మధుమేహానికి జన్యుచికిత్స-కుక్కల్లో జబ్బు పూర్తిగా నయం-స్పెయిన్ పరిశోధకుల ఘనత
వాషింగ్టన్: మధుమేహంపై స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇక్కడి పరిశోధకులు జన్యుచికిత్స ద్వారా కుక్కల్లో పుట్టుకతోవచ్చే (టైప్1) మధుమేహాన్ని విజయవంతంగా నయం చేయగలగటం విశేషం. ఇది మనుషుల్లోనూ మధుమేహాన్ని నయం చేసే చికిత్సకు మార్గం వేయగలదని భావిస్తున్నారు. పెద్ద జంతువుల్లో మధుమేహాన్ని నయం చేయటం సాధ్యమేనని తేలటం ఇదే తొలిసారి. బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఫాతిమా బోష్ నేతృత్వంలో సాగిన ఈ అధ్యయనంలో కుక్కల కండరంలోకి 'గ్లూకోజు గ్రాహకం'ను ప్రవేశపెట్టటం కీలకమైన విషయం. ఈ జన్యుచికిత్సతో కుక్కలు మధుమేహం నుంచి పూర్తిగా కోలుకోవటమే కాదు.. నాలుగేళ్ల తర్వాత కూడా జబ్బు లక్షణాలు తిరిగి కనిపించకపోవటం గమనార్హం. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్కసారితో ముగిసిపోయే ఈ చికిత్సలో సాధారణ సూదులతో కుక్కల వెనక కాళ్లకు వివిధ రకాల ఇంజెక్షన్లను ఇచ్చారు. ఇన్సులిన్ జన్యువుతో పాటు రక్తంలోంచి గ్లూకోజును గ్రహించే ప్రక్రియను నియత్రించే గ్లూకోకైనేజ్ ఎంజైమ్ వ్యక్తం కావటానికి ఈ ఇంజెక్షన్ల ద్వారా కుక్కల్లోకి జన్యు వాహకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండూ కలసి 'గ్లూకోజు గ్రాహకం'గా పనిచేసి, రక్తంలో గ్లూకోజు మోతాదూ తగ్గటానికి తోడ్పడ్డాయి.
Courtesy with Eenadu Daily News-09/Feb/2013
- ===================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.