Saturday, September 25, 2010

కంట్లో ప్రమాదకారకాలు-మూలకణ చికిత్స , Eye foreign bodies and Stem cell treatment






కంట్లో రసాయనాలు పడటం పెద్ద ప్రమాదం! నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే ఎన్నో ఆమ్లాలు, ముఖ్యంగా క్షారాలు కనుగుడ్డును తినేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి:
* సున్నం కంటికి అతిపెద్ద శత్రువు. కిళ్లీల్లో ఉపయోగించే సున్నం కూడా ప్రమాదకరమైనదే.
* బ్లీచింగ్‌ పౌడర్‌. శుభ్రం చేసేందుకు ఉపయోగించే చాలా రకాల పౌడర్లలో అమ్మోనియా ఉంటుంది. ఇది ప్రమాదకరమైనది.
* అమ్మోనియా, పొటాష్‌ ఎరువులు
* బ్యాటరీల్లో ఉండే యాసిడ్‌, లోహాలను శుభ్రం చేసేందుకు పరిశ్రమల్లో బ్లీచ్‌గా వాడే సల్ఫరస్‌ ఆమ్లం, గ్లాసులకు పాలిష్‌ వేసేందుకు వాడే హైడ్రోఫ్లూరిక్‌ ఆమ్లం, నిత్యం ఇంట్లో వాడే వెనిగర్‌ (ఎసిటిక్‌ ఆమ్లం), అత్యంత ప్రమాదకరమైన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం.. ఇవన్నీ ప్రమాదకరమైనవే.
* ఇటువంటి ప్రమాదాల బారినపడుతున్న వారిలో దాదాపు 75% శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. పరిశ్రమల్లోనే కాదు.. సున్నం పడటం వంటి ప్రమాదాలు ఇళ్లలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కొద్దినిమిషాల పాటు శుభ్రంగా కడగటం చాలా చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా కంటి వైద్యులను సంప్రదించాలి. కంట్లో పడినదేమిటో కచ్చితంగా వైద్యులకు చెప్పటం చికిత్సా విధానానికి ఉపయోగపడుతుంది. వైద్యులు కూడా కంటి నుంచి ఆ రసాయనం, దాని అవశేషాలు మొత్తం పోయే వరకూ శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు.

కంట్లో కారం' గురించి మనం భయంకరంగా చెప్పుకొంటాం. కానీ కంటికి సంబంధించినంత వరకూ 'సున్నం' అతి భయంకరమైనది! ఒక్క సున్నమే కాదు.. మనం నిత్యం వాడే బ్లీచింగ్‌ పౌడర్‌.. రకరకాల యాసిడ్లు.. ఇవన్నీ కంట్లో విపత్తు సృష్టించేవే! ప్రమాదవశాత్తూ ఇవి ఒక్కసారి కంట్లో పడ్డాయంటే చాలు.. అతి సున్నితమైన కంటి భాగాలను తినేస్తాయి. దృష్టిని దెబ్బతీస్తాయి. ఆ కన్ను తిరిగి కోలుకునేలా చెయ్యటం.. తిరిగి చూపు తెప్పించటం.. ఎంతో కష్టంతో కూడుకున్న పని!

ముఖ్యంగా మన కంటిలోని నల్లగుడ్డు పైన ఉండే పారదర్శకమైన 'కార్నియా' పొర అత్యంత సున్నితమైనది. ఇదొక్కటే దెబ్బతింటే.. నేత్రదానం ద్వారా స్వీకరించిన కార్నియాను తెచ్చి మార్పిడి చెయ్యటం ద్వారా పరిస్థితి చక్కదిద్దచ్చు. కానీ ఈ కార్నియా పొరకు నిత్యం జవజీవాలను అందిస్తూ.. ఈ చుట్టూ ఉండే 'లింబస్‌' ప్రాంతం దెబ్బతింటే మాత్రం దీన్ని సరిచెయ్యటం మహాకష్టం. పదేళ్ల క్రితం వరకూ కూడా దీనికి సరైన పరిష్కారమే లేదు. ఫలితంగా... సున్నం వంటి ప్రమాదాల బారినపడిన ఎంతోమంది బాధితులు దృష్టికి దూరంగా, అంధకారంలో ఉండిపోయారు

నల్లగుడ్డు మీదికి తెల్లగుడ్డు దురాక్రమణ
కంటిలో లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే ఇలా నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో కనుగుడ్డే మూసుకుపోయి చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే.

