Monday, December 20, 2010

కంటిచూపు , Vision


  •  

సర్వేంద్రియాణాం - నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం.
  • చంటిపిల్లలకు స్నానానికి ముందు నూనెమర్దన చేసేటప్పుడు పూర్వం (?) అమ్మమ్మలు ముక్కును (రెండుకళ్ల మధ్యనున్న భాగాన్ని) వత్తుతూ ముక్కు పొడవుగా ఉండటానికి అలా వత్తుతున్నాం అనేవారు. కాని నిజానికది కన్నీళ్లు కంట్లోంచి ముక్కులోకి పోయే నాళాన్ని (Lacrimal duct) వత్తడం జరుగుతుంది. అలా వత్తడంవల్ల ఆ నాళం మూసుకుపోయే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ నాళం మూసుకుపోతే ఆ కంటినుండి నీళ్ళు ఊరకే కారడం జరుగుతుంది (వట్టిగా ఏడుస్తున్నట్టే) కాని ఈ రోజుల్లో నూనెమర్దనా ఎవరు చేస్తున్నారు? అయినా సరే తల్లులూ రోజుకొకటి రెండుసార్లయినా మీ పిల్లలకు ఇలా ముక్కు వత్తడం మర్చిపోకండి. నాన్నకయినా చెప్పి చేయించండి.

మెల్లకన్ను ఉన్న పిల్లలు ఒక రకమైన ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. అలాంటి భావం కలగకూడనో ఏమో - మెల్లకన్ను అదృష్టం. అత్తగారింట్లో భాగ్యం పొర్లి పారుతుంది - అని పెద్దవాళ్ళు సరిపెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం శ్రద్ధ వహిస్తే మెల్లకన్నును నివారించవచ్చు. సాధారణంగా పసిపిల్లలు ఒక సం. వయసు వచ్చేవరకు మెల్లకన్నుతో ఉంటారు. అది నార్మల్‌. మెదడు ఎదుగటం, పరిపక్వత చెందటం సంవత్సరం వరకూ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంటి కండరాలపై కంట్రోల్‌ ఉండదు. అందువల్ల సం. లోపు వయసు పిల్లలు మెల్లకన్ను కలిగి ఉండొచ్చు. సంవత్సరం దాటాక కూడ మెల్ల ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు ఆ బిడ్డను కంటిడాక్టరుకు చూపించాలి. ఎందుకంటే ఈ లోపం బిడ్డకు 5-7 సం. లోపులోనే సరిచేయాలి. ఆపైన మెల్లను తగ్గించడం కష్టం. ఈ మెల్ల రావడానికి కారణం రెండు కళ్ల యొక్క చూపులో తేడా ఉండటం. అంటే ఒక కన్ను మరీ ఏమీ చూడలేదు. దాని కంటిచూపు వీక్‌ అన్నమాట. అంటే అది హ్రస్వదృష్టి కావచ్చు, లేక దీర్ఘదృష్టి కావచ్చు. చూపు బలహీనంగా ఉన్న కన్ను నెమ్మదిగా అసలు చూడ్డమే మానేస్తుంది (గా తయారవుతుంది) ఏదో ఒకవైపుకి (ముక్కువైపుకో, చెవివైపుకో) తిరిగిపోతుంది. దీన్నే మెల్ల అంటారు. సరయిన సమయంలో (5 సం.లోపు వయసులోనే) సరయిన కంటిఅద్దాలు పెట్టడంవల్ల బాగా ఉన్న కంటిని మూసేసి చెయ్యడంలాటి ప్రక్రియలలో మెల్లను నివారించవచ్చు. దయచేసి అశ్రద్ధ చెయ్యద్దు.

