Sunday, June 26, 2011

జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జీవనశైలి జబ్బులు ,సాంక్రామికేతర జబ్బులు,Non Communicable Diseases.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులు 30, 40ఏళ్ల వయసు వారిలోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి జబ్బుల్ని 'సాంక్రామికేతర జబ్బులు' (నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) అని అంటున్నారు. ఈ జబ్బులు సూక్ష్మజీవులవల్ల వచ్చేవి కావు. వీటినే జీవనశైలి జబ్బులనీ అంటున్నారు. జీవన విధానాల్లోని తేడాలవల్ల, భోజన పద్ధతులవల్ల, ప్రవర్తనవల్ల సంక్రమించే జబ్బులివి. మరో విధంగా చెప్పాలంటే- ఆధునిక ప్రపంచం మోసుకొచ్చిన మార్పులు తెచ్చిపెడుతున్న కొత్త సమస్యలివి. సగటు ఆయుఃప్రమాణం పెరగడం, జనాభాలో వృద్ధుల సంఖ్య అధికం కావడం, అంటువ్యాధులను నయం చేయడానికి తగిన వైద్యసౌకర్యాలు ఇనుమడించడం, పట్టణీకరణ వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు సిగరెట్లు, మద్యం వాడకం పెరిగితే గుండె జబ్బులు, వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతాయి. వాతావరణ కాలుష్యంవల్ల మితిమీరితే శ్వాసకోశ వ్యాధులూ ముట్టడిస్తాయి. శారీరక శ్రమతో సంబంధంలేని జీవన విధానాలవల్లా స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ముసురుకుంటాయి. గుండె-రక్తనాళ జబ్బులు (కార్డియోవాస్కులార్‌ డిసీజెస్‌), మెదడు-రక్తనాళ జబ్బులు (సెరిబ్రో వాస్కులార్‌ డిసీజెస్‌), గుండెపోటు, పక్షవాతం, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఆస్తమా, కీళ్లు అరుగుదల, ఎముకల బలహీనత, పంటి సమస్యలు, మానసిక జబ్బులు లాంటివన్నీ సాంక్రామికేతర జబ్బుల జాబితాలోకి వస్తాయి. దేశంలో 36శాతం మధ్యవయసు మరణాలకు కారణం ఈ జబ్బులే. కనీస జాగ్రత్తలతో మెలిగితే ఈ మరణాల్లో కనీసం నాలుగోవంతునైనా నివారించవచ్చన్నది ఓ అంచనా.

నిర్లక్ష్యమే మరణశాసనం
ప్రపంచవ్యాప్తంగా కూడా సాంక్రామికేతర వ్యాధుల విజృంభణ పెరుగుతోంది. 2015నాటికి ఆసియాలో ప్రతి నాలుగు మరణాల్లో మూడు ఈ కారణంగానే సంభవిస్తాయన్నది ఓ అంచనా. 2008లో అయిదు కోట్ల 70లక్షల మంది మరణించగా- అందులో 63శాతం (మూడుకోట్ల 60లక్షలు) మరణాలకు సాంక్రామికేతర జబ్బులే కారణం. ధనిక దేశాల్లో ఇలాంటి జబ్బులవల్ల చనిపోయేవారు 13శాతం; 80శాతం మరణాలు పేద, మధ్యస్థాయి దేశాల్లోనే (ఆఫ్రికా మినహా) సంభవిస్తున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సరు, దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులే ఈ మరణాలకు చాలావరకు కారణం. దక్షిణ తూర్పు ఆసియా దేశాల్లో (ఇండియా, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, కొరియా, ఇండొనేసియా, మియన్మార్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌) 29శాతానికిపైగా మరణాలు వీటివల్లే సంభవిస్తున్నట్లు జకార్తాలో జరిగిన ఓ సమావేశంలో అంచనా వేశారు. రాష్ట్రంలోనూ ఎన్నో ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఒక సర్వే జరిగింది. శారీరక శ్రమ చాలా తక్కువ చేసేవారి సంఖ్య 68శాతంగా అందులో తేలింది. రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నవారు 43శాతం, అధిక బరువు ఉన్నవారు 23శాతం ఉన్నారు. ఇక 35ఏళ్ల వయసున్న పట్టణవాసుల్లో 16-20శాతం దాకా మధుమేహ వ్యాధి ఉండవచ్చని ఒక అంచనా. రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో 45గ్రామాల్లో జరిగిన ఒక అధ్యయనంలో 55శాతం మరణాలకు కారణం అంటురోగాలేనని స్పష్టమైంది.

