Saturday, March 31, 2012

సహజసిద్ధమైన సౌందర్యం .., Natural beauty



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సహజసిద్ధమైన సౌందర్యం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందాన్ని పెంచేవాటిల్లో మేకప్‌ ప్రధానమైనది. అందులో ప్రస్తుతం అనేక రకాలు వచ్చాయి... వస్తున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి అనేక కాస్మొటిక్‌ కంపెనీలు ఆవిర్భవించాయి. కాటుక మొదలుకొని గోళ్లరంగు వరకు అనేక వెరైటీలు వచ్చేశాయి. ఇంతకు మునుపు ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఈ మేకప్‌ ప్రస్తుతం సామాన్యుల ఇళ్లలోకి కూడా ప్రవేశించింది. బయటకు అడగుపెట్టాలంటే మేకప్‌ తప్పనిసరి అంటున్నారు నేటి యూత్‌. అయితే మోడ్రన్‌ మేకప్‌ మీద ప్రస్తుత యువతకు విసుగెత్తింది. సహజసిద్ధమైన మేకప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లేవారు నేచురల్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రకృతిలో లభ్యమయ్యేవాటితో తమ శరీరాన్ని తేజోవంతంగా, ప్రకాశవంతంగా మార్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


-ముఖానికి, మేనుకు మేకప్‌లను ఉపయోగించడం క్రీ.పూ 3500 సంవత్సరం నుంచే ఉందని పురావస్తు శాఖవారి నివేదికల ప్రకారం తెలుస్తుంది. మొదటగా ఈజిప్షియన్లు తరువాత రోమన్‌లు, గ్రీకులు మేకప్‌ పట్ల ఆసక్తి కనబరిచేవారు 20వ శతాబ్దం ఆరంభంలో సామాన్య ప్రజలలోకి సైతం ఇది ప్రవేశించింది. ఈ ఆధునిక కాలంలో కాస్మొటిక్స్‌ను అనేక రసాయనాలను ఉపయోగించి తయారుచేయడం మొదలైంది. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఎక్కువగా ఉన్నా వీటినే వాడడం మొదలు పెట్టారు. అనునిత్యం ఫ్యాషన్‌, గ్లామర్‌ అంటూ పరుగులెత్తే నేటి యూత్‌ ప్రస్తుతం రసాయనాల మిశ్రమ మేకప్‌కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. సహజసిద్ధమైన అందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.

ఉల్లాసంగా ఉండాలి...
బాహ్య సౌందర్యమే కాదు మనసుకూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే అది నిజమైన అందం అంటున్నారు నేటి కుర్రకారు. ‘నేటి రోజుల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. నవీన నాగరికులం అనిపించుకోవాలంటే మంచి దుస్తులతో పాటు గ్లామర్‌గా కనిపించడమూ పరిపాటే. మనసుకు ఇంపైన సౌందర్యాన్ని అందం అంటాం. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాం. అందము ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంటుంది. ప్రతి మనిషి ఆడ, మగ అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు. ఉండాలని ప్రయత్నమూ చేస్తారు. అందమంటే శారీరక సౌందర్యమే కాదు, మానసికంగా పరిపక్వమూ, ఉల్లాసమూ కూడా ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైన అందమని చెప్పబడుతుంది. వీటికోసం మార్కెట్‌లో దొరికే అనేక సాధనాలను వాడుతుంటారు. కానీ నేడు వాటివల్ల సైడ్‌ఎఫెక్ట్‌‌స ఎక్కువగా కలుగుతోంది.

నిగనిగలాడుతుంది...
-అందంగా కనిపించాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధవహించాలి. బాహ్యసౌందర్యం బాగుండాలంటే శరీరంలో అందుకు తగిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సమ తుల్యమైన ఆహారము తీసుకోవాలి. విటమినులు ఉన్న ఆహారము తీసుకోవాలి. యాంటి యాక్సిటెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంటుంది. క్రొవ్వు పదార్థములు తక్కువగా తీసుకోవాలి. ఇలా శరీర నియంత్రను పాటిస్తే ఆటోమేటిక్‌గా మన అందం పెరుగుతుంది. అలాగే కొన్ని నియమాలను కూడా పాటించాలి. వేళకు నిద్రపోవాలి. వేళకు ఆహారము తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌ పడడం తగ్గిం చుకోవాలి. ఎక్కువ స్ట్రెస్‌, స్ట్రెయిన్‌కు గురికాకూడదు. ప్రతి రోజు మృదువైన సబ్బుతో స్నానం చేయాలి. మీ అందాన్ని ఇంకొకరి అందముతో పోల్చకూడదు. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించడం మంచిది.

