Saturday, December 22, 2012

islet cell transplantation in Diabetes-మధుమేహం లోఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత •  image : courtesy with Eenadu news paper @sukhibhava


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - islet cell transplantation in Diabetes-మధుమేహం లోఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మధుమేహం.. ప్రపంచాన్ని కమ్ముకొస్తున్న ఈ ఆధునిక ఉపద్రవాన్ని జయించేదెలా? అయితే మందులు.. లేదంటే ఇన్సులిన్‌! ఈ రెండేనా మార్గాలు?
విజ్ఞానశాస్త్రం అనూహ్యవేగంతో విస్తరిస్తున్న ఈ ఆధునిక కాలంలో కూడా మధుమేహం విషయంలో మన వైద్య పరిశోధనా రంగం అంతగా పురోగతి సాధించ లేదనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34.6 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇక మన భారతదేశం సంగతి చెప్పనే అవసరం లేదు. దాదాపు 6 కోట్ల మంది మధుమేహులతో ప్రపంచంలోనే మనం అతి పెద్ద బాధిత దేశంగా ముందు వరుసలో నిలబడ్డాం. 2030 నాటికి మన దేశంలో ఈ బాధితుల సంఖ్య 9% దాటిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా.. అది అనూహ్యంగా పెరుగుతున్నా.. నిత్యం కోట్లాది మంది మధుమేహం తెచ్చిపెట్టే రకరకాల దుష్ప్రభావాలతో తల్లడిల్లిపోతున్నా.. ఇప్పటికీ ఈ చక్కెర వ్యాధి విషయంలో విప్లవాత్మకమైన చికిత్సా విధానాలేవీ అందుబాటులోకి రాకపోవటం విషాదకర వాస్తవం. బెస్ట్‌, బాంటింగ్‌ శాస్త్రవేత్తలు ఎప్పుడో 1922లో ఇన్సులిన్‌ను ఆవిష్కరించారు. అప్పటి నుంచీ అది సంజీవనిలా కోట్లాది జీవితాలను
ఆదుకుంటున్న మాట వాస్తవమే అయినా... ఈ తొంభై ఏళ్లలో మనం సాధించిన ఘనత ఏమంటే ఈ ఇన్సులిన్‌ను నిరంతరం, సమర్థంగా ఇచ్చేందుకు అనువైన 'పంప్‌'లను ఆవిష్కరించుకుని, వాటిని శరీరానికి తగిలించుకునే స్థాయికి చేరుకోవటం. అంతకు మించి చెప్పుకోదగిన స్థాయి విజయాలేం లేవు. అయితే ఈ స్తబ్ధతను చీల్చుకుంటూ 90వ దశకం మధ్య నుంచీ 'ఐలెట్‌ కణాల మార్పిడి' మీద ప్రత్యేక దృష్టి ఆరంభమైంది. క్లోమగ్రంథిలో ఉండి, మన శరీరంలో నిరంతరం సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుండే ఐలెట్‌ కణాలను- మరొకరి నుంచి ఏ ఇబ్బందీ లేకుండా మార్పిడి చెయ్యగలిగితే అంతకు మించిన విజయం మరోటి ఉండదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఐలెట్‌ కణాల మార్పిడిపై విస్తృతంగా పరిశోధనలూ, ప్రయోగాలూ సాగుతున్నాయి. ఈ కణాల మార్పిడి విషయంలో అంతర్జాతీయంగా పరిశోధకులంతా కూడా ఎన్నో పరిమితులను, ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమంటే తాజాగా హైదరాబాద్‌లోని 'ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)' పరిశోధకులు ఈ దిశగా ఓ కీలకమైన ముందడుగు వేయబోతున్నారు. సులభంగా,
సమర్థంగా ఐలెట్‌ కణాల మార్పిడికి అవసరమైన విధానాన్ని ఆవిష్కరిస్తూ ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు పూర్తి చేశారు. మనుషులపైనా విజయవంతమైన ఫలితాలను రాబట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈ సందర్భంగా అసలు ఐలెట్‌ కణాల మార్పిడి ప్రత్యేకత ఏమిటి? దీనిలో ఎదురయ్యే సాధక బాధకాలేమిటి? తెలియ జేసే విధానమే ఈ వ్యాసము