చాలామంది, ముఖ్యంగా స్త్రీలు తలనొప్పి వస్తుందని, మెడనరాలు గుంజుతున్నాయని కంటి డాక్టరు దగ్గరకు వస్తుంటారు. దీన్ని కంటిడాక్టర్లు, కళ్ళద్దాల షాపులవాళ్ళు తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. (+)(-) 0,25 అద్దాలు రాసిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు తలనొప్పికి కారణం కనుక్కోవడమే పెద్ద తలనొప్పి. బి.పి. ఎక్కువున్నా, తక్కువున్నా, జ్వరం వచ్చినప్పుడూ, సమయానికి భోజనం చేయకపోయినా, సైనస్‌ సమస్య ఉన్నా చివరికి ఏదైనా మానసిక వత్తిడి ఉన్న, తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో అయితే తలనొప్పికి కారణం రక్తహీనత. (అనేమియా) మరి తలనొప్పి ఇన్ని కారణాలున్నప్పుడు దాన్ని కళ్లద్దాలే తగ్గిస్తాయని అనుకోడం అపోహ కాదా?  కాబట్టి మన తలనొప్పికి కారణాన్ని వెదికిపట్టుకొని దానికి వైద్యం చేయించుకోడం మంచిది. అనవసరంగా కళ్ళద్దాలకి డబ్బులు పెట్టకండి.
35-45 సం.రాల వయస్సున్న స్త్రీలు కళ్లడాక్టరు దగ్గరకొచ్చి నాకు ఈ మధ్యే గర్భసంచి తీసేసారు. అప్పట్నుంచి కళ్లు కనబడటం లేదు అనో లేక ఈ మధ్య అమ్మ చనిపోయిందని, అప్పుడు బాగ ఏడ్వడం వల్ల కంటిచూపు తగ్గిపోయిందని చెప్తూ ఉంటారు. నిజానికి గర్భసంచి తీసేయడానికి కంటిచూపుకి ఏం సంబంధం లేదు. ఏడుపుకి కంటిచూపు తగ్గడానికి కూడ ఏం సంబంధం లేదు. కేవలం వయసు ప్రధాన కారణం. ఇదే వయసులోని మగాళ్లకు కూడ చూపు తగ్గుతుంది. ఆడవాళ్లయితే సూదిలో దారం ఎక్కడం లేదు, బియ్యంలో రాళ్లు కనబడ్డం లేదు అంటూ ఉంటారు. చదువుకున్న ఆడవాళ్లు, మగవాళ్లు అయితే అక్షరాలు చదవడం కష్టంగా ఉంది అంటారు. దీనికంతటికీ కారణం - చత్వారం. ఇది 35 సం. దాటిన తర్వాతే వస్తుంది. మన కంటిలో ఒక కటకం (Lens) ఉంది. దానికి వ్యాకోచించే-సంకోచించే స్వభావం ఉంటుంది. దీనివల్ల దగ్గర వస్తువులు, అక్షరాలు చూడ్డంలో ఇబ్బంది ఉండదు. 35 సం. వయసు దాటాక మన కంట్లోని కటకం పై స్వభావాన్ని కోల్పోతుంది. అందువల్ల చత్వారం వస్తుంది. దీనికి పరీక్ష చేయించుకుని సరయిన అద్దాలు వాడటమే పరిష్కారం. మందులవల్ల లాభం లేదు.

