ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
జలుబు జ్వరం
ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటివి ప్రధానంగా వైరస్‌ల కారణంగా వచ్చే సమస్యలు. ఇవి చాలా వరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా కూడా ఇవి ఐదారు రోజుల్లో తగ్గుతాయి. ఈ సమయంలో జలుబు, ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పుల వంటివి ఎక్కువగా ఉంటే.. అవి తగ్గేందుకు ఉపశమన ఔషధాలు తీసుకోవచ్చు. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లు తుడుచుకోవటంతో పాటు ప్యారాసెటమాల్ వంటి మాత్రలు వేసుకోవాలి. ముఖ్యంగా నీరు, ద్రవాహారం ఎక్కువగా తాగాలి. లంఖణం ఉండాల్సిన పని లేదు. తేలికగా జీర్ణమయ్యే ఇష్టమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించటం అవసరం.
టైఫాయిడ్
టైఫాయిడ్ ప్రధానంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సమస్య. దీనికి 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లోనే నివసిస్తుంది. టైఫాయిడ్ బారినపడినవారు, దాన్నుంచి కోలుకుంటున్నవారి రక్తం, పేగుల్లో ఇది ఉంటుంది. వారు మల విసర్జన చేసినప్పుడు ఇది బయటకొస్తుంది. ఈ సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే ఇతరులకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది. మురుగునీటితో తాగునీరు కలుషితమయ్యే ప్రాంతాల్లో టైఫాయిడ్ అధికంగా కనిపిస్తుంది. టైఫాయిడ్ నిర్ధారణ అయితే పూర్తి కోర్సు యాంటీబయోటిక్ మందులు తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో మానేస్తే టైఫాయిడ్ తిరగ బెడుతుంది. ఇతరులకు వ్యాపించే ప్రమాదమూ ఉంది.
లక్షణాలు
* విడవకుండా జ్వరం రావటం. సాధారణంగా జ్వరం 103 నుంచి 104 డిగ్రీల వరకు ఉంటుంది.
* కొద్దిగా వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించటం
* కడుపునొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం.
రాకుండా ఉండాలంటే?
* కలుషితమైన ఆహారం, నీటికి దూరంగా ఉండాలి.
* ఆహారం తీసుకునే ముందు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.రోడ్ల పక్కన అమ్మే తిను బండారాలు, పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
* అప్పుడే వండిన ఆహారాన్ని తినటం.. కాచి, చల్లార్చిన నీటిని తాగటం ఉత్తమం.
* టైఫాయిడ్ జ్వరం బారినపడకుండా టీకాలు కూడా వేయించుకోవచ్చు.
వర్షాకాలంలో ఏం జరుగుతుంది?
1. విజృంభించే వైరస్: వాతావరణ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే మార్పుల కారణంగా కొన్ని రకాల వైరస్‌లు, సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. ఫలితంగా ఈ సమయంలో తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరాల వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఎక్కువ.
2. నీరు కలుషితం: వర్షాల కారణంగా మనం తాగే నీరూ కలుషితమవుతుంది. ఫలితంగా కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు,కామెర్లు, టైఫాయిడ్ జ్వరాల వంటివి పెరుగుతాయి.
3. దోమల సంత: వర్షపునీరు నిల్వ ఉండి.. పరిసరాల్లో దోమల సంతతి అనూహ్యంగా పెరిగిపోతుంది. ఫలితంగా దోమకాటు మూలంగా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి సమస్యలూ పెరుగుతాయి.
అయితే వీటిపై అవగాహన పెంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నింటినీ నివారించుకునే వీలుంది.
డెంగీ
దోమలు తెచ్చే పెద్ద ముప్పు ఈ డెంగీ జ్వరాలు. అన్నిచోట్లా విపరీతమైన జనసాంద్రత, పారిశుద్ధ్యలోపం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత లోపించటం.. ఇవన్నీ డెంగీ ముప్పు తెచ్చిపెట్టే 'ఈడిస్ ఈజిప్త్టె' దోమ సంతతి పెరిగేందుకు అనువైన పరిస్థితులే. ఈ దోమ కాటు ద్వారా డెంగీ జ్వర కారకమైన ఫ్లావి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇవి ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఎక్కువగా కాళ్లు, చేతుల వంటి భాగాల మీద కుడతాయి. ఇవి స్వచ్ఛమైన నీటిలో పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన తర్వాత రెండు నుంచి ఏడు రోజుల మధ్యలో డెంగీ లక్షణాలు కనబడొచ్చు.