 • ఐలెట్‌ కణాలే కీలకం
మధుమేహానికి మూలం క్లోమగ్రంథి. చూపుడువేలు ఆకారంలో.. మన పొట్టలో ఎక్కడో జీర్ణాశయం వెనకాలగా నక్కినట్టుండే ఈ గ్రంథి మన శరీరంలో అత్యంత కీలకమైన 'ద్విపాత్రాభినయం' చేస్తుంటుంది. ఒకటి- మనం తిన్న ఆహారంలోని కొవ్వులు, మాంసకృత్తుల వంటివాటిని  అరిగించుకునేందుకు అవసరమైన 'జీర్ణ రసాలను' ఉత్పత్తి చెయ్యటం. రెండోది- మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చటంలో కీలక పాత్ర పోషించే ఇన్సులిన్‌ వంటి హార్మోన్లను ఉత్పత్తి చెయ్యటం. దీనికి ప్రధానంగా క్లోమ గ్రంథిలో ఉండే 'ఐలెట్‌ కణాల సముదాయం' (ఐలెట్స్‌ ఆఫ్‌
ల్యాంగర్‌హాన్స్‌) మూలం. ఈ ఐలెట్‌ కణాలు క్లోమ గ్రంథి అంతటా వ్యాపించి ఉంటాయి. వీటిలో- బీటా, ఆల్ఫా, డెల్టా, పీపీ, ఎప్సిలాన్‌ వంటి చాలా రకాలున్నాయి. ఒక్కో రకం కణం వేర్వేరు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. ఉదాహరణకు మొత్తం ఐలెట్‌ కణాల్లో 60% వరకూ ఉండేవి బీటా కణాలు. ఇవి ఇన్సులిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. అలాగే ఆల్ఫా కణాలు గ్లూకోగాన్‌ అనే హార్మోన్‌ను, డెల్టా కణాలు సొమటోస్టాటిన్‌, పీపీ కణాలు పాంక్రియాటిక్‌ పాలీపెప్త్టెడ్‌, ఎప్సిలాన్‌ కణాలు ఘ్రెలిన్‌ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఐలెట్స్‌లో ఇంకా ఇతర కణాలూ ఉంటాయి కానీ వాటికంత ప్రాముఖ్యత లేదు. ఈ ఐలెట్‌ కణాలు ప్రధానంగా రక్తంలో గ్లూకోజు మోతాదు 80-120 మధ్య ఉండేలా నియంత్రిస్తుంటాయి.బీటా కణాలకు అత్యంత సున్నితమైన గ్రాహకాలుంటాయి. ఇవి నిరంతరం మన రక్తంలో గ్లూకోజు మోతాదును గమనిస్తుంటాయి. ఒకవేళ గ్లూకోజు మోతాదు 120 కన్నా పెరుగుతుంటే వెంటనే గుర్తించి, ఇన్సులిన్‌ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. అదే గ్లూకోజు స్థాయి 80 కన్నా తగ్గితే ఇన్సులిన్‌ ఉత్పత్తిని వెంటనే నిలుపుచేస్తాయి. ఈ ప్రక్రియ అంతా కూడా ఒక క్రమపద్ధతిలో, నిరంతరం జరుగుతుంటుంది. అయితే ఒక్క బీటా కణాలే కాదు.. మిగతా కణాలు ఉత్పత్తి చేసే గ్లూకోగాన్‌, సొమటోస్టాటిన్‌,పాలిపెప్త్టెడ్‌ వంటివీ గ్లూకోజు మోతాదును ఎంతోకొంత నియంత్రిస్తూనే ఉంటాయి. మధుమేహుల్లో (టైప్‌-1) ప్రధానంగా ఈ ఐలెట్‌ కణాలు దెబ్బతింటాయి. వీరికి మనం ప్రస్తుతం బయటి నుంచి కీలకమైన ఇన్సులిన్‌ హార్మోన్‌ ఒక్కటీ ఇవ్వగలుగుతున్నాంగానీ మిగతా వాటి విషయంలో ఏమీ చెయ్యలేకపోతున్నాం. వాస్తవానికి వీరికి ఐలెట్‌ కణాలు విడుదల చేసే అన్ని రకాల హార్మోన్లూ అవసరమే. కాకపోతే మిగతా వాటిని ఎలా ఇవ్వాలో తెలియదు కాబట్టి అత్యంత కీలకమైన ఇన్సులిన్‌ ఒక్కటీ ఇచ్చి ఊరుకుంటున్నాం. ఈ కోణం నుంచి చూసినప్పుడు దెబ్బతిన్న ఐలెట్‌ కణాల స్థానాన్ని తిరిగి ఐలెట్‌ కణాలతో భర్తీ చెయ్యటం, వాటిని మార్పిడి చెయ్యటం అత్యుత్తమ విధానమని గుర్తించి, వైద్యపరిశోధనా రంగం ఎప్పటి నుంచో ఈ దిశగా కృషి చేస్తోంది.

