మన జీవితానికీ, జీవనానికీ నాలుక ఎంత కీలకమైనదో!అద్భుతమైన రుచులు చెప్పటం, మాటలకు బాసటవ్వటం, నమలటానికి ఆసరాగా నిలవటం.. నాలుక మోసేవన్నీ ఇలా కీలకమైన బాధ్యతలే! ఇవన్నీ కాకుండా.. నాలుక చెప్పే విషయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. తరచుగా మన ఒంట్లో ఏం జరుగుతోందో.. మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెబుతుంది మన నాలుక! నోటి నుంచి మలద్వారం వరకూ ఉండే సుదీర్ఘ జీర్ణ గొట్టంలో వచ్చే మార్పులే కాదు.. మొత్తం శరీరంలో వచ్చే చాలా రకాల మార్పులు మన నాలుక మీద ప్రతిఫలిస్తుంటాయి! అందుకే అనాదిగా వైద్యంలో నాలుక చూడటానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యరంగం 'గ్లాసాలజీ' పేరుతో దీన్నో చిన్న ప్రత్యేక విభాగంగా (నాలుక శాస్త్రంగా) పరిగణించే స్థితికి వెళ్లిందంటే దీనికి ఉండే ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే నాలుక పట్టిచెప్పే రకరకాల వ్యాధులు, బాధల వివరాలు :
రోగి లోపలికి వస్తూనే.. వైద్యులు వారిని దాదాపు 'నఖశిఖ పర్యంతం' ఒక్కసారి తేరిపార జూస్తారు! ఈ ఒక్క చూపు చాలు.. రోగికీ, రోగానికీ సంబంధించిన చాలా విషయాలను గ్రహించటానికి. పద్ధతి ప్రకారం ఈ పని చేస్తే నూటికి డెబ్భై శాతం వరకూ వ్యాధిని తేలికగా పట్టుకోవచ్చు. రోగిని పరీక్షగా చూడటం, రోగి చెప్పే వ్యాధి వివరాలను, రోగి వివరాలను అడిగి తెలుసుకోవటం... వీటికి తోడుగా రోగి జుట్టు, కళ్లు, నాలుక, గోళ్లు, కాళ్లు, చర్మం వంటివి పరీక్షగా చూడటం ద్వారా వైద్యులు రోగానికి సంబంధించిన చాలా వివరాలను అవగతం చేసుకోగలుగుతారు. అందుకే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెంది అత్యాధునిక పరికరాలు, స్కానింగ్ యంత్రాల వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఇవాల్టికీ రోగిని పరీక్షించటానికీ, రోగి చెప్పే చరిత్రకూ ఉన్న ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తేలికగా పూర్తయ్యే ఈ పరీక్షల ద్వారా సమస్యనూ, దాని ఆనుపానులను శరీరంలో ఎక్కడ, ఏ వ్యవస్థలో ఉన్నాయన్నది గ్రహించటం తేలిక అవుతుంది. వీటిలో అత్యంత కీలకమైనది నాలుక. దాదాపు ప్రతి రోగికీ నాలుక చూడటం అవసరం. చాలా రకాల వ్యాధుల సంకేతాలు, చిహ్నాలు మనకు నాలుక మీద ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. దీనివల్ల కొన్ని వ్యాధులను అనుమానించి, తేలికగా నిర్ధారించుకునే వీలుంటుంది.
లక్షణం పొడారి ఎండటం--సంకేతం డీహైడ్రేషన్?
విరేచనాలు, వాంతుల వంటివి అవుతున్నప్పుడు ఒంట్లో నీరు బాగా తగ్గిపోయి 'డీహైడ్రేషన్' తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్ఫుటంగా కనబడే లక్షణం నాలుక బాగా పొడారి, ఎండినట్లు కబనడటం. ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఇలా పొడిగా తయారైతే వెంటనే డీహైడ్రేషన్ తలెత్తుతోందేమోనని అనుమానించటం అవసరం. కొన్నిసార్లు విపరీతమైన భయం, ఆందోళన వంటివాటికి గురైన వారిలోనూ, అలాగే సైనుసైటిస్ వంటి సమస్యలతో బాధపడుతూ నోటితో గాలి పీల్చే వారిలో కూడా నాలుక పొడిగా కనబడొచ్చు. కొన్ని రకాల మానసిక సమస్యలకు వాడే మందుల వల్ల లాలాజలం తగ్గిపోయి, దానివల్ల కూడా నాలుక పొడిగా తయారవ్వచ్చు.
