మన దేశంలో అవాంఛనీయ గర్భాలు.. వాటి నుంచి తప్పించుకునేందుకు నాటు పద్ధతుల్లో, గోప్యంగా అబార్షన్లు చేయించుకోవటమన్నది చాలా ఎక్కువ. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. ప్రజల్లో గర్భనిరోధక విధానాల పట్ల అవగాహన పెరిగితే అసలీ పరిస్థితి ఉత్పన్నం కాదని, మరీ ముఖ్యంగా అత్యవసర గర్భనిరోధక విధానం పట్ల అవగాహన పెంచటం ఎంతో అవసరమని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా శృంగారంలో పాల్గొంటే తక్షణ గర్భనిరోధం కోసం ఉపయోగపడేది ఈ అత్యవసర గర్భనిరోధక మాత్ర. 'ఐ-పిల్' వంటి రకరకాల బ్రాండ్ పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ 'ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ పిల్'ను 'మోర్నింగ్ ఆఫ్టర్ పిల్' అనీ పిలుస్తుంటారు. ఈ మాత్ర అత్యవసర సందర్భాల్లో అక్కరకొచ్చే మాట వాస్తవమేగానీ.. వీటిని సాధారణ గర్భనిరోధక పద్ధతులకు ప్రత్యామ్నాయంగా, తరచుగా వాడటం మాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అవసరమైతేనే 'అత్యవసరం'
అత్యవసర గర్భనిరోధక మాత్ర సమర్థంగా పని చెయ్యాలంటే దాన్ని అరక్షిత శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో లివనోర్‌జెస్ట్రల్, ప్రొజెస్టిన్, యులిప్రిస్టల్ ఎసిటేట్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆ స్త్రీ రుతుక్రమంలో అప్పడున్న దశను బట్టి- వెంటనే అండం విడుదల కాకుండా జాప్యం చెయ్యటంగానీ, లేదంటే అండం-శుక్రకణాల సంయోగాన్ని (ఫలదీకరణాన్ని) అడ్డుకోవటంగానీ, ఒకవేళ అప్పటికే అండం ఫలదీకరణం చెంది ఉంటే అది గర్భాశయం గోడలకు అంటుకోకుండా, గర్భం కుదురుకోకుండా నిలువరించటం ద్వారాగానీ గర్భధారణను నిరోధిస్తాయి. ఒకవేళ కండోమ్ వంటి గర్భనిరోధక సాధనాలు వాడుతూ, అనుకోకుండా అవి విఫలమైపోయినప్పుడు కూడా అత్యవసర గర్భనిరోధక మాత్రతో ప్రయోజనం ఉంటుంది. అత్యవసర గర్భనిరోధక మాత్ర వేసుకున్న తర్వాత 2 గంటల్లోపు వాంతి అయితే.. మళ్లీ మాత్ర వేసుకోవాలా? అక్కర్లేదా? అన్నది వైద్యులతో చర్చించటం ముఖ్యం.
అత్యవసర గర్భనిరోధక మాత్ర వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వేసుకున్న ఒకటి రెండురోజుల పాటు వాంతులు, వికారం, తీవ్రమైన అలసట, తలనొప్పి, రొమ్ములు సలపరింతగా అనిపించటం, నెలసరికీ నెలసరికీ మధ్య ఎరుపు కనబడటం, నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువ కావటం, పొత్తికడుపులో నొప్పి లేదా అసౌకర్యం, నీళ్ల విరేచనాల వంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందిగానీ ఇవేవీ అంత తీవ్రమైనవి కావు. ఇవి కూడా కొద్దిరోజుల పాటే ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులేమైనా వారం మించి కొనసాగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించటం అవసరం. మొత్తమ్మీద ఈ మాత్రలతో తీవ్ర సమస్యలు ఎదురవటమన్నది అరుదు.
అబార్షన్ మాత్ర కాదు
అత్యవసర గర్భనిరోధక మాత్ర- అబార్షన్ మాత్ర వంటిది కాదు. అబార్షన్ మాత్ర ఇప్పటికే గర్భధారణ జరిగి, గర్భంలో కుదురుకుని పెరగటం ఆరంభించిన పిండాన్ని సైతం బయటకు పంపించివేస్తుంది. కానీఅత్యవసర గర్భనిరోధక మాత్ర అసలు గర్భధారణ జరగకుండానే, గర్భం రాకుండానే నిలువరిస్తుంది. ఈ మాత్ర తీసుకున్న తర్వాత ఆ దఫా నెలసరి ఒక వారం లేటుగా రావచ్చు. గడువు కంటే వారం దాటినా కూడా నెలసరి రాకపోతుంటే వెంటనే గర్భధారణ పరీక్ష చేయించుకోవటం అవసరం.
ప్రత్యామ్నాయం కాదు
అత్యవసర గర్భనిరోధక మాత్ర అప్పటి వరకే గర్భం రాకుండా చూస్తుందిగానీ ఇదేమీ దీర్ఘకాలం పని చేసేది కాదు. కాబట్టి ఈ మాత్ర వేసుకున్న తర్వాత కొన్ని రోజులకు, లేదా వారాలకు అరక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలుంటాయి. అలాగే ఈ మాత్రను మరీ తరచుగా వేసుకోవటం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అత్యవసర సందర్భంలో ఎప్పుడైనా ఈ మాత్ర వేసుకున్నా.. దీర్ఘకాలం గర్భనిరోధం కోసం వైద్యుల సలహా మేరకు సాధారణ గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు లేదా కండోమ్‌ల వంటి సాధనాలను వాడుకోవటమే ఉత్తమం.
- ===========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.