 • మార్పిడి ఎవరికి ఉపయోగం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మధుమేహం 4 రకాలు.
 • టైప్‌-1: మనలోని రోగనిరోధక వ్యవస్థ మన క్లోమంపైనే దాడి చేయటం వల్ల ఐలెట్‌ కణాలు దెబ్బతినిపోయి.. ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోయే రకం ఇది. ఈ రకం సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 • టైప్‌-2: ఎక్కువగా పెద్దల్లో కనిపించే రకం ఇది. వీరిలో ఐలెట్‌ కణాలు పని చేస్తూనే ఉంటాయి, ఇన్సులిన్‌ తయారవుతూనే ఉంటుందిగానీ అది సమర్థంగా, ప్రభావవంతంగా ఉండదు. ముఖ్యంగా వీరి శరీర కణజాలంలో ఇన్సులిన్‌ నిరోధకత (ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌) పెరగటం వల్ల- ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతూనే ఉన్నా అది సమర్థంగా వినియోగం అవుతుండదు. ఇలా పది, పదిహేనేళ్లు గడిచాక ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి, చివరికి తగ్గిపోతుంది. 
 • టైప్‌-3: క్లోమ గ్రంథికి దెబ్బలు తగలటం, పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధులకు గురికావటం వంటి వాటి మూలంగా వచ్చే మధుమేహం ఇది.
 • టైప్‌-4: గర్భిణుల వంటి వారిలో తాత్కాలికంగా మధుమేహం వచ్చి, తర్వాత తగ్గిపోతుండే రకం ఇది.

వీరిలో టైప్‌-1 మధుమేహుల్లో ఐలెట్‌ కణాలు పూర్తిగా దెబ్బతింటాయి కాబట్టి వీరికి ఐలెట్‌ కణాల మార్పిడి బాగా ఉపయోగపడుతుంది. ఐలెట్‌ కణాలను మార్పిడి చేస్తే అవి వెంటనే పని చేయటం ఆరంభిస్తాయి. అలాగే క్లోమగ్రంథి దెబ్బతినటం వల్ల మధుమేహం బారినపడే టైప్‌-3 వారికీ ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.ఇక టైప్‌-2 రకం వారికీ మున్ముందు ఐలెట్‌ కణాల మార్పిడి ప్రక్రియ అందుబాటులోకి రావొచ్చు. ఎందుకంటే ఈ టైప్‌-2 బాధితుల్లోనూ చివరిదశలో ఐలెట్స్‌ దెబ్బతింటాయి. అందువల్ల వీరికీ వీటి అవసరం ఉంటుంది.
 • మార్పిడి పద్ధతేమిటి?
1. స్వీయ కణ మార్పిడి పద్ధతి: పాంక్రియాటైటిస్‌ వంటి వ్యాధుల బారిన పడిన వారికి- ఒక్కోసారి క్లోమ గ్రంథిని తొలగించాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తొలగించిన క్లోమం నుంచి ఐలెట్‌ కణాలను వేరుచేసి, వాటిని తిరిగి అదే వ్యక్తి శరీరంలో ఎక్కించవచ్చు. ఇందులో ఆ ఐలెట్‌ కణాలు తమవే కాబట్టి వాటిని వారి శరీరం తిరస్కరించటం వంటి ఇబ్బందులేమీ ఉండవు. అమెరికాలోని మినెసోటా వంటి విశ్వవిద్యాలయాల్లో ఈ రకం మార్పిడి ఎక్కువగా చేస్తున్నారు.
