Wednesday, February 26, 2014

Diabetes in children,పిల్లల్లో మధుమేహం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల్లో మధుమేహం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

 
  
  •  
పరుగుకీ పద్ధతుంది.  చిన్నపిల్లల్లో మధుమేహం నానాటికీ పెరిగిపోతోంది. పెద్దల్లో మధుమేహం మాదిరిగానే.. పిల్లల్లో మధుమేహం కూడా మన దేశంలో ఎక్కువగానే ఉంటోంది. నిజానికి పిల్లలకు మధుమేహం వచ్చిందంటే అదో అనుమానాల పుట్ట! పిల్లల్లో మధుమేహానికీ.. పెద్దల్లో మధుమేహానికీ తేడా ఉందా? మధుమేహాన్ని నియంత్రించేందుకు 'డైట్‌ కంట్రోల్‌' చెయ్యాలా? చెయ్యకూడదా? ఈ పిల్లలకు మాత్రలు ఇవ్వాలా? ఇన్సులిన్‌ ఇవ్వాలా? ఆడుకోనివ్వచ్చా? లేదా? ఇంత చిన్నవయసులోనే అసలేమిటిదంతా? ఎదిగే వయసులో ఇటువంటి సమస్య తలెత్తితే.. వీళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ సందేహ పరంపరకు అంతులేదు. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో మధుమేహం కాస్త భిన్నమైనదే. సమస్య ఒకటే అయినా ఆహార జాగ్రత్తల నుంచి నియంత్రించే మాత్రల వరకూ చాలా తేడాలుంటాయి. దీనిపై గత పదేళ్లలో వైద్యపరమైన అవగాహన కూడా చాలా మారుతూ వస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో మధుమేహాన్నీ... పెద్దల్లో మధుమేహాన్నీ అర్థం చేసుకునే విషయంలో ఎంతో మార్పు కనబడుతోంది.
ఒకప్పుడు మధుమేహం 15 ఏళ్లలోపు పిల్లల్లో వస్తే టైప్‌-1 అనీ, 35 ఏళ్లు దాటిన పెద్దల్లో వస్తే టైప్‌-2 రకమనీ.. అలాగే 15-35 మధ్య వయసు వారిలో వస్తే ఈ రెంటిలో ఏదైనా కావచ్చని భావించేవారు. ఎవరిలో ఏ రకమన్నది చాలా వరకూ వయసును బట్టే నిర్ధారణకు వచ్చేవాళ్లు. ఇలాంటి వర్గీకరణ ఇప్పటికీ చెలామణిలోనే ఉన్నా.. మొత్తమ్మీద గత పదేళ్లలో ఈ ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే పిల్లల్లో కూడా టైప్‌-2 మధుమేహం రావచ్చు... అలాగే పెద్దల్లోనూ టైప్‌-1 ఉండొచ్చన్న భావన బలపడింది.

స్థూలంగా చూసుకుంటే..
* టైప్‌-1లో: క్లోమగ్రంథి అస్సలు పని చెయ్యదు.. అంటే క్లోమం తయారు చెయ్యాల్సిన ఇన్సులిన్‌ వీరి శరీరంలో అసలే ఉండదన్నమాట. కాబట్టి వీరికి బయటి నుంచి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వటం ఒక్కటే పరిష్కారం.

* ఇక టైప్‌-2లో: క్లోమగ్రంథి పని చేస్తూనే ఉంటుంది, ఒంట్లో ఇన్సులిన్‌ ఉంటుందిగానీ.. అది సమర్థంగా వినియోగంలోకి వస్తుండదు. వీరికి వెంటనే ఇన్సులిన్‌ ఆరంభించాల్సిన పనిలేదు... మాత్రలతో చికిత్స ఆరంభించి, కొంత కాలానికి అవసరమైతేనే ఇన్సులిన్‌ ఇంజక్షన్లకు మారొచ్చు.

రకాలను బట్టి చికిత్స వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు మధుమేహం వస్తే... నేరుగా దాన్ని టైప్‌-1గా భావించెయ్యకుండా అది ఏ రకమైనదన్నది నిర్ధారించుకోవటం కీలకంగా మారుతోంది. అందుకే పిల్లలకు మధుమేహం వచ్చినప్పుడు ఒకప్పటిలా టైప్‌-1 అనెయ్యకుండా.. 'డయాబిటీస్‌ ఇన్‌ చిల్డ్రెన్‌' అంటున్నారు.

