Friday, April 6, 2012

బ్రెయిన్‌ ట్యూమర్స్‌-మెదడులో కణుతులు అవగాహన-Brain Tumours awareness

  • image : Courtesy with Eenadu sukheebhava .

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బ్రెయిన్‌ ట్యూమర్స్‌-మెదడులో కణుతులు అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • కణితి ఎక్కడ కనిపించినా కంగారే! జీవకణాలు క్రమం తప్పి.. అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్టు కణుతులు పుట్టుకొస్తుంటే.. ప్రాణభయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఆ కణితి.. పైకేమీ కనబడకుండా తలలో.. అదీ మెదడులో పెరుగుతుంటే...??- ఇక ఆ భయానికి అంతుండదు. ఈ మెదడులో కణుతులు అంత అరుదేం కాదు. పైగా ఇందులో ఎన్నో రకాలు. మెదడులో నుంచి పుట్టుకొచ్చేవి కొన్నైతే... మెదడు పైపొరల మీది నుంచి.. ఇలా రకరకాల ప్రదేశాల నుంచి రావచ్చు. ఇందులో క్యాన్సర్‌ కణుతులు కొన్నైతే.. క్యాన్సర్‌ కాకపోయినా మెదడును నొక్కేసి ప్రాణాల మీదికి తెచ్చేవి కొన్ని. తరచుగా భయపెట్టే ఈ కణుతుల గురించి అవగాహన చాలా అవసరం.

అధునాతమైన సీటీ స్కాన్‌, ఎమ్మారై పద్ధతులు.. ఎండోస్కోప్‌, మైక్రోస్కోప్‌ల మూలంగా శస్త్రచికిత్స.. అధునాతన రేడియేషన్‌ చికిత్స.. మెరుగైన కీమోథెరపీ మందులు, న్యూరో అనస్థీషియాల మూలంగా మెదడు కణుతుల చికిత్సతో గతంలో కన్నా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఆపరేషన్‌ అనంతరం సంరక్షణ పద్ధతులు కూడా మెరుగుపడ్డాయి. 40, 50 ఏళ్ల క్రితం మెదడులో కణితి అనగానే భయపడిపోయేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ట్యూమర్‌ను గుర్తించి, నిర్ధారించటం దగ్గర్నుంచి ఆపరేషన్‌ అవసరమైన వారిని పసిగట్టటం.. సర్జరీ, చికిత్సల్లో కొత్త కొత్త పద్ధతులు, మందులు అందుబాటులోకి రావటం వంటివన్నీ మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయి.

సాధారణంగా మనం 'మెదడులో కణుతులు'.. 'బ్రెయిన్‌ ట్యూమర్స్‌'.. అంటుంటాంగానీ వీటిలో ఎన్నో రకాలు! ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాల గురించి! ఒకటి- మెదడు లోపల్నుంచి పుట్టుకొచ్చే రకం. వీటిని 'గ్లయోమాస్‌' అంటారు. రెండోది- మెదడుపై భాగాల్లో ఏర్పడి మెదడును నొక్కుతుండేవి! మళ్లీ వీటిల్లో కూడా చాలా రకాలున్నాయి. ముఖ్యంగా మెదడు పైన చుట్టూతా రక్షణగా ఉండే పొరల (మినింజెస్‌) నుంచి పుట్టుకొచ్చే వాటిని 'మినింజియోమాస్‌' అంటారు. ఇక మెదడుకు అనుసంధానంగా ఉండే నాడులపై కూడా కణుతులు వస్తుంటాయి, వీటిని ఆయా భాగాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటిల్లో ఎక్కువగా కనిపించేది శ్రవణనాడి మీద వచ్చే 'అకూస్టిక్‌ న్యూరోమా' కణుతులు. ఇక మెదడు మధ్యలో ఉండే 'పిట్యూటరీ' గ్రంథి మీదా కణుతులు వస్తాయి, వీటిని పిట్యూటరీ కణితులంటారు. మెదడుకు వెలుపల ఉన్నప్పటికీ వీటినీ 'బ్రెయిన్‌ ట్యూమర్ల'నే అంటారు. ఇవి మెదడుకు సమీపంలోనే ఉంటాయి, ఇవి పెరిగిన కొద్దీ మెదడును నొక్కుతూ, దెబ్బతీస్తుంటాయి. ఇవే కాకుండా.. శరీరంలోని ఇతరత్రా భాగాల్లో తలెత్తే క్యాన్సర్‌ గడ్డల నుంచి ఆ కణాలు మెదడుకు పాకి.. మెదడులో క్యాన్సర్‌ కణుతులు పెరిగేలా చెయ్యచ్చు. వీటిని 'మెటాస్టాటిక్‌' లేదా 'సెకండరీ' కణుతులంటారు. ఇవి ఎక్కువగా మెదడు లోపలే వస్తుంటాయి.
  • లక్షణాలేంటి?
ప్రధానంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి! మెదడులో ఏ రకం కణితి పెరుగుతున్నా ప్రధానంగా కనిపించే లక్షణం ఇది. మన పుర్రె ఎముక చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి లోపల ఏదైనా కణితి పెరుగుతుంటే కపాలంలో ఒత్తిడి పెరిగి... తలనొప్పి మొదలవుతుంది. నెమ్మదిగా పెరిగే కణుతులైతే అవి బాగా పెద్దగా అయ్యే వరకూ తలనొప్పి రాకపోవచ్చు. వేగంగా పెరిగేవైతే వెంటనే తలనొప్పి మొదలవుతుంది. అయితే తలనొప్పి అనేది జలుబులా సర్వసాధారణమైన సమస్య కాబట్టి.. ప్రతి తలనొప్పినీ అనుమానించటం, అది కణితి వల్లనే వస్తోందని గుర్తించటం అంత తేలిక కాదు. కాకపోతే... తలనొప్పి వస్తున్న తీరును బట్టి మెదడు కణుతులున్నాయేమో అనుమానించే అవకాశం ఉంటుంది.

