Wednesday, January 12, 2011

స్త్రీల పొత్తికడుపులో నొప్పి, Lower Abdominal Pain in Womenఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -స్త్రీలలో పొత్తి కడుపులో నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--పొత్తికడుపులో నొప్పి! పతి స్త్రీ.. జీవితంలో ఎప్పుడోసారి ఎదుర్కొనే సమస్యే ఇది. కానీ 12-20% మందిలో ఇది వీడకుండా దీర్ఘకాలం వేధిస్తోంది. గైనకాలజిస్టులను సంప్రదించే స్త్రీలలో 10% మంది ఇటువంటి దీర్ఘకాలిక నొప్పితోనే వస్తున్నారంటే ఈ 'నొప్పి' తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కొంతమందికైతే రిపోర్టులన్నీ నార్మల్‌, 'నొప్పి' మాత్రం బాధిస్తూనే ఉంటుంది.

సున్నితమైన పునరుత్పత్తి అవయవాలు ఉండే పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావటమన్నది... నవయవ్వనం నుంచి వృద్ధాప్యం వరకూ.. ఏ దశలోనైనా ఎదురవ్వచ్చు. నెలసరి నుంచి సంభోగం వరకూ.. ఏ సమయంలోనైనా బాధించొచ్చు. కొందరి విషయంలో ఇది దీర్ఘకాలికంగా తయారై మనశ్శాంతి లేకుండా చెయ్యచ్చు. కుటుంబ సంబంధాల్నీ దెబ్బతియ్యచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. అయినా అన్నిసార్లూ దీనికి కచ్చితమైన కారణం కనుక్కోవటం అంత సులభమేం కాదు. అందుకే దీన్ని అర్ధం చేసుకునేదెలా? ఎదుర్కొనేదెలా? ఏమిటి దీనికి పరిష్కారం?

పొత్తికడుపులో నొప్పి.. ఉద్ధృతంగా వస్తే... ఆ నొప్పికి కారణాలు చాలావరకూ స్పష్టంగానే తెలుస్తుంటాయి. వాటికి వెంటనే చికిత్స చెయ్యటం సాధ్యపడుతుంది. కానీ చాలామందికి ఈ నొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుంటుంది. కొందరికి నొప్పి రోజంతా బాధిస్తుంటే.. మరికొందరికి తరచుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అందుకే పొత్తికడుపులో నొప్పితో బాధితులు వచ్చినప్పుడు వైద్యులు ఈ నొప్పికి కారణం ఏమై ఉండొచ్చనేది అర్థం చేసుకునేందుకు లోతుగా అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు.
చెప్పలేని బాధ
గర్భాశయం, అండాశయాలు, ఫలోపియన్‌ ట్యూబులు.. ఇలా స్త్రీ పునరుత్పత్తి అవయవాలన్నీ పొత్తికడుపులోనే ఉంటాయి. గర్భాశయ ముఖద్వారం.. యోని.. ఈ అవయవాలకు అనుసంధానంగా ఉంటాయి. వీటిలో తలెత్తే చాలా సమస్యల్లో కనబడే ప్రధాన లక్షణం.. నొప్పి! కాబట్టి ఈ 'నొప్పి' అందరికీ ఒకేతీరులో ఉండాలని లేదు. కొందరు ఈ నొప్పి కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి వస్తోందో చెప్పగలుగుతారుగానీ మరికొంత మందికి.. అసలా నొప్పి ఏమిటో, ఎక్కడి నుంచి వస్తోందో కూడా చెప్పలేకపోతుంటారు. అది బొడ్డు కింది నుంచా.. యోని నుంచా.. యోనికీ-మలద్వారానికీ మధ్య ప్రాంతం నుంచా.. ఇలా ఎక్కడి నుంచి వస్తోందో చెప్పటం కూడా కష్టమవుతుంటుంది. కొందరైతే అసలది నొప్పో.. లేక ఏదైనా అసౌకర్యమో కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. ఏదో ఇబ్బందికరమైన బాధ. చాలా అసౌకర్యంగా ఉంటుంది కానీ అది ఏమిటో, ఎక్కడి నుంచి వస్తోందో చెప్పటం కష్టం. అందుకే వైద్యులు.. ఈ నొప్పిని అర్థం చేసుకునేందుకు.. దీనికి మూలాలు ఎక్కడున్నాయో గుర్తించేందుకు బాధితులను ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు.