ముందే గుర్తించొచ్చా?
దాదాపు 40-50% మందికి క్లోమగ్రంథి పాడై, ఇన్సులిన్‌ పూర్తిగా నిలిచిపోక ముందే.. అంటే ఇంకా క్లోమం ఎంతోకొంత పని చేస్తుండగానే ఆ విషయాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బాగా ఉపయోగపడేది 'సి-పెప్త్టెడ్‌' అనే ప్రోటీను. ఇది ఇన్సులిన్‌తో పాటే క్లోమం నుంచి విడుదల అవుతుంటుంది. కాబట్టి పిల్లలకు మధుమేహం వచ్చినప్పుడు రక్తంలో సి-పెప్త్టెడ్‌ పరీక్ష చేస్తే.. అది రక్తంలో తగినంత ఉంటే (0.3 నానోగ్రామ్‌/మిల్లీలీటర్‌ కంటే ఎక్కువగా ఉంటే) క్లోమగ్రంథి పని చేస్తున్నట్టుగా గుర్తించొచ్చు. అంతకన్నా తక్కువగా ఉంటే క్లోమం సరిగా పనిచెయ్యటం లేదని అర్థం. క్లోమం పని చెయ్యటం లేదంటే టైప్‌-1గానూ, పని చేస్తోందంటే టైప్‌-2గానూ గుర్తించొచ్చు. చిత్రమేమంటే దాదాపు 40% మంది పిల్లల్లో సి-పెప్త్టెడ్‌ స్థాయులు సాధారణంగానే ఉంటూ కూడా.. వారికి మధుమేహం వస్తోంది. అంటే వారికి క్లోమం నుంచి ఇన్సులిన్‌ ఉత్పత్తి సాధారణంగా ఉంటూనే.. మధుమేహం వస్తోందన్న మాట. కాబట్టి వీరిది టైప్‌-1 రకం మధుమేహంగా భావించటానికి లేదు. క్లోమం బాగానే పని చేస్తోంది, ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగానే ఉంది, అయినా వీరికి మధుమేహం వచ్చింది కాబట్టి వీరిది టైప్‌-2 రకమే. వీరికి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వనక్కరలేదు. పెద్దల్లో మధుమేహంలో మాదిరిగానే వీరికీ మాత్రలతోనే చికిత్స ఆరంభించొచ్చు. గత 10-12 ఏళ్లుగా ఈ అవగాహన బాగా పెరిగింది. దీని ముఖ్యోద్దేశం అనవసరంగా పిల్లలందరికీ ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇచ్చెయ్యకుండా... ఎవరికి ఇన్సులిన్‌ అవసరమో కచ్చితంగా గుర్తించటం! ఇలా గుర్తించి, నిజంగా అవసరమైన వారికి మాత్రమే ఇంజక్షన్‌ ఇవ్వటం.

కాబట్టి ఇప్పుడు మనం చిన్నపిల్లలకు మధుమేహం వస్తే నేరుగా ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వారిలో సి-పెప్త్టెడ్‌ ఏ స్థాయిలో ఉందో పరీక్షించి.. అది బాగా తక్కువగా ఉంటేనే ఇన్సులిన్‌ ఇవ్వటం, లేదంటే మాత్రల వంటివి ఇచ్చే అవకాశం ఉంది.

