updated :
ఒత్తిడితో మధుమేహం!45% ముప్పు అధికం స్వీడన్ అధ్యయనంలో వెల్లడి( 09-Feb-13)
లండన్: నిరంతరం ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఇలా ఎల్లప్పుడూ ఒత్తిడితో బాధపడే పురుషులకు మధుమేహం ముప్పు 45% ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో 7,500 మంది పురుషులను 35 ఏళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని 1970లో ఆరంభించారు. ఇందులో 1915-1925 మధ్యకాలంలో జన్మించిన వారిని ఎంచుకున్నారు. తాము ఎంచుకున్న 7,500 మందిలో 6,828 మందికి అంతకుముందు మధుమేహం, గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యలేవీ లేవు. అధ్యయన కాలం ముగిసేటప్పటికి వీరిలో మొత్తం 899 మంది మధుమేహం బారినపడ్డట్టు గుర్తించారు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారికి మధుమేహం ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు తేలటం గమనార్హం. చిరాకు, ఆందోళన, ఇంట్లో లేదా ఆఫీసులో ఎదురయ్యే సమస్యల మూలంగా నిద్ర సరిగా పట్టకపోవటం వంటి అంశాల ఆధారంగా ఒత్తిడి తీవ్రతను గణించి ఈ విషయాన్ని నిర్ధరించారు. వయసు, సామాజికార్థిక స్థాయి, శారీరక శ్రమ, శరీర బరువు ఎత్తుల నిష్పత్తి, రక్తపోటు, రక్తపోటు తగ్గేందుకు వేసుకునే మందుల వంటి వాటిని పక్కనపెట్టినప్పటికీ.. మధుమేహానికీ ఒత్తిడికీ గణనీయమైన సంబంధం ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు తెలిపారు. ''ప్రస్తుతం మధుమేహాన్ని నివారించగల అంశాల్లో ఒత్తిడిని గుర్తించటం లేదు'' అని అధ్యయన నేత మసుమా నోవాక్ పేర్కొన్నారు. ఈ రెండింటికీ మధ్య నేరుగా సంబంధం ఉంటున్నట్టు తమ అధ్యయనంలో తేలినందువల్ల మధుమేహం నివారణ పద్ధతుల్లో ఒత్తిడిని కూడా చేర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు
- =====================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.