కంటిలో రసాయనాలు పడటం సర్వసాధారణమైనదే కాదు, అత్యంత ప్రమాదకరమైన సమస్య కూడా! కంటికి సంబంధించి ఇదో అతిపెద్ద విపత్తు. మామూలుగానే మన కంట్లో ఏం పడినా క్షణాల్లో మంట, ఎర్రబడటం, వాపు, నీరుకారటం వంటివన్నీ మొదలవుతాయి. కాకపోతే సరైన చికిత్సతో ఇవన్నీ కొద్దిగంటల్లోనో, రోజుల్లోనో తగ్గిపోయి.. కన్ను మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అదే గాఢమైన ఆమ్లాలుగానీ, క్షారాలుగానీ పడినప్పుడు పరిస్థితి ఇంత తేలికగా ఉండదు. అవి కనుగుడ్డు మీద ఉండే సున్నితమైన, కంటి చూపునకు అత్యంత కీలకమైన పొరలను తినేస్తాయి. ముఖ్యంగా సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి క్షార రసాయనాలు కనుగుడ్డు పైభాగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి రెండు కళ్లలోనూ పడితే పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో కార్నియా పొర దెబ్బతిన్నప్పుడు తక్షణ వైద్యంతో పాటు చూపు పునరుద్ధరణ కోసం ఎంతో సంక్లిష్టమైన చికిత్సలూ అవసరమవుతాయి. మూలకణ మార్పిడి చికిత్సా విధానం వీటిలో అత్యంత కీలకమైనది.

ఏమిటీ మూలకణ చికిత్స?
మన కంట్లో నల్లగుడ్డు మీద పారదర్శకమైన పొర ఉంటుంది. దీన్నే 'కార్నియా' అంటారు. ఈ కార్నియా చుట్టూ తెల్లగుడ్డు ఉంటుంది, దీన్ని 'కంజెంక్త్టెవా' అంటారు. ఈ రెంటికీ మధ్య ఉండే రింగులాంటి ప్రాంతం 'లింబస్‌'. కార్నియా పొర బాగుండాలంటే దాని చుట్టూ ఉండే ఈ లింబస్‌ పొర అత్యంత కీలకం. ఎందుకంటే కార్నియా పొరకు కావాల్సిన కణాలన్నింటినీ ఈ లింబస్‌ రింగే అందిస్తుంటుంది. కార్నియా స్వచ్ఛమైన అద్దంలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి దానిలో రక్తనాళాలు, రక్తసరఫరా ఉండవు. కానీ శరీరంలో అన్నిభాగాల్లాగే అక్కడి కణాలు కూడా నిరంతరం క్షీణిస్తుంటాయి. మరి దానికి నిరంతరం కొత్తకణాలు అందుతుంటేనే అది చక్కగా ఉంటుంది. అందుకే దానిచుట్టూ అద్భుతమైన 'లింబస్‌' ఏర్పాటు ఉంది. ఈ లింబస్‌ రింగులో మూల కణాలుంటాయి. ఇవి నిరంతరం కార్నియా కణాలుగా మార్పుచెందుతూ.. పైకి వ్యాపిస్తుంటాయి. దీంతో కార్నియా ఎప్పుడూ చక్కగా ఉంటుంది. ఇదీ ప్రాథమికంగా కార్నియా, లింబస్‌ల నిర్మాణం.