లక్షణం సైజు పెద్దా చిన్నా--సంకేతం కొన్ని వ్యాధులు :
నాలుక కొందరిలో చాలా పెద్దగా ఉంటుంది. ఇది నోట్లో పట్టటం కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. దీన్నే 'మాక్రో గ్లాసియా' అంటారు. ఇది గ్రోత్ హార్మోను ఎక్కువగా ఉండే 'యాక్రో మెగాలే' బాధితుల్లో, థైరాయిడ్ వ్యాధి బాగా ముదిరిపోయిన (మిక్సెడీమా) వారిలో, ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. అరుదుగా క్యాన్సర్ కణుతులు పెరుగుతున్నప్పుడు కూడా పెద్దదిగా అనిపించొచ్చు. కొన్ని రకాల అలర్జీల్లో తాత్కాలికంగా నాలుక వాపు రావచ్చు. క్షామ పరిస్థితుల్లో జీవించేవారిలో, మెదడు సంబంధ వ్యాధులతో బాధపడే వారిలో నాలుక సైజు చిన్నగా అయిపోవచ్చు. ఒంట్లో నీరు తీవ్రంగా తగ్గిపోయినప్పుడు కూడా నాలుక ఎండిపోయి, చిన్నదిగా కనబడే అవకాశం ఉంటుంది.
లక్షణం పాలిపోవటం--సంకేతం రక్తహీనత :
మన దేశంలో అతి సాధారణమైనది రక్తహీనత. గ్రామాల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది స్త్రీలలో, ముఖ్యంగా గర్భిణులలో ఈ సమస్య చాలా ఎక్కువ. ముదురు గులాబి రంగులో ఉండాల్సిన నాలుక.. పాలిపోయి లేత రంగులో ఉండటం రక్తహీనతకు ముఖ్య సంకేతం. రక్తం మరీ తక్కువుంటే ఇంకా పాలిపోయి ఉంటుంది. దీన్ని చూస్తూనే హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించి, సమస్యను నిర్ధారించి, చికిత్స అందించే వీలుంటుంది.
లక్షణం నున్నటి నాలుక--సంకేతం విటమిన్ల లోపం? :
నాలుక మీద చిన్నచిన్న మొగ్గల్లాంటివి (పాపిల్లే) ఉంటాయి. ఒంట్లో ఇనుము, నియాసిన్ వంటి బీ కాంప్లెక్స్ విటమిన్లు వంటివి తగ్గినప్పుడు ఇవన్నీ పోయి పోయి... నాలుక ఇస్త్రీ చేసినట్టుగా నున్నగా అయిపోతుంది. దీన్ని 'బాల్డ్ టంగ్' అంటారు. దీన్ని గుర్తించి చికిత్స అందించటం అవసరం.
లక్షణం నల్లటి నాలుక--సంకేతం మందులేనా? :
కొద్దిమందికి నాలుక నల్లగా అయిపోతుంది. ఇది ముఖ్యంగా రక్తం పట్టేందుకు ఇచ్చే 'ఐరన్ సిరప్'లు వాడేవారిలో ఎక్కువ. ఈ సిరప్‌లు వాడినంత కాలం ఉండి, తర్వాత అదే తగ్గిపోతుంది. దీనివల్ల ప్రమాదమేమీ ఉండదు. కొన్నిసార్లు పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్, అసిడిటీకి వాడే బిస్మత్ వంటి వాటి వల్ల కూడా నాలుక నల్లబడే అవకాశం ఉంటుంది. అలాగే అరుదుగా 'లైనిజోలిడ్' వంటి కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా నాలుక రంగు మారిపోవచ్చు.
