Friday, September 7, 2012

Ayurvedam and health_ఆయుర్వేదం లో మనఆరోగ్యం




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సు, శక్తివంతమైన శరీరం ప్రధానం. మనస్సును శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని దీర్ఘకాలం జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆయుర్వేదం అందిస్తోంది. మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో ఆయుర్వేదానికి ఆదరణ లభిస్తోంది. ఇదొక విస్తారమైన మార్కెట్‌గా రూపుదాల్చింది. మన దేశీయ వైద్య విధానాల్లో ఆయుర్వేదానికి అగ్రస్థానం అయినప్పటికీ దీని విశిష్టతను ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. కనుకనే ఆరోగ్యానికి ఆయుర్వేదం ఏ విధంగా ఉత్తమమైందో వివరించే ప్రయత్నమిది.
ఆయుర్వేదం అంటే కేవలం రోగాలకు చికిత్స చేసే వైద్య విధానం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. మనిషి రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా జీవించడానికి అవసరమైన విధి విధానాల్ని నిర్దేశిస్తోంది. ఆధునికత చేసిన మేలుతో పాటు కీడు కూడా చాలానే వుంది. ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన అనర్థాలు ప్రతిఫలం అనుభవిస్తున్నాం. అభివృద్ధి పేరిట మనిషి తన సహజాత్యాలకు భిన్నమైన జీవన రీతుల్ని అనుసరిస్తున్నాడు. ఆధునికత తెచ్చిపెట్టిన అభివృద్ధి జరిగిన మేలు సంగతి అలా వుంచితే మన చుట్టూ వాతావరణ కాలుష్యం పెరిగింది. జీవన శైలిలో విపరీతమైన మార్పులొచ్చాయి. వీటితోపాటు కొత్త కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. సహజంగా వుండాల్సిన రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ఈ అవసర సమయంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు పాశ్చాత్య దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఆయుర్వేద వైద్య విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు.
గతంలో ఇంటింటా అమ్మమ్మల, నానమ్మల మందు భరిణాలు ఉండేవి. గృహ వైద్యంగా ఆ మందుల భరిణెలోంచి ‘దినుసుల వైద్యం’ చేసేవారు. ప్రశస్తమైన ఉగ్గుపాల సంప్రదాయం కనుమరుగయింది. దాని స్థానంలో అవసరం లేని ‘మల్టీ విటమిన్ డ్రాప్స్’ ఒరవడి అలవడింది. శిశువు జఠరశక్తి దీప్తికి, జీర్ణానికి మలవిసర్జనకు అనువైన ఉగ్గుపాలతో మిశ్రీతమయ్యే వచ, సన్నదుంపరాష్ట్రం, ఆముదం వంటివి పిల్లల ఆరోగ్యానికి ఉపకరించేవి.

చరిత్రలోకి వెళితే
భరద్వాజ శిష్యుడైన ఆత్రేయముని ద్వారా ఆయన శిష్యులైన అగ్నివేశాది మహర్షులకు ఆయుర్వేదాన్ని ఉపదేశించటంతో అక్షర రూపంలో ఆయుర్వేదం అవతరించింది. అగ్నివేశ తంత్రంగా ప్రప్రధానంగా లోక ప్రచారంలోకి వచ్చింది.
కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ, శల్య, అగద, రసాయన వాజీకరణ విభాగాలలో అష్టాంగ ఆయుర్వేదం సమగ్రంగా నిలచింది. కొన్నాళ్ళ తరువాత అగ్నివేశ సంహితను చరకుడు సంస్కరించి చరక సంహితగా ప్రామాణిక గ్రంధం జాతికి అందించాడు. దీనికి చక్రపాణి దత్తు వ్యాఖ్యానం నేటికీ పరిశోధకులకు కరదీపిక. శస్త్ర చికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో విశేష ప్రజ్ఞ చూపి నేటి వైజ్ఞానికులకు సైతం విస్మయం కొలిపే విశేషాలను అందజేసిన సుశ్రుతుడు ‘సుశ్రుత సంహిత’ను అందజేసాడు.
ఋషిప్రోక్త వనౌషధులు భేషజ వేదంలో అపారంగా వున్నాయి. ఆయుర్వేద విజ్ఞానసంపద మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికి ఇప్పటికి చికిత్సకు నోచుకోని రోగాలు అనేకం వుంటూనే వున్నాయి. ఆయుర్వేద వైద్యులు వృక్ష శాస్తవ్రేత్తలు, బయోటెక్నాలజీ శాస్తజ్ఞ్రులు సమిష్టిగా కృషిచేస్తున్నప్పటికీ, పరిశోధనా సంస్థలు ఇంకా ఇంకా తీవ్ర పరిశోధనలు మముమ్మరం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

