మనకు ఆహారమంటే శక్తి! పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటి గురించే ఎక్కువగా మాట్లాడతాం.. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న 'పీచు' గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం!
'పీచు' అంటే మనకు చిన్నచూపు! అందుకే తరచుగా 'వాళ్లేం తింటారు.. పచ్చిగడ్డి!' అనీ.. 'ఏదో తిన్నాం లెండి, గడ్డీగాదం..!' అనీ రకరకాలుగా వెటకారాలు ఆడుతుంటాం. పీచు అంటే అదేదో పనికిమాలినదని భావిస్తుంటాం. కానీ ఇది వట్టి అపోహ. పైగా మన ఒంటికి చేటు తెచ్చే అపోహ! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు. వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్ పెరక్కుండా.. మధుమేహం రాకుండా.. వూబకాయం రాకుండా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదు. మన అన్నం పళ్లాన్ని నానా రకాల 'జంక్ ఫుడ్' ఆక్రమించేస్తున్న ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ 'పీచు'ను ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతోంది.
* పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు.
* పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి.
* పిల్లలకు కూడా పీచు అవసరమేగానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపునిండినట్త్లె ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతోశక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్ధాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి.వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది.
* పైకి పెద్దగా ఏమీ కనబడదుగానీ అనాస పండులో కంటే సపోటా పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే కాయగూరల్లో కంటే ముడిధాన్యం, పొట్టు పప్పుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవటం అవసరం.
* పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుందిగానీ.. మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోగలం కాబట్టి మన ఆహారంలో కూరగాయల ద్వారానే ఎక్కువగా పీచు వస్తుంది.
పోషకాహారమంటే.... పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాల వంటివే కాదు.. 'పీచు పదార్ధాన్ని' కూడా ముఖ్యమైన 'పోషక వనరు'గా గుర్తించాల్సిన అవసరం వచ్చేసింది. గత 20, 30 ఏళ్ల నుంచీ మన ఆహారంలో 'పీచు'కు ప్రాముఖ్యం పెరుగుతూ వస్తోంది. పీచు పదార్థానికీ 'పోషక ప్రాధాన్యం' ఉందని, జీర్ణ ప్రక్రియలోనూ, జీవ క్రియల్లోనూ దీని పాత్ర అమూల్యమని అధ్యయన పూర్వకంగా గుర్తిస్తున్నారు.
పీచు - పలు రకాలు
పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు.. వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని.. జీర్ణం చేసేసుకుంటుంది. కానీ పీచు ఇలా పూర్తిగా 'జీర్ణం' అయిపోదు. అందుకే దీనివల్ల 'మలం' పరిమాణం పెరుగుతుంది. ఈ పీచు- జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగుల ద్వారా ప్రయాణించి మలం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఆహార నిపుణులు చాలాకాలం పాటు ఈ 'పీచు'ను.. ఓ 'ముడి పీచు'గానే భావిస్తూ.. అది ఎందుకూ పనికి రాదని నమ్మేవారు. అందుకే చాలాకాలం పీచు మీద పెద్దగా అధ్యయనాలూ జరగలేదు, మన అవగాహనా అంతగా పెరగలేదు. అయితే పీచు ప్రయోజనాలు బయటపడుతున్న కొద్దీ మరింత లోతుగా అధ్యయనాలు చేసి.. పీచులో ప్రధానంగా 2 రకాలు ముఖ్యమైనవని నిర్ధారణకు వచ్చారు.
* కరగని పీచు: మన ఆహారంలోనే ఉంటుందిగానీ.. నీటిలో కరగని రకం పీచు ఇది. దీన్ని 'ఇన్‌సాల్యుబుల్ ఫైబర్' అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా అలాగే బయటకు వెళ్లిపోతుంది. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఉండే 'సెల్యులోజ్' అనే ముతకరకమైన పీచు, దాని కన్నా కొద్దిగా పల్చగా ఉండే హెమీసెల్యులోజ్, లిగ్నన్స్ వంటివి ఈ తరహావి. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలూ పెరుగుతాయి.
