Thursday, August 4, 2011

క్రమశిక్షణ - పిల్లల మనష్థత్వము , Discipline and children Psychology



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -క్రమశిక్షణ - పిల్లల మనష్థత్వము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎంత చెప్పినా అల్లరి మానరు. క్రమశిక్షణ పాటించరు. ట్యూషన్లు పెట్టించినా, ఇంట్లో కూర్చోబెట్టి చెప్పినా చదువులో వెనుకబాటే. ఇలాంటప్పుడు తల్లిదండ్రులకు ఆపుకోలేనంత కోపం రావడం సహజమే! దాన్ని
అదుపు చేయలేని పరిస్థితిలో పిల్లలను దుర్భాషలాడటం, ఒక్కోసారి చేయి చేసుకోవడం చాలాచోట్ల జరిగే విషయమే. దీన్ని పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయం అప్పటికి తట్టదు. కానీ ఆ తరవాత
తల్లిదండ్రుల్ని ఆలోచనలో పడేస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పసి హృదయాలు గాయపడనే పడతాయి. ఒక్కోసారి దెబ్బలకంటే కూడా మాటలే పిల్లలను ఎక్కువగా గాయపరుస్తాయి.
కనిపించని గాయాన్ని చేస్తాయి.

స్వతహాగా మార్పు...
కొన్నిసార్లు తల్లిదండ్రులు వేరే వారితో పోల్చి అవమానించేలా మాట్లాడతారు. 'మీ అబ్బాయికేమండీ బంగారం, మా వాడూ ఉన్నాడు ఎందుకూ! శుద్ధ మొద్దావతారం' అంటూ పక్కింటి వారితో అనేస్తారు. తమ
పిల్లలూ పోటీపడి ఎదగాలనే కోరిక దానికి మూల కారణం కావొచ్చు. అందుకు ఎన్నుకున్న మార్గం మాత్రం సమర్థనీయం కాదు. పిల్లలంటేనే అల్లరి చేస్తారు. పొరపాట్లు చేస్తుంటారు. వాటిని పరిణతితో అర్థం
చేసుకోవాలి. కానీ కొంతమంది పిల్లలను అవమానించేలా మాట్లాడ్డం చూస్తుంటాం. 'నీ మొహానికి ఇంతకంటే మంచి మార్కులు వస్తాయని నేననుకోలేదులే', 'నిన్ను అని ఏం లాభం! మీలాంటి వాళ్లని కన్నందుకు నా చెప్పుతో నన్ను సత్కరించుకోవాలి' 'పనికిమాలిన గాడిదా', 'స్టుపిడ్‌'... వంటి మాటలతో తీవ్రంగా మందలిస్తారు. ఈ మాటలు పిల్లల హృదయాల్లో ఎంతటి బలమైన ముద్ర వేస్తాయో ఊహించడం నిజంగా కష్టం!

మాట అనేశాక తల్లిదండ్రులు వాటిని సహజంగానే మర్చిపోతారు. కానీ అవి పిల్లల మనసులోంచి అంత తేలిగ్గా త్వరగా బయటికి పోవు. ఏ పని చేస్తున్నా వెంటాడే అవకాశం ఉంది. వ్యంగ్యంగా మాట్లాడటం,

సూటిపోటి మాటలు విసరడం, చులకనగా మాట్లాడ్డం ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. వీటి ప్రభావంతో పిల్లల్లో మార్పు కనపడినా అది స్వతహాగానో, ఆలోచనతోనో వచ్చింది కాదు. భయంతో వచ్చిన మార్పయి

ఉంటుంది.

ఉద్వేగాలతో ఆటలా!
చదువు, ఆటల్లో పోటీ.. హోంవర్కు చేయాలి, టీచరు కొడుతుందన్న భయాలు.. మనసులో భావాలు వెల్లడించాలన్న ఉత్సుకత.. ఇదీ పిల్లల తీరు. ఇది తెలిసినా, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట

విననప్పుడో, వెంటనే ఫలితం కనపడాలనుకున్నప్పుడో, ఒక పదునైన ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. అది పిల్లల భావోద్వేగాలను, భయాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం! తిట్లు చీవాట్ల

కంటే ఇది మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 'పది నిమిషాల్లో హోమ్‌వర్క్‌ పూర్తిచేయకపోతే చూడు, రాత్రికి అమ్మను భూతం ఎత్తుకుపోతుంది', 'నీ గది శుభ్రంగా సర్దుకోకపోతే ఇకపై తాతయ్య ఇంటికి

తీసుకెళ్లను. వాళ్లనూ రావొద్దని చెప్తాను', 'నా మాట వినకపోతే నాతో ఇకపై మాట్లాడనక్కర్లేదు' వంటి బెదిరింపులు బాగా పనిచేస్తాయి. ఆశించిన ఫలితం వెంటనే కనబడుతుంది. కానీ దాని తాలూకు

దుష్ప్రభావాలు మాత్రం అంత సులభంగా వదిలించుకోగలిగేవి కాదు.

