మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఎర్ర రక్తకణాల తయారీలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఎముకల పటిష్టతను కాపాడాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బుపడితే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం...
దీర్ఘకాల మూత్రపిండాల (కిడ్నీలు) వ్యాధికి కారణం మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతిపెద్దది మధుమేహం. సుమారు 40 నుంచి 50 శాతం వరకు మూత్రపిండాల వ్యాధులు రావడానికి ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది. కిడ్నీలోని ప్రత్యేక ఫిల్టర్లను దెబ్బతీసే గ్లోమరూలార్ డిసీజ్ మూడవ ప్రధాన కారణం. ఈ జబ్బున్న వారికి మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంది. ఫలితంగా కాళ్లల్లో వాపు, మొహం వాచినట్లుంటుంది. నురగగా మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇవే కాకుండా ఎలాంటి కారణం లేకుండానూ కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలో మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటర్‌స్టిషియల్ వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు. కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బులు కూడా ఇతర కారణాలు. అయితే 80 శాతం మాత్రం మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు.
ఎవరికొస్తాయి ?
చిన్న పిల్లల్లో అయితే జన్యుపరమైన కిడ్నీలోపాలున్న వారికి వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, ప్రొస్టేట్ గ్రంథి పెరగడం వల్ల పెద్ద వాళ్లకు కిడ్నీలు దెబ్బతింటాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసే వారికి, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది.
లక్షణాలు
కాళ్లవాపులు, మొహం వాచినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, ఆగకుండా వాంతులవడం, నీరసంగా ఉండడం, ఆయాసం రావడం, రాత్రివేళ మూత్రం కోసం నిద్రలేవడం, తక్కువ మూత్రం రావడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలుంటాయి. 50 శాతం కిడ్నీలు పాడైతేనే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స
కిడ్నీ వంద శాతం పాడైనప్పుడు కిడ్నీ మార్పిడితో రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరికీ సాధ్యమవదు. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. దాత అవసరం అవుతారు. అరవై ఏళ్లుపైబడిన వారికి కిడ్నీ మార్పిడి చేయడం సాధ్యం కాదు. మార్పిడికి ప్రత్యామ్నాయం డయాలసిస్ (రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ) ఇది రెండు రకాలు. ఒకటి హీమో డయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్.
హీమోడయాలసిస్
ఇది యంత్రం ద్వారా రక్తన్ని శుద్ధి చేసే ప్రక్రియ. కృత్రిమ కిడ్నీ ద్వారా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధిచేస్తారు. దీని కోసం వారానికి మూడుసార్లు రోజు విడిచి రోజు డయాలసిస్ కేంద్రానికి వెళ్లాలి. సుమారు నాలుగు నుండి ఐదు గంటలు సమయం కేటాయించాలి.
పెరిటోనియల్ డయాలసిస్
ఇది ఇంట్లో చేసుకునే డయాలసిస్. దీన్నే 'కంటిన్యూయస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్' అని అంటారు. డయాలసిస్ ఒక ఆసరా. అంతేకాని పూర్తి ప్రత్యామ్నాయం కాదు. అయినా కొన్నిప్రత్యేక పరిస్థితుల్లో ఇంట్లో డయాలసిస్ చాలా ఉపయోగకరం. ఆహారంతో, తాగే నీటి పరిమాణంలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే యదేచ్ఛగా తినవచ్చు. తాగొచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు.
కిడ్నీ మార్పిడి
ప్రపంచంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమమైన విధానం కిడ్నీ మార్పిడి. కిడ్నీ మార్పిడి, హీమోడయాలసిస్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటికి ప్రత్యామ్నాయం ఇంట్లో చేసుకునే డయాలసిస్. దీనికి నెలసరి ఖర్చు తక్కువగా ఉంటుంది. నెలకు సుమారు రూ.12 వేల నుండి 15 వేల వరకు ఉంటుంది. ఆశావాద దృక్పథంతో శాస్త్రీయతను ఉపయోగించుకునే వారికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆరోగ్యకరమైన సాధారణ జీవితానివ్వగలదు.
కిడ్నీలో రాళ్లు - లక్షణాలు
* భరించలేనినొప్పి. మూత్రంలో రక్తం పడడం. ఈ పరిస్థితి కిడ్నీ, యూరేటర్, యూరెత్ర గోడల్లో ఏదో ఒకటికానీ, అన్ని కానీ దెబ్బతిన్నప్పుడు సంభవిస్తుంది.
* మూత్రంలో చీము రావడం.
* విసర్జనసమయంలో మార్గం మంటగా అనిపించడం. మూత్రంతోపాటు చిన్న రాళ్లు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కనిపిస్తుంది.
* మూత్రం పరిమాణం తగ్గడం. యురెత్రాలో కానీ, మూత్రాశయంలోకానీ లేదా రెండింటిలో కానీ రాళ్లున్నప్పుడు జరగొచ్చు.
* తల తిరగడం, వాంతులవడం, చలి జ్వరం కూడా రావొచ్చు.
* రాయి యురేటర్‌ని బ్లాక్ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయడం.
* ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం.
* జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్త కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తిలేకపోవడం. బరువు తగ్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు
* ఎక్కువ నీళ్లు తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి.
* ప్రోటీన్, నైట్రోజన్, సోడియం ఉన్న పదార్థాలను తగ్గించాలి.
* ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్లు వంటి వాటిని మినహాయించాలి.
* కాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి. అలాగే కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో ఆహార నియమాలను అనుసరిస్తే మంచిది. అరటి, నిమ్మ, క్యారట్, కాకరకాయ, పైనాపిల్, కొబ్బరినీళ్లు, బార్లి, ఉలవలు మేలు చేస్తాయి.
* ఆల్కహాలు తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కలుగుతుంది. క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడే అవకాశం ఎక్కువ.
* నారింజ పళ్ల రసానికి కాల్షియం ఆక్సిలేట్ రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది.
విటమిన్-సి ఎక్కువగా తీసుకోవడం కూడా రాళ్ల సమస్యకు దారితీసే అవకాశముంది. కూల్‌డ్రింకులను మినహాయించాలి.
కాఫీలోని కెఫిన్ అనే పదార్థం మూత్రంలోని కాల్షియం విసర్జనకు దోహదం చేస్తుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలోని నివారించుకోవచ్చని పరిశోధనలు వెల్లడించాయి.
source : Raksha@prajasakti news paper
- ===========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.