* కరిగే పీచు: ఇది బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి, ఒక రకమైన జిగురులా తయారయ్యే రకం పీచు. దీన్నే 'సాల్యుబుల్ ఫైబర్' అంటారు. ఓట్స్, బార్లీ, చిక్కుళ్లు, బఠాణీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు.. ఇలాంటి వాటిలో ఉండే జిగురుగా తయారయ్యే గమ్స్, పెక్టిన్స్, మ్యూసిలేజస్.. ఇవన్నీ ఈ తరహావి. ఈ రకం పీచుకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయుల వంటివి తగ్గించటం వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది వీటన్నింటిలో ఎక్కువగా ఉంటుంది.
- ఈ కరిగే పీచు, కరగని పీచుల స్థాయులు.. ఒక్కో పదార్థంలో ఒక్కో మోతాదులో ఉంటాయి. మొత్తానికి మన ఆరోగ్యానికి రెండూ ముఖ్యమైనవే.
నేటి అవసరం.. పీచు!
ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం!
ఎంత పీచు అవసరం?
మనం తీసుకునే ఆహారంలో రోజుకి 40-45 గ్రాముల పీచు ఉండటం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు అందరికీ అవసరమే కానీ.. కొందరు ప్రత్యేకించి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు, మధుమేహులు, గుండె జబ్బున్నవాళ్లు, స్థూలకాయులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండేవాళ్లు, మాంసాహారం తరచూ తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి. తరచూ విరేచనాలకు వెళ్లాల్సి వచ్చే.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ బాధితులకు సబ్జాగింజల వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి వెంటనే మల విసర్జన జరగకుండా కొంతసేపు పట్టి ఉంచటానికి దోహదం చేస్తాయి. త్వరత్వరగా విరేచనం కాకుండా, నీటిని పట్టి ఉంచటం వల్ల నీళ్ల విరేచనాలూ ఎక్కువ కావు. గర్భిణులకు మలబద్ధకం తలెత్తే అవకాశం ఎక్కువ. వీరికి పీచు ఎంతో మేలు చేస్తుంది.
పీచు.. ప్రత్యేకత ఏంటి?
* మల బద్ధకం వదులుతుంది: ఆహారంలో మనం తిన్న పీచు- నీటిని, ఇతర పోషకాలను పట్టి (బైండ్) ఉంచుతుంది. కరగని పీచు- పదార్ధాలతో నీటిని పట్టి ఉంచుతుంది, మల పరిమాణం పెంచటానికి ఉపయోగపడుతుంది. కరిగే పీచు.. నీటిని గ్రహించి ఉబ్బుతుంది. దాంతో మల పరిమాణం (బల్క్) పెరిగి, అది మృదువుగా కూడా తయారవుతుంది. మల విసర్జన సాఫీగా జరగటానికి ఈ ప్రక్రియలు ఎంతో దోహదం చేస్తాయి. దీనివల్ల మలబద్ధకం, మొలలు, పేగుల్లో తిత్తులు రావటం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి.
* పేగుల ఆరోగ్యం: సబ్జాగింజలు, మెంతుల వంటివి ఉబ్బి, జిగురుగా మారతాయి. వీటివల్ల లోపల జీర్ణపదార్ధాల కదలికలు మృదువుగా, పేగుల్లో మృదువైన వాతావరణం నెలకొంటుంది. పెద్దపేగుల్లో సమస్యలు (క్రాన్స్ డిసీజ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) వంటివి తలెత్తకుండా, ఉపశమనంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.