ఇకపోతే కాస్త వయసుపైబడినవారిలో శుక్లాలు వస్తాయి. వీటికి చాలారకాల పేర్లున్నాయి. మోతిబిందెలు, కంట్లో పొరలు ఇంగ్లీషులో కాటరాక్ట్‌ అంటారు. శుక్లాలు ముదిరినప్పుడు మన కంట్లోని కటకం పాలమాదిరి లేక ముత్యంలాగా తెల్లగా కనిపిస్తుంది. మొదట్లో కంటిఅద్దాలు వాడితే సరిపోతుంది. కాని శుక్లాలు ముదిరిన తర్వాత అద్దాలు పనిచెయ్యవు. ఆపరేషనే మార్గం. రెండుకళ్లలో శుక్లాలు ముదిరిపోతే ఆ పెద్దమనిషి పూర్తిగుడ్డివాడవుతాడు. ఏ పనికయినా మరో మనిషి సాయం కావలసి వస్తుంది. ఈ పరుగుల యుగంలో ఓ ముసలాయిన్ని పట్టించుకునే  టైం పెట్టేదెవరు. కనుక ఆపరేషన్‌ చేయిస్తే ఆ పెద్దమనిషి కనీసం తన పనులు తాను చేసుకునే పరిస్థితిని కల్పించిన వాళ్లమవుతాం. ఈ ఆపరేషన్‌ ప్రభుత్వాసుపత్రుల్లో, కొన్ని స్వచ్చంద సంస్థ ల్లో ఫీజు లేకుండా ఉచితంగానే చేస్తారు. కాబట్టి మనవలూ - మనవరాళ్లూ మీ ఇంట్లో తాతయ్యా-అమ్మమ్మలకు, నానమ్మలకు కళ్లల్లో ముత్యాలు కనబడుతుంటే వెంటనే కంటిడాక్టరుకి చూపించండి. ఆపరేషన్‌ చేయిస్తే వాళ్ళు కోల్పోయిన చూపుని మళ్ళీ పొంది మీతో పాటు ఈ ప్రపంచం అందాల్ని ఆస్వాదించకలుగుతారు.

---డా|| రోష్నీ
మయోపియా-హ్ర స్వదృష్టి (నియర్‌సైటెడ్‌నెస్‌) లోపించిన బాలల కనుచూపు మెరుగుపరచడానికి, బైఫోకల్స్‌ ఎంతో దోహదం చేస్తాయని, నేత్ర శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.

ఆసియా ఖండంలోని ప్రజానీకంలో, 90 శాతం హ్రస్వ దృష్టితో బాధపడుతున్నారు. 'మయోపియా' అనే పేరుతో పిలిచే ఈ హ్రస్వ దృష్టి తో బాధపడేవాళ్లకి దూరంగావున్న వస్తువులూ, వ్యక్తులూ స్పష్టంగా అగుపించకపోవడం మామూలే. కొందరిలో, ఈ హ్రస్వ దృష్టి చాలా త్వరగా పెరిగిపోతుంది. దీనికి వంశపారంపర్యమైన లక్షణాలే కారణం. అయితే, దీనికి శాశ్వతమైన చికిత్సా విధానం కాని, నివారణోపాయం గాని ఇంతవరకూ లేదు. 'బై ఫోకల్‌ లెన్సెస్‌' కళ్లద్దాలు ఉపయోగించుడం ఒక్కటే హ్రస్వదృష్టికి తరుణోపాయం.

'బైఫోకల్స్‌' అంటే, రెండు విభా గాలుగా చేసిన 'లెన్సెస్‌' అని అందరికీ తెలుసు. పై భాగంలోంచి దూరంగా వుండే వాటినీ, క్రింభాగం లోంచి దగ్గరలోని వస్తువులనీ చూడడం, సర్వ సాధారణంగా జరిగే విషయం.

'మయోపియా' పిల్లలలో, వే గంగా పెరిగిపోతుంటే, 'బైఫోకల్స్‌' ఆ వ్యాధి నివారణకి ఎంతవరకూ దోహదం చేస్తాయనే విషయంలో, పరిశోధకులు, 135 మంది చైనీస్‌ కనేడియన్‌ పిల్లల మీద అధ్యయనాలు కొనసాగించి, సింగిల్‌ ఫోకల్స్‌ లెన్సెస్‌ కంటే, బై ఫోకల్‌ లెన్సెస్‌ వాడకమే, 'మయోపియా'కి సరైన నివారణోపాయమనే అభిప్రాయానికి వచ్చారు. అయినా, పిల్లల 'హ్రస్వదృష్టి' సమస్య గురించి, మరింతగా పరిశోధనలు జరపాల్సి వుంటుందని, శాస్త్రజ్ఞుల భావన.
  • ------------------
దూరదృష్టి , దగ్గర దృష్టికి పవర్‌ ఎక్కువగా ఉన్నవారికి--ఐసిఎల్‌ లెన్స్‌ అమరిక