దారి చూపే సమాచారం
ప్రధానంగా నొప్పి ఎక్కడ, ఎప్పుడు, లేదా ఎప్పటి నుంచి వస్తోంది? ఏ సమయంలో మొదలైంది.. తర్వాత పెరుగుతోందా? లేక అలాగే ఉండిపోయిందా? లేక దానికి నెలసరితో ఏదైనా సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోందా? నెలసరికి ముందుగానీ.. తర్వాతగానీ వస్తోందా? లేక నెలసరి వెళ్లిన తర్వాత ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో వస్తోందా? నొప్పితో పాటు స్రావాల వంటివీ అవుతున్నాయా? మూత్ర విసర్జనలోగానీ, మల విసర్జనలోగానీ సమస్యలున్నాయా? నొప్పి ఎలా వస్తోంది? ఏం చేస్తే తగ్గుతోంది? దానివల్ల రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా? లేదా? పడుకుంటే తగ్గిపోతోందా?.. ఇలా వైద్యులు రకరకాలుగా నొప్పికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. దీనిని బట్టి ఆ నొప్పి ఏదైనా శారీరక సమస్య కారణంగా, లోపలి అవయవాల్లో వస్తున్న తేడాల కారణంగా వస్తోందా? లేక ఏదైనా తీవ్రమైన మానసిక సమస్యల వల్ల తలెత్తిందా? అన్నది గ్రహించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కచ్చితంగా నిర్ధారించుకునేందుకు పరీక్షలు ఉపయోగపడతాయి.

నొప్పికి మూలాలు
సాధారణంగా పొత్తికడుపులో నొప్పి అన్నది.. నెలసరి సమస్యలతో సంభోగం, దాంపత్య జీవితంతో.. ఇలా ఎన్నో కారణాలతో రావచ్చు. ఈ నొప్పి యుక్తవయస్కుల్లో నెలసరి సమస్యలు ప్రధాన కారణమైతే పెళ్త్లె, పిల్లలున్న మధ్యవయస్కుల్లో చాలా వరకూ సంభోగంతో, ఎండోమెట్రియోసిస్‌, పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌.. లేదా కాన్పు సమయంలో జరిగిన గాయాల కారణంగా కూడా నొప్పి రావచ్చు. వీటి గురించి క్లుప్తంగా చూద్దాం.

నెలసరితో నొప్పి
* నెలసరితో పాటుగా పొత్తికడుపులో నొప్పి అన్నది చాలామందిలో కనబడే సమస్య. రజస్వల అయిన రెండుమూడేళ్ల తర్వాత ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ నొప్పిని 'స్పాస్మోడిక్‌ డిస్‌మెనోరియా' అంటారు. రుతుక్రమంలో భాగంగా గర్భసంచిలో ఏర్పడిన పొరను బయటకు పంపించేందుకు.. నెలసరి సమయంలో గర్భసంచి బలంగా సంకోచిస్తుంటుంది. ఫలితంగా ఆ సమయంలో తెరలు తెరలుగా నొప్పి వచ్చి పోతుండొచ్చు. వీళ్లు నెలసరి ఆరంభమైన రోజు నుంచే 'పెయిన్‌ కిల్లర్స్‌' మొదలుపెట్టి, దాన్ని ఒక కోర్సులా మూడు రోజులూ తీసుకోవాలి. మిగతా నొప్పులతో పోలిస్తే ఈ నెలసరి నొప్పి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది బాగా తీవ్ర దశకు చేరుకుంటూ.. పోతూ.. వస్తుంటుంది. ఇది లోపల జరుగుతున్న ప్రక్రియ కారణంగా వస్తున్న నొప్పి కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పోయేది కాదు. కాబట్టి అదే పోతుందిలే అని బాధపడే కంటే ముందే పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవటం ఉత్తమం. బిళ్లలకు అలవాటు పడిపోతామేమోనని భయపడాల్సిన పని లేదు. నొప్పి ఒక దశకు చేరుకుంటే.. అప్పుడు బిళ్లలు వేసుకున్నా తగ్గదు. పైగా ఆ తీవ్రమైన నొప్పికి వాంతుల వంటివీ రావచ్చు. కాబట్టి దీన్ని ముందే ఊహించి.. ముందు నుంచే బిళ్లలు వాడుకోవటం ఉత్తమం. నెలసరి అన్నది ప్రకృతి సహజమని, దానితో నెగ్గుకురావటం ఎలాగో తెలుసుకోవటం ముఖ్యమని అర్థం చేసుకోవటం అవసరం.

