Saturday, April 28, 2012

కళ్లు నులిమితే నష్టం,కెరటోకోనస్‌,కంటి ఎలర్జీ,Keratoconus

  •  
  • image : courtesy with Eenadu sukhibhava.
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కంటి ఎలర్జీ- -గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    అలర్జీ కావచ్చు.. దురద కావచ్చు.. అలవాటు కావచ్చు.. కారణమేదైనా తరచుగా, విపరీతంగా కళ్లు నులిమితే చాలా సమస్యలు మొదలవుతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కనుగుడ్డు మీద ఉండే పైపొర- కార్నియా అక్కడక్కడ బాగా పల్చబడిపోయి, సాగి బయటకు తోసుకురావటం! ఒకసారి ఈ సమస్య తలెత్తితే దాన్ని జాగ్రత్తగా నెగ్గుకురావటమేగానీ పూర్తిగా మళ్లీ తగ్గించటం చాలా కష్టం. అందుకే దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవటం అవసరం. ముఖ్యంగా తరచూ కంటి అలర్జీతో బాధపడేవారు దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించటానికి వీల్లేదు!

అలర్జీ.. మనకు సుపరిచితం! తుమ్ములతో మొదలై ముక్కుకారుతూ వేధిస్తుంది ముక్కు అలర్జీ. దద్దుర్లు, బెందులతో వేధిస్తుంది చర్మం అలర్జీ. ఇలాగే మన కంటికి కూడా అలర్జీ వస్తుంది, ఇది చాలా సాధారణం కూడా! కళ్లు దురద, నీరు కారటంతో మొదలయ్యే ఈ సమస్య కొందరిని విపరీతంగా, నిరంతరం వేధిస్తుంటుంది కూడా. చాలామంది దురదకు తాళలేక కళ్లు నలుపుకుంటూ తోసేసుకు తిరిగేస్తుంటారు గానీ దీనివల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని గుర్తించటం లేదు. ముఖ్యంగా అలర్జీ కారణంగా కళ్లు విపరీతంగా రుద్దుతుండటం వల్ల.. కనుగుడ్డు మీద ఉండే 'కార్నియా' పొర బాగా పల్చగా తయారై, అక్కడి నుంచి అది ముందుకు తోసుకొస్తూ.. 'కెరటోకోనస్‌' అనే అనర్థం తలెత్తుతుంది. కంటి వైద్యులు చాలా తరచుగా చూసే సమస్యే ఇది! అసలు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవటం ఒక ముఖ్యమైన అంశం, అలాగే ఒకవేళ 'కెరటోకోనస్‌' ఆరంభమైతే దీన్ని సత్వరమే గుర్తించి చికిత్స తీసుకోవటంద్వారా పరిస్థితి మరింత ముదరకుండా చూసుకోవటం ముఖ్యం.