సాధారణంగా పార్శ్వనొప్పి వంటి వాటిల్లో తలనొప్పి వస్తూ, పోతూ ఉంటుంది. మధ్యలో కొంతకొంత సమయం తలనొప్పి అస్సలుండదు. టెన్షన్‌ రకం తలనొప్పిలో బ్యాండు పట్టేసినట్టు, తల పైన పోటు వచ్చినట్టుగా నొప్పి ఉంటుంది. కానీ... మెదడులో కణుతుల మూలంగా వచ్చే తలనొప్పి వస్తూతగ్గుతుంటుందిగానీ పూర్తిగా తగ్గటమన్నది ఉండదు. నిరంతరం కొంత నొప్పి ఉంటూనే ఉంటుంది. పైగా ఒకసారి కంటే మరోసారి నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. రోజంతా ఎప్పుడూ ఎంతోకొంత తలనొప్పి ఉండటం, క్రమేపీ తలనొప్పి తీవ్రతా పెరుగుతుండటం అనుమానించాల్సిన లక్షణం! తలలో పెరుగుతున్న ఒత్తిడి మూలంగా తల ఎప్పుడూ బరువుగా ఉన్నట్టూ అనిపిస్తుంటుంది.

*వాంతులు: తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వాంతులు కూడా కావొచ్చు. వాంతి కాగానే తలనొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్లీ కొద్దిసేపట్లోనే నొప్పి పెరిగినట్లనిపిస్తూ వేదన మొదలవుతుంది.

*చూపు తగ్గటం: తలలో ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ప్రభావం చూపు మీదా పడుతుంది. దృశ్యనాడి కూడా మెదడులోని ముఖ్య భాగం కాబట్టి దీని మీద ఒత్తిడి పడినప్పుడు చూపు మసక బారుతుంది. కళ్లను నియంత్రించే నాడులు కూడా ప్రభావితమై ఒకటి రెండుగా (డిప్లోపియా) కనబడొచ్చు.

*భాగాన్ని బట్టి లక్షణాలు: మెదడులో కణితి పెరుగుతున్న భాగం.. ఏయే శారీరక అవయవాలను నియంత్రిస్తుందో ఆ భాగాల్లో లక్షణాలు కనబడొచ్చు. ఉదాహరణకు ఫాల లంబికల్లో కణితి పెరుగుతుంటే ఉత్సాహం తగ్గి, స్తబ్ధుగా ఉండొచ్చు. ఎడమవైపు కణితి పెరుగుతుంటే మాట తడబడొచ్చు. అలాగే ప్రదేశాన్ని బట్టి చెయ్యీకాలూ కదలికలు దెబ్బతినొచ్చు. ఇలా ఆయా భాగాలను బట్టి లక్షణాలు కనబడతాయి.

*ఫిట్స్‌: మెదడులో కణుతులు తెచ్చే చికాకు కారణంగా ఫిట్స్‌ కూడా రావొచ్చు. ఈ సమయంలో స్పృహ కోల్పోవచ్చు.

