Wednesday, June 1, 2011

బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ , Awareness in Bypass surgery for Heart problem.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బైపాస్ సర్జరీ - గుండె చికిత్స అవగాహణ ( Awareness in Bypass surgery for Heart problem)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...కొంతకాలం క్రితం వరకు బైపాస్ సర్జరీ అంటే అందరికీ భయమే. బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఎక్కువ కాలం బతకకపోవచ్చనీ ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. అదే సమయంలో సర్జరీలో కొత్తవిధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో గుండెను ఆపి, గుండె చేసే పనిని మరో యంత్రంతో చేయిస్తూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గుండె యథావిధిగా రక్తాన్ని పంపింగ్ చేస్తుండగానే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ వివరాలను ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు వివరిస్తున్నారు.
గుండెకు నిరంతరం రక్తం సరఫరా జరుగుతూ ఉండాలి. ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అథెరోస్క్లిరోసిస్ (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం)వల్ల గుండె రక్తనాళాల్లో(ధమనుల్లో) అడ్డంకులు ఏర్పడతాయి. ఇది ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనే జరిగిపోయేది కాదు. దీర్ఘకాలం పాటు కొనసాగి క్రమంగా రక్తనాళం మూసుకుపోతుంది. 60 నుంచి 70 శాతం రక్తనాళం మూసుకుపోయినపుడు రక్తసరఫరా బాగా తగ్గిపోతుంది.


ఈ సమయంలో ఛాతీ నొప్పి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది, ఆయాసం, భుజంలో నొప్పి, దవడ వైపు నొప్పి పాకుతుండటం వంటి లక్షణాలుంటాయి. కొందరిలో ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో ఛాతీ నొప్పి ఉండదు. ఎటువంటి లక్షణాలు లేకుండానే హార్ట్ఎటాక్ వస్తుంది. 70 శాతం కంటే తక్కువ బ్లాక్ ఉన్నప్పుడు యాంటీప్లేట్‌గగలెట్స్ వాడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది. చాలా మందిలో ఇసిజి, ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌టెస్ట్(టీఎమ్‌టీ)లో రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు బయటపడుతుంది.

కారణాలు
రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటానికి చాలా కారణాలుంటాయి. పొగతాగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, కుటుంబ సభ్యుల్లో గుండె జబ్బులు ఉన్న చరిత్ర, ఒబెసిటీ వంటివి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

ఎవరికి అవసరం?
మందులతో నొప్పి తగ్గకపోయినా, యాంజియోగ్రామ్‌లో రక్తనాళం బాగా మూసుకుపోయినట్లు తెలిసినా యాంజియోప్లాస్టీ లేదా సర్జరీ(సిఎబిజి) చేయాల్సి ఉంటుంది. యాంజీయోప్లాస్టీ వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే రక్తనాళాలు మూసుకుపోయిన అందరికీ యాంజియోప్లాస్టీ ఉపయోగపడకపోవచ్చు. రక్తనాళాల్లో ఎక్కువ చోట్ల బ్లాక్స్ ఉన్నప్పుడు, డయాబెటిస్ రోగులకు, గుండె పనితీరు బలహీనంగా ఉన్నప్పుడు, లెఫ్ట్ మెయిన్ కరొనరీ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది.

సర్జరీ
బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండె చేసే పనిని నిర్వర్తించడానికి హార్ట్ లంగ్ మెషిన్ అమరుస్తారు. ఆపరేషన్ సమయంలో ఇది గుండె, ఊపిరితిత్తుల పనిని నిర్వర్తిస్తుంది. ఇటీవల ఒపిసిఎబి(ఆఫ్ పంప్ కరొనరీ ఆర్టరీ బైపాస్) అనే నూతన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బైపాస్ సర్జరీ నిర్వహించినపుడు గుండెను ఆపాల్సిన పనిలేదు. ఆపరేషన్ సమయంలో కూడా గుండె రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది. ఈ పద్ధతిలో గ్రాఫ్టింగ్ కోసం ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది.

కన్వెన్షనల్ బైపాస్ సర్జరీ కన్నా ఇందులో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. రోగి చాలా తక్కువ సమయంలో కోలుకుంటారు. మందులు, రక్తం తక్కువగా అవసరమవుతుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి, గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. గ్రాఫ్టింగ్ కోసం ఎడమ ఛాతీ గోడల్లోని ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీని, ముంజేతి భాగం నుంచి రేడియల్ ఆర్టరీని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఇంటర్నల్ మమ్మరీ అర్టరీని ఉపయోగించడం జరుగుతుంది. ఇందుకంటే ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. సిఎబిజి సర్జరీ చేసిన పదేళ్ల తరువాత అర్టీరియల్ గ్రాఫ్ట్‌తో పోల్చితే వెయిన్ గ్రాప్ట్స్ 66 శాతం మాత్రమే తెరుచుకుని ఉంటోంది.


సర్జరీ తరువాత
సర్జరీ తరువాత ఐదారు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చు. అయితే ఆరు వారాల పాటు అధిక బరువులు లేవనెత్తకూడదు. ఛాతీకి దెబ్బతగలకుండా చూసుకోవాలి. వెహికిల్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఆరు వారాల తరువాత సాధారణ పనులు చేసుకోవచ్చు. మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం మరవద్దు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే కొత్తగా బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి.

బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లాలి. పొగతాగడం మానేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. అల్కహాల్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సర్జీరీ చేసి బ్లాక్స్‌ను మాత్రమే తొలగిస్తున్నామే తప్ప బ్లాకులు ఏర్పడే శరీర లక్షణాలను తగ్గించలేం. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే కొత్తగా బ్లాక్స్ ఏర్పడకుండా ఉంటాయి.


డా. నాగేశ్వర్‌రావు-కార్డియోథొరాసిక్ సర్జన్,-యశోద హాస్పిటల్స్, నల్లగొండ క్రాస్ రోడ్,-మలక్‌పేట్, హైదరాబాద్,-ఫోన్ : 9246271144.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.