Sunday, July 27, 2014

Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Ayurvedhi Tips for skin health and beauty, చర్మ సౌందర్యానికి కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • అందుబాటులో ఉండే వాటితోనే అందంగా ఎలా కనిపించవచ్చో-

* తాజా మెంతి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే యాక్నె, మొటిమలూ, ముడతలూ, బ్లాక్‌ హెడ్స్‌ వంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే

*స్ట్రాబెర్రీలు కొన్నప్పుడు ఆ బాక్స్‌లో అడుగున కొన్ని ఆకులు ఉంటాయి. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. మొటిమలు అధికంగా ఉన్నవాళ్లు, ఆ ఆకుల్ని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే, వాటి చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది.

* రెండు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల రోజ్‌వాటర్‌ని కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ఎండిన తులసి ఆకులతో చేసిన టీలో దూది ముంచి దానితో ముఖాన్ని తుడుచుకొంటే ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు.

* యాక్నె అధికంగా ఉండేవారు అలొవెరా రసాన్ని రెండు పూటలా ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంధానికి రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

  • కలబందతో కళగా..12/08/2014
కప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మెంతి పొడీ, టేబుల్‌ స్పూన్‌ తులసి ఆకుల పొడీ, రెండుటేబుల్‌ స్పూన్ల ఆముదం వేసుకుని బాగా కలపాలి. దీన్ని తలకు పూతలా రాసుకుని, షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ముప్పావు గంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టును బలంగా మారుస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెరుగైన ఫలితాలు పొందేందుకు కనీసం వారానికోసారి ఈ పూతను వేసుకోవాలి.

అరకప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మందార పువ్వుల పేస్టును వేసి బాగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి పోషణనిస్తుంది.

    చర్మం మరీ పొడిగా, తాకితే గరుకుగా అనిపిస్తోందా! అయితే చర్మానికి తేమనందించే ఈ క్యారెట్‌ మాస్క్‌ని ప్రయత్నించి చూడండి. -- 17-Aug-14

చెంచా తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల క్యారెట్‌ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది. క్యారెట్‌ రసం, నిమ్మరసం, సెనగపిండిని సమపాళ్లలో తీసుకొని పావుకప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ కాళ్లూ, చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా ఆలివ్‌నూనె, రెండు చెంచాల క్యారెట్‌ రసం, కాస్త పెరుగూ తీసుకుని బాగా గిలకొట్టాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు ఛాయలని వెనక్కి నెట్టేస్తాయి. క్యారెట్‌ తురుమూ, పాలపొడీ, పంచదారని సమపాళ్లలో తీసుకొని ముఖంపై రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగి ముఖం కాంతిమంతం అవుతుంది.

స్నానం ద్వారా చర్మ సమస్యలు మాయం

    వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా భాధిస్తాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు. ఈ ఇబ్బందులన్నీ తొలగించుకుని చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

ఈ కాలంలో పొగలొచ్చే వేణ్నీళ్లతో స్నానం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అలాకాకుండా గోరువెచ్చని నీళ్లలో కొబ్బరినూనె కలిపితే చర్మం మృదువుగా మారుతుంది. కాగుతున్న నీళ్లలో వేపాకు లేదంటే నిమ్మతొక్కలు వేస్తే వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి.

* సబ్బులూ, గాఢత ఎక్కువగా ఉన్న క్రీమ్‌లు వాడకపోవడం మంచిది. వాటివల్ల కొన్నిసార్లు చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. సున్నిపిండీ, నలుగు పిండి వంటి వాటికి ప్రాధాన్యమివ్వడం మంచిది.

* అప్పుడప్పుడూ కాసిని నీళ్లలో లవంగాల నూనె చేర్చి ఒంటికి మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా పాదాలకు మసాజ్‌ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. అలానే వర్షంలో తడిసి ఇంటికెళ్లినప్పుడు స్నానం చేసే నీళ్లలో వెనిగర్‌ కలపాలి. దీంతో బురద వల్ల వెంట వచ్చిన ఫంగస్‌ వదిలిపోతుంది. రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి రాత్రిపడుకునే ముందు ముఖం, మెడా తుడుచుకుంటే కనిపించని క్రిములూ మురికీ దూరమవుతాయి. చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది.

