Monday, September 5, 2011

సైక్లికల్‌ బ్రెస్ట్‌పెయిన్‌ అవగాహన ,Cyclic breastpain awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సైక్లికల్‌ బ్రెస్ట్‌పెయిన్‌ అవగాహన (Cyclic breastpain awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సైక్లికల్‌ బ్రెస్ట్‌పెయిన్‌ అవగాహన : చాలామంది మహిళలకు ప్రతి నొప్పీ!ప్రమాదం కాదు.సుడులు తిరిగే వేదన.. ఒక్కసారిగా హృదయంలో భారం...ఉన్నట్టుండి రొమ్ములో ముళ్లు గుచ్చుకున్నట్లు అనిపించడం.... క్యాన్సర్‌ భయాన్ని కలిగిస్తుంది.అయితే అది చాలాసార్లు వాస్తవం కాకపోవచ్చు.
ఆ నొప్పి.. ఎందుకు, ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. సరైన అవగాహన, పరిష్కారాలతో సాంత్వన పొందాలి.

రొమ్ములో నొప్పి.. అన్ని వయసుల వారిలో ఏదో ఒక సందర్భంలో కనిపించే సమస్య. అయితే మెనోపాజ్‌ దశకు చేరుకోని వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఆ నొప్పిని ఎదుర్కొంటారు. మూడు రకాలుగా బాధించే ఈ తరహా నొప్పికి చికిత్స ఉంది. రుతుచక్రంలో భాగమైన రొమ్ము నొప్పిని 'సైక్లికల్‌ బ్రెస్ట్‌పెయిన్‌'గా పరిగణిస్తారు. నెలసరికి వారం ముందు రొమ్ముల్లో అసౌకర్యం, విపరీతమైన నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఇది కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉంటుంది. రొమ్ములు చాలా సున్నితంగా మారతాయి. నెలసరి పూర్తయ్యాక దానంతట అదే తగ్గిపోతుంది. నెలసరితో నిమిత్తం లేకుండా ఈ నొప్పి దీర్ఘకాలంగా వేధించడం, ఇతర భాగాల వల్ల కూడా ఎదురుకావడాన్ని 'నాన్‌ సైక్లిక్‌ బ్రెస్ట్‌పెయిన్‌'గా పేర్కొంటారు.

హార్మోన్ల ప్రభావం..
నెలసరికి ముందు వచ్చే నొప్పికి ప్రత్యేక కారణాలు నిర్థారణ కాలేదు. గర్భనిరోధక మాత్రలు వాడటం, ఒత్తిడి, దాని నివారణకు వాడే మందులు.. వంటివి ప్రధాన కారణాలు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. నెలసరి సమయంలో విడుదలయ్యే హార్మోన్ల పనితీరుతో రొమ్ము కణజాలం సున్నితంగా మారుతుంది. ఫలితంగానే నొప్పి. ఈ బాధ ఒకటి లేదా రెండింటికీ.. క్రమంగా బాహుమూలాలకూ చేరుతుంది. మెనోపాజ్‌ మొదలయ్యాక అండాశయాల పనితీరు ఆగిపోతుంది కాబట్టి నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ సమయంలో హార్మోన్లు (హెచ్‌ఆర్‌టీ) వాడే వారిలో మళ్లీ ఎదురుకావచ్చు.

పరీక్షలు.. ప్రాథమిక జాగ్రత్తలు
రొమ్ము నొప్పితో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ముందు ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో భాగంగా మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌తో పాటు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నొప్పి నెలసరి సమయంలోనే వస్తోందని నిర్థారణ అయితే నివారించడం సులువు. ఇలాంటప్పుడు ఆహార జాగ్రత్తలూ అవసరమే.

కెఫీన్‌ ఆధారిత పదార్థాలు, చాక్లెట్‌ వంటి వాటిని తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
నిత్యం వ్యాయామాన్ని చేస్తూ బరువు అదుపులో ఉంచుకోవాలి. లోదుస్తులు అంటే బ్రా ఎంపికలో నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వాలి.
కొందరు మహిళలు రొమ్ములకు సాంత్వననందించే రిలాక్సేషన్‌ టేపులను ప్రయత్నిస్తారు. అలాగే ఆక్యుపంక్చర్‌, అరోమాథెరపీ వంటివీ నొప్పిని తగ్గించడంలో మేలు చేస్తాయి.