*తెలివి తగ్గటం: తలలో ఒత్తిడి మరింతగా పెరిగిపోతే మెదడు పనితీరు, తెలివితేటలు, ప్రజ్ఞ తగ్గిపోవచ్చు.

  • గుర్తించేదెలా?
తలనొప్పి వచ్చిన అందరికీ మెదడు స్కానింగులు చెయ్యటం అసాధ్యం, అనవసరం కూడా. కాబట్టి ముందు లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనుమానం బలంగా ఉంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో కణితి ఉంటే తెలియటమే కాదు, అది మెదడు లోపల ఉందా? బయట ఉందా? ఎంత సైజులో ఉంది? వంటి వివరాలూ తెలుస్తాయి.

* మెదడులో కణితి ఉంటే ఆ విషయం హఠాత్తుగా తెలుసుకోవటం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. అందుకే కౌన్సెలింగ్‌ ఇచ్చి మెల్లగా విషయాన్ని వివరిస్తారు. ముఖ్యంగా అంతా తెలుసుకోవాల్సిందేమంటే ఒకప్పుడు మెదడు కణుతులకు చికిత్స కష్టమేగానీ.. ఇప్పుడున్న అధునాతన చికిత్సా పద్ధతులతో మరీ అంతగా భయపడాల్సిన పనిలేదు! చాలా రకాల కణుతులకు సమర్థంగా చికిత్స అందించవచ్చు.

  • గ్లయోమాలు
మొత్తం మెదడు కణుతుల్లో.. మెదడు లోపలి నుంచి పుట్టుకొచ్చే ఈ గ్లయోమాలు సుమారు 40-45% వరకూ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ సంబంధమైనవే కానీ అన్నీ ప్రమాదకరమైనవి కాదు. వీటిల్లో 1, 2, 3, 4 అని నాలుగు గ్రేడులుంటాయి. దేనికైనా కణితి నుంచి ముక్క తీసి పరీక్షించి.. అది ఏ గ్రేడు కణితో నిర్ధారించటం ముఖ్యం. ఈ కణుతుల స్వభావం ఎలా ఉంది? ఇవి వేగంగా పెరిగే రకమా? వీటికి రక్తసరఫరా ఎక్కువగా ఉందా? తదితరాలన్నీ పరిశీలించే గ్రేడ్‌ ఇస్తారు. 1, 2 గ్రేడు కణితులు అంత ప్రమాదకరమైనవి కావు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. సాధారణంగా ఇవి ఫిట్స్‌తో బయటపడుతుంటాయి. కాబట్టి మందులతో ఫిట్స్‌ను అదుపులో పెడుతూ జాగ్రత్తగా గమనిస్తుంటారు. అప్పుడప్పుడు స్కానింగ్‌ చేస్తూ, కణితి వేగంగా పెరుగుతున్నట్టు గ్రహిస్తే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. ఈ 1, 2 గ్రేడు కణితులున్న వారికి చికిత్సతో మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్దాయమూ పెరుగుతుంది. ఇక గ్రేడ్‌ 3, 4 మాత్రం ప్రమాదకరమైనవి. 3వ గ్రేడు రకానికి కీమోథెరపీ ఇస్తూ జీవన కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే గ్లయోమాలను పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఆపరేషన్‌ ద్వారా ట్యూమర్‌ను తొలగించి, రేడియేషన్‌ ఇచ్చినా ఇవి కొంత కాలానికి మళ్లీ పెరగటం మొదలుపెట్టొచ్చు.

  • చికిత్స:
సర్జరీలో ఎంత వీలైతే అంత వరకూ కణితిని తొలగించేస్తారు. దీంతో రేడియేషన్‌ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కొంత భాగం తొలగించటం కష్టమైనా కీమోథెరపీతో అదీ అదుపులో ఉంటుంది. మామూలు క్యాన్సర్‌ సర్జరీల్లో- కణితి మొత్తాన్ని తొలగించే వీలుంటుందిగానీ మెదడు కణుతుల విషయంలో అది అన్నిసార్లూ అంత సాధ్యం కాదు. కణితి ఉన్న భాగాన్నంతా తొలగించాలంటే కొన్నిసార్లు మాట పడిపోవటం, కదల్లేకపోవటం వంటి ఇతరత్రా సమస్యలూ రావొచ్చు. అందుకని ఈ సర్జరీల్లో ఆయా వ్యక్తులు జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూస్తూనే.. సాధ్యమైనంత ఎక్కువ తొలగించటానికి ప్రాధాన్యమిస్తారు. పైగా సాధారణంగా గ్లయోమాలు క్రమంగా మెదడులోకి చొచ్చుకొని పోయే రకం. కాబట్టి ఎంత తొలగించినా కొంత మిగిలి ఉండే అవకాశం ఉంది, ఏ మాత్రం కణాలు మిగిలిపోయినా మళ్లీ పెరుగుతుంటాయి.