మున్ముందు మారొచ్చా?
చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు 9 ఏళ్ల పాపకు మధుమేహం వచ్చిందనుకుందాం. సి-పెప్త్టెడ్‌ పరీక్ష చేస్తే దాని స్థాయి ఎక్కువగానే ఉంది. కాబట్టి క్లోమం పనితీరు, ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగానే ఉందని భావించి.. దాన్ని టైప్‌-2 మధుమేహంగా నిర్ధారించుకుని... ఇన్సులిన్‌ ఇవ్వకుండా ఆ పాపకు మాత్రలతోనే చికిత్స ఆరంభించొచ్చు. కాకపోతే ఇక్కడో చిన్న సమస్య ఉంది. ఆ పాపకు క్లోమం పనితీరు ఇప్పుడు బాగానే ఉన్నా... మున్ముందు ఎప్పుడైనా క్లోమ గ్రంథి పనితీరు నిలిచిపోయి.. ఇన్సులిన్‌ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి ఇలా మున్ముందు క్లోమం పనితీరు నిలిచిపోయే అవకాశం ఉందా? అన్నది ముందే తెలుసుకునేందుకు ఉపయోగపడేవి గ్యాడ్‌ యాంటీబోడీ, ఐలెట్‌ సెల్‌ యాంటీబోడీ, ఇన్సులిన్‌ యాంటీబోడీ పరీక్షలు. ఒకవేళ ఈ యాంటీబోడీలు ఉంటే.. పాపకు మున్ముందైనా ఇన్సులిన్‌ తప్పకపోవచ్చు కాబట్టి ఇప్పుడు మాత్రలతో మొదలుపెట్టే బదులు.. నేరుగా ఇన్సులిన్‌ ఆరంభించొచ్చు. ఈ యాంటీబోడీ పరీక్షలను ఏడాదికి ఒకసారి చేయించుకుంటే మంచిది.

అరుదుగా...
అరుదుగా కొందరు పిల్లల్లో ఇన్సులిన్‌ నిరోధకత మూలంగా వచ్చే టైప్‌1 డయాబెటీస్‌, ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి కాకుండా (పాంక్రియాటిక్‌ బీటా సెల్‌ డిస్‌ఫంక్షన్‌) వచ్చే టైప్‌2 డయాబెటీస్‌.. ఒకే సమయంలో ఈ రెండు రకాలూ కనబడతాయి. దీన్ని డబుల్‌/హైబ్రిడ్‌ డయాబెటీస్‌ అంటారు.

ఆహార నియంత్రణ వద్దు

* 15-25 మధ్య వయసు వారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువుంటే జంతు సంబంధ ఆహారం తగ్గించుకోవాలి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే పిండి పదార్థాలు తగ్గించుకోవాలి. ఇన్సులిన్‌ నిరోధకత అన్నది రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంటుంది.

* 5-15 మధ్యవయసు వారికి ఎటువంటి ఆహార నియంత్రణలూ పెట్టకూడదు. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు మధుమేహం వచ్చినా ఎలాంటి ఆహార నియంత్రణలూ పెట్టరు. అలాగే ఈ చిన్నపిల్లలకు కూడా ఎలాంటి నియంత్రణలూ, ఆహారాన్ని తగ్గించే పనులూ చెయ్యకూడదు. అంతగా కచ్చితంగా ఉండాలనుకుంటే వాళ్ల ఎదుగుదలకూ, వాళ్ల బరువుకూ ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్ల సాయంతో తెలుసుకుని, వారి అజమాయిషీలోనే ఆహార నియమాలను పాటించాలి. అంతేగానీ మధుమేహం వచ్చిన అందరికీ ఒకటే ఆహార మంత్రం అన్నట్టు ఉండకూడదు. త్వరగా జీర్ణమైపోయే పిండి పదార్థాలను మాత్రం తగ్గించొచ్చు. ఇలాంటివన్నీ చాలా వరకూ మన ఇళ్లలో వండేవి కావు. బయట మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్‌ (కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు, నూడుల్స్‌, బిస్కట్లు, జామ్‌ల వంటివి) ఆహారాలే.

* ముఖ్యంగా... పిల్లలకు ఎదుగుదల ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు మరీ ఎక్కువ జాగ్రత్తతో వీరికి ఆహారం తగ్గించటం, వ్యాయామాలు పెంచటం వంటివి చేస్తే అసలే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే ఈ పిల్లలకు క్షయ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి నియంత్రణలేవీ పెట్టకూడదు. వీరు పొడుగు పెరగాలి, జబ్బుల బారినపడకూడదు.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం..
* మధుమేహం నియంత్రణలో లేకపోతే మనం పెద్దవాళ్లలో చెప్పుకొనే గుండెపోటు, మూత్రపిండాల జబ్బులు, చూపు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు పిల్లల్లో కనబడవు గానీ.. వీరిలో క్షయ ముప్పు ఎక్కువ. 'మ్యుకర్‌ మైకోసిస్‌' వంటి అరుదైన, ప్రాణాంతక ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వీరిలో అధికం. పుష్టికరమైన ఆహారం ఇవ్వటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం, పరిశుభ్రత కచ్చితంగా పాటించటం.. ఇవి ముఖ్యం. పిల్లలు తగినంత బరువుండాలి. అతి జాగ్రత్తలతో ఆంక్షలు పెట్టకుండా.. వీరిని సాధ్యమైనంత సాధారణ జీవితం గడిపేలా చూడాలి.