లక్షణం గాళ్లు పగుళ్లు--సంకేతం కంగారులేదు :
సాధారణంగా నాలుక మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కానీ కొంతమందికి పగుళ్లిచ్చినట్టు గాళ్లుగాళ్లుగా, గరుకుగా, చూడటానికి కాస్త భయంకరంగా కూడా ఉండొచ్చు. కొందరిలో ఇది సహజం, దీనికి ప్రత్యేకమైన కారణమేదీ ఉండకపోవచ్చు. దీన్ని గురించి ఆందోళన అవసరం ఉండదు కూడా. కానీ కొద్దిమందిలో మాత్రం విటమిన్ బి లోపం వల్ల, పుట్టుకతోనే వచ్చే జన్యులోపం (డౌన్స్ సిండ్రోమ్) వల్ల, ఎదుగుదలకు దోహదం చేసే గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండే 'యాక్రో మెగాలే' వ్యాధి వల్ల కూడా ఇలా నాలుక పగుళ్లిచ్చినట్లుగా తయారవ్వచ్చు. దీన్ని వైద్యులు గుర్తిస్తారు.
లక్షణం వణికే నాలుక--సంకేతం రకరకాల వ్యాధులు :
నాలుకలో బలమైన కండరాలు, వాటిని కదిలించే నాడులు ఉంటాయి. పక్షవాతం వంటివి వచ్చినప్పుడు నాలుక ఒక పక్కకు వంకర తరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు, థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువున్నప్పుడు, కొంతకాలం మద్యం తాగి మానేసినప్పుడు, పార్కిన్సన్స్ వ్యాధిలో నాలుక వణుకుతున్నట్టు కదిలిపోతుండొచ్చు. పురుగుల మందు తాగిన వారిలో కూడా నాడులు దెబ్బతిని, నాలుక విపరీతంగా అటూ ఇటూ కదిలిపోతుండొచ్చు.
లక్షణం తెల్లటి పూత--సంకేతం అజీర్ణం? :
కలవరపెట్టే సమస్య నాలుక మొత్తం తెల్లటి పూతలా (కోటింగ్) రావటం. ఇది అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం, విపరీతంగా మద్యం తాగటం, పొగ తాగటం, జ్వరాలు, లివర్ జబ్బుల వంటి వాటిలో ఎక్కువగా కనబడుతుంటుంది. సమస్యను గుర్తించి దానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అయితే నాలుకను విపరీతంగా గీరటం, గీకటం మాత్రం సరికాదు.
లక్షణం పెరుగు తరకల పూత--సంకేతం రోగనిరోధక శక్తి తగ్గటం :
నాలుక మీద తెల్లటి పెరుగు తరకల్లా పూత రావచ్చు. నోటిలో 'ఫంగస్' చేరి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు (క్యాండిడియాసిస్) నాలుక మీద ఇలా తెల్లటి పెరుగులాంటి పూత కనబడుతుంది. నిజానికి నాలుకకు రక్తసరఫరా ఎక్కువ, లాలాజలం నిరంతరం కడిగేస్తుంటుంది కాబట్టి సాధారణంగా ఇటువంటి ఇన్ఫెక్షన్లు అరుదు. కానీ కొన్నిసార్లు ఒంట్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేకుండా ఉండిపోయిన వారిలోనూ, హెచ్‌ఐవీ బాధితుల్లోనూ, ఇతరత్రా వ్యాధులతో మంచానపడి రోజుల తరబడి పండ్లు సరిగా తోముకోకుండా ఉండిపోతున్న వారిలోనూ ఎక్కువ. ఇవే కాకుండా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారిలో, అలాగే దీర్ఘకాలం స్టిరాయిడ్ మందులు వాడుతున్న వారిలో కూడా రోగనిరోధక శక్తి సన్నగిల్లి.. ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. ఈ లక్షణాన్ని వెంటనే గుర్తించి 'యాంటీ ఫంగల్' చికిత్సతో పాటు సమస్యకు మూలాన్ని కూడా గుర్తించి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
లక్షణం ఎర్రగా పొక్కిపోవటం--సంకేతం యాంటీబయాటిక్స్ వాడకం :
దీర్ఘకాలం యాంటీబయాటిక్స్ వంటి మందులు వాడినప్పుడు మన పేగుల్లో బీ-కాంప్లెక్స్ విటమిన్‌ను తయారు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల విటమిన్-బి (నియాసిన్) లోపం తలెత్తి.. నాలుక ఎర్రగా పొక్కిపోతుంది. వైద్యుల దృష్టికి తీసుకువెళితే వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు.