2. ఇతరుల నుంచి మార్పిడి పద్ధతి: మన శరీరంలో ఇతర అవయవాలకూ, క్లోమానికీ చాలా తేడా ఉంది. కాలేయం నుంచి కొంత భాగం తొలగిస్తే అది మళ్లీ తిరిగి పెరుగుతుంది, కాబట్టి దాతల నుంచి కాలేయం ముక్క తీసుకుని మార్పిడి చేసే అవకాశం ఉంది. అలాగే రెండు కిడ్నీల్లో ఒకదాన్ని దాత నుంచి తీసుకుని మార్పిడి చెయ్యచ్చు. కానీ క్లోమంతో ఇలా సాధ్యం కాదు. క్లోమం నుంచి చిన్న ముక్క తీసినా సరే.. పాంక్రియాటైటిస్‌ వంటి తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి జీవించి ఉన్న వారి నుంచి ఐలెట్‌ కణాలను సేకరించటం కష్టం. అందుకే ప్రమాదాల
వంటి వాటి బారినపడి జీవన్మృతులైన (బ్రెయిన్‌డెడ్‌) వారి నుంచి క్లోమాన్ని సేకరించి, వారి ఐలెట్‌ కణాలను మార్పిడి చేసే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'కెడావర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌' అంటారు. ఈ రకం ఐలెట్‌ కణాల మార్పిడి టైప్‌-1 మధుమేహ బాధితులకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి ఇతరుల నుంచి సేకరించిన ఐలెట్‌ కణాలు కాబట్టి వీటిని మన శరీరం ఆమోదించకుండా తిరస్కరించే
ప్రమాదముంది. కాబట్టి తిరస్కరించకుండా చూసేందుకు- మనలోని రోగనిరోధకశక్తిని అణిచిపెట్టి ఉంచేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి సేకరించే ఐలెట్లతో ఇదే కాదు, మరో ఇబ్బందీ ఉంది. ఒక వ్యక్తికి- ఒక జీవన్మృతుడి నుంచి సేకరించిన ఐలెట్‌ కణాలే సరిపోకపోవచ్చు. చాలినన్ని ఐలెట్‌ కణాలు కావాలంటే- కనీసం రెండు పాంక్రియాస్‌లు అవసరమవ్వచ్చు. జీవన్మృతుల అవయవదానం అన్నది ఇంకా అంతగా ప్రాచుర్యంలోకి రాని మన దేశంలో ఒక వ్యక్తికి రెండు పాంక్రియాస్‌లు దొరకటం కొంత కష్టంతో కూడుకున్న పని.
 • కణాలు ఎలా తీస్తారు?
క్లోమగ్రంథి చాలా సున్నితమైనది. కాబట్టి దీన్ని దాత నుంచి చాలా జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది. దాత శరీరం నుంచి క్లోమాన్ని బయటకు తీసిన తర్వాత ప్రత్యేకమైన పద్ధతిలో ఐలెట్‌ కణాలను వేరుచేస్తారు. ముందు ఆ క్లోమం లోకి ఇంజెక్షన్‌ ద్వారా 'కొలాజెనేస్‌' అనే ద్రావణాన్ని ఎక్కిస్తారు. దీంతో క్లోమంలోని ఐలెట్‌ కణాలు వేరవుతాయి. అప్పుడు ఆ క్లోమాన్ని ముక్కలు చేసి 'రికార్డి ఛాంబర్‌' అనే పరికరంలో ఉంచుతారు. ఇందులో ఐలెట్‌ కణాలు పూర్తిగా వేరుపడి, బయటకు వస్తాయి. వీటిని శుద్ధి చేసి, మార్పిడికి తగినట్లుగా సిద్ధం చేస్తారు.
 • మార్పిడి చేసేదెలా?
