మత్తుమందు ఇవ్వడం వల్ల సర్జరీ సమయంలో నొప్పి తెలియకపోవచ్చేమో గానీ, సర్జరీ తరువాత మాత్రం ఎంత నొప్పి.. ఎంత బాధ! పాత విధానాల్లో మూరడేసి పొడవునా చేసే సర్జరీతో ఆసుపత్రిలో, ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత ఎంత నరకం అనుభవించేవాళ్లు.. ప్రత్యేకించి క్యాన్సర్ సర్జరీల్లో ఈ తేడా మరింత తీవ్రంగా కనిపిస్తుంది. కణుతులు మరీ పెద్దవైనప్పుడు కత్తికోతలు కూడా పెద్దగానే ఉండేవి. క్యాన్సర్ నివారణలో ఎంత సమర్ధవంతమైన వైద్యం అందించినా, ఓపెన్ సర్జరీ వల్ల కలిగే విపరీతమైన నొప్పి, బాధ కొద్దిరోజుల దాకా ఎంతో దుర్భరంగానే ఉంటాయి.
క్యాన్సర్ సర్జరీలో ఒక్కోసారి చిన్న కణితిని తీసివేయడానికి కూడా ఎంతో పొడవాటి కోత పెట్టక తప్పదు. ముఖ్యంగా ఛాతి, అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు, గర్భసంచి, మూత్రాశయాల్లో వచ్చే క్యాన్సర్ కణుతుల్ని తీసివేయడానికి మొన్నమొన్నటి దాకా ఈ పెద్ద కోత తప్పని ఓపెన్ సర్జరీ మాత్రమే మార్గంగా ఉండేది. కాని కీహోల్ విధానం వచ్చిన తరువాత క్యాన్సర్‌సర్జరీలో పెను మార్పులే సంభవించాయి. అయితే ఇప్పటికీ కొందరు క్యాన్సర్ సర్జరీలను కీహోల్ విధానంలో చేయాల్సిన పనేముంది..? కోత 20 సెంటీమీటర్లు పడితే ఏంటి.. 2 సెంటీమీటర్లు పడితే ఏంటి..? క్యాన్సర్ కణితిని మొత్తంగా తీసివేయడం ఇక్కడ ముఖ్యం. అంతేగాని, కాస్మెటిక్ ఫలితాలు ముఖ్యంకాదు కదా! అంటూ ఉంటారు. దష్టినంతా కాస్మెటిక్ ఫలితాలు సాధించడం మీదే పెడితే, క్యాన్సర్ సర్జరీలో ఒక రాజీ ధోరణి అలవడవచ్చు కదా అని కూడా అంటూ ఉంటారు. నిజానికి అలాంటి పరిస్థితే ఇక్కడ ఉత్పన్నం కాదు.
ఎన్నో రెట్లు మెరుగు
ఏ రకంగా చూసినా, ఓపెన్ సర్జరీ కన్నా కీహోల్ సర్జరీ పది రెట్లు మెరుగైనది. ప్రామాణికమైనది కూడా. కీహోల్ సర్జరీ వల్ల అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాల్ని కంటి చూపు కన్నా పదీ పదిహేను రెట్లు పెద్దవిగా చూడగలిగే సౌలభ్యం ఉంటుంది. కీహోల్ సర్జరీలో భాగంగా స్కోప్స్ కెమెరాను ఉపయోగించి శరీర అంతార్భాగాలను కంటి కనిపించని అతి సూక్ష్మభాగాలను కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. లాప్రోస్కోప్ విధానంలో కంటికి కనిపించని ఆయా భాగాలు సహజ పరిమాణం కన్నా పదిరెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. ఈ విధానంలో క్యాన్సర్‌కు గురైన భాగాలు, దాని చుట్టూ ఉండే క్యాన్సర్ పాకే అవకాశం ఉన్న ఇతర విభాగాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీ ద్వారా ఏ భాగాలను ఏమేరకు తీసివేయాలో స్పష్టంగా తెలుస్తుంది.
లింఫ్ గ్రంథులతో సహా..
క్యాన్సర్ సర్జరీలో ఆ కణితి, దాని చుట్టూ ఉండే కణజాలం, అది పాకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులన్నింటినీ తీసివేయాలి. అయితే వాటిని సంపూర్ణంగా తీసివేయడంలో కీహోల్ సర్జరీ తోడ్పడుతుంది. ఒకప్పుడు మల విసర్జక, మూత్రాశయ, లైంగిక భాగాలకు మరికొన్ని ఇతర భాగాలకు సర్జరీ చేస్తున్నప్పుడు ఆయా భాగాలకు సంబంధించిన, కంటికి కనిపించని అతి సూక్ష్మమైన నాళాలు తెగిపోయేవి. అవి తిరిగి అతికించడానికి కూడా అవకాశం లేనివి. అయితే ఈ లాప్రోస్కోపిక్ విధానంలో సర్జరీ చేస్తున్నప్పుడు ఆ నాళాలన్నీ పది పదిహేను రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. అలా అవి చాలా స్పష్టంగా కనిపించడం వల్ల అవి మునుపటిలో తెగిపోయే ప్రమాదం తప్పింది.