* చిన్నపిల్లల్లో రక్తంలో గ్లూకోజు మోతాదు ఉదయం నిద్ర నుంచి లేవగానే 100, మిగతా సమయాల్లో 140 దాట కుండా చూడాలన్నది సూత్రం. 15-25 మధ్య వాళ్లు కొంత అటూఇటైనా నెగ్గుకొస్తారుగానీ 5-15 మధ్య ఇంత కచ్చితమైన పరిమితులు పాటించాలంటే షుగర్‌ పడిపోయే ప్రమాదం (హైపోగ్లసీమియాలు) కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ వయసువారు స్కూళ్లకు వెళుతూ, ఆటలాడుతూ చురుకైన జీవితం గడుపుతుంటారు. కాబట్టి వీరికి ఆహారపరమైన నియంత్రణలు పెట్టకుండా.. ఇన్సులిన్‌, మాత్రల ద్వారానే నియంత్రణ సాధించటం ముఖ్యం. దండిగా ఆహారం ఇవ్వాలి.

* మనిషి జీవితంలో 5-15 ఏళ్ల మధ్య కాలం చాలా కీలకం. కాబట్టి ఈ వయసు పిల్లలు మరీ అధికంగా బరువుంటే తప్ప బరువు తగ్గించేందుకు ప్రయత్నించకూడదు. దానివల్ల ఎదుగుదల తగ్గిపోయి ఇన్ఫెక్షన్ల వంటివి బయల్దేరతాయి. కాలి వేళ్ల మధ్య తేమ లేకుండా చూడటం, జననాంగాల వద్ద తేమ లేకుండా చూడటం, శుభ్రత పాటించటం రోజంతా ముఖ్యం. వారికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూడాలి.

భవిష్యత్తుకు బెంగ లేదు
* పిల్లలకు మధుమేహం వచ్చింది.. వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడాల్సిన పని లేదు. నిజానికి మధుమేహం కచ్చితంగా నియంత్రణలో పెట్టుకునేవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా కూడా ఎక్కువ కాలం జీవిస్తుంటారు. ఈ విషయం అధ్యయనాల్లో కూడా స్పష్టంగా నిరూపణ అయ్యింది.

* చిన్నపిల్లల్లో 5-15 ఏళ్ల మధ్య మధుమేహ నియంత్రణకు ఇన్సులిన్‌ వాడితే వీరు మధుమేహం లేనివారికన్నా ఎత్తు పెరుగుతారు.

* 5 ఏళ్లలోపు పిల్లలకు ఇన్సులిన్‌ ఇవ్వాల్సి వస్తే రోజుకు ఒకటిరెండు సార్లే కాకుండా.. అవసరాన్ని బట్టి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఇవ్వటం మంచిది.

పట్టించే లక్షణాలు..
* కోమా: ఇన్సులిన్‌ లోపంతో వచ్చే టైప్‌-1 మధుమేహం హఠాత్తుగా వస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు అకస్మాత్తుగా పెరగటం వల్ల 'హైపర్‌ ఆస్మాసిస్‌' వచ్చి, పిల్లలు స్పృహ తప్పి పడిపోతారు. ఐదేళ్లలోపు పిల్లల్లోనైతే ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. పదిహేనేళ్లలోపు పిల్లల్లో ప్రాణాంతకం కాకపోవచ్చు గానీ కోమాలోకి వెళ్లే ప్రమాదముందని గుర్తించాలి.