సాంక్రామిక వ్యాధులు ముమ్మరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశంపై దృష్టిసారించింది. ఏప్రిల్‌ 28, 29న మాస్కోలో జరిగిన వివిధ దేశాల ఆరోగ్యశాఖామాత్యుల సమావేశంలో ఈ విషయంమీదే లోతైన చర్చ జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం అందులో పాలుపంచుకొంది. మనదేశంలో ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్య అంటువ్యాధులే. స్వాతంత్య్రం తరవాత అంటువ్యాధులపై పైచేయి సాధించే అవకాశం మనకు ఉండేది. కానీ, గడచిన అరశతాబ్దంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. దానివల్ల అంటువ్యాధులు తగ్గకపోగా ఇతర వ్యాధులూ విజృంభించాయి. ఐరోపా దేశాల ఆరోగ్య చరిత్ర తరచిచూస్తే- ప్రభుత్వ విధానాల్లో క్రమబద్ధమైన రీతులు అక్కడ గోచరిస్తాయి. వారు తొలుత అంటువ్యాధుల్ని నియంత్రించిన తరవాతే సాంక్రామికేతర వ్యాధుల సమస్యమీద దృష్టి సారించారు. మనదేశం ప్రస్తుతం ఈ రెండు రకాల వ్యాధుల భారాలను ఒకేసారి మోయాల్సి వస్తోంది. అంతేకాక ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన జబ్బులు నేడు పేదలకూ సంక్రమిస్తున్నాయి. పేదరికంవల్ల జబ్బులు పెరుగుతుంటే... వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో మరింత పేదరికంలోకి దిగజారుతున్న వైనం కళ్లముందే కనిపిస్తోంది. సాంక్రామికేతర జబ్బులు జీవితాంతం వెంటాడతాయి. వీటికి ఏళ్ళతరబడి వైద్యం అవసరమవుతుంది. చికిత్సా పద్ధతులూ ఖరీదైనవే. మనదేశంలో గుండె జబ్బు బారినపడ్డ కుటుంబాల్లో 20శాతం మేర పేదరికంలోకి కుంగిపోతున్నాయి. అదేవిధంగా క్యాన్సరు వస్తే 25శాతం కుటుంబాలు దారిద్య్రంలో కూరుకుపోతున్నాయి. అల్పాదాయ కుటుంబంలో ఒకరు మధుమేహం బారినపడితే, వారి ఆదాయంలో 34శాతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యంపట్ల ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్యకరమైన అలవాట్లను పౌరుల్లో పెంపొందించేందుకు ప్రభుత్వాలు ఏ రోజూ చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలెప్పుడూ మద్యాన్ని, పొగాకును ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలుగానే చూశాయి. 92శాతం వూపిరితిత్తుల క్యాన్సర్‌కు, 42శాతం దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులకు, 20శాతం గుండె, రక్తనాళ జబ్బులకు పొగతాగడమే కారణం! ఆల్కహాలు అధికంగా సేవించడంవల్ల ప్రపంచంలో రెండుకోట్ల 30లక్షల మంది మరణిస్తున్నారు. ఈ జబ్బుల్ని అరికట్టడంలో పొగాకు, ఆల్కహాలుపై నియంత్రణ చాలా కీలకమైనది. పొగాకుపై 20శాతం పన్ను పెంచితే పొగతాగేవారి సంఖ్య ఎనిమిది శాతం తగ్గవచ్చన్నది ఒక అధ్యయనం. పొగాకు, ఆల్కహాలు దుష్పరిణామాలమీద ప్రజల్లో అవగాహన తీసుకురావడం, వాటి వాణిజ్య ప్రకటనల్ని నిషేధించడం, అవి విచ్చలవిడిగా లభ్యం కాకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం సర్కారు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు. ప్రపంచీకరణ ముందుకు తెస్తున్న ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తరహా జీవన విధానాలు సాంక్రామికేతర జబ్బులు పెరగడానికి సారవంతమైన భూమికను అందిస్తున్నాయి. అందుకే వీటిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాల స్థాయిలోనే నివారణ, నియంత్రణలకు పథకాలు రచించాల్సి ఉంది. 2007-2008లో కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్వేలో మనదేశంలో అంటువ్యాధులవల్ల సంభవించే మరణాలకంటే సాంక్రామికేతర వ్యాధులవల్ల జరిగే మరణాలు రెండింతలని తేలింది. ఇప్పటికైనా ఈ ముప్పును ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలంటే అందుకు ప్రజాపంపిణీ వ్యవస్థలో వైవిధ్యభరితమైన ఆహారపదార్థాలు దొరికేటట్లు, అవి మధ్య తరగతికీ అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమవల్ల చాలా జబ్బులను తగ్గించవచ్చు. ఇందుకు సైకిళ్ల వాడకం పెరగాలి. సామాజిక ఆటస్థలాలను, పార్కులను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టాలి. సింగపూర్‌లో ఉన్నట్టుగా పాఠశాలలో 'స్లిం అండ్‌ ట్రిమ్‌ పాలసీ'ని అమలుచేయాలి. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో రోజుకు గంటన్నర సమయాన్ని క్రీడలకోసం తప్పనిసరిగా కేటాయించాలి.