ఏమిటీ కెరటోకోనస్‌?
మన కనుగుడ్డు మీద రక్షణగా పట్టి ఉండే తెల్లటి పైపొరను 'కార్నియా' అంటారు. ఇదీ, దీని కిందుగా ఉండే సహజమైన లెన్సు.. రెండూ కలిసి.. మన కంటి ముందున్న దృశ్యాన్ని లోపల ఉండే రెటీనా పొర మీద కేంద్రీకృతమయ్యేలా చూస్తాయి. దీంతో మనకు దృశ్యం కనబడుతుంది. విపరీతంగా కంటిని నులమటం, నలపటం వల్ల కనుగుడ్డు మీద ఉండే ఈ కార్నియా పొర పల్చబడే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కడ పల్చబడితే అక్కడ దీని బిగువు స్వభావం తగ్గి, లోపలి నుంచి ముందుకు తోసుకురావటం మొదలవుతుంది. దీన్నే 'కెరటోకోనస్‌' అంటారు. ఇది సాధారణంగా 20, 30 ఏళ్ల వయసులో రావచ్చు. దీనివల్ల మైనస్‌ పవర్‌లో తేడాలు వస్తుంటాయి. (సిలిండ్రికల్‌ పవర్‌ తోడవుతుంటుంది) కాబట్టి ఎవరికైనా చూపు మసకగా ఉందనిపిస్తే వైద్యులతో పరీక్ష చేయించుకోవటం మంచిది. కంటి పరీక్షలో వారికి 'సిలిండ్రికల్‌ పవర్‌' ఉండి, అది క్రమేపీ పెరుగుతున్నట్టనిపిస్తే వైద్యులు కెరటోకోనస్‌ ఉందేమో అనుమానించి.. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేస్తారు. కెరటోకోనస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమేపీ పెరుగుతూ.. చివరికి కార్నియా లోపలిపొర ఎండోథీలియం చిరిగినట్త్లెపోతోంది. దీన్నే 'కార్నియల్‌ హైడ్రాప్స్‌' అంటారు. కార్నియా పొర బాగా ముందుకు తోసుకొచ్చినప్పుడు అందులోకి నీరు తోసుకొచ్చి, వాపు వచ్చి.. వెంటనే చూపు తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కన్నును ఎక్కువగా రుద్దటం వల్ల వచ్చే విపరిణామాలు. అయితే కళ్లు రుద్దేవాళ్లందరికీ కెరటోకోనస్‌ రాకపోవచ్చు. అందుకే వైద్యులు దీనికి జన్యుపరమైన అంశాలు కూడా తోడవుతాయని భావిస్తున్నారు. తరచూ తల్లీపిల్లల్లో, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో చూస్తుండటం జన్యువుల ప్రమేయాన్ని పట్టిచెప్పే అంశం.

కళ్లెందుకు రుద్దుతారు?
1. కొందరు ఒక్కసారి కళ్లు నులుముకొంటే చూపు బాగా కనబడుతుందని భావిస్తూ తరచూ, అప్రయత్నంగా కళ్లు నులుముకుంటుంటారు.
2. కంటి అలర్జీలున్న వాళ్లు దురదతో తరచూ కళ్లను తీవ్రంగా నలుపుతుంటారు.
3. డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలున్న వారికి కూడా ఈ సమస్య ఎక్కువ. చాలాసార్లు పిల్లలు రుద్దీ రుద్దీ.. లోపలి పొరలు చినిగిన తర్వాతగానీ తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకురారు.

4. కొందరికి నోట్లో వేలు పెట్టుకోవటం లాగే తరచూ కన్ను రుద్దుకోవటం కూడా ఒక అలవాటుగా ఉంటుంది. వీరిలో కూడా 'కెరటోకోనస్‌' ఉండొచ్చు.
-మొత్తమ్మీద దీర్ఘకాలం కంటిని రుద్దుతుంటే కెరటోకోనస్‌ వస్తుందని కచ్చితంగా చెప్పచ్చు.

నిర్ధారించుకునేదెలా?
కెరటోకోనస్‌ ఉందేమో అని అన్న అనుమానం బలంగా ఉన్నప్పుడు 'టోపోగ్రఫీ' అనే పరీక్ష చేస్తారు. దీనిలో గుండ్రంగా ఉండాల్సిన కార్నియా వంపు మారిందా? ఎక్కడ ఎలా ఉందన్నది క్షుణ్ణంగా పరీక్షిస్తారు. కెరటోకోనస్‌ తొలిదశలో ఉన్నప్పుడు సాధారణంగా కనుగుడ్డు కింది అర్ధభాగంలో ముందుకు తోసుకొచ్చినట్లు స్పష్టంగా కనబడుతుంది. కొంచెం ముదిరితే.. కంటి వైద్యులు సాధారణంగా చేసే 'స్లిట్‌ల్యాంప్‌' పరీక్షలోనే- కార్నియా పొర పల్చబడినట్లు కనబడటం, కార్నియా మీద నాడులు ప్రముఖంగా కనబడటం, బయటకు తోసుకొస్తున్న చోట ఆ చుట్టూ ఒక రింగ్‌లా కనబడటం, మచ్చలు రావటం.. వంటి లక్షణాలు కనబడతాయి. టార్చ్‌లైట్‌తో, రెటీనోస్కోప్‌లతో చూసినప్పుడు కూడా వైద్యులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి. 'కెరటోమెట్రీ' అనే పరీక్షలో కార్నియా వంపు ఎక్కడెక్కడ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. టోపోగ్రఫీలోనే ఇప్పుడు 'అబ్‌స్కాన్‌' అనే కొత్త పద్ధతి వచ్చింది. దీనిలో మొత్తం వివరాలన్నీ తెలుస్తాయి. ఈ మూడింటిని బట్టి 'కెరటోకోనస్‌' అని నిర్ధారిస్తారు.