* ఎదుగుదల తగ్గటం: క్లోమం కొంతమేర పనిచేస్తూ.. సి-పెప్త్టెడ్‌ కొద్దిగా ఉండే పిల్లల్లో గ్లూకోజు మోతాదు నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ఆర్నెల్లు, ఏడాది సమయంలో క్రమేపీ 100 నుంచి 500 వరకూ పెరుగుతూపోవచ్చు. మన దేశంలో అధికంగా కనిపించేది ఇలాంటి మధుమేహమే. క్రమేపీ పెరుగుతుంది కాబట్టి ఇది వచ్చిందని తెలుసుకోవటం కష్టం. వీరిలో ఎదుగుదల అంతగా ఉండదు. ఆ వయసుకు తగినంత ఎత్తు, బరువు ఉండరు.

* సోమరితనం: చురుకుదనం తగ్గటం, బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం, పనులు చేసుకోలేకపోవటం, పాఠాలు సరిగా చదవకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* అతి మూత్రం: వీరిలో ఎక్కువగా ఆకలి, దాహం వేయటం, మూత్రం పోయటం వంటివీ ఉంటాయి. కానీ ఇవన్నీ క్రమేపీ అధికమవుతాయి కాబట్టి వీటిని గుర్తుపట్టటం కష్టం. రాత్రిపూట పక్కలో మూత్రం పోసినా పిల్లల్లో అది సహజమేనని భావిస్తుంటారు.

* ఇన్ఫెక్షన్లు: మధుమేహం వచ్చిన పిల్లలకు రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో వీరికి ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా ముక్కు, చెవి, గొంతు, చర్మ జననాంగ ఇన్‌ఫెక్షన్లు అధికంగా కనిపిస్తాయి.

మొత్తానికి పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం విషయంలో ఏదైనా తేడాగా అనిపిస్తే రక్తంలో గ్లూకోజు పరీక్ష చెయ్యటం ఉత్తమం.

వయసును బట్టి చికిత్స
* 15-25 ఏళ్ల మధ్య: వీరికి మధుమేహం వచ్చినట్లయితే సి-పెప్త్టెడ్‌, ఆటోయాంటీబోడీల పరీక్షలు జరిపి, అవి ఎక్కువగానే ఉంటే.. అలాగే పెద్దల మాదిరిగా లావుగా ఉంటే.. మెట్‌ఫార్మిన్‌, పయోగ్లిటజోన్‌ వంటి 'ఇన్సులిన్‌' సెన్సిటివిటీ పెంచే మందులు ఇస్తారు.

* 15-5 ఏళ్ల మధ్య: లావుగా ఉంటే ఈ వయసు పిల్లలకూ ఇన్సులిన్‌ ఇవ్వకుండా మెట్‌ఫార్మిన్‌ వంటి నోటి మందులు, సన్నగా ఉన్నవారికి సల్ఫనైల్‌ యూరియా వంటి మందులు ఇస్తున్నారు. కానీ ఈ వయసులో ఒకవేళ గాడ్‌యాంటీబోడీలుంటే.. మున్ముందు ఇన్సులిన్‌ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి ముందు నుంచే కొంత ఇన్సులిన్‌, కొంత మందులు కలిపి ఇస్తారు.

* 5 ఏళ్లలోపు: వీరికి మాత్రం మధుమేహం వస్తే సీ-పెప్త్టెడ్‌ ఎక్కువుందా? తక్కువుందా? వంటివేమీ పట్టించుకోకుండా.. ఇన్సులిన్‌ ఇవ్వటమే మంచిది. ఇది వీరిలో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల ముఖ్యం. దానికి ఇన్సులిన్‌ అవసరం. కాబట్టి వారికి ఇన్సులినే ఇవ్వటం, మాత్రలు ఇవ్వకపోవటం మంచిది.