రాత్రివేళ మెలకువ వచ్చిన ఎనిమిదేళ్ల పాపకో బాబుకో పక్కన తల్లి కనిపించకపోతే మనసులో కలిగే భయం తీవ్రతను అంచనా వేయడానికి ప్రయత్నించి చూడండి. ఇకపై తాతయ్యతో ఆడుకోలేననే విషయం

పసి మనసులో భయాన్ని సృష్టిస్తుంది. పెరిగి పెద్దయ్యాక కూడా బాంధవ్యాలు కోల్పోతాననే భయం, ప్రియమైన వారు కనిపించకుండా పోతారేమోననే ఆందోళన వంటివి ఈ బాల్యపు అనుభవాల నుంచే

ఉద్భవిస్తాయని మానసిక నిపుణులంటున్నారు.

పదేపదే ఎందుకలా!
నిజానికి తల్లిదండ్రుల్లో చాలామంది బాల్యంలో తమ పెద్దవారితో ఇలా చీవాట్లూ శిక్షలూ అనుభవించిన వారే. నాటి అవమానపు చాయలు వారిలో అంతర్లీనంగా ఉండి వాటిని పిల్లలపై చూపిస్తుంటారని

కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క 'నేనెందుకిలా ప్రవర్తిస్తున్నాను' అని బాధతో ప్రశ్నించుకుంటూనే భావోద్వేగాలను ఉపయోగించుకునే తీరుని తల్లిదండ్రులు మళ్లీమళ్లీ చేస్తుంటారని

వారంటున్నారు. మాటలతో పసి మనసులు గాయపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- వి.ఎల్‌.సుజాత
సహనంతో సరిదిద్దాలి...
* పిల్లలకు తక్కువ మార్కులు రావడానికి కేవలం వారి ప్రతిభ మాత్రమే కాక ఇతర కారణాలు కూడా ఉంటాయి. క్లాసు టీచర్‌ పాఠాలు చెప్పే విధానం, సిలబస్‌లో లేని అంశాలు ప్రశ్నాపత్రంలో ఉండటం, పరీక్షల

సమయంలో పిల్లల శారీరక ఆరోగ్యం, మానసిక ఆందోళన ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. అంకెల్లో చూడకుండా పిల్లల అంతరంగం అడిగి తెలుసుకొని పరిష్కారాలు వెతకాలి.

* మారుతున్న పిల్లల మనస్తత్వాలను, భావోద్వేగాలను కూడా తల్లిదండ్రులు గుర్తించగలగాలి. పిల్లలతో వ్యవహరించేప్పుడు పిల్లల స్థాయిలో సహానుభూతితో ఆలోచించగలగాలి. అప్పుడే వారి మనోభావాలను

చదవడం సాధ్యమవుతుంది.

* ఎవరిపట్లయినా సరే, సహానుభూతితో వ్యవహరించే తల్లి తన పిల్లలను కూడా ఎదుటి వారి దృక్కోణాన్ని అర్థం చేసుకునేలా తీర్చిదిద్దగలదు. ఇదే విషయాన్ని తాజాగా ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం తన

సర్వేలో వెల్లడించింది. ఇటువంటి సహానుభూతి పిల్లల్లో పెంచినప్పుడు తల్లిదండ్రుల భావాల్ని కూడా వారి కోణంలోంచే అర్థం చేసుకోగలుగుతారు. సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది.

* కొంతమంది పిల్లలకు క్రమశిక్షణ అంత త్వరగా అలవడదు. తిట్టడం, కొట్టడం, అవమానించేలా మాట్లాడ్డం వల్ల లాభం ఉండదు. క్రమక్రమంగా పిల్లలను దారిలో పెట్టడానికి కొంత సమయమూ, చాలా

సహనమూ అవసరం.

* అస్తమానం పిల్లలను ఇతరులతో పోల్చడం సరికాదు! ఒకరికి చదువులో ప్రతిభ ఉంటే మరొకరికి మరొక కళలో ప్రావీణ్యం ఉండవచ్చు. అందరి తెలివితేటలూ ఒకే రకంగా ఉండవు.

* పిల్లల భావోద్వేగాల మీద పనిచేసే బెదిరింపులు వెంటనే మానివేయాలి. దీర్ఘకాలంలో చాలా చెడు ప్రభావాలను కల్గిస్తాయి.

* త్వరగా కోపం వచ్చే వారు పిల్లల విషయంలో దాన్ని వీలైనంతగా నియంత్రించుకోవడం అభ్యసించాలి. ఎంతయినా వాళ్లు మీ పిల్లలు. శిక్షకీ క్రమశిక్షణకీ తేడాని గుర్తించడం అన్నిటికంటే ముఖ్యం.

--- Dr.Suman Roy (psychologist)--Eenadu Vasundara.
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.