Wednesday, August 24, 2011

ఉద్యోగిని లలో మానసిక ఒత్తిడి-మెలకువలు , Mental Stress in employed women-awarenessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఉద్యోగిని లలో మానసిక ఒత్తిడి-మెలకువలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...స్త్రీలు ఉద్యోగాలు చేయాలా? . భర్తల సంపాదన చాలదా?. అలా అనుకుంటే ఇంకేమైనా ఉందా! మహిళా మండళ్లు ఊరుకుంటాయా?.. స్త్రీల హక్కులను కాలరాసినట్టు కాదా?.. సరే ... మరి ఆరోగ్యమూ కాపాడుకోవాలి కదా !
ఇంట్లో పనులు, ఆఫీసు విధులు, అతిథి మర్యాదలు.. పిల్లల బాధ్యతలు.. ఉద్యోగం చేసే మహిళలు నిత్యం ఎదుర్కొనే పరీక్షలెన్నో! మల్టీటాస్కింగ్‌ వారి శక్తికి నిదర్శనం. కానీ అది నాణేనికి ఒకవైపే. ఇంటాబయటా పనులతో తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం.. పోషకాహార, నిద్రలేమికి గురి కావడం.. వారే అంతగా గుర్తించని మరోకోణం. ఈ సమస్యని గమనించి, తగిన ముందుచూపుతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న స్త్రీ దైనందిన జీవితం తెల్లవారుజామున ఐదుకి మొదలవుతుంది. కాఫీ, టిఫిన్‌ పేరుతో ఓ పావుగంట విశ్రాంతి. మిగిలిన సమయం అంతా కాళ్లకు చక్రాలే. వంట, పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయడం, ఇంటిపనులు, భర్త అవసరాలు, అత్తామామలకు మందులు సిద్ధంగా ఉంచడం, మరోవైపు ఆఫీసులో ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచన.. ఇలా హడావుడిగా అనేక పనులతో బహుపాత్రాభినయమే. పనులు అవుతున్నాయి సరే! కుదురుగా తిన్న, పడుకొన్న భావన కలగదు. అదీకాక శారీరక అలసట, మానసిక ఒత్తిడి. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగినుల పరిస్థితి ఇదే.

ఒత్తిడిలో మనమే ముందంజ...
బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఇంటాబయటా రాణించి శభాష్‌ అనిపించుకోవాలనే తపన ఒకవైపు.. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వైనం మరొకవైపు. తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేసింది. మహిళలు అత్యవసరంగా ఒత్తిడిని చిత్తుచేసే మార్గాలను అన్వేషించాలని చెప్పకనే చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,500 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మన దేశంలో 87 శాతం మహిళలు అన్ని వేళలా ఒత్తిడికి గురవుతున్నారు. 82 శాతం వారికి అసలు విశ్రాంతి తీసుకునే సమయమే ఉండట్లేదు. ఇతర దేశాల్లో చూస్తే రష్యాలో 69, ఫ్రాన్స్‌ 65, స్పెయిన్‌ 66, అమెరికాలో 53 శాతం అన్నివేళలా ఒత్తిడికి గురవుతున్నారు.

బాధ్యత తెలిసి భారం..
ఆదాయం, హోదా బాగానే ఉన్నా, తరచూ పెరిగే పని భారం, ఇంటినీ కార్యాలయాన్నీ సమన్వయం చేసుకోలేకపోవడం చాలామంది ఉద్యోగుల్ని వేధిస్తోందని చెబుతారు ఓ ప్రముఖ సంస్థలో చేస్తోన్న సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌.... రోజుకి పదిగంటల పని. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ సమయమే ఉండాల్సి ఉంటుంది. లక్ష్యాలుంటాయి. కచ్చితమైన డెడ్‌లైన్లూ చేరుకోవాలి. ఆఫీసులో పని పూర్తి కాకపోతే.. ఇంటికీ మోసుకెళ్లాలి. దాంతో ఇంట్లో ఉన్నా బాబుకు సమయం కేటాయించలేని పరిస్థితి. ఆమే కాదు, ఆమె చుట్టూ ఉన్న వారిలో చాలామందిది ఇదే పరిస్థితి. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేస్తేనే గుర్తింపు, పదోన్నతి. అలాగని ఇంటికొచ్చాక పనులూ తప్పడం లేదు. సాయంగా ఎంతమంది ఉన్నా.. అమ్మా అంటూ వచ్చే అబ్బాయిని పట్టించుకోవాల్సిన బాధ్యత స్త్రీదేగా! ఇలా అహర్నిశలూ పని చేస్తున్నా, అన్నింటికీ న్యాయం చేయలేకపోతున్నాననే భావన ఒత్తిడికి దారితీస్తోంది..'