  • అందానికి ఆలివ్‌
నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎలు చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచడానికి తోడ్పడతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే ముడతలూ, గీతలను తొలగిస్తాయి. చర్మానికి అవసరమైన తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. స్నానానికి అరగంట ముందు ఆలివ్‌నూనెను ఒంటికి పట్టించి, తరవాత స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

* తరచూ మేకప్‌ వేసుకునే వారి చర్మం త్వరగా పొడి బారుతుంది. ఈ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించడానికి ఆలివ్‌నూనెను వాడాలి. దాన్ని గోరువెచ్చగా చేసి ముఖానికి మర్దన చేసి, కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల, కఠిన రసాయనాల ప్రభావం చర్మంపై పడదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

* కొందరికి గోళ్లు ఇట్టే విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.


పెసరపిండితో అందం
అందంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. దీనికి అందుబాటులో ఉండే వంటింటి వస్తువులు సరిపోతాయి. అలాంటివాటిల్లో పెసరపిండి కూడా ఒకటి.

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

రెండుమూడు చెంచాల పెసరపిండీ, పావుకప్పు పెరుగూ, చెంచా తేనె, చిటికెడు పసుపూ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం శుభ్రంగా కడుక్కున్నాక పూతలా వేసి, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలూ, మొటిమల తాలూకు మచ్చల్ని తొలగిస్తుంది.

పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా పెసరపిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జూ, అరచెంచా బొప్పాయి పేస్ట్‌ కలుపుకొని మెత్తగా చేసుకుని ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తారు.

గుడ్డులోని తెల్లసొనలో చెంచా పెరుగూ, చెంచా పెసరపిండీ, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.

  • పాల మెరుపు
విటమిన్‌ 'ఎ', 'డి' వంటి వాటితో పాటూ ఎముకల్ని బలంగా ఉంచే క్యాల్షియం వంటి ఖనిజాలూ పాల నుంచి పెద్ద మొత్తంలో శరీరానికి అందుతాయి. దుమ్మూ, ధూళీ ప్రభావం పడినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పాలను సహజ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. పాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపరిచి బ్లాక్‌హెడ్స్‌, యాక్నె వంటి సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. దీనికోసం ఏం చేయాలంటే... పచ్చి పాలను ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి దాానికి చెంచా సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. దీంతో మురికి తొలగిపోతుంది.

* చర్మం పొడి బారి ఇబ్బందిపెడుతోందా! దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి ఆరనివ్వాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది. పచ్చి పాలల్లో గులాబీ రేకల ముద్దా, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు ఒంటికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
  •  
* ఎండవేడితో తలెత్తే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలు అదుపులో ఉంచుతాయి. మేని ఛాయను మెరుగుపరుస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. పచ్చి పాలూ, తేనె మిశ్రమాన్ని రోజూ ఒంటికి రాసుకుని ఆరాక స్నానం చేస్తే సరి. స్నానం చేసే నీళ్లలో అరకప్పు పచ్చిపాలూ, చెంచా గులాబీ నీరూ, రెండు చెంచాల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. దీనితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అవసరమైన పోషకాలు అంది నిగనిగలాడుతుంది.

బంగాళాదుంప రసం పూత చర్మం నిగారింపుకు  ప్రయత్నిద్దాం

    ఎప్పుడూ వంటింట్లో అందుబాటులో ఉండే బంగాళాదుంప అందానికి ఎంతో మేలు చేస్తుంది.

చెంచా బంగాళాదుంప రసంలో రెండు చెంచాల నిమ్మరసం, ముల్తానీమట్టీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. అది ఆరాక చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ఎండ వేడికి చర్మం రంగును కోల్పోయినప్పుడు ఫ్రిజ్‌లోపెట్టి తీసిన బంగాళాదుంప ముక్కలతో ముఖం మీద రుద్దుకుంటే సరిపోతుంది అలానే బంగాళాదుంపలో ఉండే పొటాషియం, విటమిన్‌ బి6, విటమిన్‌ 'సి'లు చర్మం మీద మృతకణాలను తొలగించేస్తాయి. విటమిన్‌ సి యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మ సమస్యలను దూరం చేసి మృదువుగా మారుస్తుంది. బంగాళాదుంప గుజ్జులో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేయాలి. ఈ పూత ముఖానికి బ్లీచ్‌లా కూడా పని చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.