పిల్లలకేమిటీ మధుమేహం?
ఇంతింత చిన్నచిన్న పిల్లలకు మధుమేహం రావటమేమిటన్నది ఆశ్చర్యకరమైన ప్రశ్న. దీని గురించి పరిశోధకులు చాలారకాల సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. వీటిల్లో ఎక్కువగా వినపడేది 'యాక్సిలరేటర్‌ హైపోథిసిస్‌'. దీనిలో ప్రధానంగా చెప్పేది- బిడ్డ శరీరతత్వం (కాన్‌స్టిట్యూషన్‌), ఒంట్లో వాపు స్వభావం (ఇన్‌ఫ్లమేషన్‌), రోగనిరోధక దాడి (ఆటోఇమ్యూనిటీ). పిల్లల్లో మధుమేహం రావటానికి ఈ మూడింటితో పాటు మరికొన్ని అంశాలూ కారణమవుతాయని చెప్పేందుకు రకరకాల సిద్ధాంతాలున్నాయి.

* కుటుంబాల్లో..
మధుమేహం జన్యుపరంగా వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఇంతవరకూ మధుమేహానికి కారణమయ్యే జన్యువులేవీ గుర్తించలేదు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కూడా కాదు. కానీ కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ కుటుంబాల్లో పిల్లలు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇతరత్రా ఎలాంటి ప్రత్యేక కారణాలేవీ లేకుండా కూడా మధుమేహం కనిపిస్తోంది. అలాగని ఇది పూర్తిగా ఆయా కుటుంబాల్లో వస్తుందనీ చెప్పలేం. తల్లిదండ్రులిద్దరూ మధుమేహులైనా కూడా.. వారి పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశం 60%, అదీ 60 ఏళ్ల నాటికి! ఇందులో కూడా తండ్రికి మధుమేహం ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ. తల్లికి మధుమేహం ఉంటే పిల్లలకు రాదని చెప్పలేం గానీ అంత త్వరగా రాకపోవచ్చు. వీటన్నింటినీ చూసిన తర్వాత ఇది శరీరతత్వం ప్రకారం వచ్చే జబ్బు అన్న అవగాహన ఇప్పుడు పెరుగుతోంది.

* ఆహారం..
కర్ర పెండలం, కంద, వెదురు బియ్యం, అడవి అరటిపండు తొక్కల్లో గానీ లోపల గానీ 'సైనో జైన్స్‌' అనేవి ఉంటాయి. ఇవి శరీరంలో హైడ్రోసయానిక్‌ ఆమ్లంగా మారతాయి. సాధారణంగా ఇది సల్ఫర్‌తో కూడిన అమైనో ఆమ్లాలతో నిర్వీర్యమై మూత్రంలో వెళ్లిపోతుంది. కానీ కొందరిలో ఈ అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. వీరిలో హైడ్రోసయానిక్‌ ఆమ్లం బయటకు వెళ్లిపోకుండా రక్తంలో పెరిగిపోతుంది. ఇది క్లోమాన్ని దెబ్బతీస్తుంది. ఇలా అమైనో ఆమ్లాలు తక్కువగలవారికి జన్యువులూ తోడైతే మధుమేహానికి దారితీయొచ్చు.

* క్రిమి సంహారకాలు..
పొలాల్లో చల్లే రసాయనాలూ, ఎరువులూ నేలలోకి ఇంకి.. ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పంటలపై చల్లే క్రిమి సంహారకాలు.. కూరగాయలు, పండ్లపై విషపదార్థాల వంటివీ మధుమేహానికి దోహదం చెయ్యొచ్చు.

* అలవాటులేని పదార్థాలు..
మనకు ఒక వయసు వచ్చేవరకూ జీర్ణక్రియ పూర్తిగా కుదురుకోదు. 12 ఏళ్ల వరకూ కొన్ని పదార్థాలు సరిగా జీర్ణం కావు. ఆర్నెళ్లలోపు పిల్లలకు పొడుల రూపంలో ఉండే పదార్థాలను అరిగించుకునే శక్తి ఉండదు. ఇలాంటివి తినిపిస్తే శరీరం వాటికి వ్యతిరేకంగా యాంటీబోడీలను తయారు చేస్తుంది. ఇవి ఆ పొడులనే కాదు.. శరీరంలోని కణాలనూ దెబ్బతీస్తుంది. కాబట్టి ఆర్నెళ్లలోపు పిల్లలకు త్వరగా ఘనాహారం పెట్టకూడదు. అలవాటులేని ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లుటెన్‌తో కూడిన గోధుమల వంటివి తీసుకుంటే పేగుల్లోని జిగురు పొరను (మ్యూకోజా) దెబ్బతీసే యాంటీబోడీలు పుట్టుకొస్తాయి. వీటిల్లో ముఖ్యమైంది 'టిష్యూ ట్రాన్స్‌ గ్లుటమినేజ్‌ యాంటీబోడీ'. ఈ యాంటీబోడీలు పేగులపై దాడులు చేస్తాయి. దీంతో శరీరంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. చివరికి జిగురుపొర దెబ్బతిని ఆహారంలోని కొవ్వు, చక్కెర వంటి సూక్ష్మకణాలు పేగుల్లోంచి నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. ఫలితంగా మధుమేహం వచ్చే అవకాశముంది.

