వర్షాకాలంలో దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యు, చికున్ గున్యా జ్వరాలే కాక శ్వాసకోశ సంబంధ వ్యాధులు బాధిస్తాయి. వేధిస్తాయి. ఒకపట్టాన తగ్గవు. వస్తే వారం, పది రోజులుంటాయి. తమకు వచ్చింది జలుబు, ఆస్తమా, అలర్జీ, న్యుమోనియా అని గుర్తించడంలో రోగి విఫలమవుతాడు. మామూలు జలుబే కదా అని మందుల షాపువాడు ఇచ్చిన మందులతో సరిపెట్టుకుంటారు. కానీ ఈ సమయంలోనే వైద్యున్ని సంప్రదించాలి. దీని వల్ల వ్యాధి ఎక్కడా, ఏ దశలో ఉంది తెలుసుకుని కచ్చిమైతన చికిత్స అందేఅవకాశముంది.... ఆ వివరాలు
ముందు గొంతు నొప్పి మొదలై జలుబులాగా మారుతుంది. తర్వాత కొన్ని రోజుల దాకా పొడి దగ్గు, తెమడతో దగ్గు వస్తుంది. జ్వరంతోనూ, జ్వరం లేకుండా, గొంతులో ఇన్‌ఫెక్షన్, సైనస్ ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. సాధారణంగా ఇవి వారం లేదా పదిరోజుల్లో తగ్గుతాయి. ఆస్తమా ఉన్నవారిలో ఇవి ఎక్కువ రోజులుంటాయి.
ఈ సీజన్‌లోనే ఎందుకు?
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమశాతం ఎక్కువే. సీజన్ మారుతుంది. తేమ వల్ల వైరస్‌లు వృద్ధి చెందుతాయి. సీజన్ వీటికి అనుకూలం. వేసవిలోని వేడివల్ల ఇవి నియంత్రణలో ఉంటాయి. అంతేకాక వర్షాకాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వృద్ధిచెందుతాయి . దీని వల్ల ఎక్కువ మంది వీటిబారిన పడతారు. ఇక ఆస్తమా ఉన్నవారిలో జలుబు వర్షాకాలంలో కాలుష్యం ఎక్కువై వీరిలో సమస్యలు తీవ్రమవుతాయి.
గొంతునొప్పి : ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో మొదలైవుతుంది. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ను చంపడానికి రోగనిరోధక శక్తిపనిచేస్తుంది. అందుకే గొంతునొప్పి ఉన్నప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. మంచి నిద్ర అవసరం. చల్లటి పదార్థాలు తీసుకోకుండా వేడి పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మందులు లేకుండానే గొంతునొప్పి తగ్గుతుంది. కానీ మనం పని ఒత్తిడి వల్ల విశ్రాంతి తీసుకోలేం. దీంతో మన రోగనిరోధక శక్తి తగ్గి సెకండరి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశముంది. ఫలితంగా దగ్గు, ఛాతిలో ఇన్‌ఫెక్షన్ వస్తాయి. గొంతు నొప్పికి కారణం 90 శాతం వైరల్ ఇన్‌ఫెక్షన్లు, 10 శాతం బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లే. మన పీల్చేగాలిలో ఈ వైరస్‌లు ఎక్కువుంటాయి. పీల్చేగాలిలో, తీసుకునే ఆహారం ద్వారా ఇవి లోపలికి వ వెళ్తాయి.
అలర్జీ : ఇది రకరకాలుగా ప్రభావితం చేస్తుంది. ముక్కు కారడం, పొద్దున్నే చల్లగాలి తగిలినా, దుమ్ము పీల్చినా తుమ్ములు వస్తాయి. ముక్కు బ్లాక్ అవుతుంది. తలనొప్పి ఉంటుంది. గొంతు గులగా ఉంటుంది. పొడి దగ్గు రాత్రిపూట ఎక్కువుంటుంది. ఇవీ అలర్జీకి చిహ్నాలు.
