Tuesday, April 24, 2012

అనొరె క్సియా నెర్వోసా,Anorexia Nervosa,తినకపోవడం రుగ్మతే





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అనొరె క్సియా నెర్వోసా,Anorexia Nervosa,తినకపోవడం రుగ్మతే- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...






మనందరమూ జీవించడానికి ఆహారం తీసుకుంటాం. మనం తినే ఆహారాన్ని ఎంతో ఆనందంగా భుజిస్తాం. అయితే మనుష్యుల ప్రవర్తనలలో కనిపించే వైవిధ్యాలలాగా వారి ఆహార విషయాల్లోనూ వైవిధ్యాలు ఉండవచ్చు. కొంతమంది ఎక్కువగా భుజించవచ్చు. మరికొందరు తక్కువగా తినవచ్చు. కొంతమందిత్వరగా స్థూలకాయులు కావచ్చు. ఇంకొంతమందిలో ఎంత తిన్నా స్థూలకాయం వారి దరిదాపులకు రాకపోవచ్చు.
అయితే, కొంతమంది సన్నగా ఉండాలనే భావనతో శరీరా వసరాలకు కూడా సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహా రాన్ని తీసుకుంటారు. ఇటువంటి వారి విషయంలో వైద్య సహాయం అవసరం కావచ్చు. ఎందుకంటే వీరు అనొరె క్సియా నెర్వోసా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారై ఉండవచ్చు. ఈ పరిస్థితి మహిళలలో సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది మరింత ఎక్కువ.

లక్షణాలు
- స్థూలకాయం వస్తుందనే భయం
- అతి తక్కువగా తినడం
- తీవ్రస్థాయిలో బరువు కోల్పోవడం
- స్థాయిని మించి వ్యాయామం చేయడం
- మహిళల్లో రుతుక్రమంలో లోపాలు

అనొరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు కనిపిస్తుంది. ఇదిసాధారణంగా ఉన్నతాదాయ వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాల అమ్మాయిల్లో డైటింగ్‌ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అమ్మాయిలు త్వరితగతిన బరువు కోల్పోవాలనే ఉద్దేశ్యంతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తారు. ఇదే వారి ప్రధాన కార్యక్రమంగా మారుతుంది.
తమ వయస్సు, ఎత్తులతో పోల్చినప్పుడు ఉండాల్సిన స్థాయికంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ, కొంతమంది అమ్మాయిలు డైటింగ్‌చేయడం, తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం చేస్తుంటారు. లేదా డైటింగ్‌తోపాటు బరువు తగ్గడానికి ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటారు. వీరిలో ఆహారం పట్ల స్థిరమైన అవాంఛిత ఆలోచనలు (అబ్సెషన్స్‌) ఉంటాయి. ఇటువంటి వారు ఆహారం తీసుకున్న తరువాత బరువు పెరగకూడదనే ఆలోచనతో తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

అనొరెక్సియా వలన దుష్ఫలితాలు
- ఆహారం తీసుకోకపోవడం వలన కుద్బాధకు గురవుతారు. ఫలితంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.
- వ్యాకులతకు గురవుతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. నిద్ర సరిగ్గా పట్టదు.
- శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బలహీనతకు లోనవుతారు.
- వాంతుల కారణంగా మూర్ఛ వ్యాధికి గురి కావచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు. గుండె కొట్టుకోవడంలో లోపాలు సంభవించవచ్చు.
- హార్మోన్లలో అసమతుల్యతలు సంభవించి రుతుక్రమంలో మార్పులు వస్తాయి. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి.

అనొరెక్సియాకు కారణమేమిటి?
కొంతమంది అమ్మాయిలు ఇలా అనొరెక్సియా నెర్వోసాకు గురికావడానికి కారణమేమిటి? అని పరిశీలిద్దాం.
వీరిపై సామాజికపరమైన వత్తిడి ప్రధాన కారణం. సన్నగా ఉంటే అందంగా ఉంటారనే భావన ఒక కారణమైతే, మీడియాలో వస్తున్న ఫ్యాషన్‌ షోలు వీరిపై ప్రభావం చూపడటం మరొక కారణం. అలాగే 'బరువు తగ్గండి అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో వెలుస్తున్న 'క్లినిక్‌లు కూడా అమ్మాయిఉల అనొరెక్సియా నెర్వోసాకు గురవడానికి ఇంకొక కారణం.
సన్నగా ఉన్నవారికి సమాజంలో లభించే ప్రత్యేక గుర్తింపు కూడా అమ్మాయిలలో బరువు తగ్గాలనే ఆలోచన కలుగజేసి డైటింగ్‌ చేయడానికి తద్వారా అనొరెక్సియాకు గురి కావడానికి దోహదం చేస్తున్నది.
నియంత్రణ : డైటింగ్‌ చేయడంవలన ఏదో సాధించామనే భావన కలుగుతుంది. డైటింగ్‌, బరువు తగ్గడాలు రెండూ శరీరం నియంత్రణలోనే ఉందనే భావనను కలిగిస్తాయి.
కుటుంబం: తల్లిదండ్రులు పిల్లలడైటింగ్‌ను ఆమోదించడమో, లేదాపిల్లలు భోజనం వద్దనడమో అనేక కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులపై కోపాన్ని భోజనం మానివేయడం ద్వారా ప్రదర్శిస్తారు.
వ్యాకులత: ఏ కారణంగా కలిగే వ్యాకులత అయినా ఆహారంపట్ల అభిరుచిని తగ్గించవచ్చు. అయితే వ్యాకులత కలగడానికిగల కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే వారిలో ఆహారం పట్ల ఉన్న నిరాసక్తత తొలగిపోతుంది.
ఎలాంటి సహాయం అందించాలి?
ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుంది. అమ్మాయిలు కొంత బరువు తగ్గిన తరువాత సరైన పద్ధతిలో సలహాలివ్వడం ద్వారా వారిలో ఉండే అబ్సెషన్‌ను తొలగించవచ్చు.
వయస్సు, ఎత్తులకు తగిన బరువు ఉన్న ప్పటికీ అమ్మాయిల్లో బరువు తగ్గాలనే ఆలోచన ఇంకా స్థిరంగా ఉండి, డైటింగ్‌, వ్యాయామాలు మొదలైనవి చేస్తుంటే తప్పని సరిగా వారికి వైద్య సహాయం అవసరమవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే నొరెక్సియా కారణంగా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అనొరెక్సియాను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం అంత కష్టమేమీ కాదు.
అనొరెక్సియా సమస్యతో బాధపడే వారికి చికిత్సలో మొదటి మెట్టు వారు తమ వయస్సు, ఎత్తుకు సరిపోయే బరువు ఉండేలా చూడటం. పిల్లలు కూడా ఇతర కుటుంబ సభ్యులతోపాటు తమ శరీరావసరాలకు సరిపోయిన స్థాయిలో ఆహారాన్ని తీసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. అనొరెక్సియా నెర్వోసాతో బాధపడుతున్న రోగికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స చేయించడం అవసరం. రోగి సమస్యను మానసిక వైద్య నిపుణుడు సమగ్రంగా తెలు సుకుని, తగిన కారణాలను కనుగొంటారు. అలాగే రోగిలో అంతర్లీనంగా వ్యాకులత ఉందేమో పరిశీలిస్తారు. తదనుగుణంగా చికిత్స చేయడానికి అవకాశముంటుంది.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.