చికిత్స
* అలర్జీ ఉంటే దానికి చికిత్స చేసి తగ్గిస్తూనే ముందు చూపు చక్కబడేందుకు అద్దాలు ఇస్తారు. సిలిండ్రికల్‌ పవర్‌ మరీ ఎక్కువగా ఉంటే దృష్టిని సరి చేయటానికి 'కాంటాక్ట్‌ లెన్సులు' ఇస్తారు. దీనిలో కూడా 'సాఫ్ట్‌ లెన్సు'లతో ఉపయోగం ఉండదు. హార్డ్‌ లెన్సులు అవసరంగానీ వాటితో ఇతరత్రా సమస్యలు రావచ్చు కాబట్టి ఇప్పుడు 'ఆర్‌జీపీ రిజిడ్‌ గ్యాస్‌ పర్మియబుల్‌' లెన్సులు, సాఫ్ట్‌-హార్డ్‌ లెన్సులు కలిసి వచ్చే 'పిగ్గీబ్యాక్‌' లెన్సుల వంటివి ఉపయోగపడతాయి. కొత్తగా గుడ్డు మొత్తాన్ని ఆవరించి పెద్దగా ఉండే 'స్ల్కీరల్‌ లెన్సులు' వస్తున్నాయి. వీటితో ప్రయోజనం అధికమేగానీ ఇవి ఖరీదైనవి, క్రమేపీ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

* సర్జరీ: కార్నియా నుంచి తోసుకొచ్చిన ఉబ్బు భాగాన్ని సరిచేసేందుకు లోపల రింగ్స్‌ అమర్చే విధానం ఉంది, దీంతో చూపు మెరుగవుతుంది, దీనిపైన కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకోవటం కూడా తేలిక అవుతుంది. మరీ ఎక్కువగా పొడుచుకొస్తే మాత్రం కార్నియా మార్పిడి సర్జరీ చెయ్యాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సర్జరీలో మొత్తం కార్నియా అంతా మార్చకుండా కొంతభాగమే మార్పిడి చేసే 'డీఎల్‌కేపీ' తరహా ఆధునిక పద్ధతులూ వచ్చాయి, ఫలితాలు బాగుంటున్నాయి.

* ముదరకుండా: కెరటోకోనస్‌ మరింతగా ముదరకుండా చూసేందుకు తాజాగా 'కొలాజెన్‌ క్రాస్‌లింకింగ్‌' అనే విధానం అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక ప్రత్యేక పద్ధతిలో కనుగుడ్డు మీదకు అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేస్తారు. దీంతో- పొరను దృఢంగా పట్టి ఉంచే ఫైబర్స్‌ అన్నీ బలంగా ఒకదాంతో మరోటి అతుక్కొని (క్రాస్‌లింకిగ్‌) కొలాజెన్‌ దృఢంగా అవుతుంది. సాగటం కొంత తగ్గుతుంది. దీంతో కెరటోకోనస్‌ మరింత ముదరకుండా నివారిస్తుంది.