క్యాన్సరుకు సంబంధించిన హైటెక్‌ వైద్యసదుపాయాలపై శ్రద్ధపెడుతున్నారుగానీ- నివారణపై ఎలాంటి దృష్టీ పెట్టడం లేదు. మధుమేహం నియంత్రణకై పైలెట్‌ ప్రాజెక్టులు ప్రారంభించినా అవేవి సక్రమంగా జరగడంలేదు. జబ్బు తొలిదశలోనే గుర్తించగలిగితే వైద్యఖర్చులు పెరగకుండా చూసుకోవచ్చు. మందులు చౌకధరలకు అందుబాటులో ఉండేలా చూడటం, 'పారామెడికల్‌ వర్కర్‌'లు, నర్సులు, ఇంటిదగ్గరే వైద్య చికిత్స అందించగలిగేవారి సంఖ్య పెరిగేలా చూడాలి. దీర్ఘకాలిక వైద్యసేవలను అందించగల వైద్య వ్యవస్థలను రూపొందించుకోవాలి. అందుకోసం కొంతమేర ఎక్కువ డబ్బే వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నిరాసక్తతకు అసలు కారణమిదే. సాంక్రామికేతర జబ్బులకు నిధులు ఏ స్థాయిలోనూ తగినంతగా లేవు. పౌరుడు తన ఆరోగ్య పరిరక్షణకోసం వెచ్చిస్తున్న దాంట్లో కేవలం 20శాతం మాత్రమే ప్రభుత్వం వైపునుంచి అందుతోంది. మిగిలినదంతా వ్యక్తిగతంగా ఎవరి ఖర్చులు వారు పెట్టుకుంటున్నారన్నమాట. రోజుకు ఇరవై రూపాయలైనా ఆదాయంలేనివారే అత్యధికులున్న మనదేశంలో ఈ పరిస్థితి సహించరానిది.

ముందుచూపు ముఖ్యం
ఈ ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ- సాంక్రామికేతర జబ్బుల నివారణ నియంత్రణలమీదే ప్రధానంగా జరగబోతోంది. ఇటీవల మాస్కోలో జరిగిన ఆరోగ్యశాఖా మంత్రుల సదస్సు ఇందుకు సన్నాహకంగా జరిగిందే! కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థమీద అనేక అవాంఛనీయ ఒత్తిళ్ళు వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సాంక్రామికేతర జబ్బుల ప్రణాళికలో వ్యాధినిరోధంతోపాటు వైద్యానికీ ప్రాధాన్యం ఉంది. మాస్కో ప్రకటనలో ఈ తరహా జబ్బులకు కావలసిన ఉపశమన వైద్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ జబ్బుల వైద్యానికి, నాణ్యమైన మందులకు సంబంధించిన ప్రస్తావనే ఆ ప్రకటనలో లేదు. అదేవిధంగా ముసాయిదాలో ఉన్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాలు తుది ప్రకటనలో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సామాజిక ఆరోగ్య ఉద్యమకార్యకర్తలు, మూడో ప్రపంచదేశాల ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించాల్సిన సమయమిది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్యసేవలను పటిష్ఠంచేసి వాటికి సాంక్రామికేతర వ్యాధుల ప్రణాళికను అనుసంధానించాలి. రాష్ట్రంలోనూ ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ మీద దాదాపు 3000కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. కానీ, ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసే ఒక సమగ్ర పథకం ప్రభుత్వం వద్ద లేదనేది వాస్తవం. అటువంటి దార్శనికతే సర్కారు ప్రదర్శించి, ఈ రూ.3000కోట్లు ప్రభుత్వాసుపత్రులమీద వ్యయంచేసి ఉంటే- ఇప్పటికే సకల సౌకర్యాలతో చక్కని ప్రభుత్వాసుపత్రులు తయారై ఉండేవి. సాంక్రామికేతర జబ్బులను ఎదుర్కోవడం సాధ్యమయ్యేది. ప్రపంచమంతా ఈ జబ్బులమీద యుద్ధం ప్రకటిస్తున్న ఈ సమయంలోనైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య విధానంవైపు దృష్టిసారించాలి.

(రచయిత శాసనమండలి సభ్యులు,జనవిజ్ఞానవేదిక ఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ / డాక్టర్‌ గేయానంద్‌.)
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.