ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళలకి ఫిట్‌నెస్‌తో.. ఆత్మవిశ్వాసం ఆనందం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కాలేజీలో చదువుకొంటున్నప్పుడు.. కుందనపు బొమ్మలా! , పెళ్త్లెన కొత్తల్లో.. జాజి తీగలా సన్నగా, చలాకీగా.. మరిప్పుడో?.. లావుగా, నిస్సత్తువగా, అది నేనేనా అనిపించేలా! కుటుంబం, పిల్లలు, శ్రీవారు, కెరీర్ అంటూ బాధ్యతల చుట్టూ పరుగులు పెట్టే మహిళలకి ఆకృతి గురించి పట్టించుకొనే తీరిక ఉండకపోవచ్చు. కానీ ఫిట్‌నెస్‌తో.. ఆత్మవిశ్వాసం, ఆనందం సొంతం అవుతాయి. పోషకాహారం, వ్యాయామం ఈ క్రమంలో ఎంతో కీలకం అంటున్నారు నిపుణులు.
సన్నగా, మారాలని.. త్వరత్వరగా బరువు తగ్గిపోవాలని రెండు మూడు నెలల పాటు జిమ్‌కెళ్లడం, యోగాసనాలు వేయడం, సలాడ్లు తినడం... ఆ వెంటే 'ఇక మనవల్ల కాదు బాబూ' అనుకొంటూ ఆ పనులకు చుక్క పెట్టేయడం చాలామంది చేసేపని. ఇలాంటి అరకొర ప్రయత్నాలు బరువు తగ్గించవు సరికదా.. సన్నబడ్డం సాధ్యం కాదేమో అన్న నిరాశ నిస్పృహలోకి నెట్టేస్తాయి. అలా కాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లని జీవనశైలిలో భాగంగా చేసుకొంటే చక్కని ఫలితాలు కనిపిస్తాయి.
అన్నీ తింటేనే అందం..
పోషకాహారం అనగానే.. శక్తినిచ్చే ఏవో కొన్ని పదార్థాలే ఈ కోవకి చెందుతాయి అనుకొంటారు. అవి మాత్రమే అతిగా తింటూ ఉంటారు. గోధుమ పదార్థాలు మంచివంటే అవే తింటూ కూర్చోవడం సరికాదు. తాజా పండ్లు, కాయగూరలు, గింజలు, సలాడ్లు, దంపుడు బియ్యం, జొన్నరొట్టెలు, తృణధాన్యాలు, మొలకలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇలా విభిన్న వర్గాలకి చెందిన పదార్థాలన్నింటిని తగుమోతాదులో రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనికి వ్యాయామం కూడా తోడయితే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. అలా జరిగితే నిస్సత్తువ ఉండదు. పని మీద సానుకూల ధోరణి ఏర్పడుతుంది. పనిలో చకచక ఉంటే పేరుకొన్న కెలొరీలు కరగడం పెద్ద పనేం కాదుగా!
అల్పాహారంతో.. ప్రారంభం
అల్పాహారం అనగానే చాలామందిలో చిన్నచూపు. ఏదో తిన్నామంటే తిన్నాం అనో, ఏకంగా భోజనం చేసేస్తేపోదా అనో సరిపెట్టుకొంటారు. కానీ రోజంతా జీవక్రియలు సరిగ్గా సాగి హుషారుగా పనిచేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి, మధ్యాహ్నం, సాయంత్రం అతిగా తిని బరువు పెరగకుండా ఉండటానికి ఈ అల్పాహారమే కీలకం. మాంసకృత్తులు, పీచు, ఖనిజలవణాలు, విటమిన్లు ఉన్న టిఫిన్ తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో పొట్టలోకి అనవసరపు చిరుతిళ్ల చెత్తా చెదారం చేరకుండా ఉంటుంది. పప్పులన్నీ వేసి కమ్మగా వండిన ఉప్మా, పెసరట్టు, పాలు, పీచు అధికంగా ఉండే ఓట్లు తినండి! మార్పు మీకే తెలుస్తుంది.