* పొత్తికడుపులో నొప్పి అన్నది సుఖవ్యాధుల వల్ల కూడా రావచ్చు. కాబట్టి లైంగికంగా చురుకుగా ఉన్న ఆడపిల్లలు, స్త్రీలకు నొప్పి వస్తుంటే ఆ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించటం కూడా అవసరం.

* కొందరిలో నొప్పి నెలసరికి ముందు వస్తుంటుంది, చాలాసార్లు నెలసరి రాగానే తగ్గిపోతుంది. వీరిలో చాలా వరకూ పొత్తికడుపులో ఇన్ఫెక్షన్‌గానీ.. ఇతరత్రా మరేదైనా కారణం ఉందేమో పరిశీలించాల్సి ఉంటుంది.

* గర్భాశయంలో నెలనెలా పెరుగుతుండాల్సిన ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాకుండా.. ఇతరత్రా ప్రాంతాల్లో కూడా పెరుగుతుండటం పెద్ద సమస్య. దీన్నే 'ఎండోమెట్రియోసిస్‌' అంటారు. దీనివల్ల కూడా నెలసరి సమయంలో నొప్పి రావచ్చు. లేదా గర్భాశయంలో కణితులు (ఫైబ్రాయిడ్స్‌) పెరుగుతున్నా కూడా నొప్పి వస్తుంది.

* ఒకవేళ సంతానం కలగకుండా.. పొత్తికడుపులో నొప్పి వేధిస్తుంటే.. చాలా వరకూ 'ఎండోమెట్రియోసిస్‌'ను అనుమానించాల్సి ఉంటుంది. లేదా ఫలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవటానికి కారణమైన 'క్రానిక్‌ పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌' వంటివి కూడా కారణం కావచ్చు. వీటిని పరీక్షల్లో నిర్ధారించుకోవచ్చు.
.
అన్నీ నార్మల్‌.. కానీ నొప్పి!
ఎంతోమంది స్త్రీలు దీర్ఘకాలంగా పొత్తికడుపులో నొప్పితో బాధపడుతుంటారు. ఎన్నో పరీక్షలూ పూర్తవుతాయి.. కానీ నిర్దిష్టమైన కారణమేదీ కనబడదు. వైద్యులు స్పష్టమైన కారణమేదీ లేదని చెబుతున్నా.. వాళ్లకు నొప్పి మాత్రం వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక తీవ్ర వేదన, క్రమేపీ కుటుంబ జీవితం.. దాంపత్య జీవితం అన్నీ ప్రభావితమవటం వంటివీ మొదలవుతాయి. చివరికి ఏం చెయ్యాలో పాలుపోని అయోమయ స్థితిలో పడిపోవచ్చు. ఇటువంటి వారి విషయంలో... పరీక్షల్లో అంతా 'నార్మల్‌'గానే ఉంది కాబట్టి 'నొప్పి' లేదని కాదు. ఆ నొప్పి 'కేవలం మానసికం' అని వదిలెయ్యటానికి లేదు. వారికి 'నొప్పి' ఉన్న మాట వాస్తవం అని గుర్తించటం, దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించటం అవసరం. అయితే అన్నిసార్లూ నొప్పికి కచ్చితమైన కారణాలు గుర్తించటం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు నెలనెలా గర్భాశయంలో పెరుగుతుండే ఎండోమెట్రియం పొరలు.. అక్కడి నుంచి బయటపడి చిన్నచిన్నగా పొత్తికడుపులో అక్కడక్కడ అతుక్కుని ఉన్నా కూడా నొప్పి వస్తుంది. కానీ వాటిని సాధారణ పరీక్షల్లో గుర్తించటం అంత తేలిక కాదు. దీర్ఘకాలంగా పొత్తికడుపులో ఇన్ఫెక్షన్‌ ఉన్నా కూడా దాన్ని గుర్తించలేకపోవచ్చు. వీటికి నొప్పి ఉంటుంది గానీ ఆ కారణాలను గుర్తించటం కష్టం. వీరి విషయంలో మరింత లోతుగా పరీక్షలు చేయటం.. వాటిలోనూ ఏమీ బయటపడకపోతే నొప్పి నుంచి బయటపడేందుకు ఇతర మార్గాలను అన్వేషించటం అవసరపడొచ్చు.
కారణాలు
గర్భిణీగా ఉన్నప్పుడు
అబార్షన్‌ కావడం, గర్భాశయంలో కాకుండా అండవాహికలలో గర్భం ఏర్పడి దానికదే చెదరిపోవడం, గర్భాశయంలో ఏర్పడిన పిండం లోపలే చనిపోయినప్పుడు చాలా తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పితోపాటు ఇతర లక్షణాలు, అంటే రక్తస్రావం మొదలైనవి కనిపిస్తాయి.

