Wednesday, September 29, 2010

గొంతు నొప్పి,ఫారింజైటిస్‌ , Pharyngitis,Throat pain,Sore throatగొంతు రొంప - గొంతు నొప్పి---ఫారింజైటిస్‌ : గొంతు, గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.


Sore throat, Pharyngitis,గొంతు నొప్పి

పిల్లలకు సంక్రమించే అతి సామాన్యమైన బాధ గొంతు నొప్పి. చాలాసార్లు వైద్యుల వద్దకు కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. గొంతు నొప్పితో పాటు ముక్కు, చెవులు, సైనసులు కూడా ఈ బాధలకు గురి కావచ్చు. ఇవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానంగా ఉండటమే ఇందుకు కారణం. గొంతులో టాన్సిల్స్‌ కూడా ఉంటాయి గనుక అవీ ఈ బాధలకు ప్రభావితమవుతుంటాయి. ఏడాదిలోపు పిల్లలకు టాన్సిల్స్‌ చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాళ్లీ బాధలకు గురికాకపోవచ్చు. 4-8 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో ఈ బాధలు ఎక్కువ. కొందరిలో ఈ నొప్పితోపాటు చెవిపోటు, కడుపునొప్పి కూడా కన్పించవచ్చు. అంతేకాదు, ఈ బాధలు ప్రబలంగా వుండి గొంతునొప్పి మరుగునపడే అవకాశమూ ఉంటుంది. అందుకని ఇటువంటి లక్షణాలున్న పిల్లల్లో గొంతును కూడా పరీక్షించటం అవసరం.
టాన్సిల్స్‌ పెరిగాయా అన్నదాన్ని ఇన్ఫెక్షన్‌ను సూచించే ప్రమాణంగా పెట్టుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామంది పిల్లల్లో టాన్సిల్స్‌ పెద్దవిగానే ఉండొచ్చు.

ఈ 'సోర్‌ త్రోట్‌' విషయంలో నూటికి 80 కేసుల్లో వైరస్‌లు కారణమైతే మిగిలిన 20 కేసుల్లో బ్యాక్టీరియా క్రిములు కారణం అవుతుంటాయి. బ్యాక్టీరియా కారణంగా తలెత్తిన గొంతునొప్పిని 'స్ట్రెప్‌ త్రోట్‌' అని వ్యవహరిస్తారు. దీనికి 'స్ట్రెప్టోకాకస్‌ హెమోలిటికస్‌' అనే బ్యాక్టీరియా కారణం. ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగానే కీళ్లవాపుతో కూడిన జ్వరం (రుమాటిక్‌ ఫీవర్‌), కిడ్నీ వాపు (గ్లోమరూలో నెఫ్రైటిస్‌) వంటి తీవ్ర సమస్యలూ చోటు చేసుకోవచ్చు. 'స్కార్లెట్‌ ఫీవర్‌'కూ ఇదే మూలం.

గొంతునొప్పికి కారణం వైరస్సా లేక బ్యాక్టీరియానా అన్నది నిర్ధారించటం కష్టతరమైన అంశం. దేనివల్ల వచ్చినా జ్వరం, నీరసం, ఆకలి మందగించటం, దగ్గు, మాట బొంగురుపోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా మూలంగానైతే త్వరగా గొంతు నొప్పి మొదలవుతుంది. ఈ బాధలకు గురైన వారికి పరీక్షలు జరిపి 'బీటా హెమోలిటికస్‌ స్ట్రెప్టోకాకస్‌' క్రిమిని గుర్తించటం జరిగింది. అయినా ఈ క్రిముల మూలంగానే గొంతునొప్పి వచ్చిందని చెప్పలేం. గొంతులో ఈ క్రిములున్నా నొప్పి లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. రోగులలో క్రిములకన్నా వారి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ప్రధానమైన అంశమన్నది గమనార్హం. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో కూడా నూటికి 10-20 మందిలో బీటా హెమోలిటికస్‌ క్రిములు కనిపిస్తాయి.

గొంతునొప్పి కేసుల్లో ఎక్కువ శాతానికి యాంటీబయాటిక్‌ ఔషధాలు నిరర్ధకం. వీరిలో చెవిలో చీము, మెడలో గ్రంథులు వాయటం, సైనసైటిస్‌, కీళ్ల వ్యాధులు, కిడ్నీల వాపు మొదలైన బాధలు చోటుచేసుకుంటాయి. వీటన్నింటి కారణంగా గొంతు వాపు (ఫారింజైటిస్‌) ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది.

వింటర్ సీజన్‌లో చాలామంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. వాతావరణం మారుతున్నప్పుడు గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటంవలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడంవల్ల, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతు నొప్పి వేధిస్తుంది. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్, లెరింజైటిస్, ఫెరింజైటీస్ వంటి వ్యాధుల వలన కూడా గొంతు నొప్పి రావొచ్చు.

లక్షణాలు :
ఆహారం మింగటం, నీరు త్రాగటం, గాలి పీల్చటం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురుపోవటం, గొంతు తడారిపోవటం, నోరు దుర్వాసన వస్తుంది. గొంతు నొప్పి, చెవినొప్పి జలుబుతో జ్వరం రావటం నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయ.

జాగ్రత్తలు :
చల్లటిగాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని త్రాగకుండా, కాచి వడపోసిన నీటిని తీసుకోవటం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీమ్‌లను, బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ల స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స  తీసుకోవాలి.

చికిత్స :
జ్వరానికి : పరాసిటమాల్ మాత్రలు 500 మి.గ్రా. రోజుకి 2 లేదా 3 మాత్రలు చొప్పున్న 3-5 రోజులు ,
ఇంఫెక్షన్‌ తగ్గడానికి : ఎరిత్రోమైసిన్‌ 250 మి.గ్రా. రోజుకి 3 సార్లు  3-5 రోజులు  ,
ఎక్కువగా మినరల్ వాటర్ త్రాగాలి ,
బిటాడిన్‌ మౌత్ వాస్ ద్రావకము తో గొంతు పుక్కలించాలి.
సాత్వికాహారము మాత్రమే తీసుకోవాలి ,
ఒక వారము రోజులు విశ్రాంతి తీసుకోవాలి .


ముసలి వాళ్ళలో :
ఆహారాన్ని సరిగ్గా మింగలేక పోవటం, సరిగ్గా మాట్లాడ లేకపోవటం, గొంతు బొంగుపోవటం, తెమడరావటం గొంతునొప్పి లక్షణాలు. ఇవి కనిపించినప్పుడు వృద్ధుల్ని వెంటబెట్టుకుని సంబంధిత డాక్టరుచేత చికిత్స చేయించాలి. ఆరోగ్యకర అలవాట్లను పాటించాలి. ఐసుముక్కలు, అతి చల్లని పదార్థాలు తీసుకోరాదు. అతి కారం, అతి మసాలా వస్తువుల్ని, పులుపు వస్తువుల్ని తక్కువగా వాడాలి.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.