* గ్రేడును బట్టి కేవలం రేడియేషనే ఇవ్వాలా? కీమోథెరపీ ఇవ్వాలా? అనేది నిర్ధరిస్తారు. మెదడు దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ల మీదనే పనిచేసే రేడియోథెరపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్‌-1 ట్యూమర్లకు రేడియేషన్‌ ఇవ్వరు. గ్రేడ్‌-2కు ఆయా పరిస్థితులను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. 3వ గ్రేడ్‌ కణుతుల వారికి రేడియేషన్‌, కీమోథెరపీలతో ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. 4 గ్రేడ్‌ విషయం పరిస్థితిని బట్టి ఏం చెయ్యాలో వైద్యులు నిర్ధారిస్తారు. రేడియేషన్‌, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్లీ కణుతులు పెరుగుతుంటే మరోసారి ఆపరేషన్‌ చెయ్యచ్చు.

మినింజియోమాలు
మెదడు కణుతుల్లో ఈ పైపొరల నుంచి వచ్చే మినింజియోమాలు 16-18% వరకూ ఉంటాయి. వీటిల్లో కేవలం 1-2% కణితులు మాత్రమే క్యాన్సర్‌ కణతులు. మిగతావన్నీ క్యాన్సర్‌ రకం కాదుగానీ ఇవి పెరుగుతూ, మెదడును నొక్కుతుండటం వల్ల సమస్యలు పెరుగుతుంటాయి. ఈ పొరలు మెదడు చుట్టూ, పైనంతా ఆవరించి ఉంటాయి కాబట్టి ఈ కణుతుల కూడా మెదడు పైన రావచ్చు, మెదడు అడుగు వైపున కూడా రావొచ్చు. ఉపరితలం మీద ఏర్పడే కణితులను ఆపరేషన్‌ ద్వారా పూర్తిగా తొలగించొచ్చు. ఆపరేషన్‌ చేశాక పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు కూడా. అయితే మెదడు అడుగున వచ్చే వాటిని చేరుకోవటం కష్టం. కీలకమైన నాడులు ఉంటాయి కాబట్టి వీటిని పూర్తిగా తొలగించటం సాధ్యం కాదు. అందువల్ల మళ్లీ మళ్లీ పెరగటమన్నది వీటిల్లో ఎక్కువ. అందువల్ల ఆపరేషన్‌ తర్వాతా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.

అకూస్టిక్‌ న్యూరోమాలు
చెవి నుంచి మెదడుకు వెళ్లే శ్రవణనాడి, ముఖానికి సంబంధించిన (ఫేసియల్‌) నాడి ప్రాంతంలో ఇవి ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్లు కావు. పుట్టుకొచ్చే ప్రదేశాన్ని బట్టి వీటివల్ల- వినికిడి తగ్గటం, లేదా నోరు వంకర పోవటం, తూలిపోతుండటం వంటి లక్షణాలు కనిపించొచ్చు. సాధారణంగా వినికిడి పూర్తిగా తగ్గిపోయేంత వరకూ కణితి పెరుగుతున్నట్టు బయటపడదు. మొదట్లో తలనొప్పి ఉండకపోయినా.. కణితి పెరుగుతున్న కొద్దీ అది చుట్టుపక్కల నిర్మాణాలను నొక్కుతూ, మెదడులో ద్రవాల ప్రసారం ప్రభావితమై కపాలంలో నీరు చేరుతుంది. అప్పుడు తలనొప్పి వస్తుంది. ఈ ట్యూమర్‌ కిందే మనం మాట్లాడటానికి, మింగటానికి తోడ్పడే నాడులుంటాయి. వీటిపై ప్రభావం పడితే ముద్ద మింగలేకపోవటం, మాటలు తడబడటం వంటి లక్షణాలు కనబడొచ్చు. కొన్నిసార్లు స్పర్శ, నమలటానికి తోడ్పడే కండరాలు దెబ్బతినొచ్చు. మొద్దుబారటం, నడకలో తడబాటు, సమన్వయం లోపించటం, ఒకవైపు తూలిపోవటం కనిపిస్తాయి. చాలాసార్లు ఈ లక్షణాలను- వయసుతో పాటు వచ్చే సహజ మార్పులుగా పొరబడుతుంటారు కూడా. మిగతావాటి కన్నా ఈ ట్యూమర్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అయితే వీటిని పూర్తిగా తీసేయొచ్చు. ఈ క్రమంలో కొన్నిసార్లు వినికిడిని పూర్తిగా కాపాడటం సాధ్యం కాకపోవచ్చు. ముఖనాడి కొంచెం దెబ్బతినే అవకాశమూ ఉంది. అందువల్ల ఈ ట్యూమర్ల పరిమాణం 3 సెం.మీ. కన్నా తక్కువగా ఉంటే.. ప్రస్తుతం 'గామా నైఫ్‌'తోనూ చికిత్స చేస్తున్నారు. దీంతో ఇవి లోపలే కుచించుకుపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు 70 ఏళ్ల వయసులోనూ ఈ ట్యూమర్లు బయపడుతుంటాయి. వీరికి వినికిడి లోపంతో పెద్దగా ఇబ్బంది లేకపోతే కణితిని వెంటనే తొలగించకుండా జాగ్రత్తగా గమనిస్తారు. ఒకవేళ పెద్దగా అవుతుంటే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది.

