Monday, September 17, 2012

లైపోసక్షన్‌-Lipo sucction



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -లైపోసక్షన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



లైపోసక్షన్ చికిత్సలో సూక్ష్మగొట్టాలు, అల్ట్రాసోనిక్‌ తరంగాలు, ఇంజెక్షన్‌ వంటి వాటిని ఉపయోగించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు.

నేటి సమాజంలో ఊబకాయం ఓ పెద్ద సమ్యసగా మారింది. శరీరానికి తగినంత వ్యాయామం, శారీరక శ్రమ వుండక పోవటంతో ఏర్పడేదే ఊబకాయం! చాలామంది లావును తగ్గించుకోవాలని అనేక రకాలుగా కష్టపడు తుంటారు. తిండిమానేయడం వంటి కష్టాలు లేకుండా బరువు తగ్గాలని షార్ట్‌కట్స్‌ వెదుకు తుంటారు. అటువంటి వారి కోసం రకరకాల పరికరాలు మార్కెట్‌లో లభ్యమవు తున్నాయి. అయినా ఇంకా సులభమైన మార్గం కోసం వెదుకుతున్నారు. ఈ బిజీలైఫ్‌లో ఆ పరికరాలను ఉపయోగించడానికి కూడా సమయం లేదు. అటువంటి వారి కోసం ఆధునిక వైద్య శాస్త్రం ఓ సులువైన మార్గాన్ని మనముందుకు తెచ్చింది. ఇది ఓ శస్త్ర చికిత్స. దీని పేరు లైపోసక్షన్‌''!ఊబకాయం నుంచి విముక్తికి 'లైపోసక్షన్‌'-- అసలు స్థూలకాయం అంటే ఏమిటి? ఇది ఏరకమైన వ్యాధి? ఏ వయసు వారికి వస్తుంది?

శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు వున్న వారిని స్థూలకాయులు అంటారు. మనిషి ఎత్తును బట్టి బరువును లెక్కిస్తారు. మనిషి ఎత్తును సెంటీమీటర్లలో కొలిసి ... దానినుండి 100 ని తీసివేయగా వచ్చిన సంఖ్య సుమారుగా ఆమనిషి బరువు కి.గ్రా లో ఉంటుంది. శరీరం సంరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ శరీర బరువును పరీక్షించుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు, నియమావళితో బరువు తగ్గొచ్చు. ఎలా అంటే... ఓ ప్రణాళికాబద్ధంగా కొన్ని నియమనిబంధనలను తయారు చేసుకోవాలి, వాటిని తప్పక పాటించాలి. బరువు తగ్గాలనుకునేవారు ఆహార విషయంలో పూర్తి శ్రద్థవహించాలి. అలా అని తినడం మానేయడం, డైటింగ్‌ పేరుతో ఉపవాసముంటే లేనిపోని అనర్థాలను కోరి తెచ్చుకున్నవారౌతారు. ఆహారం ప్రణాళికాబద్ధంగా తినాలి. ప్రతిరెండుగంటలకు కొద్ది కొద్దిగా తింటుండాలి. తినేటప్పుడు ఆహారాన్ని మింగేయ కుండా ఎక్కువసేపు నమలాలి. రాత్రిళ్ళు 8 గంటలలోపుగా భోజనం ముగించిన, రెండుగంటల తర్వాత నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. అంతేకాక అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. అదే క్రమంలో అధిక మోతాదులో మంచినీరు తాగాలి. అయితే నీరు తాగేందుకు పగటిపూటే అధిక ప్రాధాన్యతనివ్వాలి. కాని ఈ ప్రక్రియ ఈ నాటి బిజీలైఫ్‌లో కష్టతరంగా మారింది.

లైపోసక్షన్‌ : లైపోసక్షన్‌ ఎటువంటి శ్రమలేకుండా బరువు తగ్గేందుకు ఆధునిక వైద్యం సహాయ పడుతోంది. నగర జీవితాల్లో శారీరక శ్రమ తగ్గిపోవడంతోపాటు ఆహార అలవాట్లలో మార్పులు రావటంతో శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఒంట్లో పేరుకున్న కొవ్వును పెరిగిపోతున్న శరీర బరువును తగ్గించుకోవడానికి వాకింగ్‌, జాగింగ్‌, యోగా వంటి వ్యాయామాలను చేసేవారిని మనం రోజూ చూస్తున్నాం. ఏం చేసినా కొవ్వు కరగక పోవటంతో పలురకాల సమస్యలతో సతమత మవుతున్నారు కొందరు. ఇటువంటి వారి కోసమే 'లైపోసక్షన్‌' అందుబాటులోకి వచ్చింది.