* గ్లూకోజు, కొలెస్ట్రాల్ నియంత్రణ: పీచు నీటితో పాటు గ్లూకోజు వంటి పిండి పదార్ధాలనులు, స్టిరాల్స్ వంటి కొవ్వుల వంటివాటినీ పట్టి ఉంచి.. అవి త్వరగా రక్తంలో కలిసిపోకుండా చూస్తుంది. కరిగేపీచు.. గ్లూకోజు వెంటనే రక్తంలో కలవకుండా చూస్తుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది. కరగని పీచు- మధుమేహం రాకుండా నివారించటంలోనూ కీలకం. అందుకే మధుమేహుల ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూడటం అవసరం. అలాగే రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ మోతాదూ పెరగకుండా చూడటంలో కరిగే పీచుకు ప్రాముఖ్యం ఉంది. ఈ పీచుపదార్ధాన్ని మాంసాహారంతో కలిపి తీసుకుంటే అందులోని కొలెస్ట్రాల్‌ను కూడా పట్టి ఉంచుతుంది. బైల్ యాసిడ్స్‌ను పట్టి ఉంచి- శరీరంలో సహజంగాఉండే కొలెస్ట్రాల్ కూడా విడుదల కాకుండా ఆపుతుంది. కొన్ని రకాల పీచు అయితే కొలెస్ట్రాల్ తయారు కాకుండానూ అడ్డుకుంటుంది.
* బరువు నియంత్రణ: పీచు త్వరగా కడుపు నిండిన భావన కలజేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. పీచు పూర్తిగా జీర్ణమైపోదు కాబట్టి దీన్నుంచి శరీరానికి వచ్చే శక్తీ చాలా చాలా తక్కువ. ఆ కొద్దిపాటి శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది, ఇది కొవ్వుగా మారటానికి అవకాశం తక్కువ. వీటన్నింటివల్లా బరువు తగ్గటానికి, బరువు పెరగకుండా ఉండటానికి పీచు దోహదం చేస్తుంది.
* గుండెకూ మేలు: ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ వంటి వాటినీ పీచు పట్టి ఉంచి మల విసర్జన ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది. గుండె రక్తనాళాలు త్వరగా దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటు తగ్గించటానికి, గుండెపోటు రాకుండా, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండానూ చూస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
* క్యాన్సర్ల నివారణ: మలద్వారం, పెద్దపేగు క్యాన్సర్లే కాదు.. శరీరంలో రకరకాల క్యాన్సర్ల నివారణలో పీచు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనాల్లో గుర్తిస్తున్నారు.
పీచు దేనిలో ఎక్కువ దొరుకుతుంది...?
ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వెంటనే.. బీరకాయ, పొట్లకాయ, బీన్స్, చిక్కుళ్లు, అనాసపండు.. ఇలా పీచుపీచుగా కనబడే పదార్ధాల పేర్లు టకటకా చెప్పేస్తారు. కానీ వాస్తవానికి పైకి పీచుపీచుగా కనిపించే వాటిలోనే పీచు ఎక్కువగా ఉంటుందనుకోవటం సరికాదు.
-- డా. కె.ఉమాదేవి-- ప్రొఫెసర్, న్యూట్రిషన్, కాలేజ్ ఆఫ్ హోంసైన్స్,-- ఎన్‌జీరంగా వర్సిటీ, హైదరాబాద్
Some fiber giving Vegetables -->
పీచు లభించే పదార్థాలు
రోజు ౩౦ గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు .అందులో కరిగే పీచు ఉంటె మంచిది .సాదారణంగా ప్రతి ఒక్కరు పీచు ఉండే పదార్థాలు తినడం మంచిది.మధుమేహం ,గుండె జబ్బులు ,మలబద్దకం బాధ పడేవారు ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటారు . పీచు లభించే పదార్థాలు గోధుమలు ,రాగులు, జొన్నలు,సజ్జలు,కొర్రలు ..వీటిలో కరిగేరకం పీచు ఎక్కువగా ఉంటుంది .మనమే గోదుమలు తెచ్చుకొని పిండి పట్టిచడం మంచిది.మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కోవగా ఉంటుంది.పప్పుల్లో ముడి సెనగలు ,పెసలు ,మినుమలు ,అలసందలు బతనిలు..వీటిలో ఎక్కోవ పీచు ఉంటుంది.
- ===================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.