తెలుసుకుందాం...
సహజసిద్ధంగా ఎలాంటి వాటిని తీసుకోవాలో ప్రముఖ బ్యూటీషియన్స్‌ కొన్ని చిట్కాలను వివరిస్తున్నారు.
అలసిన కళ్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్లకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.కళ్లకు మేకప్‌ వేసుకనే ముందే చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పలమీద ఉంచుకోవాలి.

పొడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్‌ స్పూన్‌ చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మచుక్కలు, ఒక టేబుల్‌ స్పూన్‌ కిస్మిస్‌లు ఇవన్ని బాగా కలపాలి. మొహానికి రాసుకుని 20 నిమిషాలు అనంతరము గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

జిడ్డు చర్మానికి : పావు టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం లో రెండు టేబుల్‌ స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచెం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని బాడీ లోషన్‌గా కూడా వాడవచ్చు.

చక్కని స్కిన్‌ టోన్‌ కోసం : ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ సన్నగా తరిగిన కమలా పండు తొక్కలు, ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్‌ మీల్‌, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మృదువుగా మర్దన చేయాలి. చర్మం మీది మృత కణాలు, బ్లాక్‌ హెడ్స్‌ తొలగి పోతాయి. దీనిని రోజువారీ స్క్రబ్‌గా కూడా వాడవచ్చు.

శరీర కాంతి పెంచే చిట్కాలు...
నిమ్మరసం , మజ్జిగ సమభాగాలు కలిపి ముఖానికి మర్దన చేయడం వల్ల ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛముగా కనిపిస్తుంది. ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతంగా అవుతుంది.

ముఖముపై ముడతలున్నట్లయితే రెండు చెంచాల గ్లిజరిన్‌లో సగం చెంచా గులాబీ నీరు, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి రాసుకుంటే ఉదయము లేవగానే చర్మపు రంగు నిగ్గుతేలి ముడతలు కనిపించకుండాపోతుంది.

చర్మానికికుంకుమ పువ్వు సొగసు : కుంకుమ పువ్వు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌందర్య సాధనంగా ప్రసిద్ధిపొందింది. ఈ పువ్వుతో తయారయిన పేస్టును ముఖము, చేతులపైన రాసుకుంటే చర్మానికి మృదుత్వము, బంగారు మెరుపును తెస్తుంది.

పసుపు, వేపల లేపనం : వందల సంవత్సరాలనుంచి భారతీయుల చర్మ సంరక్షణకు పసుపు, వేపలను ఎంతగానో నమ్ముతారు. పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని, హాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపుపొడి, కొంచెం కుంకుమ పొడి, ఒక చెంచా వేపచూర్ణము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము, ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.

గంధం పేస్టు : అందరికీ ఒకే రకమైన శరీర తత్వం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి చర్మము బాగా సున్నితంగా ఉంటుంది. ఏ మాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుంది. దురద, పొడిబారడం, పొరలుగా రావడం, బిరుసెక్కిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు గంధము పేస్టు ఆయిల్‌ చర్మాన్ని చల్లబరుస్తుంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనె గ్రంధులు ఉత్తేజితమైన తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మానికి హానిచేసే బ్యాక్టీరియాలను తొలిగిస్తాయి.
జుట్టుకు గొప్ప కండిషనర్‌ పెరుగు : అందానికి మెరుగులు దిద్దే ఉత్పత్తులలో పాల సంబంధిత పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అధిక శాతం ప్రొటీన్లు, విటమిన్లు ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. పెరుగు జుట్టును పొడిబారనీయకుండా చేస్తుంది. షాంపూతో తలంటుకున్న తరువాత ఐదునిమిషాలు పెరుగుతో తలకు మసాజ్‌ చేసుకుంటే పొడిబారిన జుట్టుకు చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టుకి మృదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకు ఉంది.

నీరు...
నీరు మనశరీరానికి ఎంతో అవసరము. సమాజములో దాదాపు ఎనభై శాతం మంది డిహైడ్రేషన్‌కి లోనవుతుంటారు. దీని వలన శరీరము ముడతలు పడి కాంతి విహీనంగా తయారవుతుంది. బుగ్గలు చొట్టలు పడి ముఖము అందవికారముగా తయారవుతుంది. మన శరీర బరువులో 70 శాతం ఉండే నీరు అందానికి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కావున ప్రతిరోజూ కనీసము రెండు లీటర్ల నీటిని త్రాగడం శరీరానికి ఎంతో మంచిది .
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.