Saturday, April 28, 2012

గవదబిళ్లలు,Mumps

  • Image : courtesy with Eenadu sukhibhava.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గవదబిళ్లలు,Mumps- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... ఉన్నట్టుండి జ్వరంతో పిల్లలకు దవడలు వాచిపోయి.. గవదబిళ్లలు మొదలైతే.. చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా.. ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిది రాకుండా సమర్థమైన టీకా ఉంది! చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే 'మంప్స్‌' అంటారు. ఆటలమ్మ, పొంగుల మాదిరిగానే ఇది కూడా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. ఇది 5-9 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లోఎక్కువ. అయితే ఇది పెద్దల్లో కూడా రావచ్చు, పైగా పెద్దలకు వస్తే బాధలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఈ గవదబిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడోచోట కనబడుతూనే ఉంటుందిగానీ ఎండకాలం నుంచి వర్షరుతువు మొదలయ్యే మధ్య అధికం. అలాగే 2-3 మూడేళ్లకు ఒకసారి ఇది విస్తృతంగా చాలామందిని చుట్టబెడుతుంటుంది!
  • ఎలా వస్తుంది?
గవదబిళ్లలు ఉన్న వారు దగ్గినా, తుమ్మినా.. లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ ఇతరులకూ వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే- ఈ వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత బాధలు, లక్షణాలు మొదలవటానికి 14 నుంచి 21 రోజులు పట్టొచ్చు. పూర్తిస్థాయి గవద బిళ్లలున్న వారి నుంచే కాదు, తొలిదశ లక్షణాలున్న వారి నుంచీ ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది!
  • గ్రంథులలో స్థావరం
గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీదా ప్రభావం చూపుతుంది. ముందుగా- మామూలు ఫ్లూ మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు నలతగా ఉన్నట్టు కనిపిస్తారు. ఈ సమయంలో చెంపల దగ్గర.. చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు (పెరోటిడ్‌ సెలైవరీ గ్లాండ్స్‌) రెండువైపులా వాచి, బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావొచ్చు. దాదాపు 5-7 రోజుల్లో ఈ వాపు తగ్గుతుంది. వాపుతో పాటు జ్వరమూ తగ్గుముఖం పడుతుంది.
  • సమస్యల ముప్పు
గవదబిళ్లలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్రా భాగాలనూ ప్రభావితం చెయ్యచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంథుల్లోనూ వాపు రావొచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. * సాధారణంగా 12-14 మధ్యవయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనబడుతుంది. ముఖ్యంగా గవదల వాపు తగ్గుతున్న సమయంలో (7-10 రోజుల మధ్య) ఒక్కసారి జ్వరం వచ్చి, వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తికడుపులో నొప్పి, జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి 'పాంక్రియైటిస్‌'కు దారితియ్యచ్చు.అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే- ఇవన్నీ తాత్కాలికంగా బాధ పెట్టేవేగానీ వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండవు.
  • అరుదుగా ప్రమాదం
* చాలాచాలా అరుదుగా గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ మెదడుకు వ్యాపించి మెదడువాపు (ఎన్‌కెఫలైటిస్‌), మెదడు పైపొరల్లో వాపు (మెనింజైటిస్‌) తెచ్చిపెట్టొచ్చు. అయితే ఇవి అరుదు, పైగా సకాలంలో చికిత్సతో చాలావరకూ నయమైపోతాయి. * గవదబిళ్లల్లో వాపు, నొప్పి, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతరత్రా సమస్యలు, మరణాలు చాలా చాలా తక్కువ. * ఎంఎంఆర్‌ టీకా వేయించుకోవటం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. * గవదబిళ్లలు వచ్చి, వృషణాలు వాస్తే భవిష్యత్తులో పిల్లలు పుట్టరనుకోవటం పెద్ద అపోహ. ఇది అనవసరమైన భయమే తప్ప ఇందులో నిజం లేదు.
  • టీకాతో నివారణ
గవదబిళ్లలు రాకుండా చిన్నపిల్లలందరికీ 'ఎంఎంఆర్‌ (మంప్స్‌, మీజిల్స్‌, రూబెల్లా) టీకా ఇవ్వటం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లేముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. * ఒకసారి గవదబిళ్లలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాదు. ఈ వ్యాధి వచ్చినవారికి దాని నిరోధకశక్తి జీవితాంతం ఉంటుంది. * పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు, లేదా ఎవరికైనా ఒక వైపే వాపు వచ్చినప్పుడు- గవదబిళ్లలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది.
  • పెద్ద అపోహ
గవదబిళ్లల కారణంగా మగపిల్లలకు వృషణాల వాపు వస్తే.. పెద్దయ్యాక వారికి పిల్లలు పుట్టకపోవటం వంటి సమస్యలుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. గవదబిళ్లల మూలంగా పిల్లలు పుట్టకపోవటం, పటుత్వం తగ్గటం వంటి ఇబ్బందులేమీ ఉండవు.
  • పరీక్షలతో నిర్ధారణ
చాలా వరకూ లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబోడీ, ఐజీఎం, ఐజీజీ వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలూ చేసి ఈ వైరస్‌ను నిర్ధారించుకోవచ్చు. పీసీఆర్‌ పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్‌ను గుర్తించొచ్చు. మెదడువాపు వచ్చినపుడు మాత్రం వెన్ను నుంచి నీరు (సీఎస్‌ఎఫ్‌) తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది.
  • విశ్రాంతి కీలకం

గవద బిళ్లలకు ప్రత్యేకమైన మందులేమీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడలకు వేడినీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్‌ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం, వీరికి అవసరమైతే స్టీరాయిడ్స్‌ వంటివి ఇస్తారు. 

Courtesy with : Eeandu sukhibhava , writen by Dr.Aswanikumar -prof. of medicine , Ashram medical college-Eluru.

  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.