Monday, November 5, 2012

Nutritional deprivation_Mother and child deaths-పౌష్టికాహార లేమి_మాతాశిశు మరణాలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Nutritional deprivation_Mother and child deaths-పౌష్టికాహార లేమి_మాతాశిశు మరణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


దేశంలో ఏటా సంభవిస్తున్న శిశుమరణాల్లో సగానికిపైగా పౌష్టికాహార లోపమే కారణమవుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఏడు నెలల వ్యవధిలో సుమారు 700మంది చిన్నారులు కన్నుమూసిన ఘటనలో జాతీయ మానవ హక్కుల సంఘం రెండ్రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నివేదిక అడిగింది. తగినంత సిబ్బంది, అవసరమైన సౌకర్యాలు లేని కారణంగానే అంతటి దారుణం జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తూ దాన్ని 'బాలల హక్కుల' ఉల్లంఘనగానే వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడేళ్లలోపు పిల్లల్లో 74.3శాతంమంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ తాజాగా వెల్లడించిన వాస్తవం.

'వైద్యం ఓ సామాజిక శాస్త్రం.  అవగాహన కొరవడటంవల్లే మలేరియాలు, డయేరియాలు ఇప్పటికీ మన సమాజాన్ని అట్టుడికిస్తున్నాయి. పుట్టిన వెయ్యిమంది శిశువుల్లో 74మంది పురిట్లోనే ప్రాణం వదులుతున్నారన్నారు, దేశంలోని బాలల్లో 42శాతం వయసుకు తగిన బరువు లేనివారే.

ప్రపంచంలో నమోదవుతున్న అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో అత్యధికం మనదేశంలోనే ఉంటున్నాయి. పుట్టిన నెలరోజుల్లోపే ప్రపంచవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలమంది శిశువులు అసువులుబాస్తున్నారని- అందులో లక్ష మరణాలు భారత్‌లోనే నమోదవుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాలల ఆరోగ్య వికాసాలే లక్ష్యంగా 1975నుంచీ దేశంలో అమలవుతున్న సమీకృత శిశు అభివృద్ధి కార్యక్రమం(ఐసీడీఎస్‌) కింద- సుమారు పదిలక్షల అంగన్‌వాడీల ద్వారా రోజూ ఏడుకోట్ల ఇరవై లక్షలమంది పిల్లలకు, కోటిన్నర గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నారు . మాతాశిశు మరణాల రేటు, పౌష్టికాహారం, పిల్లల బరువు, గర్భిణుల రక్తహీనత వంటివాటి ఆధారంగా దేశ జీవన ప్రమాణస్థాయిని అంచనా కడతారు. ఐసీడీఎస్‌ నేతృత్వంలో నడిచే అంగన్‌వాడీలకు- పాఠశాలలకూ మధ్య బొత్తిగా సమన్వయం కనిపించదు. కనీసం 90శాతం పాఠశాలలు రక్షిత మంచినీటికి  దూరంగా ఉంటున్నాయి. డెబ్భై శాతానికిపైగా స్కూళ్లలో శౌచాలయాలు లేవు. జాతీయ పౌష్టికాహార నిపుణుల బృందం, ప్రత్యేకంగా పౌష్టికాహార శాఖను నెలకొల్పాలని సిఫార్సు చేసింది.

గణాంకాలు :
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న వారిలో 35శాతం భారత్‌లోనే ఉన్నారు

* మాతృ మరణాల్లో కనీసం 20శాతానికి కేవలం రక్తహీనతే కారణం. దేశంలో సుమారు 60శాతం తల్లులు రక్తహీనతతో కుంగిపోతున్నారు.

* అయోడిన్‌ లోపం, గాయిటర్‌ కారణంగా దేశంలో ఏడుకోట్లమంది అల్లాడుతున్నారు.

* అతిసార వల్ల దేశంలో సుమారు ఆరు లక్షలమంది శిశువులు అసువులు బాస్తున్నారు.

* విటమిన్‌-ఎ లోపం కారణంగా దేశంలో ఏటా నాలుగు లక్షలమంది పసివాళ్లు కన్నుమూస్తున్నారు. అయోడిన్‌ లోపించడంవల్ల ప్రతి సంవత్సరం భారత్‌లో 70 లక్షలమంది పిల్లలు మానసిక వైకల్యాలతో జన్మిస్తున్నారు.

* ఆహారంలో ఫొలిక్‌ ఆసిడ్‌ సరైన పాళ్లలో అందని కారణంగా ఏటా రెండు లక్షలమంది పిల్లలు నరాల సంబంధ సమస్యలతో పుడుతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది 16 రెట్లు అధికం.

అమ్మపాలు...
తల్లిపాలు అమృతంతో సమానమని మరోసారి గుర్తుచేస్తోంది పోషకాహార సంస్థ. కనీసం నాలుగు నెలలవరకూ తల్లిపాలు అవసరమని పన్నెండేళ్లనాటి నివేదిక సలహా ఇచ్చింది. ఆ వ్యవధిని ఇప్పుడు ఆరు నెలలకు పొడిగించింది. గరిష్ఠంగా రెండేళ్ల వరకూ ఇవ్వవచ్చంది. తల్లిపాలలోని కొలెస్ట్రమ్‌లో అపారమైన పోషక విలువలు ఉన్నాయి. ఆ మురిపాలతో తల్లీబిడ్డల అనుబంధాలూ బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుష్కలంగా తల్లిపాలు తాగిన బిడ్డల్లో పెద్దయ్యాక కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వూబకాయం, కొన్నిరకాల క్యాన్సర్లూ దరిచేరే ప్రమాదమూ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

పెరిగే పిల్లలకు...
పెరిగి పెద్దవుతున్న కొద్దీ, చిన్నారులకు మరింత శక్తిమంతమైన ఆహారం కావాలి. అప్పుడే పుట్టిన పసికందు బరువు ఐదునెలలు తిరిగేసరికి రెట్టింపు అవుతుంది. ఏడాది నిండేసరికి మూడురెట్లు ఎక్కువవుతుంది. బిడ్డలు రెండో ఏడాదికంతా, 7-8 సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమార దశకు ముందు బాలబాలికలు...ఏటా 6-7 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 నుంచి 3 కిలోల బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక కౌమారం మొదలైందంటే ఎన్నో శారీరకమైన, మానసికమైన మార్పులు! అమాంతంగా ఎత్తూ (10 నుంచి 12 సెంటీమీటర్లు) బరువూ (8 నుంచి 10 కిలోలు) మారిపోతాయి. ఆ మార్పులకు సరిపడా ఆహారం అందాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఇవ్వాలి. ప్రతి మనిషికీ రోజుకు 600 నుంచి 800 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఎదిగే వయసులో ఆ అవసరం ఇంకా ఎక్కువ. పాల ద్వారా ఆ కొరత కొంత తీరుతుంది. నెయ్యి, వంటనూనెలు తగినంతగా (రోజుకు 25 నుంచి 50 గ్రా.) ఇవ్వాలి. ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పొద్దస్తమానూ టీవీకి అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. పిజ్జాలూ బర్గర్లూ వంటి చిరుతిళ్ల విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉండాలి. బాల్యం నుంచే ఆరోగ్యం మీదా పోషక విలువల మీదా అవగాహన కల్పించాలి. పిల్లల్లో పెరుగుతున్న వూబకాయ సమస్య పట్ల జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వూబకాయం బూచి చూపించి కడుపు మాడ్చడం కంటే, వ్యాయామాన్నీ ఆటపాటల్నీ ప్రోత్సహించడమే మంచి మార్గమని కన్నవారికి సలహా ఇస్తోంది.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.