బహిష్టు క్రమానికి సంబంధించి
బహిష్టు సమయంలో 2 నుంచి 3 రోజుల ముందునుంచి వచ్చే నొప్పి, బహిష్టు స్రావం ఆగిపోయే వరకూ ఉండే నొప్పి (డిస్మెనోరియా), ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌, బహిష్టు మొదలైన 12 నుంచి 14 రోజుల మధ్య అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయంలో కొంత మందిలో పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి ఒకటినుంచి రెండు రోజుల వరకూ ఉంటుంది.

గర్భాశయ కారణాలు
గర్భాశయంలో కంతులు, ఎండోమెట్రియోసిస్‌, అడినోమయోసిస్‌ వంటి గర్భాశయ గోడల కణజాలంలో సాధారణ మార్పులు కలగడం, గర్భాశయ స్థానంలో మార్పు రావడం, గర్భాశయం యోనిభాగంలోకి లేదా యోని వెలుపలకు జారడం.

అండాశయ కారణాలు
నీటి బుడగలలాంటి సిస్ట్‌లు (చాకొలెట్‌ సిస్ట్స్‌) పగలడం, వొవేరియన్‌ సిస్ట్‌ ఉండటం. ఈ రెండు కారణాల్లో పొత్తి కడుపులో నొప్పితోపాటు బహిష్టు క్రమంలో తేడాలు కూడా వస్తాయి.

పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌
గర్భాశయం, గర్భాశయ వాహికలు, అండాశయాలు, దానికి సంబందఙంచిన ఇరుప్రక్కల భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం

జీర్ణకోశ వ్యవస్థలకు చెందిన వ్యాధులు
- ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌, అపెండిసైటిస్‌, మలబద్ధకం, మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకడం, లేదా రాళ్లు ఏర్పడటం, ఎముకలకు సంబంధించిన, ముఖ్యంగా నడుము భాగంలోని ఎము కల, కండరాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, చిట్లడం తదితర కారణాల వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.ఇవే కాకుండా, గర్భాశయ వాహికల స్థితిని తెలుసు కోవడానికి, ప్లిలలు పుట్టని స్త్రీలకు చేసే పరీక్ష అయిన హిస్టరో సాల్పింజోగ్రామ్‌ (హెచ్‌ఎస్‌జి) వాడే రసాయన పదార్థాల వల్ల కూడా ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు.

అంతేకాకుండా, పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలలో దేనితోనో ఒకదానితో బాధపడుతూ, మానసిక విచారం, ఆందోళన, దిగులుకు లోనైన వారిలో కూడా పొత్తి కడుపు నొప్పి అంత సులభంగా నయం కాదు. తరచుగా బాధిస్తుంటుంది కూడా.

-నొప్పితో కూడిన సమస్యలు
గర్భాశయానికి సంబంధించిన వ్యాధులతో కలిగే నొప్పి ముందు పొత్తి కడుపులో మొదలై, తరువాత కడుపు మొత్తానికి ప్రాకుతుంది.పొత్తికడుపులో నొప్పి ఉండి బహిష్టులు కాని వారిలో ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వంటివి కారణమై ఉంటాయి.
ఆకలి కాకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం, వాంతులు కావడం మొదలైనవి జీర్ణాశయగత వ్యాధులకు సంబంధించిన పొత్తి కడుపు నొప్పితో అనుసంధానమై ఉంటాయి.
తరచుగా మూత్రం పోవడం, మూత్ర విసర్జనలో నొప్పి, అరుదుగా జ్వరంతో కూడి పొత్తి కడుపు నొప్పి మూత్రాశయ వ్యాధుల్లో ఉంటుంది.
జ్వరం, చలి, వణుకు, మూత్రం కష్టంగా ఉండటం తదితర లక్షణాలతో కూడిన పొత్తి కడుపు నొప్పి ఎక్యూట్‌ పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌లో ఉంటుంది.
కడుపు నొప్పితోపాటు మూర్ఛ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి పడిపోవడం ఉంటే పొట్టలో రక్తస్రావాన్ని కలిగించే వ్యాధులున్నాయని అనుమానించి తక్షణమే వైద్య సహాయం పొందాలి. గర్భాశయంలో

అసాధారణ ఎదుగుదలలు ఉన్నా, కంతులు ఉన్నా నాడి కొట్టుకోవడం, బిపి, గుండె పని తీరులలోనూ తేడాలు ఉండే అవకాశా లుంటాయి.