ఆస్తమా : వేసవి కాలంలో చాలా తక్కువ మందిలోనే ఆస్తమా ఇబ్బంది కలిగిస్తుంది. చాలా మందిలో వర్షాకాలంలోని చల్లటి వాతావరణం, కాలుష్యం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఆస్తమ ఉన్నవారిలో ఇబ్బంది క్రమంగా తీవ్రమవుతుంది. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు. ఫీనోటైప్స్ ను బట్టి ఆస్తమా ఇబ్బంది రకరకాలుగా వ్యక్తమవుతుంది. కొంత మందిలో ఆస్తమా ఉన్న వారిలో ఆయాసం ఉండకపోవచ్చు. దగ్గు రూపంలో వస్తుంది. దీన్ని 'కాఫ్ వేరియంట్ ఆస్తమా' అంటారు. నాకు ఆయాసం లేదు, పిల్లికూతలు రావడం లేదు, ఆస్తమా కాదు దగ్గు ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే దీన్ని ఆస్తమాగా పరిగణించాల్సి ఉంటుంది. కొంత మందిలో నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసం ఉంటుంది. సీజన్ మారగానే రాత్రిపూట ఛాతిపట్టేసినట్టు ఉంటుంది. ఎమర్జెన్సీ అటాక్స్ వస్తాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే జలుబు వారం రోజులు పది రోజుల్లో తగ్గాలి. తగ్గకుంటే జలుబు కాదు ఎలర్జీ అనీ, ముక్కు కారుతుంది అని భావిస్తే ఆస్తమా ఉన్నట్లు భావించాలి. ఆస్తమా ఉన్నవారి ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు సెన్సిటివ్‌గా ఉంటాయి. బయటి వాతావరణంలోని వైరస్‌లోపలికి ప్రవేశిస్తే వేగంగా ప్రతిస్పందిస్తాయి. కొంత మందికి రంగుల, సెంట్, పూల వాసన పడదు. దీన్ని పీలిస్తే వారికి ఆస్తమా తీవ్రమవుతుంది. ఎందుకంటే పిల్చినప్పుడు లోపలికి వెళ్లిన గ్యాస్ ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాలను మూసేస్తుంది. దీంతో గొట్టాలు ముడుచుకుని వెంటనే ఆస్తమా అటాక్ వస్తుంది. చల్లటి పదార్థాలు, పుల్లటి పదార్థాలు తీసుకునే వారిలో ఆస్తమా పెరిగే అవకాశముంది. ఘాటైన వాసన పడదు.
న్యుమోనియా : ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్ తర్వాత మొదలవుతుంది. విశ్రాంతి, నిద్రలేకుండా ఒత్తిడికి గురైనప్పుడు, ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉంటే వైరల్ ఇన్‌ఫెక్షన్ తీవ్రమవుతుంది. న్యుమోనియా అంటే ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్. చిన్న పిల్లలో, వృద్ధుల్లో ఇది సాధారణం. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువుంటుంది కాబట్టి. న్యుమోనియా ఉన్నవారిలో హైగ్రేడ్ ఉష్ణోగ్రత, చలి, దగ్గు, వణుకు, కొంత మందిలో తెమడ రావొచ్చు, ఇంకొంత మందిలో రాకపోవచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలవుతాయి. జలుబు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో జ్వరం తగ్గక, దగ్గు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. నిమోనియా లక్షణాలున్నాయో పరీక్షించుకోవాలి.
ఆస్తమా-న్యుమోనియా
ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలపై ప్రభావం ఉంటుంది. గొట్టాలు ముడుచుకుపోవడం వల్ల గాలి పీల్చుకోవడం వదలడం ఇబ్బందిగా ఉంటుంది. న్యుమోనియ అంటే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్. దీని వల్ల ఊపిరితిత్తుల్లో చీము చేరుతుంది. దీంతో గాలి లోపలికి వెళ్లినా ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు. చీము రావడానికి వివిధ కారణాలుంటాయి. ఒక భాగంలో వచ్చింది వేరే భాగానికి సోకకుండా యాంటి బయాటిక్ చికిత్స చేయించుకోవాలి.
తేడా ఎలా గుర్తిస్తారు?
అలర్జీకి- జలుబుకు మధ్య ఉన్న తేడా చాలా మందికి అర్థం కాదు. నాకు జలుబు తగ్గదని ఫిక్స్ అవుతారు. జలుబు వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది మందులు వేసుకున్నా వేసుకోకపోయినా వారం పదిరోజుల్లో దానంతటదే తగ్గుతుంది. జలుబు తగ్గకుండా ముక్కు బిగపట్టడం, ముక్కు కారడం, తమ్ములు రావడం ఉంటే అలర్జీ ఉన్నట్లు. రాత్రిపూట పొడి దగ్గు ఎక్కువ ఉండి, తెమడ తెల్లగా ఉంటే ఇన్‌ఫెక్షన్ అయ్యే అవకాశం తక్కువ. తెమడ ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, గోధుమ రంగులో ఉంటే ఇన్‌ఫెక్షన్‌గా భావించాలి. ఈ ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో ఉన్నవారందరికి న్యుమోనియా ఉండదు. బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే న్యుమోనియా అంటారు. అలర్జీ దగ్గులాగా వచ్చి ఊపరితిత్తులు గొట్టాలు ముడుచుకుంటాయి. ఎందుకంటే లోపల వాపు అధికమై తెమడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ తెమడ మన సహజ రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది. అప్పుడు పీల్చుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లు ఇన్‌ఫెక్షన్‌గా మారే అవకాశముంది. జలుబుకు లోపల ఇబ్బందిలేకుండా ఉంటే అలర్జీకి పెద్దగా పరీక్షలు అవసరం లేదు. రోగి లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. దగ్గు, ఆయాసం, తెమడ ఉంటే ఛాతి ఎక్స్‌రే పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తుల సామర్థ్యం కనుక్కోవడానికి పిఎఫ్‌టి టెస్ట్‌ను చేస్తారు. న్యుమోనియా తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేరాలా, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అందరికీ 25 సంవత్సరాల వరకు ఊపరితిత్తులు పెరుగుతాయి. ఆ తర్వాత సామర్థ్యం తగ్గుతుంది. మామూలు వాళ్లకంటే ధూమపానం చేసేవారిలో సామర్థ్యం ఇంకా తక్కువుంటుంది. సంవత్సరానికి ఐదురెట్లు ఎక్కువ తగ్గుతుంది. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిందా అనేది తెలుసుకోవాలి. ప్రభావం తెలుసుకోవడానికి బ్రీతింగ్ టెస్ట్ చేస్తారు.
