Saturday, December 25, 2010

అతిగా కూచుంటే..అనర్థమే , Too long siting is bad for health




కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. తిండి సంగతేమో గానీ ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యాన్నే హరించివేస్తుందని సెలవిస్తున్నారు పరిశోధకులు. రోజుకి అరగంట సేపు వ్యాయామం చేసినా సరే.. దీర్ఘకాలం కూచొని పనిచేస్తే గుండెజబ్బులు, క్యాన్సర్‌తో పాటు వెన్నునొప్పి, తదితర సమస్యలూ చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

మారుతున్న జీవనశైలి, పని పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ మనిషిని కదలనీయకుండానే 'పని' కానిచ్చేస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా కూచోవటమూ అలవడుతోంది. మనలో చాలామంది మెలకువగా ఉన్నప్పుడు 95% సమయాన్ని కూచునే గడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు కూచోవటం అనేది గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్థూలకాయం, టైప్‌2 మధుమేహం, గుండెపోటు, కొన్నిరకాల కాన్సర్లకు దారి తీస్తున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. వ్యాయామం చేస్తున్నప్పటకీ ఎక్కువసేపు కదలకుండా పనిచేస్తే ఈ ముప్పులు ముంచుకొస్తుండటం గమనార్హం.

అరగంట మించుతోందా?
కుర్చీలోంచి కదలకుండా 60 నిమిషాల సేపు టీవీ చూస్తున్నారా? అయితే గుండెజబ్బులు, క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ముంచుకొస్తున్నట్టే. నిజానికి స్థిరంగా కూచోవటం అనేది మానవులకు సరిపడదంటున్నారు పరిశోధకులు. ఈ సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుందని వివరిస్తున్నారు. ఇది వ్యాక్యూమ్‌ క్లీనర్‌లా పనిచేస్తూ.. రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూచుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాల్లో నిల్వ ఉండిపోతుంది. ఎక్కువసేపు కదలకపోతే కండరాలూ మందకొడిగా తయారై బిగుసుకుపోతాయి. బరువు, బొజ్జ పెరుగుతాయి. పొట్ట భాగంలో పేరుకునే ఈ కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హర్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. రక్తనాళాలు పూడుకుపోవటం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికీ దారితీస్తుంది.

వెన్ను సమస్యలు కూడా
ఎక్కువసేపు కూచోవటం వల్ల వెన్నెముక, భుజాలు, తుంటి సమస్యలూ పుట్టుకొస్తాయి. మన వెన్నెముక నిలబడేందుకు వీలుగా రూపొందింది. గంటలకొద్దీ వెన్నుని నిటారుగా ఉంచి సరైన ఆకృతిలో కూచోవాలంటే వీపు భాగంలోని కండరాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక ముందుకు వంగుతుంది. భుజాలు కిందికి వాలిపోతాయి. ఇది క్రమంగా భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు సరిగా లేకపోయినా వెన్నెముక దెబ్బతింటుంది. మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపైనా ప్రభావం చూపుతుంది.

చిన్న పనులతో పెద్ద మేలు
గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పనులతోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.

* కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
* రోజుకి కనీసం 40 నిమిషాల సేపైనా నడక అలవాటు చేసుకోవాలి. ఇది కీళ్లు బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
* ఆఫీసులో సహోద్యోగుల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఫోన్లు, ఈ-మెయిళ్ల వంటివి చేయకుండా కాస్త కాళ్లకు పని కల్పించటం మంచిది.
* వీలైనప్పుడు శ్వాసను వదులుతూ కడుపును లోపలికి పీల్చుకొని 10 అంకెలు లెక్కబెడుతూ అలాగే ఉండండి. ఇది పొట్ట కండరాలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
* ఒత్తిడి తగ్గి భుజాలు విశ్రాంతి పొందేందుకు వీలుగా అప్పుడప్పుడు భుజాలను పైకి లేపుతూ ఉండాలి.
* ఫోన్‌ వచ్చినపుడు లేచి నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు.
* వీలైనంతవరకు లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.