దీనివల్ల సర్జరీ సమయంలో రక్తస్రావం అయ్యే అవకాశం బాగా తగ్గిపోతుంది. చాలావరకు రక్తం ఎక్కించాల్సిన అవసరమే ఉండదు. అన్నవాహిక క్యాన్సర్‌కు గాని, రెక్టల్ క్యాన్సర్‌కు గాని సర్జరీ చేసిన తరువాత కణితి బాగా పెద్దదిగా ఉన్నప్పుడు వెంటనే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీ చేసినప్పుడు సర్జరీ కోత గాయం పూర్తిగా మానేదాకా ఈ థెరపీలో ఇవ్వకుండా ఆపాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో పెద్ద గాయమే ఉండదు కాబట్టి వెంటనే థెరపీలు ఇవ్వడం వీలవుతుంది. ఓపెన్ సర్జరీతో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇచ్చే పెయిన్‌కిల్లర్స్ వల్ల ఇతర దుష్ప్రభావాలు కొన్ని తలెత్తుతాయి. కొందరిలో శ్వాసపరమైన ఇబ్బంది కలిగించే రెస్పిరేటరీ డిప్రెషన్ సమస్య కూడా మొదలవుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీతో పెద్దగా నొప్పే ఉండదు కాబట్టి పెయిన్ మెడికేషన్ అవసరమే ఉండదు. హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. ఇతరత్రా ఖర్చులు ఎక్కువే అయినా హాస్పిటల్‌లో ఉండే సమయం తగ్గిపోతుంది కాబట్టి ఆ ఖర్చులు మిగులుతాయి.
జెనైటల్ యూరినరీ ఆంకాలజీ
జననాంగ సంబంధిత క్యాన్సర్లకు లాప్రోస్కోపీ విధానం ఎంతో ప్రయోజనకరం. ప్రత్యేకించి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ సర్జరీలోనూ, మలవిసర్జక భాగపు సర్జరీలోనూ, అండాశయ క్యాన్సర్ సర్జరీలోనూ దీని ఉపయోగం చాలా ఎక్కువ. గర్భాశయ క్యాన్సర్‌లో వ్యాధి పాకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులను కూడా ఈ విధానంలో చాలా కచ్చితమైన రీతిలో తీసివేయవచ్చు. అలాగే స్త్రీ జననాంగంలో వచ్చే క్యాన్సర్‌ను సంపూర్తిగా తీసివేయడం కూడా ఈ విధానంలో వీలవుతుంది.
అలాగే మూత్రాశయ నాళాలను స్పష్టంగా గుర్తిస్తూ, వాటికి హాని కలగకుండా చేయడంలో కూడా లాప్రోస్కోపీ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ఓపెన్ సర్జరీ చేయడం వల్ల గర్భాశయం మీద వచ్చే దుష్ప్రభావాలేవీ లేకుండా లాప్రోస్కోపీ విధానంలో చేయడం వీలవుతుంది. జననాంగం, దాని చుట్టూ ఉండే భాగాన్ని తీసివేసేటప్పుడు చాలా పర్‌ఫెక్ట్‌గా తీసే అవకాశం ఉంది.
అండాశయ క్యాన్సర్‌లో కణితి చాలా చిన్నదిగా ఉంటే సులువుగా తీసివేయవచ్చు. ఒకవేళ పెద్దదిగా ఉంటే ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా దాని సైజు తగ్గాక ఆ తరువాత సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీతో అయితే చాలా పెద్ద కోత పడుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువే. అందుకే ఆ గాయం మానడానికి ఎక్కువ కాలం పడుతుంది. అదే లాప్రోస్కోపీ విధానంలో అతి చిన్న కోతతోనే అయిపోతుంది కాబట్టి రెండోరోజుకే బాగా కోలుకుంటారు. సర్జరీ జరిగిన వారం రోజులకే కీమోథెరపీ ఇవ్వవచ్చు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్లు
కీహోల్ సర్జరీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సలకు చాలా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్. 25 సెంటీమీటర్ల పొడవుండే అన్నవాహిక క్యాన్సర్‌కు మామూలుగా అయితే ఒకే పెద్దకోతతో ఈ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇది దాదాపు 7 గంటలు పట్టే పెద్ద ఆపరేషన్. ఈసోఫేగల్ క్యాన్సర్లు ఎక్కువగా పెద్దవయసులోనే వస్తాయి. పొగ, మద్యం తాగేవారిలో కూడా ఇవి ఎక్కువే. వీళ్లందరికీ ఏదో ఒక స్థాయిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉంటాయి.
