజెస్టరాన్‌ హార్మోను ఉంటుంది. దీన్ని శరీరంలో అమరుస్తారు. ఫలితంగా అండం విడుదల కాదు. వీర్యకణాలూ స్త్రీ శరీరంలోకి చేరకుండా గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండే మ్యూకస్‌ చిక్కబడుతుంది. ఇది వద్దనుకుంటే ప్రొజెస్టరాన్‌ని ఇంజెక్షన్‌గా తీసుకోవచ్చు. ఇది కూడా ఇంప్లాంట్‌లానే పనిచేస్తుంది. బదులుగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ కలిపి ఉండే గర్భనిరోధక మాత్రలూ ఉంటాయి. ప్రొజెస్టరాన్‌ మాత్రమే ఉండే మినీపిల్‌, ప్రొజెస్టరాన్‌ ప్యాచ్‌ ఇలా చాలా రకాలుంటాయి. ఇవన్నీ కాదనుకుంటే హార్మోన్లను విడుదలచేసే వెజైనల్‌ రింగ్‌ని జననేంద్రియభాగంలో అమరుస్తారు. అనుకోకుండా గర్భం వస్తుందని భయపడేవారికి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ సరైన ప్రత్యామ్నాయం. గర్భం రాకుండా చేసే ఈ మాత్రల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. మరికొన్నింట్లో కేవలం ప్రొజెస్టరాన్‌ ఒక్కటే డబుల్‌డోస్‌ రూపంలో ఉండొచ్చు.

  • ముందే కాన్పు కాకుండా:
రకరకాల కారణాల వల్ల నెలలు నిండకుండానే కాన్పు అవుతుందని భయపడేవారికీ డాక్టర్లు ప్రొజెస్టరాన్‌ సప్లిమెంట్లను ఇస్తారు. ఇందువల్ల ముందే ప్రసవం రాదు. వీటిని ఎలా వాడాలనేది డాక్టర్లే సూచిస్తారు.

  • మెనోపాజ్‌ దశలో..
ఏళ్లు గడిచి మెనోపాజ్‌ దశ వస్తోందంటేనే భయపడతారు చాలామంది మహిళలు. దానికి కారణం ఆ సమయంలో బాధించే హాట్‌ఫ్లషెస్‌, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గడం, నెలసరిలో తేడా, రాత్రిళ్లు చెమటలుపట్టడం, అలసట, జుట్టురాలడం, నిద్రలేమి, జననేంద్రియభాగం పొడిబారడం, కలయిక సమయంలో బాధ.. ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బందిపెడతాయి. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు హార్మోన్లను సూచిస్తారు.

  • సమస్యలు :
ఇన్నిదశల్లో హార్మోన్లు వాడటం అనేది ఓ కోణం అయితే వాటివల్ల కొన్ని సమస్యలూ ఉంటాయనేదీ రెండో కోణం. అవి తాత్కాలికంగానే కాదు, దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.తాత్కాలికంగా ఎదురయ్యే ఇబ్బందుల్లో.. వికారం, రొమ్ముల్లో వాపు, మొటిమలు (కేవలం ప్రొజెస్టరాన్‌ మాత్రమే వాడేవారిలో) వెజైనల్‌ డిశ్ఛార్జి, రక్తస్రావం, తలనొప్పి లాంటివి బాధిస్తాయి. వీటిని గుర్తించడం సులువే కానీ దీర్ఘకాలంలో బాధించేవీ కొన్ని ఉంటాయి. ఈ సమస్యల్ని గుర్తించడం కొద్దిగా కష్టం. ముఖ్యంగా..

క్యాన్సర్‌:
హార్మోన్ల వల్ల ఎండోమెట్రియల్‌, రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈస్ట్రోజెన్‌ని వాడితే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కాస్త పెరుగుతుంది. ప్రొజెస్టరాన్‌ కూడా తీసుకుంటేఇంకా పెరుగుతుంది. అలాగే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని నాలుగేళ్ల కన్నా ఎక్కువగా వాడేవారిలో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని తేలింది. దాంతోపాటూ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉండటం, నెలసరి త్వరగా మొదలుకావడం, ఆలస్యంగా గర్భం దాల్చడం, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మెనోపాజ్‌ ఆలస్యంగా మొదలుకావడం, స్థూలకాయం, రొమ్ముపై రేడియేషన్‌ ప్రభావం లాంటివన్నీ ఈ సమస్యని ఇంకా పెంచుతాయి.

గుండెజబ్బులు:
ఒకప్పుడు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ని తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రావు అనుకునేవారు.అధ్యయనాల ప్రకారం ఈ రెండూ వాడటం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేలింది. మెనోపాజ్‌ దశ మొదలై, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు డాక్టర్ల సలహాతో హార్లోన్ల వాడకాన్ని ఎంచుకోవాలి.

ఎవరు వాడకూడదు..
గుండెజబ్బులూ, రొమ్ముక్యాన్సర్‌తోపాటూ కొన్నిరకాల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నవాళ్లూ, అకారణంగా రక్తస్రావం అయ్యేవారూ, కాలేయ సమస్యలు ఉన్నవారూ హార్మోన్లు వాడకూడదు. అలాగే అధికరక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌, గర్భం దాల్చాలనుకునేవారూ వీటికి దూరంగా ఉండాలి. డాక్టర్‌తో ప్రతి విషయాన్నీ చర్చించుకున్నాకే వాడాలి తప్ప సొంతంగా వేసుకోకూడదు.

Courtesy with Dr.Praneetha reddy , Uro-Gynaecologist - Hyd
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.