* మొత్తమ్మీద.. అసలు పరిస్థితి ఇక్కడి వరకూ రాకుండా చూసుకోవటం, కన్నును నలపకుండా, అలర్జీ తగ్గటానికి చికిత్స తీసుకోవటం అత్యుత్తమం.
అలర్జీ దశలోనే అడ్డుకట్ట మేలు!
మిగతా అలర్జీల్లాగే కంటి అలర్జీ కూడా ఎక్కువగా పుప్పొడి రాలే కాలంలో కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో ఇది ఏడాదంతా (పెరీనియల్‌) ఉంటుంది కూడా. కంటి అలర్జీల్లో వర్నల్‌ కెరటో కంజెక్టివైటిస్‌ (వీకేసీ) చాలా తీవ్రమైంది. ఇది మన దేశంలో ఎక్కువ. సాధారణంగా ఇది 8-12 ఏళ్ల వయసులో వస్తుంటుంది. ఇతర దేశాల్లో ఇది వయసుతో పాటు తగ్గిపోతుంటుంది. కానీ మన దగ్గర చాలా ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంటుంది. కంటి అలర్జీ ముదిరిపోతే కెరటోకోనస్‌తో సహా ఎన్నో అనర్థాలు పొంచి ఉంటాయి. కాబట్టి అలర్జీని విస్మరించకూడదు. చాలామందికి దుమ్ము, ధూళి, కాలుష్యం పొగ వంటివి పడవు. దీంతో కంటిలోని వివిధ భాగాల్లో వాపు, చికాకు ఆరంభమవుతుంది. సాధారణంగా ఇది కనుగుడ్డు మీద ఉండే పారదర్శక పైపొర కార్నియా; రెప్పల్లోపల ఉండే కంజెక్త్టెవా పొర; నల్లగుడ్డు, తెల్లగుడ్డు కలిసే లింబస్‌ వంటివన్నీ అలర్జీకి ప్రభావితమవుతుంటాయి. కన్ను దురద పెట్టటం, మంట, ఎరుపెక్కటం, నీళ్లు కారటం, వెలుతురు చూడలేకపోవటం, తరచూ కళ్లు నులమటం, రుద్దటం దీని లక్షణాలు. ఈ అలర్జీకి ప్రధానంగా- తవిటి పురుగు (డస్ట్‌మైట్స్‌), పుప్పొడి, కుక్క-పిల్లివంటి జంతువుల బొచ్చు, పత్తి.. దూది వంటి ధూళి కణాలు, కొన్ని రకాల రసాయనాలు కారణమవుతుంటాయి.

పుండు పడొచ్చు
కంటి అలర్జీతో బాధపడే వారిలో కనురెప్ప లోపలి భాగం (పాల్‌పెబ్రల్‌ కంజెక్త్టెవా)లో అక్కడక్కడా ఎర్రగా అయ్యి, వాచి.. ఉబ్బినట్లుగా ఉంటాయి. వీటినే 'పాపిలే' అంటారు. అలర్జీ తీవ్రంగా ఉంటే ఇవి పెద్దపెద్దగా కూడా ఏర్పడతాయి. కళ్ల నుంచి తీగలు సాగుతూ జిగురు స్రావాలు రావటం మొదలవుతుంది. అలర్జీ దీర్ఘకాలంగా ఉంటే రెప్పలోపలి భాగంలో మచ్చలు వస్తాయి. లింబస్‌ ప్రాంతం మందంగా అవుతుంది. పైన రెప్పలోపల ఉండే పాపిలే తరచూ కార్నియా పొరను రుద్దుకుంటూ ఉండటం, వాటి నుంచి వాపు కారక రసాయనాలు విడుదల అవుతుండటంతో కార్నియా పైపొర ప్రభావితమై.. పుండ్లు కూడా పడొచ్చు. వీటినే 'షీల్డ్‌ అల్సర్స్‌' అంటారు. దీని మీద తెల్లగా పొరలు పేరుకుని పుండు మానకుండా తయారవుతుంది. దీనికి చికిత్స చేయకపోతే ఇన్‌ఫెక్షన్లూ వస్తాయి. దీనివల్ల పిల్లల్లో కార్నియా మీద మచ్చ ఏర్పడటం, 'మెల్ల' రావటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి. కంటిని అతిగా రుద్దటం వల్ల కెరటోకోనస్‌ రావచ్చు. ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలూ పొంచి ఉంటాయి.

