Monday, September 20, 2010

మలేరియా Malaria

  • [Mosquito+day.jpg]


మలేరియా (Malaria), దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో మరియు మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. "ప్లాస్మోడియం" (Plasmodium) అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు. కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషులలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి.

ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రజారోగ్య సమస్య మలేరియా. 108 దేశాల్లో మలేరియా ఉంది. క్రీ.శ. 2008లో మలేరియావల్ల ప్రపంచ వ్యాప్తంగా 10లక్షల మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోని చిన్న పిల్లలు, చిన్నపిల్లలో జరిగే మరణాలలో 20 శాతం మలేరియా వల్లనే. ప్రపంచ వ్యాప్తంగా మలేరియావల్ల జరిగే మరణాలలో 85 శాతం ఆఫ్రికా దేశాల్లో వస్తున్నవి. ప్రపంచంలోని 50 శాతం ప్రజలు మలేరియా వచ్చే పరిస్థితులలో జీవిస్తున్నారు.
మనదేశంలో జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఏటా మలేరియా ఏ మాత్రం ఉంది అని తెలుసుకొనుటకు దేశ జనాభాలో 10 శాతం మందికి మలేరియా పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో దాదాపు 1.5 నుండి 2 మిలియన్ల ప్రజలలో మలేరియా క్రిమి ఉన్నట్లు తెలుస్తున్నది. మన దేశంలో ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, త్రిపుర, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మన దేశంలో 95 శాతం ప్రజలు మలేరియా వ్యాధికి గురయ్యే పరిస్థితులలో జీవిస్తున్నారు. మన దేశంలో 80 శాతం మలేరియా 20 శాతం ప్రజలు జీవించే ప్రాంతాలయిన అడవులు, కొండ ప్రాంతాలు, ఆదివాసీలు జీవించే ప్రాంతాల్లో వస్తున్నవి.

మలేరియా రాకుండా..

వర్షకాలంతో పాటే దోమల బెడదా తీవ్రమవుతుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వృద్ధిచెందే ఇవి తెచ్చిపెట్టే సమస్యలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా దోమకాటు మూలంగా ఎంతోమంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. అందుకే జూన్‌ నెలను 'మలేరియా వ్యతిరేక మాసం'గా పాటిస్తుంటారు. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే ఈ మలేరియా బారినపడటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు.

* చేతులు కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరిస్తే దోమకాటు నుంచి కాపాడుకోవచ్చు.

* పడుకునేటప్పుడు తప్పనిసరిగా మంచం చుట్టూ దోమతెర వేసుకోవాలి. రిపెలెంట్లు, కాయిల్స్‌, క్రీములు, లోషన్ల వంటి వాటితోనూ దోమలు దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు.

* దోమలు బయటి నుంచి ఇంట్లోకి దూరకుండా కిటికీలకు తప్పకుండా జాళి అమర్చుకోవాలి.

* ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించటం మంచిది.

* సాధారణంగా నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడుతుంటాయి. అందువల్ల వీలైనంతవరకు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవాలి.

* ఇంట్లోగానీ వరండాల్లో గానీ వాడకుండా వదిలేసిన కుండలు, గిన్నెల్లో నీరు లేకుండా చూసుకోవాలి. ఖాళీ పాత్రలను తప్పకుండా బోర్లించి ఉంచాలి.

* తాగునీటి పాత్రలపై ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలి.

* మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలాంటి చోట్లకు గర్భిణులు వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే మలేరియా మూలంగా గర్భస్రావం, నెలలు నిండకముందే కాన్పు కావటం, మృత శిశు జననం వంటి ముప్పులు పెరిగే అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు వికీపిడియా ను చూడండి -> మలేరియా వ్యాధి .
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.