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానం- శుద్ధిచేసి సిద్ధంగా ఉన్న ఐలెట్‌ కణాలను- కాలేయానికి రక్తం తీసుకువెళుతుండే కీలకమైన 'పోర్టల్‌ సిర'లోకి నేరుగా ప్రవేశపెట్టటం. ఇలా ప్రవేశపెట్టిన కణాలు ఆ పోర్టల్‌ సిర నుంచి ముందు కాలేయంలోకి చేరుకుని, కాలేయం కణాల మధ్య కుదురుకుంటాయి. ఎక్కించిన ఓ పది రోజుల్లో ఇవి పని చేయటం.. అంటే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చెయ్యటం ఆరంభిస్తాయి. రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. వీటి నుంచి విడుదలైన ఇన్సులిన్‌ కాలేయం నుంచి బయటకు వచ్చే రక్తం ద్వారా ఇతర భాగాలకు ప్రసరిస్తుంది. మినెసోటా యూనివర్సిటీతో సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా కొద్ది కేంద్రాల్లో ఈ విధానంలోనే మార్పిడి చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 700 మందికి ప్రయోగాత్మకంగా మార్పిడి చేశారు. మార్పిడి తర్వాత వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి బాగుంటోంది, బయటి నుంచి ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండటం లేదు కూడా. కాకపోతే ఈ విధానంలో ఉన్న ఇబ్బందేమంటే- ఇలా కాలేయంలోకి మార్పిడి చేసిన ఐలెట్‌ కణాలు ఓ రెండేళ్లలోనే 50% వరకూ పనిచేయటం ఆపేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లు గడిచే సరికి వీటి పనితీరు పూర్తిగా నిలిచిపోతోంది. దీంతో మధుమేహ నియంత్రణ కోసం మళ్లీ ఇన్సులిన్‌ తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతోంది. ఇవి దీర్ఘకాలం ఎందుకు పని చేయటం లేదన్నది పరిశీలించినప్పుడు ప్రధానంగా కాలేయంలో... క్లోమంలో మాదిరి వాతావరణం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ ఈ కణాల మీదా దాడి చేసి, వీటి పనితీరు దెబ్బతీస్తుండవచ్చు. అందుకే ఇప్పటి వరకూ ఐలెట్‌ కణాల మార్పిడి అన్నది వేగంగా ముందుకు పోవటం లేదు. దీనికి విరుగుడుగా ఇప్పుడు 'ఏషియన్‌
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ' పరిశోధకులు వినూత్న విధానానికి తెర తీశారు. ఈ ఐలెట్‌ కణాలను నేరుగా లివర్‌లోకి ప్రవేశపెట్టటం కాకుండా.. వాటిని 'థెరసైట్‌' అనే ఒక చిన్న తిత్తిలో ఉంచి.. చర్మం కింద అమర్చటం ఈ విధానం ప్రత్యేకత. ఇలా థెరసైట్లను ఇతర అవసరాలకు ఇప్పటికే వాడుతున్నారు. వాటిని ఐలెట్‌ కణాల మార్పిడికి వినియోగించటం 'ఏఐజీ' పరిశోధకుల కృషి. రెండు అంగుళాల పొడవు, అరంగుళం వెడల్పుండే ఈ తిత్తి పైన పల్చటి పొర (మెంబ్రేన్‌) ఉంటుంది. ఇది స్రావాలను మాత్రం అటూఇటూ పోనిస్తుందిగానీ దీనిగుండా కణాలు మాత్రం పోలేవు. అందుకే ఐలెట్‌ కణాల నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌, ఇతర హార్మోన్లు దీని గుండా బయటకు వస్తాయి, ఐలెట్‌ కణాలు మాత్రం బయటకు రాలేవు. దీన్ని శరీరంలో ఎక్కడైనా అమర్చొచ్చు. వీపు భాగంలో అమరిస్తే ఫలితాలు మరింతగా బాగుంటున్నాయని గుర్తించారు. ఈ థెరసైట్‌ను చర్మం కింద అమర్చిన వెంటనే కణాలకు అవసరమైన రక్త సరఫరా జరుగుతుంది. పోషకాలు అందుతాయి. ముఖ్యంగా- ఈ తిత్తిలోకి కణాలేవీ వెళ్లలేవు కాబట్టి మన రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలూ లోపలికి వెళ్లలేవు, ఐలెట్‌లపై దాడి చెయ్యలేవు. కాబట్టి ఈ విధానంలో రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచేందుకు 'ఇమ్యూనో సప్రసెంట్‌' మందులనూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐలెట్‌ కణాల నుంచి ఇన్సులిన్‌తో పాటు సొమటోస్టాటిన్‌, గ్లూకోగాన్‌ వంటి ఇతర హార్మోన్లు కూడా విడుదల అవుతాయి.

 • తొలిసారి మనుషులకు!