శ్వాస సాఫీగా సాగిపోవాలంటే నొప్పి ఉండకూడదు. సర్జరీలో పెద్ద కోత పడినప్పుడు విపరీతంగా నొప్పి ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా సమస్యగా ఉంటుంది. కీహోల్ సర్జరీతో చేసే ఈ చికిత్స కేవలం మూడు నాలుగు గంటల్లో పూర్తవుతుంది. సర్జరీ జరిగాక వారు కోలుకోవడం చాలా వేగంగా, సునాయాసంగా ఉంటుంది. ఇతరత్రా వారికి ఏ ఇబ్బందీ ఆయాసమూ ఉండవు. అందుకే 80 ఏళ్ల వయసు వారు కూడా ఈ సర్జరీని తట్టుకోగలుగుతారు. పెద్దపేగుల్లోని ఎడమ, మధ్య, కుడి భాగాల్లో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, ఈ లాప్రోస్కోపీ విధానం ద్వారా సులువుగా చేయగలుగుతున్నాం.
రెక్టల్ క్యాన్సర్
విసర్జన భాగానికి దగ్గరలో క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేయడమంటే ఒకప్పుడు పెద్ద సమస్యగా ఉండేది. ఈ సర్జరీలో మలవిసర్జనను నియంత్రించే యానల్ స్పింక్టర్‌ను మొత్తంగా తీసివేయడమే ఇందుకు కారణం. అలా తీసివేయడం వల్ల నియంత్రణ లేకుండా మలం విడుదల అవుతూనే ఉంటుంది. అందుకే నడుముకు ఒక పక్కన రంధ్రం చేసి మలవిసర్జన కోసం పేగును అక్కడ అమర్చేవాళ్లం.
అప్పటికి అది అనివార్యమే అయినా, ఎల్లకాలం ఆ కత్రిమ మార్గం ద్వారా విసర్జంచవలసి రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. అలా మొత్తంగా తీసివేయడానికి రెక్టమ్ పైనున్న క్యాన్సర్ భాగాలను అంత స్పష్టంగా గుర్తించే అవకాశం లేకపోవడమే కారణం. అయితే లాప్రోస్కోపిక్ విధానం ద్వారా అక్కడ వచ్చిన కంటికి కనిపించని క్యాన్సర్ కణుతులను చాలా స్పష్టంగా గుర్తించగలిగే అవకాశం ఏర్పడింది. అందుకే క్యాన్సర్ ఉన్న భాగాన్ని తీసివేసి ఆ కత్తిరించిన భాగాన్ని స్పింక్టర్ పైన కుట్లు వేసి అతికిస్తున్నాం. ఒకప్పుడైతే చాలాసార్లు రెక్టల్ క్యాన్సర్స్‌లో రెక్టల్ స్పింక్టర్‌ను కూడా తీసివేయాల్సి వచ్చేది. దీనివల్ల మలం సహజమార్గంలో రాకుండా పోవడంతో కత్రిమ మార్గాన్ని ఏర్పరిచి అందులోంచి వెళ్లే ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా, యానల్ స్పింక్టర్‌ను అలాగే ఉంచేసి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేయడం సాధ్యమవుతోంది.
థైరాయిడెక్టమీ
థైరాయిడ్‌కు సంబంధించిన క్యాన్సర్ కాని (బినైన్) కణుతులను ఇప్పుడు ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ ద్వారా తీసివేయగలుగుతున్నాం. దీనివల్ల ఎక్కడా కత్తి కోతలు కనబడవు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో లింఫ్‌నోడ్స్ తీయడానికి ఎండోస్కోపిక్ సెంటినల్ నోడ్ హార్వెస్టింగ్, అలాగే ఎండోస్కోపిక్ యాక్సిలరీ క్లియరెన్స్ చేయడం జరుగుతోంది. దీనివల్ల మునుపున్న దుష్ప్రభావాలు బాగా తగ్గిపోయాయి. చేయి కదల్చడంలో ఉండే మునుపటి ఇబ్బందులు కూడా ఇప్పుడు రావడం లేదు. అలాగే గాల్‌బ్లాడర్ సర్జరీ, అండాశయ క్యాన్సర్ సర్జరీ ఇవన్నీ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సమర్థవంతంగా చెయ్యగలుగుతున్నాం. అత్యాధునిక ఔషధాలతో క్యాన్సర్‌ను ఎలాగూ శక్తివంతంగా అరికట్టగలుగుతున్నాం. దీనికి తోడు కీహోల్ సర్జరీ. లేదా లాప్రోస్కోపిక్ సర్జరీతో కత్తి కోతల బాధ కూడా బాగా తగ్గిపోయింది. ఈ ఆధునిక విధానాలు పాత తరహా సర్జరీలతో కలిగే అనేకానేక బాధల నుంచి విముక్తి కలిగించాయి.
- courtesy with Dr. Ch.Mohana Vamsy @namasthetelangaana.jindagee.
- ============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.