ప్రమాదం జరిగితే..?
కంట్లో ఏవైనా రసాయనాలు పడి.. కార్నియా పొర దెబ్బతింటే.. వేరొక నేత్రదాత నుంచి స్వీకరించిన కార్నియా మార్పిడి చేస్తారు. ఆ తర్వాత దానికి అవసరమైన కణాలన్నింటినీ యథాప్రకారం లింబస్‌ అందిస్తుంటుంది. కానీ ప్రమాదంలో లింబస్‌ భాగం కూడా దెబ్బతింటే..? అప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది. కార్నియా మార్పిడి చేసినా.. దానికి నిరంతరం కణాలను సరఫరా చేసే లింబస్‌ ప్రాంతం లేక అది అట్టేకాలం నిలబడలేదు. రెండోది- లింబస్‌ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే. ఇలాంటి వారికి కార్నియా మార్చినా.. లింబస్‌ లేదు కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడలేదు. కాబట్టి లింబస్‌ ప్రాంతం దెబ్బతిన్నప్పుడు.. దాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అత్యవసరం. ఒక కన్ను బాగుంటే దాని నుంచి కొద్దిభాగం తీసుకువచ్చి మార్పిడి చెయ్యచ్చు. కానీ లింబస్‌లో మరీ ఎక్కువ భాగం దెబ్బతినిపోతే ఎలా? అలాగే ఒక కన్ను దెబ్బతింది కాబట్టి బాగున్న కంటి నుంచి లింబస్‌ తెచ్చి అమర్చటమంటే.. ఆ బాగున్న ఒక్క కంటినీ కూడా దెబ్బతీసిన వాళ్లమవుతామా? అన్నదీ ముఖ్యమే. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నది అత్యంత క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారంగానే 'లింబస్‌ మూలకణాల మార్పిడి' విధానాన్ని రూపొందించారు.

మార్పిడి అద్భుతం!
బాధితుల రెండో కన్ను బాగుంటే.. దాని నుంచి చాలా తక్కువగా (2 మి.మీ.) లింబస్‌ రింగు పొరను తీసుకుంటారు. ఒకవేళ రెండోకన్నూ దెబ్బతింటే తలిదండ్రులు, లేదా సన్నిహిత బంధువుల నుంచి కొద్దిగా లింబస్‌ పొరను సేకరిస్తారు. దాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సాధ్యమైనంత పెద్దగా పెంచటమన్నది ఈ ప్రక్రియలోని మూలసూత్రం. ఇలా మూలకణాలను పెంచవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమవ్వటంతో ఎల్వీప్రసాద్‌ పరిశోధకులు.. దాన్ని కంటి లింబస్‌ కణాలకు వర్తింపజేస్తూ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో సాధించేందుకు కృషి చేసి విజయం సాధించారు.
బాగున్న కంటి నుంచి కేవలం 2 మి.మీ. లింబస్‌ మాత్రమే తీసుకుని.. దాన్ని ప్రయోగశాలలో పెద్దగా పెంచాలి. అందుకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చే మాయ (ఆమ్నియాన్‌) పొర సహాయం తీసుకున్నారు. మాయపొరను ప్రయోగశాలలో చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రత్యేక రసాయనాల్లో సిద్ధంగా ఉంచుతారు. రోగి కంటి నుంచి తీసుకున్న 2 మి.మీ.ల లింబస్‌ పొరను దాని మీద ఉంచి.. క్రమేపీ దాన్ని 2 వారాల్లో పెద్దగా పెంచుతారు. రెండు కళ్లూ బాగా దెబ్బతిన్నా కూడా చిన్న లింబస్‌ ముక్క బాగుంటే చాలు.. అదే రోగి నుంచి దాన్ని తీసుకుని.. ప్రయోగశాలలో పెంచుతారు. ఇలా పెంచిన పొరను తీసుకువెళ్లి.. దెబ్బతిన్న కంటిలో అతికిస్తారు. అది క్రమేపీ కుదురుకుని.. తన మూలకణాల నుంచి కార్నియా కణాలను తయారు చెయ్యటం ఆరంభిస్తుంది. క్రమేపీ కార్నియా చక్కబడుతుంది. లేదంటే నేత్రదాతల నుంచి కార్నియా తెచ్చి మార్పిడి చెయ్యచ్చు. ఇప్పటికే లింబస్‌ను బాగు చేశారు కాబట్టి కార్నియా చక్కగా స్థిరపడుతుంది. ఇదీ ఈ ప్రక్రియ ప్రత్యేకత!


  • source : L.V.prasad eye hospital Updates- Hyderabad
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.