పరీక్షలు
వ్యాధిని నిర్ధారించే పరీక్షలతోపాటుగా సాధరాణ వైద్య పరీక్షలైన హీమోగ్లోబిన్‌, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ కూడా చేయించాల్సి ఉంటుంది. అలాగే కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌, యూరిన్‌ కల్చర్‌ అవసర

మవుతాయి. గర్భిణీలలో అయితే బి సబ్‌యూనిట్‌ ఆఫ్‌ హెచ్‌సిజి నిర్ధారణ వల్ల గర్భం ఎక్కడ ఏర్పడిందనేది తెలుస్తుంది. ఉదరకోశం మొత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌ మొదలైన పరీక్షలు అవసరం అవుతాయి. అరు దైన వ్యాధుల్లో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణకు లాపరోస్కోపీ అవసరం అవుతుంది. చాలా వరకూ పొత్తి కడుపులో కలిగే నొప్పికి కారణ మయ్యే వ్యాధులు సత్వరమే చికిత్స చేయాల్సినవై ఉంటాయి. వాటిలో సుమారు 50 శాతం రోగులకు శస్త్ర చికిత్సలు అవసరం కావచ్చు. మిగిలిన వ్యాధుల్లో లక్షణాను సారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

వ్యాధి రాకుండా...
పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌
పరషనల్ హైజిన్‌ పాటిస్తూ ఉండాలి . వివాహ స్త్రీలు కాపురం తరువాత నీటితో శుబ్రము గా కడుగుకోవాలి .

అండాశయంలో కంతులు
విటమిన్ల తో కూడిన పౌస్టికాహారము తీసుకోవాలి .

మూత్రాశయ వ్యాధుల్లో
ఎక్కువగా నీరు త్రాగాలి . ప్రతిరోజూ ఉదయం పరగడుపున సుమారు 1 లీటరు నీటిని తీసుకోవాలి .

మూత్రాశయ రాళ్లకు్ఎక్కువగా నీరు త్రాగాలి.

గర్భాశయం కిందకు జారితే
మంచి వైద్యుని సంప్రదించి ఆపరేషన్‌ చేసుకోవాలి .

మలబద్ధకం
మలబద్ధకం, గ్యాస్‌ చేరడం, మొదలైన వాటికి త్రిఫలాను మించిన ఔషధం లేదు. దీనిని 5 గ్రాముల చొప్పున రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.

బహిష్టు సమయంలో
dyamen మాత్రలు తీసుకోవాలి.

మెనోపాజ్‌లో
అశ్వగంధ, శతావరి ,లోద్ర ఉన్న ఆయుర్చేదిక్ మందు పాలతో రోజుకు రెండు సార్లు సేవించాలి.


పొత్తికడుపులో నొప్పితో పాటు..
** మలద్వారం గుండా రక్తం ** 50 ఏళ్లు పైబడిన వారిలో.. కొత్తగా మలవిసర్జన అలవాట్లు మారిపోవటం ** నెలసరి నిలిచిపోయిన తర్వాత కొత్తగా మొదలయ్యే నొప్పి ** పొత్తికడుపులో చేతికి గట్టిగా గడ్డలా తగులుతుండటం ** వేగంగా బరువు తగ్గిపోతుండటం ** 40ఏళ్లు దాటిన తర్వాత.. రుతుస్రావం అస్తవ్యస్తంగా అవుతుండటం ** సంభోగానంతరం రక్తస్రావం అవుతుండటం ** నొప్పి కంటే ఆత్మహత్య మేలనిపిస్తుండటం.....

నొప్పితో పాటు ఈ లక్షణాల్లో ఏవి కనబడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కొందరి విషయంలో లైంగిక వేధింపులకు గురవ్వటం, మానసిక భయాలు.. అవి కూడా పొత్తి కడుపులో నొప్పి రూపంలో బయట పడుతుండొచ్చు. కాబట్టి వీటినీ పరిశీలించాల్సి ఉంటుంది.

సంభోగంతో నొప్పి
సంభోగం సమయంలో నొప్పి చాలామందిలో కనబడే సమస్యే. దీన్ని 'డిస్పరూనియా' అంటారు. ఈ నొప్పి ఇటీవలే ఉన్నట్టుండి మొదలైందా? మొదటి నుంచీ ఇంతే బాధాకరంగా ఉన్నదా? అంగ ప్రవేశం సమయంలోనే నొప్పి ఉంటోందా? లేక సంభోగం ముగిసిన వెంటనే నొప్పి వస్తోందా? అన్నది ముఖ్యం.