లెక్కపెట్టుకొంటున్నారా?
అన్ని రకాలూ తినడం మంచిదే! కాకపోతే ఎంత మేరకు తింటున్నాం అన్నది కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే కొందరివి క్షణం తీరిక లేకుండా కూర్చున్న చోట కూర్చోకుండా పరుగు పెట్టే ఉద్యోగాలు. మరికొందరివి ఆఫీసుకొచ్చినప్పుడు, వెళ్లినప్పుడు తప్ప సీటులోంచి లేవకుండా చేసే విధులు. ఇలా పనులను బట్టి కెలొరీలు అవసరం మారుతూ ఉంటుంది. కెలొరీలంటే మరేం కాదు.. ఆయా పదార్థాలు విడుదల చేసే శక్తే! మీ అవసరాలకు సరిపడేన్ని కెలొరీలు మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా 55 కేజీల బరువుండే మహిళ 1900 కెలొరీల శక్తిని అందిపుచ్చుకోవాలి. అందులోనూ విటమిన్లు, మాంసకృత్తులు వీటికి ప్రాధాన్యం ఇవ్వడం మర్చిపోకూడదు. ఇలా చేయడం వల్ల్ల అధిక బరువు సమస్యని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అయితే తీసుకొనే ఆహారాన్ని ఒకేసారి కాకుండా ఆరుసార్లు చిన్నచిన్న మొత్తాల్లో తినాలి. సాయంత్రం వేళల్లో పియర్, యాపిల్ వంటివి తింటే మేలు. 'వేడివేడిగా ఏం తిందామా' అని మనసు నియంత్రించుకోలేని వాళ్లు సాదా పాప్‌కార్న్‌ని తినొచ్చు.
నడకతో నాజూకు
తీసుకొనే ఆహారానికి తగ్గట్టుగా నిత్యం వ్యాయామం చేయడం వల్ల మాత్రమే తీరైన ఆకృతి సొంతమవుతుంది. రోజులో పదివేల అడుగులు వేస్తే ఎటువంటి జబ్బులు దరిచేరవన్నది ఒక అధ్యయనం. అమ్మో పదివేల అడుగులా? అదీ రోజూనా! అనేవారికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్న సడలింపు ఇచ్చింది. రోజులో మూడు వేల అడుగులు వేసినా చాలని. మెట్లెక్కడం, షాపింగ్ చెయ్యడం వంటి వాటన్నింటికీ నడిచి వెళ్లడం వల్ల మూడు వేల అడుగుల లక్ష్యం తేలిగ్గానే పూర్తవుతుంది. నడకతోపాటు యోగాసనాలు వేయడం, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాలు దృఢమవుతాయి. స్ట్రెచింగ్.. కండరాలని తీర్చిదిద్దే వ్యాయామం ఇది. రోజులో పదిహేను నిమిషాల పాటు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల తీరైన ఆకృతి సొంతమవుతుంది.
సానుకూలతతో సన్నగా
ఓ మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని పుస్తకంలో రాసిపెట్టుకోవడం, సానుకూల ఆలోచనలున్న వ్యక్తులతో మాట్లాడ్డం, ఉదయాన్నే చక్కని స్ఫూర్తినిచ్చే కొటేషన్లు రాసిన పోస్టర్లు చదవడం ఇవన్నీ మీ ఆలోచనని సాకారం అయ్యేట్టు చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తాయి. పని ఎప్పుడూ ఉండేదే! దానిని ప్రణాళికతోనే ఎదుర్కోవాలి. ఒత్తిడికి దూరంగా, హాయిగా నిద్ర పోవడం వల్ల కళ్లలో కాంతి, మేనిలో మెరుపు సొంతమవుతాయి.
--Dr.Janaki Srinath , Hyderabad
- =================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.