లైపోసక్షన్‌ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం. ఇది ఓ రకమైన ఆధునిక శస్త చికిత్స. ఈ చికిత్సలో సూక్ష్మగొట్టాలు, అల్ట్రాసోనిక్‌ తరంగాలు, ఇంజెక్షన్‌ వంటి వాటిని ఉపయోగించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఏ ఏ శరీర భాగాలంటే బుగ్గలు, మెడ, చేతులు, నడుము, తొడలు, వంటిభాగాలనుండి లైపోసక్షన్‌ ద్వారా సులభంగా కొవ్వును తొలగించ వచ్చు. లైపోసక్షన్‌ ద్వారా సైడ్‌ఎఫెక్ట్స్‌ లేవు. ఎటువంటి బలహీనత రాదు. లైపోసక్షన్‌తో సన్నగా మారటంతో అధిక బరువు వల్ల వచ్చే బి.పి, మధుమేహం , గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా వుండవచ్చు. లావుగా వుంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని, వెంటనే సన్నగా మారేందుకు లైపోసక్షన్‌ చేయించుకోమని కొంతమంది వైద్యులు కూడా సూచిస్తున్నారు.

లైపోసక్షన్‌ ఎవరైనా చేయించుకోవచ్చా అంటే అవును, ఆరోగ్యంగా వున్నవారు ఎవరైనా చేయించు కోవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే షుగర్‌, బి.పి, థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అవి అదుపులో వుంటేనే ఈ చికిత్స సాధ్యం. అలా అని లైపోసక్షన్‌తో ఒక సిట్టింగ్‌లోనే శరీరంలో పేరుకున్న కొవ్వును తొలగించేస్తారు అనుకోవటం పొరపాటే. కొందరికి రెండు , మూడు సిట్టింగులు కూడా అవసరమవు తాయి.

ఏ వయసు వారికి ఎంత కొవ్వును తొలగించవచ్చు?

  • ఒక సిట్టింగ్‌లో 25 నుండి 35 సంవత్సరాల వారికి 8నుండి 10 లీటర్ల వరకు కొవ్వును తొలగించవచ్చు. అదే 25 సంవత్సరాల లోపు వారికి 12 లీటర్ల వరకు తొలగించవచ్చు. ఇక 35 నుండి 45 సంవత్సరాల వారికి 8 లీటర్లు, 45 సంవత్సరాలు పై బడిన వారికి 5 లీటర్లు తీసి వేయవచ్చు. వయస్సును బట్టి' సిట్టింగ్స్‌ నిర్ణయిస్తారు .

చికిత్సా విధానం
  • లైపోసక్షన్ అంటే 3-4 మిల్లిమీటర్లు రంధ్రాలు చేసి చర్మం కింద కేంద్రీకృతమైన కొవ్వును ద్రవరూపంలో తీసే పద్ధతి. ఇది పూర్తిగా కాస్మొటిక్ సర్జరీ. లైపోసక్షన్ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.

శరీరంలో కొవ్వు ద్రవరూపంలో ఉండదు. దాన్ని లైపోసక్షన్‌లో ద్రవంగా మార్చి రంధ్రం ద్వారా వెలుపలికి తీయడం జరుగుతుంది. కొవ్వు పొరల్లోకి నార్మల్ సెలైన్ (ఎన్ఎస్) ఎక్కించడంతో అది నీటిలో ముంచిన స్పాంజి మాదిరిగా తయారవుతుంది. దానివల్ల కొవ్వు పొరలు వేరవుతాయి. రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి.

కొవ్వును చేతితో కాన్యులా సహాయంతో, అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా కరిగించి ద్రవరూపంలోకి మారుస్తారు. అల్ట్రాసోనిక్ తరంగాలు, శరీరంలో ఏ విధమైన దీర్ఘకాలిక మార్పులు, హాని చేయవని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది అచ్చం ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌లాగానే ఉంటుంది. మూడోది అల్ట్రాసోనిక్ పద్ధతి ద్వారా ద్రవరూపంలోకి మారిన కొవ్వును సక్షన్ పంప్ సాయంతో బయటకు లాగుతారు.

  • అల్ట్రాసోనిక్ లైపోసక్షన్
సాధారణ పద్ధతిలో కంటే అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ ద్వారా రక్తస్రావం చాలావరకు తగ్గుతుంది. నొప్పులు తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా విధులకు హాజరు కావొచ్చు. ఈ చికిత్స కూడా తక్కువ సమయంలో పూర్తవుతుంది. బరువు విషయంలోనే కాకుండా పురుషుల్లో ఛాతీ పెరుగుదలను అంటే గైనకోమాస్టియాతో బాధపడుతున్న వారికి కూడా ఈ పద్ధతిలో గ్రంధులు కరిగించడం వీలవుతుంది. దీనివల్ల మచ్చలు ఏర్పడవు.