* సెల్‌ఫోన్ల వాడకం వల్ల ఈ రకం శ్రవణనాడి కణుతులు ఎక్కువగా వస్తున్నాయన్న ప్రచారం బాగా ఉందిగానీ.. వాస్తవానికి ఇదేదీ శాస్త్రీయంగా ఇంకా నిరూపణ కాలేదు.

పిట్యూటరీ కణుతులు
పిట్యూటరీ గ్రంథి మీద వచ్చే కణుతుల్లో హార్మోన్లను స్రవించేవి, స్రవించనివి.. అని రెండు రకాలున్నాయి. హార్మోన్‌ స్రవించని ట్యూమర్లు కళ్లు, నాడుల మీద ఒత్తిడి కలజేస్తాయి. దీంతో ఒక కంట్లో గానీ రెండు కళ్లల్లో గానీ పక్కల దృశ్యాలు కనబడటం తగ్గిపోతుంది. ఈ కణుతులు మరీ పెద్దగా ఐతే మెదడులోని ద్రవాల ప్రసరణ దెబ్బతిని తలనొప్పి రావొచ్చు. గతంలో పిట్యూటరీ ట్యూమర్లను మెదడును తెరచి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎండోస్కోపీ లేదా మైక్రోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి లోనికి వెళ్లి తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్యూమర్లలో కొంత భాగాన్ని (డీబల్క్‌) గానీ పూర్తిగా గానీ తొలగించొచ్చు. కొంత కణుతులు లోపలే ఉండిపోతే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండొచ్చు. లేకపోతే రేడియేషన్‌ చికిత్స చేయొచ్చు. చిన్న కణుతులైతే పూర్తిగా తొలగించొచ్చు. పెద్ద కణుతులైతే ఆపరేషన్‌ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి రక్తనాళాలు అంటుకొని ఉంటాయి కాబట్టి తొలగించేటప్పుడు హైపోథలమస్‌ దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల తీవ్ర సమస్యలు వచ్చే ముప్పు ఉండొచ్చు.

* ఇక హార్మోన్లను స్రవించే ట్యూమర్లలో ప్రధానంగా కనిపించేది ప్రోలాక్టినోమాలు. ఈ కణుతులు పెరగటమే కాదు, వీటి నుంచి ప్రోలాక్టిన్‌ అనే హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం వల్ల- మగవారిలో పటుత్వం తగ్గటం, రొమ్ములు పెద్దకావటం.. ఆడవారిలో నెలసరి నిలిచిపోవటం, పాలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే వెంటనే ప్రోలాక్టిన్‌ మోతాదు పరీక్ష చేయించాలి. అది ఎక్కువగా ఉన్నట్టు బయటపడితే ప్రోలాక్టిన్‌ తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కణితి పరిమాణం కూడా తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే తిరిగి మామూలుగా అవుతారు. ఈ ప్రోలాక్టినోమాలు చాలా పెద్దగా అయితేనే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడే లక్షణాలు బయటపడతాయి కాబట్టి ముందే జాగ్రత్త పడటానికి అవకాశముంది. చిన్నగా ఉంటే గ్రోత్‌ హార్మోన్‌ ట్యూమర్లునూ మందులతోనే నయం చేయొచ్చు.