* కొందరికి నాలుక విపరీతంగా ఎర్రగా, స్ట్రాబెర్రీ పండులాగా అయిపోతుంది.కొన్నికొన్ని రకాల వ్యాధుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ ఉండాల్సిన దాని కంటే చాలాచాలా ఎక్కువగా అయిపోతూ.. వీరిలో నాలుక కూడా బాగా ఎర్రగా అయిపోతుంది. కొద్దిమందిలో బీకాంప్లెక్స్ (రైబోఫ్లోవిన్) లోపం తలెత్తినప్పుడూ నాలుక ఎర్రబారుతుంది.
లక్షణం నీలం నాలుక--సంకేతం శ్వాస ప్రక్రియ లోపం? :
కొందరికి నాలుక నీలం రంగులోకి మారిపోవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. సాధారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తి, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం పెరుగుతున్నప్పుడు (సైనోసిస్) నాలుక నీలంగా మారచ్చు. అయితే ఈ సమయంలో కేవలం నాలుకే కాదు, గోళ్లు, కొన్నిసార్లు చర్మం కూడా నీలంగా మారుతుంటాయి. కొన్నిసార్లు పుట్టుకతోనే గుండె జబ్బులున్న పిల్లల్లో లేదా పుట్టగానే ఏడ్వని పిల్లల్లో కూడా ఇటువంటి సమస్య తలెత్తచ్చు. మొత్తానికి నాలుక నీలంగా మారిందంటే కచ్చితంగా వైద్యులకు చూపించి సమస్యను నిర్ధారించుకోవటం అవసరం.
లక్షణం విచిత్ర ఆకారాలు--సంకేతం భయం లేదు :
కొందరికి నాలుక మీద పైపొరలో.. రకరకాల ఆకృతుల్లో గాళ్లు, అరలు, నెర్రల వంటివి వచ్చి... తరచూ వాటి ఆకృతులు మారిపోతుంటాయి. ఇవి చూడటానికి ఒక మ్యాపులాగా ఉండటంతో దీన్ని 'జియోగ్రఫిక్ టంగ్' అంటారు. దీనికి పెద్దగా కారణమేదీ ఉండదు. దీనివల్ల ప్రమాదమూ ఉండదు. అయితే చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటంతో చాలామంది భయపడుతుంటారు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవటం, సున్నితంగా బ్రషింగ్ చేసుకోవటం, నాలుక పైభాగాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కడగటం వంటిజాగ్రత్త చర్యలతో దీన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.
లక్షణం నల్ల మచ్చలు--సంకేతం విటమిన్ బి12 లోపం :
కొందరికి ఒంట్లో విటమిన్ బి12 లోపించటం వల్ల నాలుక పాలిపోయినట్లు ఉండటమే కాకుండా.. కొన్నిసార్లు దాని మీద నల్లమచ్చలు కూడా రావచ్చు. నిజానికి ఒంట్లో బి12 లోపం ఉన్నప్పుడు ఇటువంటి మచ్చలు (పిగ్మెంటేషన్) అర చేతుల్లోనూ రావచ్చు. ఇవే మచ్చలు నాలుక మీదా కనబడొచ్చు. కాబట్టి ఇటువంటి మచ్చలు కనబడితే వైద్యులు 'బి12' లోపంగా భావించి నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తారు.