ఎండకు కమిలిన చర్మానికి సాంత్వన కలగాలంటే, బంగాళాదుంపల్ని తరిగి ఆ ప్రాంతంలో ఉంచాలి. పది నిమిషాలయ్యాక తీసి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే పెరుగులో చెంచా బంగాళాదుంప గుజ్జును కలిపి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఆలూలో ఉండే విటమిన్‌ బి6 చర్మం మీద యాంటీ ఏజింగ్‌ కారకంలా పనిచేస్తుంది. ముడతలు రాకుండా కాపాడుతుంది.

కళ్ల కింద నల్లటి మచ్చలు బాధిస్తోంటే ఈ గుజ్జులో తేనె కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ పూత వల్ల నల్లటి మచ్చలు దూరమవుతాయి. కళ్ల మంటలూ, దురదా తగ్గుతాయి.

బంగాళా దుంప రసంలో సమపాళ్లలో కీరదోస రసం కలిపి అందులో దూది ఉండలు వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత దూదితో ముఖం తుడుచుకుంటే టోనర్‌గా పనిచేసి ముఖాన్ని మెరిపిస్తుంది. ఇక బంగాళాదుంపలను ఉడికించిన నీళ్లతో తరచూ ముఖం కడుక్కుంటే తాజాదనం సొంతమవుతుంది.

  • ముడతలు దూరం
కార్యాలయంలో కూర్చుని పనిచేసే వాళ్లతో పోలిస్తే... బయట తిరిగి పని చేసే వాళ్లకి ముప్ఫైల్లోనే చర్మంపై గీతలు పడటం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లు క్రీముల కన్నా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.

*బాగా పండిన అరటిపండుని మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేసుకోవాలి. బయటికి వెళ్లొచ్చాక ఇలా చేస్తే గీతలు పడే అవకాశం తగ్గుతుంది.
*అనాస గుజ్జు కూడా చర్మంపై బాగా పనిచేస్తుంది. ఆ గుజ్జూ లేదా రసాన్ని ముఖానికీ మెడకీ రాసుకుని మర్దన చేస్తే ముడతలూ, గీతలు రాకుండా చూసుకోవచ్చు.
*ఒక టీ చెంచా ఆలివ్‌ నూనెకి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దినా మంచిదే.
* తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
*బొప్పాయిని మెత్తగా చేసి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి వారానికోసారి ముఖానికి రాసుకోవాలి.
*అప్పుడప్పుడు తేనె, గులాబీ నీళ్లూ, పసుపూ కలిపి ముఖానికి రాసుకుని కాసేపు వదిలేసినా మంచిదే.

పై పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటే ముప్ఫైల్లోనే చర్మంపై గీతలూ, ముడతలూ రావడం... పొడిబారడం వంటి సమస్యలు దూరమవుతాయి.

  • గుడ్డుతో అందమే...

జుట్టుకి ఆరోగ్యాన్నీ అందాన్నీ అందించే వాటిలో గుడ్డు స్థానం ఎప్పుడూ ముందే. ఇందులో సల్ఫర్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, ఇనుమూ, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్‌ 'ఇ' కూడా కావల్సినంత ఉంటుంది. అది అతినీలలోహిత కిరణాల నుంచి వెంట్రుకలను కాపాడుతుంది. గుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్‌ నూనెని కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని మాడుకు పట్టేలా రాసుకోవాలి. పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే గుడ్డు పచ్చసొనలో మూడు చెంచాల ఆలివ్‌నూనెనీ కాస్త తేనెనీ కలిపి రాసి అరగంట తరవాత కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనకు కాస్త నిమ్మరసాన్ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌లను నెలలో కనీసం రెండుసార్లయినా ప్రయత్నిస్తే... మృదువైన, నిగనిగలాడే జుట్టు సొంతమవుతుంది.
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.