  • చికిత్సల్లో విప్లవం: గామానైఫ్‌
మెదడులోని ఇతరత్రా భాగాలేవీ ప్రభావితం కాకుండా కేవలం కణితి మీదే రేడియేషన్‌ తీక్షణంగా పనిచేసేటట్లు చేయటంలో 'గామానైఫ్‌' అద్భుతంగా వెసులుబాటునిస్తుంది. ముందు సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కానింగులతో కణితి కచ్చితంగా ఎక్కడుందో గుర్తించి, స్టీరియో టాక్టిక్‌ ఫ్రేమ్‌ను రూపొందిస్తారు. దానిపైకి రేడియేషన్‌ ఇచ్చినప్పుడు- రేడియేషన్‌ వివిధ కోణాల నుంచి తక్కువ డోసుల్లోనే వస్తూ.. ఒక్కచోట కేంద్రీకృతమై అంతా కలిసి తీక్షణంగా మారుతుంది. ఇలా మిగతా భాగాలు పెద్దగా ప్రభావితం కాకుండా కణితి కణాలు మాడిపోయేలా చేస్తారు. ఇదిఇటీవలికాలంలో విస్తృతంగా వాడకంలోకి వస్తోంది. ఇలాగే లీనియర్‌ ఆక్సిలేటర్‌ యంత్రాలూ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. మెదడు అడుగు భాగంలో ఏర్పడే చిన్న మినింజియోమాలకు శస్త్రచికిత్స కష్టం. ఇలాంటి వాటికి గామానైఫ్‌ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిట్యూటరీ ట్యూమర్లు.. అకూస్టిక్‌ ట్యూమర్లు.. ఇతరత్రాచోట్ల నంచి వచ్చిన క్యాన్సర్‌ కణాలు రెండు మూడు పెరుగుతున్నప్పుడు.. చికిత్సలో ఇది బాగా పనికివస్తుంది.

  • వేరే చోటి నుంచి పాకేవి.. మెటాస్టాసిస్‌
శరీరంలో ఇతరత్రా భాగాల్లో పెరిగే క్యాన్సర్‌ గడ్డల నుంచి ఆ కణాలు మెదడును చేరుకుని ఇక్కడ పెరగటం మొదలుపెట్టచ్చు. ముఖ్యంగా మూత్రపిండాలు, రొమ్ములు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం నుంచి మెదడుకు వ్యాపించటం ఎక్కువ. ఇవి గ్లయోమాల్లా మెదడు లోపలి నుంచే ఏర్పడతాయి. వీటిల్లోనూ మామూలు మెదడు కణుతుల్లో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి. పైగా వీటిల్లో 25% ఆపరేషన్‌ చేసి చూసిన తర్వాతే... అవి వేరేచోటి నుంచి వచ్చిన రకాలనీ, శరీరంలో మరోప్రాంతంలో ఎక్కడో క్యాన్సర్‌ ఉందన్న విషయం తెలుస్తుంది. కొన్నిసార్లయితే అసలు ప్రధాన క్యాన్సర్‌ ఎక్కడుందో తెలియదు. అయినా దాని ప్రభావంతో మెదడులో కణితి ఏర్పడుతుంది. ఇలాంటి ట్యూమర్‌ ఒకటే.. అదీ పెద్దగా ఉంటే సర్జరీ చేస్తారు. రెండు మూడు ట్యూమర్లు ఏర్పడితే, చిన్నగా ఉంటే ముందు ముక్క తీసి నిర్ధరిస్తారు. తర్వాత రేడియేషన్‌ ఇస్తారు. ప్రధాన కణితి ఊపిరితిత్తుల్లో, కాలేయంలో, జీర్ణకోశంలో.. ఎక్కడైనా ఉందని తెలిస్తే అలాంటి వారికి మెదడు కణితి తొలగించే సర్జరీతో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాన్ని తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది.


--Dr.K.V.R.sastry (Neuro-surgeon,Medwin hos Hyd)
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. hai this is vamsi , i need i help, in my childewood days i got opretion in this brain tumor,now i have cynoeis and cold problem and cough,im thinking so much .why i dontno im thinking i m getting headache some times, can u please reply me and solv my problem give me suggestions.
    please

    ReplyDelete
  2. hai this is vamsi , i need i help, in my childewood days i got opretion in this brain tumor,now i have cynoeis and cold problem and cough,im thinking so much .why i dontno im thinking i m getting headache some times, can u please reply me and solv my problem give me suggestions.
    please

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.