Thursday, June 2, 2011

బెణుకు, sprain


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బెణుకు, sprain- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...తరచుగా చాలామంది మడమ(ankle)బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో స్నాయువు లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే బెణుకులు (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

బెణుకులు ఎక్కువగా మడమ, మోకాలు, మోచేయి మరియు మణికట్టు కీళ్ళకు జరుగుతుంది. బెణికిన వారిలో 25 శాతం మందికి దీర్ఘకాలంపాటు జాయింట్లలో నొప్పి, కండరాలు బలహీనంగా మారటం ఉంటాయి.

చీలమండ బెణకడం అనేది రెండు రకాలుగా జరుగవచ్చు. చీలమండ జాయింటు బైటివైపునకు తిరగడం వలన పాదం లోపలికి ఒరగటం మొదటి విధానం. దీనినే వైద్య పరిభాషలో ఇన్వర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. చీలమండ బైట వైపున ఉండే స్నాయువులు బాగా సాగిపోయి చీరుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఇక రెండవ విధానంలో చీలమండ జాయింటు లోపలివైపునకు తిరగడం వలన పాదం బైటి వైపునకు ఒరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎవర్షన్‌ ఇంజ్యూరీ అంటారు. దీనిలో చీలమండ లోపలివైపు లిగమెంట్లు దెబ్బ తింటాయి.

లక్షణాలు
బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది. అలాగే వాపు, ఎరుపుదనాలు కనిపిస్తాయి. దెబ్బ తిన్న భాగాన్ని ముట్టుకుంటే నొప్పి వస్తుంది.ఒక మోస్తరు బెణుకుల్లో వాపు కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో మొదటి పది నిముషాలలో విపరీతమైన నొప్పి ఉండి, గంట, రెండు గంటలలో సద్దుమణుగుతుంది. కొంతమంది బెణికినప్పుడు చీరుకుపోయిన శబ్దాన్ని గాని, విరిగిన శబ్దాన్ని గాని వింటారు. చీలమండ జాయింటులోని లిగమెంట్లు దెబ్బ తిన్న స్థాయిని ఆధారం చేసుకుని లక్షణాలు తీవ్రత మారుతుంటుంది

తీవ్రత బట్టి వర్గీకరణ

బెణుకు ని ఆంగ్లం లొ స్ప్రైయిన్ అని పిలుస్తారు. ఇది తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి. చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది.
* మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.

ప్రధమ చికిత్స

చికిత్సని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదంలో గుర్తు పెట్టుకొని చేస్తారు.

* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
* Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న భాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
* Ice- ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
* Compression- కంప్రెషన్ బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
* Elevation- ఆ భాగాన్ని ఎత్తులో ఉంచడం,

వైద్యుణ్ణి ఎప్పుడు కలవాలి? బెణికినప్పుడు చీలమండ వద్ద ఏదో విరిగినట్లు శబ్దం రావడం. భరించలేనంత స్థాయిలో నొప్పి, వాపు, ఎరుపుదనాలు కనిపించడం లేదా రెండు వారాలకు మించి కొనసాగడం, పాదం మీద బరువు మోపలేకపోవడం, చీలమండ స్థిరత్వాన్ని కోల్పోవడం,దెబ్బ తగిలిన తరువాత తిమ్మిర్లు, మొద్దుబారటాలు ఉండటం తదితర సమయాల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

బెణికిన మడమకు ఏది మంచిది ?
ఎప్పుడైనా మడమ బెణికినపుడు వెంటనే వేడి కాపడం పెట్టటం మంచిదని చాలామంది చెబుతుండటం తెలిసిందే. ఇది నొప్పిని తగ్గిస్తుందని, రక్త ప్రసరణను ప్రేరేపించటం ద్వారా వాపు తగ్గేలా చేస్తుందని నమ్ముతుంటారు. కానీ మరికొందరు ఇందుకు పూర్తి విరుద్ధంగా బెణికిన చోట మంచుముక్కలు పెడితే మేలని భావిస్తుంటారు. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుందని, వాపు పెరగకుండా తోడ్పడుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో ఏది మంచిది? ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పరిశోధనలు మాత్రం మంచుకే ఓటేస్తున్నాయి. ఆటల్లో మడమ బెణికిన క్రీడాకారులపై శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేశారు. ఒకసారి వేడి కాపడం, మరోసారి మంచు పెట్టటం.. ఇలా రకరకాలుగా పరీక్షించారు. వీటితో పాటు నొప్పి నివారణ మందులు కూడా ఇచ్చారు. బెణికిన వెంటనే అక్కడ మంచుముక్కలను ఉంచటం ద్వారా త్వరగా ఉపశమనం కలుగుతున్నట్టు తేలింది. కాబట్టి బెణికిన మడమకు రక్షణ, విశ్రాంతి, మంచు పెట్టటం (20 నిమిషాల సేపు), బ్యాండేజీ చుట్టటం, కాలు ఎత్తుగా ఉంచటం.. అనే పద్ధతిని పాటించటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే.. మడమ బెణికితే వేడి కాపటం కన్నా మంచు ముక్కలను పెట్టటం మంచిదన్నమాట.

ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
తరచుగా చాలామంది మడమ బెణకటంతో బాధ పడుతుంటారు. కాలు కూడా కదపలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి .

* మడమ బెణికినప్పుడు విశ్రాంతి తీసుకోవటం అన్నింటికన్నా ప్రధానం. పాదం మీద భారం పడకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం అవసరమైతే క్రచెస్‌, చేతికర్ర ఉపయోగించటానికి మొహమాట పడొద్దు.

* సాధ్యమైనంతవరకు పాదాన్ని తొడల కన్నా ఎత్తుగా ఉంచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.

* చిన్నపాటి బెణుకులైనా తగ్గటానికి రెండు వారాల సమయం పడుతుంది....ఇసుగుపోకూడదు .

* వీలైనంత త్వరగా మడమపై ఐస్‌ బ్యాగ్‌ని పెట్టాలి. రెండు మూడ్రోజుల వరకు తరచుగా ఇలా చేస్తుండాలి.

* వాపుని తగ్గించటానికి సాగే బ్యాండేజీని మడమకు చుట్టాలి.

లేదా............బామ్మ చెప్పిన చిట్కాలు మంచివే !

చింతపండు, పాత బెల్లం మిశ్రమాన్ని వేడి చేసి బెణుకు నొప్పులుండే చోట లేపనం చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది

యూకలిప్టస్‌ నూనె (ఆయిల్‌) చర్మానికి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన అనారోగ్యాలను పోగొడుతుంది. తలనొప్పిని, బెణుకు నొప్పులను యూకలిప్టస్‌ ఆయిల్‌ను పూయడం వల్ల ఆ బాధను తగ్గిస్తుంది.

బెణుకు, వాపుల నొప్పి తగ్గటానికి మెంతులను ఉడికించి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు, నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుకడితే నివారణ కలుగుతుంది. అయితే రెండు మూడుసార్లు ఈ విధంగా కట్టు కట్టాలి.

ఆముదం మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్లనొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి.

ఇంగ్లిష్ (allopathy) చికిత్స :
నొప్పికి -> Tab . Aceclonac 750 one tab two time a day, for 7-10 days. or
->Tab . Dolomed MR one tab 3 times a day for 7- 10 days
పై మాత్రలు వాడినప్పుడు కడుపులో మంట రాకుండా tab pantop 40 daily one పరగడుపున వాడాలి .
Frimov ointment పై పూత గా రాయాలి . 3-4 రోజులు .
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.