సమన్వయం సాధించాలి...ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం ఉద్యోగానికి వెళుతున్న మహిళలకు కుటుంబం నుంచి తగిన స్థాయిలో ప్రోత్సాహం అందాలి .
మెలకువలు తెలిసి...ఇంటి పనులు, ఆఫీసు వ్యవహారాలను సమన్వయం చేసుకొని ఒత్తిడి లేకుండా హ్యాపీగా జాలీగా ఉండటం మాటలు చెప్పినంత సులువు కాదు. అలాగని కష్టమూ కాదు. ఆలోచిస్తే అనేక మార్గాలు ఉంటాయి . . . విధులకు సంబంధించిన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం.. ఆన్‌లైన్‌లో విద్యుత్తు, కేబుల్‌, క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని చెల్లించడం వంటివి చేయాలి . ఎదురయ్యే ఇబ్బందుల్ని బట్టి ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. నిత్యావసర వస్తువుల్ని సైతం ఇప్పుడు ఇంటికి తెచ్చిచ్చే సదుపాయం వచ్చేసింది కదా'

వాస్తవిక దృక్పథం.. మనసుకు విరామం
* ఉద్యోగినులు వాస్తవికంగా ఆలోచించాలి. మానసిక సాంత్వన పొందాలి. ఎన్నో చేయాలనుకున్నా.. రకరకాల సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటి వాటిని ఎలా పరిష్కారించాలా అని ఆలోచించుకోవాలి. అవే తలచుకుని బాధపడకూడదు.

* విరామం లేకుండా పనిచేయడం కన్నా.. ప్రతి గంటకోసారి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆఫీసైనా, ఇంట్లో బాధ్యతలైనా.. మనసుకు హాయినిచ్చే పనులు చేయాలి. పిల్లలతో మాట్లాడటం.. భాగస్వామికి చిన్న సందేశం పంపడం వంటివి ఏవైనా సరే.

* నిత్యం రకరకాల ఆలోచనలతో సతమతమయ్యే మనసుకు విశ్రాంతినివ్వాలి(ఎమోషనల్‌ వెకేషన్‌). రోజు ఎలా గడిచినా.. మానసికంగా కుంగిపోకుండా ఉండేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సహాయకులు రాకపోయినా, సహోద్యోగులతో ఇబ్బంది ఎదురైనా చిరాకు ప్రదర్శించకుండా ఆనందంగా ఉండేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

* 'వ్యక్తులు మనకు నచ్చినట్లు ఉండకపోయినా.. సందర్భాలు సానుకూలంగా లేకపోయినా. నేను మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉంటాన'నే సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి.

* కార్యాలయంలో మర్నాడు చేయాల్సిన పనుల్ని ముందురోజే ఆలోచించుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంటి పనుల విషయంలోనూ అంతే. నిద్రలేచిన తరవాత ఆ రోజు ఏం చేయాలని ఓ పది నిమిషాలు ఆలోచించుకుంటే హడావుడి ఉండదు.అంతగా అవసరంలేని పనుల్ని వారాంతాల్లో పూర్తిచేసుకోవచ్చు. ఇంటి నుంచి నిర్వర్తించగలిగే బాధ్యతలు ఉంటే ఆ అవకాశం కల్పించమని యాజమాన్యాన్ని కోరవచ్చు.

* మహిళలు 'సూపర్‌ విమెన్‌'గా మారుతున్నారు. అది ఒకరకంగా మంచిదే. కానీ మెలకువలు గ్రహించి మసలుకోవాలి. ఒత్తిడి చట్రంలో కూరుకుపోకుండా మార్గాలు అన్వేషిస్తూ ముందంజ వేయాలి. ఎవరికైనా రోజులో ఇరవై నాలుగ్గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయస్ఫూర్తి చూపాలి.

* ప్రతి చిన్నపనీ, పెద్దపనీ నేను మాత్రమే బాగా చేయగలను.. అనే తీరు తగ్గించుకుని.. ఇతర కుటుంబసభ్యులకు అప్పగించవచ్చు. అది విధులకూ వర్తిస్తుంది. ఎప్పుడూ బాగా కష్టపడాలి.. ఏ సమయంలో విరామం తీసుకున్నా... ఇబ్బంది ఉండదో గ్రహించే ముందుచూపు కనబరచాలి.

* కెరీర్‌లో ఒక్కో అడుగు పైకెదిగే కొద్దీ సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డబ్బిచ్చి అయినా సరే.. సహాయకుల్ని నియమించుకోవాలి. ఇంటాబయటా సత్సంబంధాలనేవి ఉద్యోగినులకు తప్పనిసరి.


Source : Eenadu news paper 24/08/2011
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.