Friday, December 21, 2012

What happens if Gallblader removed-పిత్తాశయాన్ని తొలగిస్తే ఏమవుతుంది?
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- పిత్తాశయాన్ని తొలగిస్తే ఏమవుతుంది?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవ శరీరంలో అతి చిన్న భాగాల్లో ఒకటిగా పిత్తాశయాన్ని చెప్పుకోవచ్చు. కడుపులో కుడి వైపున పై భాగంలో ఇది అమరి ఉంటుంది. కాలేయానికి కింది భాగంలో ఉండే సంచీ వంటి భాగం ఇది. ఒక రకంగా చెప్పాలంటే కాలేయానికి అనుసంధానంగా వ్యవహరించే భాగం అనుకోవచ్చు. ఎందుచేతనంటే కాలేయంలో నిరంతరాయంగా పైత్య రసం ఊరుతూ ఉంటుంది. ఇది అవసరం అరుునప్పు డల్లా జీర్ణ వ్యవస్థకు అందతూ ఉండాలి. అలాగని ఎల్లప్పుడు అక్కడ ఉంచటానికి వీల్లేదు. అందుచేత ఈ పైత్య రసాన్ని తాత్కాలికంగా నిల్వ ఉంచే ఒక సంచీ వంటి భాగం అవసరం. సరిగ్గా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించటమే పిత్తాశయం విధి.

-పైత్య రసంలో వాస్తవానికి ఎటువంటి ఎంజైములు ఉండవు. కానీ, జీర్ణక్రియకు సహకరించే రసాయనాలు ఇందులో ఉంటాయి. కొలెస్టిరాల్‌, బైలి రుబిన్‌ అనే రెండు పదార్థాలు ముఖ్య అనుఘటకాలు అనుకోవచ్చు. ఇందులో కొలెస్టిరాల్‌ అనేది కొవ్వుకు సంబంధించిన ఉత్పన్నకాలుగా చెప్పుకోవచ్చు. బైలిరుబిన్‌మాత్రం కాలేయంలో ఉత్పన్నం అవుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ లో కీలక పాత్ర వహించే ఎర్ర రక్త కణాలు శాశ్వతమైనవి కాదు. ప్రతీ ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు ఉంటుంది. ప్రతీ 120 రోజులకు ఒకసారి ఈ రక్త కణాలు శిథిలం అయిపోయి కొత్తవి పుట్టుకొని వస్తాయి. ఈ రక్త కణాలు శిథిలమయ్యే వేదికగా కాలేయం నిలుస్తుంది. నిరంతరాయంగా జరిగే ఈ ప్రక్రియ ఫలితంగా ఈ శిథిల పదార్థాలు కాలేయంలో ఒక చోట చేరతాయి. జీవ రసాయన చర్యల వలన ఇది బైలిరుబిన్‌గా మారుతుంది.

-ఈ రెండు సహజ సిద్దంగా ఉత్పన్నం అవుతుంటాయి. వీటి ఉత్పత్తి మామూలుగా ఉన్నంత కాలం అంతా సజావుగానే ఉంటుంది. కానీ ఈ రెండు అనుఘటకాలు ఎక్కువగా పోగు పడినప్పుడు మాత్రం సమస్య తప్పదు. సరిగ్గా ఆ పరిస్థితి తలెత్తినప్పుడే పిత్తాశయానికి ఇబ్బంది పుట్టుకొని వస్తుంది. ముందుగానే చెప్పిన ట్లుగా పిత్తా శయం అనేది కాలేయం స్రవించే పైత్య రసానికి తాత్కాలిక రిజర్వాయర్ గా పని చేస్తుంది. ఈ పైత్య రసం అక్కడ నిల్వ ఉన్నప్పుడు ఈ అనుఘటకాల వాటా పెరగటం సంభవిస్తుంది. అంటే కొలిస్టిరాల్‌కానీ, బైలిరుబిన్‌ కానీ ఎక్కువగా పేరుకొని పోతుంది. అటువంటప్పుడు ఈ పదార్ధాలు ఘన రూపంలోకి మారి రాళ్లుగా పరిణామం చెందుతాయి. కొలిస్టిరాల్‌ కానీ రాళ్లుగా మారితే కొలిస్టిరాల్‌ రాళ్లు అనీ, బైలిరుబిన్‌ ఘన పదార్థంగా మారితే పిగ్మెంట్‌రాళ్లు అని వ్యవహరిస్తారు.

