Thursday, August 29, 2013

Hepatitis-B,హెపటైటిస్‌-బి


  •  

  •  ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hepatitis-B,హెపటైటిస్‌-బి-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


హెపటైటిస్‌-బి

హెపటైటిస్‌ -బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌ -బి వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌ హెసడ్నావైరస్‌ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఇది ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్‌ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌ వైరస్‌ ఉన్నవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 - 5 శాతం వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి లివర్‌ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాప్తి మరియు వ్యాధి లక్షణాలు

ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

తొలి దశ
హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
1. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌ -బి ‘పాజిటివ్‌’ ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
2. క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95 శాతం మందికి ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్ళీ Elisa పరీక్ష చేస్తే ‘నెగిటివ్‌’ వచ్చేస్తుంది.
3. పెద్దల్లో కేవలం కొద్దిమందికి(5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అది అలాగే శరీరంలో ఉండిపోతుంది.
4. అంటే హెపటైటిస్‌ -బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
5. ఒకసారి హెపటైటిస్‌ -బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

వైరస్‌ మకాం
కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రోనిక్ పటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ - బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే... ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను అస్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి ఎలీష -HBsAg పాజిటివ్‌ ఉంటుంది గానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

1. వీళ్ళకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్ళు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటి రెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
2. కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ప్రమాదం
ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.
4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
5. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు, ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది, ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో - చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
7. సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
8. ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
9. వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

విపరీత పరిస్థితి
కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

ఏ పరీక్ష ఏం చెబుతుంది?
HBsAg: ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
SGPT :ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూ, ప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
HBeAg: ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులలో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు. ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది కాస్త ఖరీదైన పరీక్ష.

ముందు జాగ్రత్త
ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందుస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.
1. హెపటైటిస్‌ - బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
2. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
3. ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
4. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
5. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం... చాలా అవసరం!

పెళ్లి
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

గర్భిణులు
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

టీకాలు
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి.Courtesy with : డా ధర్మేష్‌ కపూర్‌, హెపటాలజిస్ట్‌-గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకపూల్‌@surya Telugu daily news paper
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. It would be helpful if you mention the details about the food to be taken by the patient during this period.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.