Friday, December 14, 2012

Coronary Artery diseases in young age awareness-చిన్న వయసులోనే గుండెకు గండం...అవగాహన  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చిన్న వయసులోనే గుండెకు గండం...అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇది గుండెజబ్బుల తీవ్రతను తెలిపే విషయం. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం కోసమే చాలా అవసరము .

‘ఫలానా వారికి గుండెజబ్బుట, గుండెపోటు వచ్చిందట’ అని వినిపించడం ఈమధ్య మామూలయిపోయింది. ఆ కబురు చెప్పీచెప్పగానే ఎదుటివారు ‘అరె... ఆయనది చిన్న వయసే కదా’ అని స్పందించడం కూడా ఎక్కువయ్యింది. అంటే... గుండెజబ్బులు ఒక వయసు దాటిన తర్వాత వస్తాయనేది గతంలోని అభిప్రాయం. అభిప్రాయాలు వేరు... అనుభవాలు వేరు. అనుభవం వల్ల అభిప్రాయాలు మారతాయి. గుండెజబ్బుల గురించి ఇటీవల జరుగుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులు, ఇతరులతో పోలిస్తే మన దేశవాసుల్లో స్వతహాగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు... అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండటం కోసం ఉపయోగించే మార్జరిన్ వంటి నూనెలు, కొవ్వులు ఉండే పదార్థాలు వాడటంతో పాటు ఇటీవల శరీరంలో ఎక్కువగా కదలికలు లేని తరహా వృత్తులు పెరగడం, దాంతో శరీరానికి అవసరమైన కొద్దిపాటి కదలికలు కూడా లేకపోవడంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఈ గుండెజబ్బుల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తున్న సంఘటనలూ ఎక్కువగా చూస్తున్నాం.

  • నివారణ ఇలా...
వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి.

పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే.

అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.

  • నడుం కొలత కూడా ఒక సూచనే...
మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి.

పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.

  • మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్
రక్తపోటు (హైబీపీ) అనే అంశం కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.
గుండెజబ్బులకు దారితీసేందుకు దోహదం చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో అత్యంత ప్రధానమైనది డయాబెటిస్.
దూమపానం మరో పెద్ద రిస్క్ ఫ్యాటర్.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇటీవల పెరిగింది. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా పెరుగుతోంది.
ఇటీవల చిన్న వయసులో స్థూలకాయం వస్తుండటం మన దేశ వాసుల్లో పెరుగుతోంది. ఈ అంశం కూడా చిన్నవయసులో వచ్చే గుండె సమస్యలకు దారితీస్తోంది.
ఒత్తిడి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ఓ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.కాబట్టి వీలైనంత వరకు మితిమీరిన ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం.
కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉంటే వంశపారంపర్యం అనే అంశాన్ని ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు.
మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం కూడా పెరగడంతో గుండెజబ్బులు ఎక్కువగా బయటపడుతున్నాయి.
ఇటీవల నగరీకరణ పెరగడంతో జీవనశైలిలోని మార్పులు అంటే పనిగంటలు, పనుల్లో ఒత్తిడి పెరగడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి వాటి వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి.
ఈ తరం వృత్తులలో ఎక్కువగా శరీరానికి పెద్దగా అలసట కలిగించనివే ఉంటున్నాయి. ఫలితంగా దేహానికి తగినంత వ్యాయామం ఉండట్లేదు. దీంతో చిన్న వయసులోనే హార్ట్ డిసీజెస్, హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి.

  • ఈ జాగ్రత్తలు తీసుకోండి...
నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం.
శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి.
వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి.
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు.
ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది.
మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి.
అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.

--Courtesy with Dr.Premchand MD.DM ,Sunshine hos.Hyd.@saakshi Telugu news paper.
         

  • =================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.