చికిత్స
అలర్జీ తెచ్చిపెడుతున్న కారకాలకు దూరంగా ఉండటం ప్రధానం. దుమ్ము ధూళి, కాలుష్యాల్లోకి వెళ్లకపోవటం, ఇల్లు దులిపినప్పుడు దూరంగా ఉండటం, పుప్పొడి తగలకుడా చూసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి. చేతులతో కళ్లను అసలే రుద్దకూడదు. ఐసు, లేదా చల్లటి నీటితో కళ్లకు కాపడటం పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.

* చికిత్సలో భాగంగా వైద్యులు అలర్జీతో అతిగా స్పందిస్తున్న కణాలనునెమ్మదింపజేసేందుకు 'క్రోమాల్‌ ఫోర్ట్‌' వంటివి ఇస్తారు. ఇప్పుడు యాంటీ హిస్టమిన్‌, మాస్ట్‌ సెల్‌ స్టెబిలైజర్లతో కూడిన ఓలోప్యాటడిన్‌ మందు కూడా అందుబాటులోకి వచ్చింది. కళ్లు పొడి బారకుండా చూసేందుకు, అలర్జీ కారకాలను బయటకు పంపించేందుకు 'ఆర్టిఫిషియల్‌ టియర్స్‌' వంటి చుక్కల మందులు ఇస్తారు. వీటితో వాపు మూలంగా వచ్చే మంట నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి లెవోసిట్రిజిన్‌ వంటి యాంటీ హిస్టమిన్‌ మాత్రలు కూడా ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే కొద్దిరోజుల పాటు స్టీరాయిడ్స్‌ చుక్కల మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా వాడితే నీటికాసులు, శుక్లాల వంటివి వచ్చే ప్రమాదముంది. కాబట్టి వీటిలో తక్కువ ప్రభావం గల వాటిని వాటిని ఇస్తారు. వీటితో ఫలితం లేకపోతే కను రెప్పల కింద స్టీరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వాపు మరీ ఎక్కువగా ఉంటే సైక్లోస్పోరిన్‌ చుక్కల మందూ బాగా ఉపయోగపడుతుంది. ఆస్థమా బాధితులకు ఇచ్చే మాంటిలూకాస్ట్‌ తరహా మందులతోనూ ప్రయోజనం ఉంటుంది. వీటన్నింటినీ వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవటం అవసరం. మరీ పెద్ద పుండ్లు పడితే- పైపొరలను తొలగించి, అక్కడ మాయ నుంచి తయారు చేసిన పల్చటి పొరలను (ఆమ్నియాటిక్‌ మెంబ్రేన్స్‌) పొరలను అమర్చుతారు. ఇవి పుండు త్వరగా మానేందుకు దోహదం చేస్తాయి.

* మందపాటి అద్దాలు ధరించాల్సిన అవసరం లేకుండా చేసే 'లాసిక్‌' సర్జరీ ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే 'కెరటోకోనస్‌' సమస్య ఉన్న వారికి లాసిక్‌ సర్జరీ చెయ్యకూడదు. అందుకే లాసిక్‌ సర్జరీకి ముందు- కార్నియా పొర తగినంత మందం ఉందా? లేదా? అన్నది చూడటంతో పాటు కెరటోకోనస్‌ లేదని కూడా నిర్ధారించుకున్న తర్వాతే లాసిక్‌ సర్జరీ చేస్తారు.

/ Dr.M.S.Shridhar -cornial specialist , Vasan Eye care hospital , Hyderabad.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. This is probably the best, most concise step-by guide on keratoconus on how to / what to keratoconus Hair Transplant Clinic in Hyderabad

    ReplyDelete
  2. Thanks for providing wonderful information Regards: Beauty Tips

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.