-ఈ రెండు రకాల విభజన అన్నది పదార్థ స్వభావం ఆధారంగా చేసుకొన్నదే. రాళ్లు ఎంత పరిణామంలో ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, ఎంత ప్రదేశాన్ని ఆక్రమించాయి అన్న దాన్ని బట్టి వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. ఈ రాళ్లు కొన్నిసార్లు పిత్తాశయానికి పరిమితం కావచ్చు. మరి కొన్ని సార్లు ఇతర ప్రాంతాలకు అంటే పైత్య రస వాహిక లేదా చిన్న పేగులోకి వ్యాపించవచ్చు. అనేకసార్లు ఈ రాళ్లు పేరుకొనటం వలన పైత్య రస ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. దీంతో కడుపులో గడబిడ మొదలవుతుంది. అదే వ్యాధి రూపంలో బయట పడుతుంది. అప్పటిదాకా ఇటువంటి ఇబ్బంది ఉందన్న సంగతికూడా తెలియనే తెలియదు.

-అసలు ఈ రాళ్లు ఏర్పడటానికి నిర్దిష్టమైన పరిస్థితులు కారణం అనుకోలేం. ప్రధానంగా కొలిస్టిరాల్‌, బైలిరుబిన్‌, ఎక్కువగా పోగు పడటంతో రాళ్లు ఏర్పడవచ్చు. పైత రసంలో ఇతర పదార్థాల శాతం పెరిగిపోయినా ఇది తలెత్తవచ్చు. కాలేయ వ్యాధులు, రక్త ప్రసరణ వ్యాధులు తలెత్తినప్పుడు కూడా రాళ్లు వస్తుంటాయి. పైత్య రసం ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు కూడా దీన్ని గమనించవచ్చు. రాళ్ల తో నేరుగా వచ్చే ప్రమాదం కంటే ఇతర సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. పైత్య రసంతో కలిసినప్పుడు ఇన్‌ ఫెక్షన్‌ సోకే చాన్సు ఉంటుంది.

-పైత్యరసంలోని కొలిసిస్టిన్‌ ఎక్కువగా ఏర్పడినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో పాటు పిత్తాశయంలో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని కొలిసిస్టిటిస్‌ అని వ్యవహరిస్తారు. నొప్పి తీవ్రత ద్వారా దీన్ని గుర్తించవచ్చు. కుడి వైపు పై భాగంలో ఇది మొదలవుతుంది. తర్వాత కుడిపైపు స్కాప్యులా ఎముక ఉండే చోటికి వ్యాపించవచు. చాలాసార్లు వేపుళ్లు, నూనె దినుసులు, జంక్‌ ఫుడ్‌ తిన్న తర్వాత తలెత్తుతుంటుంది. కొద్ది పాటి జ్వరం, డయేరియా, వాంతులు, నాసియా వంటి లక్షణాల్ని కూడా గమనించవచ్చు. కొన్ని సార్లు పిత్తాశయం గోడల్లో వాపు గమనించవచ్చు. తీవ్రమైన కేసుల్లో నెక్రోసిస్‌, గోడల్లో ధ్వంసం జరగటాన్ని చూడవచ్చు. గోడలు వాపు ఏర్పడిన పరిస్థితిని సాధారణ కొలిసిస్టిటిస్‌ గా వ్యవహరిస్తారు. తర్వాత కాలంలో పిత్తాశయం లో కదలికలు బాగా మందగిస్తాయి. వ్యాధి ముదిరిన దశను తీవ్రతర కొలిసిస్టిటిస్‌ గా చెబుతారు.

-ఈ ఇన్‌ఫెక్షన్‌ క్లోమానికి సోకినప్పుడు పాన్‌ క్రియాటిటిస్‌ గా చెబుతారు. క్లోమంలో స్రవించే ఎంజైమ్‌ లు పేగుల్లోకి వచ్చి అక్కడ ఆహారాన్ని జీర్ణ ంచేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ ఎంజైమ్‌లు క్లోమంలోనే ఉండిపోయి అక్కడ పనిచేయటం మొదలు పెడతాయి. ముఖ్యంగా ట్రిప్సిన్‌ ఇటువంటి పనులకు పాల్పుడుతుంది. దీని వల్ల క్లోమంలోపలి గోడలు పాడై పోతాయి. క్రమంగా మొత్తం క్లోమం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే పాన్‌క్రియాటిటిస్‌ గా వ్యవహరిస్తారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం ద్వారా తలెత్తే ప్రధాన సమస్యల్లో ఇది రెండోది. ఇక, రాళ్ల సమస్య పెద్దది గా అయినప్పుడు ఇతర జీర్ణ భాగాలకు ఇబ్బది తలెత్తవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు పెద్ద గా వ్యాధి కారక లక్షణాలు చెప్పే పరిస్థితి లేదు. కానీ తీవ్రమైన నొప్పిని గుర్తించవచ్చు. ఈ నొప్పికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి.