వేదాలలో ‘వేదిక ప్లాంట్స్’గా పేర్కొన్న ‘సోయిమిడా ఫ్రెబ్రిఫ్యూగా’ (మాంసరోహిణి) నిక్షిప్త భేషజంగా వేదాల్లో పేర్కొన్న పిప్పలి, అపామార్గ, వరుణ వంటి ఓషధులపై పరిశోనలు జరిపి వాటి విశిష్టతను డాక్టర్ ఇటికాల సంజీవరావుగారు వంటి శాస్తవ్రేత్తలు ప్రపంచానికి తెలియజేశారు.
పోషక విలువలతో కూడి వ్యాధి క్షమత్వ శక్తికి వ్యాధి నివారణకు ఉపయుక్తమైన ఇమ్యునోమాడ్యులెటర్ గుణాలుకలిగిన మొక్కలు అనేకం శ్రీశైలం, నల్లమల అడవులలో తిరుపతి కొండలలో వున్నాయని అధ్యయనంలో తెలిసింది.
మనం నిత్యం వాడే అనేక ఆహార పదార్థాలలో ఓషధీ విలువలు వున్నాయి. ఉసిరిక, వాము, అల్లం, జీలకర్ర, పసుపు, శొంఠి, ఇంగువ, కలబంద, వేప, పిప్పళ్లు, ద్రాక్ష, ఏలకులు, లవంగాలు, కర్పూరం మొదలైనవి ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడేవే! పంచగవ్యాలు (ఆవుపాలు, పెరుగు, పేడ, నెయ్యి, గోమూత్రం) విశిష్టతకు శాస్ర్తియమైనదిగా పేటెంట్ పొందడం నిదర్శనం. మూలికలు, ఆకులు, పూలు, మొక్కలు, శుద్ధమైన ధాతు లోహములలో తయారుచేయడం ఆయుర్వేద వైద్య విధానంలోని విశిష్టత.

ఎన్నో విష ఫలితాలను (సైడ్ ఎఫెక్ట్స్) మందుల లిటరేచర్‌పై సూచించినప్పటికీ తెలిసే వాటి వాటి వాడుకను ప్రోత్సహించే పద్ధతి అభ్యంతరకరం. ఇతర వైద్య విధానాలలోని ప్రామాణికతను శాస్ర్తియతను ప్రయోగాత్మకంగా పరిశీలించే అలవాటు ఏర్పరచుకుంటే, అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయుర్వేదం మీద నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా మానవాళికి ప్రయోజనం ఏర్పడుతుంది.
పాశ్చాత్య వైద్య విధానంవలన విసిగిపోయి వున్నవారు ఇవాళ ప్రత్యామ్నాయ వైద్య విధానాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. కార్పొరేట్ వైద్యం ఖరీదవడం, మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ వుండటం, కొన్ని మందులు జీవితాంతం వాడాల్సి రావడం వలన ఇతర వైద్య విధానాలవైపు సామాన్యుల దృష్టి సారిస్తున్నారు.
కనుక అందరికీ అందుబాటులో వుండే విధంగా వైద్య సంస్థలు వైద్యులు జాగ్రత్త వహించి అపోహలు తొలగించి మెరుగైన ఆయుర్వేద వైద్యాన్ని అందివ్వటం ఇవాళ్టి అవసరం.

అనంతరకాలంలో వాగ్భటుని అష్టాంగ హృదయం, భావప్రకాశం, బసవరాజీయం, మాధవ నిదానం వంటి గ్రంధాలు వచ్చాయి. శ్రీశైలంలో సిద్ధనాగార్జునుని సంప్రదాయంలో రసశాస్త్రం పరిఢవిల్లి నిత్యానంద సిద్ధుని రసరత్నాకరం, సిద్ధనాగార్జునుడి రసేంద్రమంగళం వంటి అమూల్య గ్రంథాలు జాతికి అందాయి. రస సంప్రదాయం ఐదు భాగాలుగా విభజించబడినది. రసఖండు, రసేంద్రఖండం, రసాయనఖండం, వాదఖండం, మంత్రిఖండం. అయిదు భాగాలతో ప్రసిద్ధ గ్రంధాలలో రసశోధన, అష్టాదశ సంస్కరములు, జారణ, మారణ భస్మవిధానాలు ఇందులో వివరించారు.
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నాలుగు సాంప్రదాయాలు అనాదిగా ప్రచారంలో వున్నాయి. అవి బ్రాహ్మీ సంప్రదాయం, శైవీ సంప్రదాయం, సుమంత భద్ర సంప్రదాయం, అగస్త్య సంప్రదాయము.
బ్రాహ్మీ సంప్రదాయంలో ఔషధ ప్రధానంగాను, శైవీ సంప్రదాయంలో రస, ధాతు, లోహ విధానాలు వైద్య విధానంలో వాడబడి శ్రీశైల ప్రాంతం నుండి విశేష ప్రాచుర్యం పొందింది.
విజ్ఞానపరంగా, ప్రకృతిపరంగా ఇంతటి అమూల్య సంపద ఉన్నప్పటికీ, విశేష పరిశోధనలు లేకపోవటంవలన చాలా కాలం పాటు వినియోగిచుకోలేకపోయాం.


డాక్టర్ డి. శ్రీరామమూర్తి--రాఘవేంద్ర నర్సింగ్ హోం-Hyd-500073@ ఆంధ్రభూమి దిన పత్రిక
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.