* 'ఎండోమెట్రియోసిస్‌', పొత్తికడుపులో ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి.. సంభోగం సమయంలో నొప్పి ఉండొచ్చు.

* కాన్పు తర్వాత సంభోగంలో నొప్పిగా ఉందంటే కాన్పు సమయంలో పెట్టిన చిన్న కోత.. సరిగా మానకపోవటం.. లేదా మానిపోయిన గాటు ప్రాంతం మందంగా తయారవటం.. లేదా ఇన్ఫెక్షన్ల వంటివి కారణం కావచ్చు.

* ఎప్పుడూ మామూలుగానే ఉండి ఇటీవలే నొప్పిగా అనిపిస్తుంటే.. ఏవైనా కుటుంబంలో, జీవనశైలిలో వచ్చిన మార్పులు నొప్పికి దోహదం చేస్తున్నాయేమో చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు లైంగిక జీవితానికి దూరంగా ఉండాలన్న కోరిక, సంభోగం పట్ల, లైంగిక జీవితం పట్ల విముఖత.. 'నొప్పి' రూపంలో బయటపడొచ్చు. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఈ నొప్పిని ఒక కారణంగా కూడా చూపిస్తుండొచ్చు. తాము అనుభవిస్తున్న అసౌకర్యాన్ని మరో రూపంలో, పదంలో చెప్పుకోలేక ఆ ఇబ్బందిని 'నొప్పి' అంటుండొచ్చు. అది నిజంగా నొప్పి కాకపోవచ్చు.. కానీ దానికీ పరిష్కారం గురించి చూడాల్సిందే. కొన్నిసార్లు.. భర్తల విషయంలో అనుమానాలు, భయాలు ఉన్నవారు కూడా 'నొప్పి' అంటుండవచ్చు. భర్తల నుంచి తమకు సుఖవ్యాధులు సంక్రమిస్తాయా? అన్న భయాలు కూడా నొప్పిలా తయారవ్వచ్చు. అటువంటప్పుడు పరీక్షలు చేయించుకుని ఆ భయాలు పోగొట్టుకోవటం కూడా ముఖ్యమే. కాబట్టి మనసులో ఉన్న ఈ భయాలు, అనుమానాలు సంశయాలన్నింటినీ నిస్సంకోచంగా వైద్యులతో చర్చించటం చాలా చాలా ముఖ్యం.

* నెలసరి నిలిచిపోయిన వారిలో.. ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల లోపం కారణంగా యోని పొడిబారటం, సంకోచించటం (ఎట్రోఫిక్‌ వజైనా) వంటి సమస్యల వల్ల సంభోగ సమయంలో నొప్పి ఉంటుంది. అలాగే హార్మోన్‌ లోపం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెరిగి.. వాటివల్ల నొప్పి రావచ్చు. కాబట్టి ఈ వయసులో సంభోగం వంటి వాటి గురించి చెబితే వైద్యులు ఎలా అర్థం చేసుకుంటారోనన్న భయాలు పెట్టుకుని మౌనంగా ఉండిపోవాల్సిన పని లేదు. ఆయుర్దాయం, జీవనప్రమాణాలు గణనీయంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ వయసులో, దాంపత్య జీవితంలో ఇవేమీ అసహజం కాదు. వీటి గురించి నిస్సంకోచంగా డాక్టర్లతో చర్చించటం అవసరం, వీటికి చికిత్స చాలా తేలిక కూడా.
ఆపరేషన్ల తర్వాత
* గర్భాశయాన్ని తొలగించే 'హిస్ట్రెక్టమీ' ఆపరేషన్‌ తర్వాత.. కొందరిలో సంభోగం సమయంలో నొప్పి రావచ్చు. సర్జరీ తర్వాత లోపల యోని పైన ఉండే గోడ.. సంభోగ సమయంలో ఒత్తిడికి గురై నొప్పిగా ఉండొచ్చు.

* కొందరిలో పలుమార్లు సర్జరీలు చెయ్యటం వల్ల లోపల పేగులు అతక్కుపోయి.. వాటివల్ల (ఎడ్‌హిజన్స్‌) కూడా నొప్పి వస్తుండొచ్చు. వీటికి వైద్యులు తక్షణం పరిష్కరించలేకపోయినా నొప్పితో నెగ్గుకొచ్చే మార్గాలు సూచిస్తారు.


  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.