దూరదృష్టి , దగ్గర దృష్టికి పవర్‌ ఎక్కువగా ఉన్నవారికి శస్తచ్రికిత్స ద్వారా అమర్చే ఇంప్లాంటబుల్‌ కొల్లామర్‌ లెన్స్‌ను రాయలసీమలోనే ప్రప్రథమంగా అమర్చారు. డాక్టర్‌ సుధాకర్‌ రావు మాట్లాడుతూ దగ్గర దృష్టి -1 నుంచి -8 వరకు ఉన్నవారికి లేజర్‌ ద్వారా అద్దాలు లేకుండా సరిచేయవచ్చని తెలిపారు. కానీ 20 నుంచి 30 శాతం ఉన్నవారికి లేజర్‌ చికిత్స సరిపడదని తెలిపారు. దీనికి నల్లగుడ్డు మందము తక్కువుగా ఉండటమే కారణమన్నారు. అలాంటి వారికి ఐసిఎల్‌ ద్వారా -6 నుంచి -250 వరకు పవర్‌ సరిచేయవచ్చని తెలిపారు. ఐసిఎల్‌ అనేది కంటిలోపల మైక్రో ఇన్సిషన్‌ ద్వారా అమరుస్తారని చెప్పారు. కంటిలోని లెన్స్‌ ముందు వీటిని అమరుస్తారని తెలిపారు. వీటి అమరికతో రోగికి అద్దాలు లేకుండా చక్కగా కంటిచూపు కన్పిస్తుందని తెలిపారు. శస్త్ర చికిత్స జరిగిన 3 గంటల్లోగా చూసే అవకాశం ఉందన్నారు. ఇద్దరికి ఐసిఎల్‌ లెన్స్‌ను విజయవంతంగా అమర్చామని తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాలోపు, ఆరోగ్యవంతమైన, మందం లేని నల్లగుడ్డు ఉన్న వారు, -6 నుండి -25 హ్రస్వదృష్టి కలవారు, +6 కంటే ఎక్కువ దూరదృష్టి కలవారు, సిలెండ్రికల్‌ పవర్‌ ఉన్న వారు ఐసిఎల్‌  లెన్స్‌ అమర్చేందుకు అర్హులని తెలిపారు. డాక్టర్‌ జి రమేష్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, చెన్నై  వంటి నగరాల్లోనే ఐసిఎల్‌ లెన్స్‌ అమరుస్తున్నారని తెలిపారు. దీని కోసం రూ. 60వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. లావు పాటి అద్దాలతో బాధపడేవారిని ఐసిఎల్‌ తో వారికి ఆ బాధ తప్పిందని ఆయన చెప్పారు. జీవితాంతం చక్కగా చూసే అవకాశం ఉంద న్నారు.

పెరుగుతున్న హ్రస్వదృష్టి

ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టే వ్యాధులంటే మనం చాలా వరకూ.. గుండెపోటు, క్యాన్సర్‌ వంటి పెద్దపెద్ద సమస్యలనే వూహించుకుంటాం. కానీ నేటి కంప్యూటర్‌ యుగం.. 'కనిపించని' మరెన్నో ముప్పులు తెచ్చిపెడుతోంది.