విశ్రాంతి తప్పనిసరి
జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పితో వస్తే రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి.గోరువెచ్చని పదార్థాలు ద్రవ పదార్థాలు తాగడం మంచిది. దీని వల్ల జబ్బునుంచి కోలుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంట్లో కూర్చొని టీవి చూడడం, మిగిలిన పనులు చేసుకోవడం, షాపింగ్‌కు వెళ్లడం కాదు.బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలి .
మందులు-ఇన్‌హేలర్‌తో చికిత్స
తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులకు మందులు వాడొచ్చు. మూడు రోజులు మించి ఇవి ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. ముక్కు అలర్జీకి స్ప్రే, యాంటి హిస్టమిన్స్ తో చికిత్స చేస్తారు. సైనస్‌లో ఇన్‌ఫెక్షన్ ఉంటే యాంటి బయాటిక్, దగ్గు, ఆయాసం పిల్లికూతలు ఉంటే ఇన్‌హేలర్ వాడతారు. దీంతోపాటు టాబ్లెట్లు ఇస్తారు. న్యుమోనియా వ్యాధి లక్షణాలు ఉంటే మందులు, ఇంజక్షన్ ఇస్తారు. ఆయాసం ఎక్కువ ఉండే శరీరంలో ఆక్సీజన్ తగ్గినప్పుడు ఆక్సీజన్ ఇవ్వాల్సి రావొచ్చు. దగ్గు, తీవ్ర జ్వరం, నీరసం నిస్సత్తువ ఉన్నవారికి ఆసుపత్రిలో వైద్యం చేస్తారు. ముక్కులో స్ప్రే చేసినప్పుడు ఎలర్జీ వల్ల ఏర్పడిన మందమైన పొరను ఇది తగ్గిస్తుంది. ఉపశమనం కలుగుతుంది. ముక్కు బ్లాక్‌కాదు. స్ప్రేను అలర్జీ తగ్గేవరకు వాడాలి.
రోగనిరోధక శక్తి
ఇది అందరికీ ఉంటుంది. ఇది లేకపోతే రోజూ ఏం చేయలేం. మనం తినే పదార్థాల్లో, పీల్చేగాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. ఇవి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత వీటిపై మనలోని సహజ రోగనిరోధక శక్తిపోరాటం చేస్తుంది. మధుమేహం, దీర్ఘకాల గుండె, శ్వాసకోశ జబ్బులున్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీరు వర్షంలో తడిస్తే జలుబు వల్ల రోగనిరోధక శక్తి తగ్గి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశమెక్కువ. క్షయ, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్, సిగరెట్, ఆల్కహాలు, గుట్కా తినేవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వయసును బట్టి, వ్యాధిని బట్టి కొన్ని మందులు వాడేవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తిపెరగాంటే వ్యాయామం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం అరగంట సూర్యరశ్మి మనపై ప్రసరించాలి. దీని వల్ల సహజ రోగనిరోధక శక్తిపెరుగుతంది. సూర్యరశ్మిసోకకుంటే విటమిన్-డిలోపం ఏర్పడి రోగనిరోధకశక్తి నెమ్మదిస్తుంది. వీటిమిన్-డి లోపం ఉన్నవారిలో మధుమేహం వస్తుందని ఈమధ్య జరిగిన పరిశోధనలో వెల్లడైంది. తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పప్పులు , చికెన్, తాజా ఆకుకూరలు రోగనిరోధక శక్తినిపెంచుతాయి. స్వీట్లు, ఉప్పుశాతం తగ్గాలి. రోజూ కనీసం రెండు రకాల పండ్లు తినాలి. టిఫిన్, భోజనం మధ్యలో కాఫీలు, టీల కన్నా పండు తింటే ఆకలికాదు. వేళకు ఆహారం సమతుల్యంగా తీసుకోవాలి. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అరగంట వ్యాయామం చేయాలి.
Source :
రక్ష డెస్క్ Mon, 15 Aug 2011, -- డాక్టర్ సుధీర్‌ఆలపాటి--శ్వాసకోశ వ్యాధినిపుణులు--సన్‌షైన్ హాస్పటల్, సికింద్రాబాద్.
- =======================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.