Saturday, December 25, 2010

డిస్క్‌ జారినప్పుడు(డిస్క్‌ ప్రొలాప్స్‌),Disk Prolapse


వయసుతో నడుంలోను, మెడలోను ఎముకల అరుగుదల, డిస్క్‌లలో ఏర్పడే డీజనరేషన్‌ మార్పులను స్పాండిలోసిస్‌ అంటామని గత వారం చెప్పుకున్నాం. అలాకాకుండా ప్రయాణాలలో ఏర్పడే అదుర్లు, నెత్తిమీద పెద్దపెద్ద బరువులు మోయటం, షేవింగ్‌ సెలూన్లలో అసహజ పద్ధతులలో మసాజ్‌ చేయించడం, వంగి అలవాటు లేని ఎక్కువ బరువులెత్తే ప్రయత్నం చేసినప్పుడు మెడ, నడుంలోని డిస్క్‌లు పక్కకు గాని, వెనుకకుగాని జరుగుతాయి. దీనినే డిస్క్‌ ప్రొలాప్స్‌ అంటాం. ఇది ముఖ్యంగా చిన్న వయసులో.. 20 నుండి 30 ఏళ్లలో రావడం అధికంగా ఉంటుంది.

సర్వైకల్‌ డిస్క్‌ప్రొలాప్స్‌

మెడలోని ఎముకలలో 5,6,7, ఎముకల మధ్యగల డిస్క్‌లు సాధారణంగా ఎక్కువగా స్లిప్‌ అవుతుంటాయి. ఎక్కువగా ముందుకు వంగి చదవటం, ద్విచక్ర వాహనాల్లో అధికంగా ప్రయా ణించటం, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు వృత్తి పరంగా ఎక్కువగా వంగి వుండటం, అలవాటు లేనివారు శీర్షా సనాన్ని ప్రయత్నించటం వల్ల డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్య ఉత్పన్నమవుతుంది.

లక్షణాలు : మెడ బిగుసు కుపోవడం, వున్నట్టుండి తీవ్రమైన నొప్పి కలగడం, మెడనుండి భుజం పైభాగానికి వెనుకకు తీవ్రంగా నొప్పి రావటం, భుజం నుండి మోచేతికి, చేతివేళ్ళ పొడవునా నొప్పి రావటం, మొద్దు బారతాయి. ఒక్కోసారి చేతి కండరాలు బలాన్ని కోల్పోతాయి.

రోగ నిర్ధారణ : ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ పరీక్ష అత్యంత కీలకమైనవి.

వైద్యం : స్పాండిలోసిస్‌లాగే హార్డ్‌ కాలర్‌, ట్రాక్షన్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం. శస్త్ర చికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది.

లంబార్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌

నడుంలోని 4,5 ఎముకల మధ్యగల డిస్క్‌లు వెనుకకు గానీ, పక్కకుగానీ స్లిప్‌ అవుతాయి. దీనికి ముఖ్యమైన కారణాలు వంగి బరువెత్తే ప్రయత్నం చేయటం. వెనుకసీట్లలో కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు ఏర్పడే అదుర్లు. అధికంగా హైజంప్‌, లాంగ్‌జంప్‌ వంటి క్రీడలు.

లక్షణాలు : ఈ జబ్బులో డిస్క్‌ వెనుకకు పూర్తిగా జరిగినప్పుడు నడుం పూర్తిగా పట్టుకుపోయి నిద్రలో అటూ ఇటూ పొర్లడతారు. సొంతంగా లేవడం చాలా కష్టమవుతుంది. తీవ్ర నడుంనొప్పి, నడుం పక్కనగల కండరాలు పూర్తిగా వడ్డుకుపోయి నడుం బిగుసుకుపోతుంది. అలాకాక డిస్క్‌ పక్కకు తొలిగినప్పుడు నడుం నుండి కాళ్ళలోకి వచ్చే నరాలమీద ఒత్తిడి ఏర్పడి తొడవెనుక భాగం నుండి, మోకాలిలోనికి, పిక్క కండరాలకు కాలివేళ్ళలోనికి పాదపు అడుగు భాగానికి విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. ముఖ్యంగా నిలబడ్డప్పుడు, నడిచేటప్పుడు కాలిపొడవునా ఏర్పడే ఈ న్యూరాల్జిక్‌ నొప్పిని 'సయాటికా' అంటాం. ఒక్కోసారి ఈ నొప్పి తొడ వెనుక భాగంలో మోకాలి వరకు మాత్రమే రావచ్చు. దీనిని 'ఎటిపిల్‌ సయాటికా' అంటాం.

ఒక్కోసారి నడిచేటప్పుడు కాళ్లల్లోని రక్తనాళాలలో రక్తసరఫరా తగ్గి కాలిపొడవునా ఇదే రకమైన నొప్పి వస్తుంది. దీనిని 'వాస్క్యులార్‌ క్లాడికేషన్‌' అంటాం. ఈ జబ్బులో మొదటిసారి నడిచినప్పుడు వచ్చిన నొప్పి కొద్దిగా విశ్రాంతి తరువాత తగ్గుతుంది. మళ్ళీ నడక మొదలు పెట్టినప్పుడు మొదట నడిచిన దూరంలో సగదూరం నడిచినప్పుడే నొప్పి కనపడుతుంది. అంటే.. రక్తనాళాలలో సమస్య ద్వారా వచ్చే క్లాడికేషన్‌ నొప్పి, దాని దూరం మొదటిసారికన్నా రెండవసారి సగ దూరానికే నొప్పి వస్తుంది. అలా కాకుండా నడుంనుంచి వచ్చే నరాల నొప్పి నుండి వచ్చే 'సయాటికా' నొప్పిని న్యూరోలాజికల్‌ క్లాడికేషన్‌ అంటాం. ఇది కూడా విశ్రాంతి ద్వారా తగ్గుతుంది. కాని విశ్రాంతి తదనంతరం వచ్చే నొప్పి మళ్ళీ అదే దూరానికి వస్తుంది. అంటే వాస్క్యులర్‌ క్లాడికేషన్‌ దూరం వలె న్యూరోలాజికల్‌ క్లాడికేషన్‌ దూరం మారదు.

రోగ నిర్ధారణ : లంబార్‌ డిస్క్‌ ప్రొలాప్స్‌లో కూడా, ఎక్స్‌రే, సిటిస్కాన్‌, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా రోగనిర్ధారణ చేస్తారు.

వైద్యం : ఈ వ్యాధి చికిత్సలో అతిప్రధానమైంది విశ్రాంతి. డాక్టర్‌ సలహా మేరకు లంబార్‌ బెల్ట్‌, ట్రాక్షన్‌తోపాటు మందులు వాడాలి. ఒక్కోసారి నరం ఒత్తిడి ఎక్కువై పాదం బలహీనపడి 'ఫుట్‌డ్రాప్‌' కూడా ఏర్పడవచ్చు. అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే శస్త్ర చికిత్స చేయాలి.

--------------------------------------------------------------------
డాక్టర్‌ జె. భాను కిరణ్‌,ఆర్థొపెడిక్‌ సర్జన్‌,డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌,సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ,బెంగళూరురోడ్డు, అనంతపురం.

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.