ప్రజల దృష్టి సమస్యల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? కాలంతో పాటే వీటిలో కూడా ఏవైనా మార్పులు వస్తున్నాయా?  అన్నది గుర్తించేందుకు ఇటీవలే ఓ భారీ అధ్యయన నిర్వహించారు అమెరికా పరిశోధకులు. ఆశ్చర్యకరంగా- ఇప్పుడు 12-54 ఏళ్ల మధ్య వయసు వారిలో హ్రస్వదృష్టి (మయోపియా) సమస్య ఒకప్పటి కంటే చాలా ఎక్కువగా ఉంటోందని వెల్లడైంది. ఈ హ్రస్వదృష్టి సమస్య ఉన్న వారికి దగ్గరి వస్తువులు బాగానే కనబడతాయిగానీ దూరంగా ఉన్నవేవీ సరిగా కనబడవు. అమెరికాలో 1972లో దాదాపు 25% మందికి ఈ సమస్య ఉండగా.. అదే 2004 నాటికి వచ్చేసరికి ఇది 42 శాతానికి పెరిగిందని అమెరికా జాతీయ నేత్ర సంస్థ గుర్తించింది. నేటి యువతరం ఆరుబయట గడిపే సమయం తగ్గిపోతోంది. ఎక్కువగా గదుల్లోనే ఉండటం, రోజంతా కంప్యూటర్లు, వీడియోగేమ్‌ల వంటి దగ్గరి దగ్గరి వస్తువులనే తదేకంగా చూడటానికి అలవాటుపడుతుండటం వల్లే ఈ హ్రస్వదృష్టి సమస్య పెరిగి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

నిన్నమొన్నటి వరకూ నేత్ర పరిశోధకులంతా హ్రస్వదృష్టి ప్రధానంగా జన్యుపరమైనదేననీ, దానికి ఇతరత్రా అంశాలేవీ పెద్దగా దోహదం చెయ్యవని భావించేవారు. అందులో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే హ్రస్వదృష్టి కొన్ని కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. అయితే తాజా అధ్యయనం.. ఈ విషయంలో కేవలం జన్యువులనే కారణంగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేస్తోంది. రోజువారీ మనం వేటిని ఎక్కువగా చూస్తున్నాం? దగ్గరి వాటినా? దూరంగా ఉన్నవాటినా? అన్నదీ కీలకమేనని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరికీ హ్రస్వదృష్టి ఉన్నా కూడా.. వారి పిల్లలు గదులకే పరిమితం కాకుండా ఆరుబయట వస్తువులను చూడటం వంటి అంశాల పట్ల శ్రద్ధ తీసుకుంటుంటే.. ఆ పిల్లలకు హ్రస్వదృష్టి అంత త్వరగా ముంచుకురావటం లేదు. దీనర్థం మన జీవనశైలి కూడా మన చూపును బాగా ప్రభావితం చేస్తుందనే!

రోజులో దీర్ఘసమయం దగ్గరి వస్తువులనే చూస్తుండటం వల్ల ఆ కాంతి.. కంటి రెటీనా మీద కేంద్రీకృతమయ్యేందుకు వీలుగా కనుగుడ్లు కాస్త ముందుకు సాగివస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే పార్కులు, మైదానాల వంటి ఆరు బయట ప్రాంతాల్లో తిరుగుతూ.. అక్కడి వస్తువులను చూస్తుంటే కనుగుడ్లు, వాటి కండరాలు బాగా విశ్రాంతిగా ఉంటున్నాయని బెర్క్‌లీకి చెందిన క్లినికల్‌ ఆప్టోమెట్రీ ప్రొఫెసర్‌ డా|| రాబర్ట్‌ డిమార్టినో వివరించారు. ఎప్పుడూ దగ్గరి వాటినే చూస్తుంటే మన కంటి నిర్మాణం కూడా అందుకు తగ్గట్టుగానే మారిపోతుంటుందని, ఫలితమే ఈ హ్రస్వదృష్టి అని ఆయన వివరించారు. పిల్లలు ఎప్పుడూ పుస్తకాలు, కంప్యూటర్లు, టీవీల ముందర గడపటం కాకుండా.. కాస్త బయటకు వెళ్లి ఆడుకునేలా.. ప్రకృతిని ఆస్వాదించేలా చూడటమన్నది కేవలం వారి కంటి చూపుకే కాదు.. మనో వికాసానికీ, చక్కటి ప్రాపంచిక దృక్పథం అలవడటానికీ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.