-కడుపులో కుడి వైపున పై భాగంలో నొప్పి జనిస్తుంది. ఇది తీవ్రంగా ఉంటుంది. కొన్ని రోజులకు ఒక్కసారి, లేదా కొన్ని వారాలకు ఒక్కసారి బాధ పెడుతుంటుంది. భోజనం చేశాక అరగంట లేదా గంట తర్వాత ఇది మొద లు అవుతుంది. సాధారణంగా అర్థ రాత్రి ఈ నొప్పిని గమనించవచ్చు. ఒక గంట నుంచి ఐదు గంటల దాకా నొప్పి బాధిస్తుం టుంది. వ్యాధి ఒక్కోసారి వెనక్కి లేదా పై భాగంలోకి వ్యాపిస్తుంటుంది. అప్పుడప్పుడు దీంతో పాటు జ్వరం, వాంతులు, అజీర్ణం వంటి లక్షణాల్ని గమనించవచ్చు. ఈ నొప్పి వచ్చినప్పుడు రోగి విలవిల్లాడిపోతుంటాడు. అసహనం, చిరాకు పెరిగిపోతుంది కొన్ని సార్లు తట్టుకోలేనంతగా నొప్పి వచ్చేస్తుంటుంది. వె ల్లకిలా పడుకోవటం, పక్కకు ఒదగటం వంటి పనులు చేస్తుంటారు. తెల్ల వారు జాము సమయంలో ఈ నొప్పి ఉపశమిస్తుంటుంది.

-పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కడుపు నొప్పిని బట్టి సాధారణంగా గుర్తిస్తారు. దీని నిర్దారణ కోసం ఎక్సురే, అల్ట్రా సౌండ్‌పరీక్షలు అవసరం అవుతాయి. కొన్ని సార్లు సీటీ స్కాన్‌, ఈఆర్సీపీ పరీక్షలు చేయించాలి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆలస్యం చేయటం మంచిది కాదు.పిత్తాశయంలో రాళ్లను గుర్తించాక అది ప్రాథమిక దశలో ఉందా, లేక వ్యాధి తీవ్రం అవుతోందా అన్నది తేల్చుకొంటారు. చాలా ప్రాథమిక దశ అయినప్పుడు మందులతో వాటిని కరిగించేందుకు యత్నిస్తారు. లేని పక్షంలో కొలిసిస్టెక్టమీ అనే ఆపరేషను అవసరం అవుతుంది. పూర్వం కడుపుని కోసి ఈ ఆపరేషను చేయాల్సి వచ్చేది. ఇప్పుడు లాపరోస్కోపీ విధానంలో ఇది చాలా సురక్షితంగా మరియు తేలికగా మారింది. అంటే కడుపు లో 5-10 మిల్లీ మీటర్ల మందంలో చిన్నపాటి రంధ్రం చేస్తారు.

-అందులో ఒక సూదిని పంపుతారు. దీని చివర ఉండే చిన్నపాటి వీడియో కెమెరా ద్వారా కడుపులోపలి జీర్ణవ్యవస్థ బాగాలు ఎదురుగా ఉండే తెర మీద కనిపిస్తాయి. ఆ తెర మీద భాగాల్ని గమనిస్తూ పరిక రాల్ని కదుపుతూ ఆపరేషన్‌ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాళ్లను కరిగించేయటం సాధ్యం అవుతుంది. మరి కొన్ని సార్లు పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. మొత్తం మీద లాపరోస్కోపీ విధానం ద్వారా చాలా తేలిగ్గా సురక్షితంగా ఈ ఆపరేషన్‌పూర్తి చేయవచ్చని మాత్రం చెప్పవచ్చు.పిత్తాశయం లో చేసే ఈ ఆపరేషన్‌చాలా సురక్షితంగా తేలిగ్గా పూర్తి చేయవచ్చని గుర్తుంచుకోవాలి. ఆపరేషను పూర్తయితే మర్నాడే పేషంట్‌ను డిశ్చార్జ చేసేయచ్చు. తర్వాత ఇన్‌ ఫెక్షన్‌ ఏమైనా ఏర్పడిందా అన్న పరీక్షలు చేసి చెక్‌చేస్తారు. అంతటితో చికిత్స పూర్తవుతుంది. తర్వాత కాలంలో మాములూగా జీవనాన్ని సాగించవచ్చు. ఇది ఆధునిక టెక్నాలజీ తో కూడిన ఆపరేషన కాబట్టి నిపుణులైన సర్జన్‌ లతో చేయించుకోవటం మేలు.


-Courtesy with డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,M.S., M.Ch., (sgpgi)F.H.P.B., F.L.T.,(snuh)@Surya Telugu daily
(సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌-హైదరాబాద్‌)

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.