లక్షణాలు
అకస్మాత్తుగా వణుకుతో జ్వరం రావటం. 101 నుంచి 104 డిగ్రీల వరకు జ్వరం ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకోసారి వెలుతురు చూడటం కూడా కష్టం కావొచ్చు. బలహీనత, నోరు చేదు, ఆకలి మందగించటం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కొంతమందిలో ఛాతీ మీద, వీపు మీద ఎర్రటి చిన్నచిన్న మచ్చలు రావచ్చు. సాధారణంగా జ్వరం వారం పాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. కొంతమందిలో మొదటి రెండు రోజులు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. రెండోసారి వచ్చినప్పుడు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువ.
* డెంగీ తీవ్ర రూపమైన డెంగీ హెమరేజిక్ ఫీవర్‌లో రక్తంలో ప్లేట్‌లెట్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. శరీరం మీద రక్తపు మచ్చలు రావొచ్చు. కొంత మందిలో ముక్కు, పళ్లచిగుళ్ల నుంచి రక్తం కారొచ్చు. రక్తపు వాంతులు, నల్లని విరేచనాలు కూడా అవ్వొచ్చు.
* డెంగీ షాక్ సిండ్రోమ్‌లో.. హెమరేజిక్ ఫీవర్‌లో కనిపించే లక్షణాలన్నీ ఉంటాయి. రోగి నాడి కొట్టుకోవటం, రక్తపోటు తగ్గిపోతుంది. ఒళ్లు చల్లబడటం, బాగా చెమట పట్టటం, అస్థిమితం, ఒకోసారి అపస్మారక స్థితిలోకీ వెళ్లే ప్రమాదం ఉంది. ఇవి తీవ్రమైన రకాలు కాబట్టి అసలు డెంగీ జ్వరం రాకుండా చూసుకోవటం అత్యుత్తమం.
రాకుండా ఉండాలంటే?
* పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా.. శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరగకుండా చూసుకోవాలి.
* ముఖ్యంగా పగటి పూట దోమల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
* పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు వేయటం మంచిది. క్లాసు రూముల్లో, ప్రయాణాల్లో దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
మలేరియా
ఒకప్పుడు మలేరియా అంటే తీవ్రమైన చలితో, ఎక్కువగా సాయంత్రం పూట వచ్చే జ్వరమని భావించేవారు గానీ క్రమేపీ ఈ జ్వరం లక్షణాల్లో తేడాలు వస్తున్నాయి. ఈ మలేరియా.. ప్లాస్మోడియం జాతి సూక్ష్మక్రిముల మూలంగా వస్తుంది. ఈ సూక్ష్మక్రిమి ఎనాఫిలస్ దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ సూక్ష్మక్రిముల్లో నాలుగు రకాలున్నాయి. వీటిల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ చాలా ప్రమాదకరమైంది. మలేరియా మరణాలకు చాలావరకు ఈ వైరస్ కారణమవుతోంది. దోమ కుట్టటం ద్వారా రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు కాలేయాన్ని చేరుకుంటాయి. అనంతరం కాలేయంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. అక్కడ్నుంచి రక్తప్రసరణలో కలిసి మలేరియా దాడి చేయటానికి దోహదం చేస్తాయి.
లక్షణాలు
* తొలిదశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.
* తర్వాత రోజు విడిచి రోజు జ్వరం వస్తూ పోతుంటుంది.
* చలితో వణకటం, దుప్పట్లు కప్పితే కొంతసేపటికే చెమటతో తడిసిపోయి ఒళ్లంతా చల్లబడుతుంది.
* అనీమియా, కొందరిలో ప్లీహం కాస్త పెద్దగా అవటం ఉంటుంది.
* సెరిబ్రల్ మలేరియా ప్రాణాంతకమైంది. ఇందులో నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది.
* కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యం కూడా కనబడుతుంది.
రాకుండా ఉండాలంటే?
* చేతులు కాళ్లను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
* దోమల బారినపడకుండా దోమతెరలు, రిపెలెంట్లు, కాయిల్స్, క్రీములు, లోషన్ల వంటి వాటితో దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలి.
* కిటికీలకు తప్పకుండా మెష్‌లు అమర్చుకోవాలి.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
* ఖాళీ పాత్రలు, వాడకుండా ఉన్న ఎయిర్‌కూలర్ల వంటి వాటిల్లో నీరు లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లోని ఖాళీ డ్రమ్ముల వంటి వాటిని బోర్లించాలి. టెంకాయ చిప్పలు, పాత టైర్ల వంటి వాటిని దూరంగా పారేయాలి.
* మలేరియా ప్రబలిన ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే వైద్యుడిని సంప్రదించి యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలాంటి చోట్లకు గర్భిణులు వెళ్లకపోవటమే మంచిది.