* కొందరికి కాఫీ పొడి రంగు, నలుపు రంగు కలిసినట్లుగా నాలుక మీద మచ్చలు వస్తుంటాయి. వీరిలో పెద్దపేగులో పిలకలు (పాలిప్స్) వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణం నంజు పొక్కులు--సంకేతం ఒత్తిడి? :
చాలామందిని తరచుగా వస్తూపోతూ వేధిస్తుండే సమస్య.. నాలుక మీద నంజు పొక్కులు (ఆప్థస్ అల్సర్స్). పొక్కులు బాగా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి, బాధ వేధిస్తుంటాయి. చాలామంది ఇవి బీకాంప్లెక్స్ లోపం వల్ల వస్తాయని భావిస్తారుగానీ అది పూర్తి నిజం కాదు. ఇవెందుకు వస్తాయో ఇదమిత్థమైన కారణం తెలియదు. అయితే ఈ సమస్య తీవ్రమైన మానసిక ఒత్తిడి పరిస్థితులను అనుభవిస్తున్న వారిలో.. అంటే పరీక్షలకు వెళుతున్న పిల్లలు, నిద్ర సరిగా లేనివారు, వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్న వారిలో అధికంగా కనబడుతుంటుంది. వారం పది రోజుల్లో అవే తగ్గిపోతాయి. అవసరమైతే వైద్యులు నొప్పి తెలియకుండా వీటికి క్రీముల వంటివి సిఫార్సు చేస్తారు.
లక్షణం తెల్లటి మచ్చలు--సంకేతం క్యాన్సర్‌కు ముందు దశ? :
దీర్ఘకాలం పొగతాగటం, పొగాకు వాడటం వంటివాటి వల్ల నోటిలో క్యాన్సర్ వచ్చే ముప్పు పొంచి ఉంటుంది. వీరిలో తొలిదశలో నాలుక తెల్లగా మారిపోవటం, తెల్లటి మచ్చలు రావటం ఎక్కువ. దీన్నే 'ల్యూకో ప్లేకియా' అంటారు. ఈ తెలుపు గీకినా పోదు. నొప్పీ ఉండదు. ఇటువంటి మచ్చలు కనబడితే తక్షణం వైద్యులను సంప్రదించటం అవసరం.
లక్షణం నొప్పిలేని పుండ్లు--సంకేతం క్యాన్సర్? :
నాలుక మీద పుండు లేదా పుండ్లు ఉండి, వాటి వల్ల నొప్పేమీ లేకపోతే మాత్రం దాన్ని క్యాన్సర్ పుండ్లేమోనని అనుమానించి, తక్షణం వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. హెర్పిస్, సిఫిలిస్ వంటి వ్యాధుల్లో కూడా నోట్లో, నాలుక మీద నొప్పి లేని పుండ్లు రావచ్చు. విటమిన్-బి లోపం వల్ల కూడా పుండ్లు రావచ్చుగానీ ఇటీవలి కాలంలో ఇది చాలాచాలా అరుదనే చెప్పాలి. పేగుల్లో చోటుచేసుకునే కొన్ని రకాల జబ్బుల వల్ల (క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్ మొదలగునవి) కూడా నాలుక మీద పుండ్లు రావచ్చు. మొత్తమ్మీద నాలుక పుండు ఏదైనా 3 వారాల కంటే ఎక్కువకాలం మానకుండా ఉండిపోతే తక్షణం వైద్యులకు చూపించి, అవసరమైతే ముక్క పరీక్షించటం కూడా ముఖ్యమే.
లక్షణం మంట--సంకేతం వ్యాధేం కాదు :
నాలుక మీద మంట సాధారణమైన సమస్యే కానీ చాలాసార్లు దీనికి తీవ్రమైన వ్యాధులేమీ కారణం కాదు. కొందరిలో నాలుక కాలినట్లనిపించటం, రుచులు కూడా కొద్దిగా తేడాగా అనిపిస్తాయి. నాడులు సున్నితంగా తయారవటం వంటివే దీనికి కారణమవుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే మంట తగ్గేందుకు క్రీముల వంటివి సిఫార్సు చేస్తారు.
--courtesy with : Dr.Mallela Venkateswararao @Eenadu sukhibhava
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.