ఒకవేళ గర్భనిరోధక మాత్రలు వేసుకున్న తరవాత నొప్పి బాధిస్తోందనిపిస్తే వైద్యుల సూచనల మేరకు మాత్రల విషయంలో మార్పులు చేసుకోవాలి. అయినా సరే నొప్పి అలాగే కొనసాగుతుంటే.. కండోమ్స్‌ వంటి గర్భనిరోధకాలని ఎంచుకోవాలి.

ఓ అధ్యయనం ప్రకారం.. ఈవెనింగ్‌ ప్రిమ్‌రోజ్‌ ఆయిల్‌ మాత్రలో గామోలెనిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దానివల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది కానీ.. అది ఇంకా నిర్థారణ కాలేదు. దీన్ని వాడటం వల్ల వికారం, తలనొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అయితే గర్భిణులు, గర్భం దాల్చాలనుకునే వాళ్లు.. మూర్ఛవ్యాధి ఉన్నవాళ్లు దీన్ని తీసుకోకూడదు. వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరి.

మందులు: కొన్నిరకాల నొప్పి నివారిణులు, నాన్‌ స్టిరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీంలు, జెల్స్‌ (ఎన్‌.ఎస్‌.ఎ.ఐ.డి) వాడితే.. కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అది కుదరనప్పుడు వైద్యుల సూచనల మేరకు మాత్రలు తీసుకోవచ్చు. ఇవి ఎంతకాలం వాడాలనేది వైద్యులే వివరిస్తారు.

హార్మోన్లు: నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, మందులు వాడినా, క్రీంలు రాసుకున్నా సమస్య తగ్గని పక్షంలో వైద్యులు హార్మోన్ల మాత్రలు సిఫారసు చేస్తారు. వీటిని వాడుతున్నప్పుడు మాత్రం కొన్నిరకాల దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. నిపుణులతో చర్చించి ఆ తరవాతే ఎంచుకుంటే సరిపోతుంది తప్ప శస్త్రచికిత్స అవసరం లేదు.

నెలసరి కాని వేళల్లో నొప్పికి.. ఉపశమనం
ఈ తరహా నొప్పి రెండురకాల్లో ఉంటుంది. ఒకటి రొమ్ములోనే వస్తుంది. మరొకటి రొమ్ము వెనకాల ఉండే కండరం, పక్కటెముక కలిసి ఉండే చోట నుంచి బాధిస్తుంది. అయితే దాన్ని కూడా రొమ్మునొప్పిగానే అనుకుంటారు. ఈ రెండూ నెలసరితో నిమిత్తం లేకుండా వస్తాయి. ఒకవేళ మెనోపాజ్‌ సమయంలో వస్తే మాత్రం క్యాన్సర్‌ అని అన్ని సమయాల్లో భ్రమపడాల్సిన అవసరంలేదు. ఇతర కారణాలూ ఉంటాయి. రొమ్ముల్లో ఉండే ఇతర సమస్యలు, గతంలో వాటికి ఏదైనా శస్త్రచికిత్స జరిగినా... నొప్పి తప్పదు. రొమ్ము బయటి భాగం నుంచి నొప్పి వస్తోందంటే ఛాతి గోడల దగ్గర వాపు ఉండి ఉండవచ్చు. ఈ స్థితిని 'కాస్టో కాండ్రైటిస్‌' గా పరిగణిస్తారు.

కారణం తెలుసుకునేందుకు ముందుగా ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు వైద్యులు. క్యాన్సర్‌ లేదని తేలితే.. ముందుగా ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటివి సూచిస్తారు.

విలువైన విశ్రాంతి..
సమస్య మరీ తీవ్రంగా ఉండి అది ఛాతి, భుజాలకూ చేరితే ఆ భాగంపై ఒత్తిడి పెంచకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎందుకంటే కదలికలు నొప్పిని మరింత పెంచుతాయి. కొన్నిరకాల పెయిన్‌కిల్లర్లు సమస్యను తగ్గిస్తాయి. వైద్యుల్ని సంప్రదిస్తే.. లోకల్‌ ఎనస్తీషియా, స్టిరాయిడ్‌ ఇంజెక్షన్‌తో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. గుండెల్లో పట్టేసినట్లు ఉండటం కూడా రొమ్ములో నొప్పి అనే భావనను కలిగిస్తుంది. కాబట్టి నొప్పి ఎక్కడో తెలుసుకుని ఆ ప్రకారం చికిత్స తీసుకుంటే సరిపోతుంది. అంతేకానీ ఇది క్యాన్సరే అని కంగారు పడాల్సిన అవసరం లేదు.

-- p.Raghuram . Breast surgeon , KIMS hospital Hyaderabad.for Eenadu vasundara



  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.