కామెర్లు
వాస్తవానికి కామెర్లు అనేది ఒక లక్షణం మాత్రమే. ఇది హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఎన్నో ఇన్ఫెక్షన్లలో రావచ్చుగానీ ఈ సీజన్లో విజృంభించే కామెర్లకు ఎక్కువగా హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఇ రకం వైరస్‌లు కారణమవుతాయి. ఇవి ప్రధానంగా కలుషితాహారం, కలుషితమైన తాగునీటి కారణంగా వ్యాపిస్తాయి. వర్షకాలంలో మురుగు నీరు తాగునీటితో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీంతో ఈ రకం కామెర్లు ప్రబలిపోయే ప్రమాదం పొంచి ఉంటోంది. కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారటం, రక్తంలో బిలురుబిన్ స్థాయి పెరగటం, శరీరంలోని సున్నితమైన చర్మం కూడా పచ్చబడే అవకాశాలుంటాయి. ఇలా హెపటైటిస్-ఎ, ఇ రకం వైరస్‌ల కారణంగా వచ్చే కామెర్ల సమస్య రెండు మూడు వారాల్లో సహజంగానే దానంతట అదే తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ఇది తేలికగానే తగ్గిపోతుంది గానీ పెద్దవయసు వారిలో నెలల తరబడి వేధించవచ్చు. దీన్ని అశ్రద్ధ చెయ్యటానికి లేదు.
లక్షణాలు
* హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఇ రకం వైరస్‌ల వల్ల కామెర్లలో ప్రధానంగా ఆకలి మందగిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లో కేవలం వాంతులు, కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్లంతా నొప్పి వంటి ఉంటాయి. నాలుగైదు రోజుల తర్వాత మూత్రం పచ్చగా అవుతుంది. క్రమంగా చర్మం, కంట్లో తెల్లభాగం, గోళ్లు, నాలుక పసుపు పచ్చగా అవటం. మూత్రం కూడా పసుపు రంగులో రావటం. కొన్ని సందర్భాల్లో మలం తెల్లగా, నల్లగా రంగూ మారొచ్చు.
* కడుపునొప్పి, చికాకు, బలహీనత వంటివీ కనిపిస్తాయి.
* కామెర్లు ముదిరితే వాంతిలో రక్తం పడటం, కడుపులో ద్రవాలు పేరుకుపోవటం వంటి ప్రమాదకర లక్షణాలు కూడా ఉంటాయి.
రాకుండా ఉండాలంటే?
* పరిశుభ్రమైన నీటినే తాగాలి. తాగునీటిని బాగా మరగకాచి, వడకట్టి, చల్లారిన తర్వాత తాగటం మంచిది.
* సాధ్యమైనంత వరకూ ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. బయట రోడ్ల మీద అమ్మే పదార్థాలు, పండ్ల రసాల వంటివి కలుషితమయ్యే అవకాశం ఉందని గుర్తించాలి.
* కూరగాయలు, ఆకుకూరలను బాగా కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించాలి. పండ్లను కూడా శుభ్రంగా కడిగాకే తినాలి.
* కామెర్ల లక్షణాలు కనబడితే ఆకుపసర్లు, చెట్టుమందులంటూ తాత్సారం చేయకుండా అసలు అవి ఏరకం కామెర్లన్నది నిర్ధారణ చేసేందుకు, తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్యులను సంప్ర దించాలి.
నీళ్ల విరేచనాలు
బ్యాక్టీరియా, వైరల్, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల మూలంగా నీళ్లవిరేచనాలు (డయేరియా) వస్తాయి. రోజుకి మూడు అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా భావించొచ్చు. సాధారణంగా ఇది రెండు మూడు రోజుల వరకు ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాంతులు విరేచనాలతో బాధపడే వారికి ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.
వాంతులు విరేచనాలతో ఒంట్లో నీటితో పాటు ముఖ్యమైన లవణాలు కూడా బయటకు పోతాయి. వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోతే 'డీ హైడ్రేషన్'కు దారి తీస్తుంది. ఇలాంటి సమయాల్లో కొందరికి సెలైన్ పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అందువల్ల పరిస్థితి ముదరకుండా వాంతులు విరేచనాలు అవుతుంటే 'ఓఆర్‌ఎస్'ను అరగ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి.
ఎన్నిసార్లు విరేచనాలు అయితే అన్నిసార్లు ఓఆర్‌ఎస్ కలిపిన ద్రావణాన్ని తాగటం తప్పనిసరి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ, పప్పునీళ్ల వంటి వాటినీ తరచుగా తీసుకోవాలి.
- =========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.