ఐలెట్‌ కణాల మార్పిడి అన్నది మన దేశంలో ఇంత వరకూ ఎవరూ చేయలేదు. దీనిపై 'ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ' పరిశోధకులు కొంతకాలంగా లోతుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఐలెట్‌ కణాలను ఉంచిన థెరసైట్‌ను కోతులకు అమర్చి చూశారు. మంచి ఫలితాలు వెలువడ్డాయి. అమర్చిన ఏడాది తర్వాత కూడా ఐలెట్‌ కణాలు సమర్థంగా పని చేస్తుండటమేకాదు.. వాటి సంఖ్య పెరుగుతోందనీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి కూడా మెరుగవుతోందని గుర్తించారు. దీనిపై పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఫలితాలు బాగుండటంతో దీన్ని ప్రయోగాత్మకంగా మనుషులకూ అమర్చి చూసేందుకు మార్గం సుగమమైంది, 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ' అనుమతించింది. దీంతో ఏఐజీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఈ మార్పిడి ప్రక్రియను చేపడుతున్నారు. కోతులపై ఫలితాలను బట్టి చూస్తే ఈ విధానం విజయవంతమైన ఫలితాలను ఇవ్వటం తథ్యమని భావిస్తున్నారు.
 • లాభాలేమిటి?
* ఇన్సులిన్‌ తీసుకునేవారిలో 20% మందిని తరచుగా 'సుగర్‌ పడిపోవటం' (హైపోగ్త్లెసీమియా) సమస్య వేధిస్తుంటుంది. ముఖ్యంగా టైప్‌-1 బాధితుల్లో ఇది మరీ ఎక్కువ. ఇలాంటి వారికి ఐలెట్‌ కణాల మార్పిడి బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఈ ప్రక్రియ అంతగా అందుబాటులో లేకపోవటం వల్ల ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు థెరసైట్‌ విధానంలో రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందుల అవసరమూ లేకపోవటం మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. పైగా ఐలెట్‌ కణాల మార్పిడిలో ఇతర హార్మోన్లను విడుదల చేసే కణాలూ ఉంటాయి. ఇవన్నీ కూడా మధుమేహ నియంత్రణకు తోడ్పడతాయి.

* మధుమేహ నియంత్రణకు ఇన్సులిన్‌ తీసుకుంటున్నా కూడా దీర్ఘకాలంలో కిడ్నీలు, కళ్ల సమస్యల వంటి సూక్ష్మరక్తనాళాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఐలెట్‌ కణాల మార్పిడితో ఈ తరహా దుష్ప్రభావాలను సమర్థంగా నివారించుకోవటం సాధ్యమని వెల్లడైంది.

* థెరసైట్‌ ప్రక్రియలో థెరసైట్‌ తిత్తిని కేవలం చర్మం కిందే అమరుస్తుండటం వల్ల ఒకవేళ భవిష్యత్తులో ఐలెట్‌ కణాలు తగ్గిపోయినా చాలాతేలికగా కొత్తవాటిని తిత్తిలోకి ఇంజెక్ట్‌ చేసే వీలుంటుంది.

* కడుపులోని కొవ్వు కణాల నుంచి మూలకణాలు తీసి, వాటిలోంచి ఐలెట్‌ కణాలను సృష్టించటంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మున్ముందు అందుబాటులోకి రావొచ్చు. వీటిని కూడా థెరసైట్‌ ద్వారా ఇవ్వొచ్చు.

థెరసైట్‌ తరహాలోనే న్యూజిలాండ్‌లో 'మైక్రో క్యాప్సూల్‌' అనే పద్ధతినీ రూపొందించారు. దీన్ని కూడా శరీరంలో ఎక్కడైనా ప్రవేశపెట్టొచ్చు. కాకపోతే అందులో పందుల నుంచి తీసిన ఐలెట్‌ కణాలను వినియోగిస్తున్నారు. పందుల కణాలను అమరిస్తే రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని తప్పించేందుకు వాళ్లు క్యాప్సూల్‌ వాడుతున్నారు. థెరసైట్‌ పద్ధతిలోనూ పందుల నుంచి తీసిన కణాలను వాడితే, రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులను వాడాల్సిన అవసరం ఎలాగూ ఉండదు కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

 • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.