  • దుష్ప్రభావాలు :
లైపోసక్షన్‌ ద్వారా ఎటువంటి నొప్పులు వుండవు. ఈ సర్జరీకి మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్జరీ అనంతరం మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఎటువంటి నొప్పులు రావు, ఎప్పటిలాగానే పనులన్నీ చేసుకోవచ్చు. కొవ్వును తీసివేసినా చర్మం వదులుగా మారకుండా వుండేందుకు సర్జరీ అనంతరం 'ప్రెషర్‌ గార్మెంట్స్‌'నే ధరించాల్సివుంటుంది. వీటిని ధరించడం వల్ల చర్మం క్రిందిపొరకు అతుక్కు పోతుంది. ఈ చికిత్సలో శరీరంలో మూడు నుండి నాలుగు మి.మీ.ల చిన్నపాటి రంధ్రాన్ని చేస్తారు.అనంతరం అందులో నుండి వేజర్‌ ప్రోప్స్‌ను పంపించి కొవ్వును కరిగించి తీసేస్తారు. అల్ట్రాసౌండ్‌ ఎనర్జీతో సెకనుకు 36 వేల వైబ్రేషన్‌లతో వేజర్‌ప్రోప్‌ ద్వారా కొవ్వును తీస్తారు. దీనిలో రక్తస్రావం చాలా తక్కువగా వుంటుంది. ఒక లీటరు కొవ్వులో 10.మి.లీ.ల కంటే తక్కువ రక్తం పోతుంది. 10 లీటర్ల కొవ్వును తీసినప్పుడు కూడా 100మి.లీ.ల రక్తం పోతుందని వైద్యుల అంచనా.

  • జాగ్రత్తలు
లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత కంప్రెషర్ గార్మెంట్స్‌ను కనీసం రెండు వారాలు వేసుకోవాలి. ఈ దుస్తులు వేసుకోవడం వల్ల గాయం త్వరగా మానడమే కాకుండా, ఆపరేషన్ తర్వాత సాధారణంగా ఏర్పడే వాపు, చీము పట్టడం లాంటి దుష్ప్ర్రభావాలు ఉండవు. ప్రత్యేకంగా మెష్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసే ఈ కంప్రెషర్ గార్మెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన ద్రవాన్ని తయారుచేసే లింఫాటిక్ వ్యవస్థను పరిరక్షించడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయి. తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామాన్ని రెండు వారాల తరువాత మొదలుపెట్టాలి.

అందాన్ని కాపాడుకోవాలనుకునేవాళ్ళూ, ఆరోగ్యం పట్ల అవగాహన వున్నవారు ఈ సర్జరీపట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్‌ వరల్డ్‌లో వున్నవారైతే వారి అవసరాలరీత్యా దీనిని ఆశ్రయిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా విదేశాల్లో లైపోసక్షన్‌ ఎక్కువగా చేస్తున్నారు. అమెరికా ప్లాస్టిక్‌ సర్జరీ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం గత ఏడాది 16 లక్షల మంది లైపోసక్షన్‌ చేయించుకున్నారు. మన దేశంలో కూడా గత ఏడాది 4 లక్షల మంది లైపోసక్షన్‌ ద్వారా లబ్దిపొందారు. చూడ చక్కని శరీరాకృతి కొరకు నేడు ఈ చికిత్స విదేశాల్లోనే గాక మన దేశంలోని ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి వచ్చేసింది. దీనిని ఆరోగ్యవంతులు ఎవరైనా చేయించుకోవచ్చు. అందమైన ఆకృతిని పొందవచ్చు. అనుభవజ్ఞుడైన కాస్మెటిక్‌ సర్జన్‌లు దగ్గరే ఈ చికిత్స చేయించుకోవాలి..

ఇది గుర్తుంచుకోవాలి!

ఒకసారి కొవ్వు తొలగించాక.. మళ్లీ అక్కడ కొవ్వు పెరగదన్నది పెద్ద అపోహ! ఆహార నియమాలు, వ్యాయామం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే తిరిగి కొవ్వు పెరుగుతుందని మరవకూడదు. నిజానికి మన చర్మంలో ఉండేది 80% కొవ్వే. చర్మం సజీవంగా ఉండాలంటే కొవ్వు తప్పనిసరి. కొవ్వు మొత్తం తీసేస్తే చర్మం కుళ్లిపోతుంది. అందుకే లైపోసక్షన్‌ చేసే సమయంలో కొంత కొవ్వు అక్కడ మిగిలి ఉండేలా జాగ్రత్త పడతారు. ఆపరేషన్‌ అనంతరం జీవనశైలి మార్చుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కొవ్వు మళ్లీ పెరిగి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. 
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.