* యాంటీబోడీలు..
శరీరంలో యాంటీబోడీలు మరో సమస్య. క్లోమంలో ఉండే ఐలెట్‌ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే ఐలెట్‌ సెల్‌ యాంటీబోడీలు, ఇన్సులిన్‌ యాంటీబోడీ, గ్యాడ్‌ యాంటీబోడీలు.. ఇవన్నీ క్లోమగ్రంథిని దెబ్బతీస్తాయి. నిజానికి గ్యాడ్‌ పదార్థం మెదడులో ఉంటుంది. ఇది మెదడులోని నాడీకణాలకు అవసరమైన 'గాబా న్యూరోట్రాన్స్‌మిటర్‌'ను తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. అయితే నాడీవ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయటానికి పుట్టుకొచ్చే గ్యాడ్‌యాంటీబోడీ.. పాంక్రియాస్‌ గ్రంథిని ఎందుకు దెబ్బతీస్తోందనేది ప్రస్తుతానికి వైద్యరంగానికి అంతుబట్టటం లేదు. ఏదేమైనా గ్యాడ్‌ యాంటీబోడీ ఉన్నవారికి పాంక్రియాస్‌ బీటా కణాలు త్వరలోనే దెబ్బతినే అవకాశముంటుంది. ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి.. ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం (టైప్‌-1) రావొచ్చని కచ్చితంగా చెప్పొచ్చు.

* విటమిన్‌ డి..
ఇది మనం తిన్న ఆహారంలోని క్యాల్షియం రక్తంలో కలవటానికి, అక్కడ్నుంచి ఎముకల్లోకి చేర్చటానికి తోడ్పడుతుంది. అయితే ఇది చేసే పనుల్లో ఇదొక శాతం మాత్రమే. నిజానికిది రోగనిరోధక శక్తిని పెంపొందించే (ఇమ్యూనో మాడ్యులేటరీ) ప్రోటీను. ఇది చాలా విస్తృతమైన పనులు చేస్తుంది. పిల్లల్లో విటమిన్‌-డి మోతాదు తక్కువగా ఉంటోంది. దీంతో రోగనిరోధకశక్తి వికటించి.. శరీరంపైనే దాడి (ఆటో ఇమ్యూనిటీ) ఆరంభిస్తోంది. అందువల్ల విటమిన్‌ డి తక్కువగా గలవారికి మధుమేహం వచ్చే అవకాశమూ పెరుగుతుంది.

* పర్యావరణం..
తేమ, పగలూరాత్రీ కాంతి సమయం, ఉష్ణోగ్రత, వర్షం వంటివన్నీ 'బయోక్త్లెమేట్‌' కిందికి వస్తాయి. ఉష్ణదేశాల నుంచి చలిదేశాలకు, అలాగే చలి దేశాల నుంచి ఉష్ణదేశాలకు వచ్చినప్పుడు, నిద్రకు సంబంధించిన నియమాలు పాటించనప్పుడు మధుమేహం రావచ్చు. ముఖ్యంగా రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల మధ్య శరీరంలో కణాల మరమ్మతు జరుగుతుంటుంది. ఈ సమయంలో సరిగా నిద్రపోకపోతే హార్మోన్లన్నీ గందరగోళంలో పడిపోతాయి. దీనివల్ల కూడా మధుమేహం రావచ్చు.

  •     Courtesy with : P.V.rao (prof and HOD) Diabetology NIMS-Hyd.@eenadu sukhibhava.15-Nov-2013

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.