ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Flakes in big vessels of neck and danger, మెడ దగ్గరి పెద్ద రక్తనాళాల్లో పూడికల ప్రమాదం,పక్షవాతం లో కెరోటిడ్ ధమనుల పాత్ర- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
చాలా చిన్న అవరోధం చాలు.. చెట్టంత మనిషిని నిలువునా కుప్పకూల్చటానికి! అది గుండెలోని రక్తనాళాల్లో కావచ్చు.. మెదడులోని రక్తనాళాల్లో కావచ్చు.. కాళ్లలోని రక్తనాళాల్లో కావచ్చు.. ఇలా శరీరంలోని ఏ కీలక రక్తనాళాల్లో, ఎక్కడ అవరోధం తలెత్తినా పరిస్థితి ప్రాణాల మీదికే వస్తుంది. గుండెలోని రక్తనాళాల్లో అవరోధం తలెత్తితే గుండెపోటు తథ్యం. అలాగే మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడితే పక్షవాతం సిద్ధం. నిజానికి ఇలా మెదడు లోపలి రక్తనాళాల్లోనే కాదు... ఆ మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే 'మెడ' దగ్గరి పెద్ద రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినా కూడా.. పరిస్థితి ఇంతే ప్రమాదకరంగా ఉంటుంది!
మొత్తం పక్షవాతం బాధితుల్లో నూటికి 10 మంది ఇలా మెడ దగ్గరి రక్తనాళాల్లో కొవ్వు పూడికల కారణంగానే విపత్తు బారినపడుతున్నారని చెబుతున్నాయి గణాంకాలు! అందుకే ఈ పూడికలను నియంత్రించుకోవటమన్నది.. ఇప్పుడు పక్షవాతం నివారణలో ఒక కీలకాంశంగా పరిణమిస్తోంది.
పక్షవాతం అతిపెద్ద సమస్య. గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రజలను బలి తీసుకుంటున్న ఈ సమస్యకు మూలం... రెండు రకాలు. మొదటిది- మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి, కొంత మెదడు భాగానికి రక్తప్రసారం నిలిచిపోవటం. దీన్నే 'ఇస్కీమిక్ స్ట్రోక్' అంటారు. పక్షవాతం బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఇలా ఇబ్బందుల పాలవుతున్న వాళ్లే! ఇక రెండోది- మెదడులోని రక్తనాళాలు ఎక్కడోచోట చిట్లి రక్తం గడ్డకట్టి, పక్షవాతం బారినపడటం. దీన్ని 'హెమరేజిక్ స్ట్రోక్' అంటారు. మొత్తమ్మీద రక్తనాళాలు చిట్లి గడ్డకట్టటం కంటే కూడా... మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు, అవరోధాలు ఎదురై, మెదడులోని కొంత భాగానికి రక్తప్రసారం నిలిచిపోవటమన్నదే చాలా ఎక్కువ. ఇలా మెదడులోని రక్తనాళాల్లోకి అవరోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడివన్నది కీలకం. చాలా సందర్భాల్లో శరీరంలోని ఇతరత్రా భాగాల్లో చిన్నచిన్న రక్తపు గడ్డలు, కొవ్వు పూడికలు తయారై.. వాటికి సంబంధించిన చిన్నచిన్న పలుకులు, ముక్కల వంటివి రక్త ప్రవాహంలో కలిసి కొట్టుకుపోతూ.. మెదడులోకి వెళ్లి... అక్కడి రక్తనాళాల్లో అవరోధంగా ఏర్పడి, రక్తప్రవాహాన్ని నిలిపివెయ్యటం ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా మెడ దగ్గర ఉండే 'కెరోటిడ్' ధమనుల్లో కొవ్వు పూడికలు, కొలెస్ట్రాల్ ముద్దలు ఏర్పడి.. వాటి నుంచి చిన్నచిన్న పలుకుల్లాంటివి విడివడి మెదడులోకి వెళ్లి.. పక్షవాతం సమస్యను తెచ్చిపెట్టటం ఎక్కువగా కనబడుతోంది. అందుకే ఇప్పుడీ కెరోటిడ్ ధమనులకు ప్రాధాన్యం ఎంతో పెరుగుతోంది.
పక్షవాతం: కెరోటిడ్ ధమనుల పాత్ర
భారతీయులను, ముఖ్యంగా హైదరాబాద్ వైద్య నిపుణులు సేకరించిన గణాంకాలను చూస్తే (హైదరాబాద్ స్ట్రోక్ రిజిస్ట్రీ)- మొత్తం పక్షవాతం కేసుల్లో 10% వరకూ ఇలా మెడ దగ్గరి కెరోటిడ్ ధమనుల్లో సమస్య వల్లే ముంచుకొస్తున్నాయి. మిగతా 90% కేసులకు మెదడులోని రక్తనాళాల్లోనే సమస్యలు తలెత్తతటమో, లేదూ ఇతరత్రా రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డలు మెదడులోకి వెళ్లి అడ్డుపడటమో.. ఇలా ఇతరత్రా అంశాలు కారణమవుతున్నాయి. ప్రతి వంద మంది పక్షవాతం బాధితుల్లో పది మందికి కెరోటిడ్ ధమనుల్లో పూడికలు ఉంటున్నాయంటే కచ్చితంగా దీని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 శాతమూ చాలా వరకు నివారించదగ్గవే. ఈ సమస్యను ముందే గుర్తించే అవకాశం ఉంటే వీరు పక్షవాతం బారినపడకుండా నివారించుకోవచ్చు.
కెరోటిడ్‌లలో సమస్య: గుర్తించేదెలా?
* సాధారణంగా రక్తనాళాల (వాస్క్యులర్) సర్జన్లు... మెడ దగ్గర చెయ్యి పెట్టి నొక్కి చూడటం, అలాగే స్టెతస్కోప్‌తో చూడటం ద్వారా కెరోటిడ్ ధమనుల్లో రక్త ప్రవాహం తీరు ఎలా ఉందో పరిశీలిస్తారు. ఈ సమయంలో ఒక రకమైన కంపన ధ్వని (థ్రిల్/బ్రూయీ) వినపడితే లోపల పూడిక వస్తోందని అనుమానించవచ్చు. ఒకసారి ఇలా అనుమానం బలపడితే రక్తనాళం లోపలి సమస్యను కచ్చితంగా నిర్ధారించుకునేందుకు మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.
* అలాగే గుండెకు బైపాస్ ఆపరేషన్ చేయించుకునే వారందరికీ ఆపరేషన్‌కు ముందు ఈ కెరోటిడ్ ధమనులు ఎలా ఉన్నాయన్నది పరీక్షిస్తారు. ఎందుకంటే ఈ ధమనుల్లో పూడికలు ఉంటే.. సర్జరీ సమయంలో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
* అరుదుగా కొందరికి ఒక కాలుగానీ, లేదా కాలూచెయ్యీ వంటి రెండు అవయవాలుగానీ బలహీనంగా అనిపించి.. మళ్లీ ఒకటి రెండు గంటల్లో అంతా మామూలుగా సర్దుకుంటుంది. ఇటువంటి లక్షణం కనబడితే దాన్ని విస్మరించకూడదు. దీన్నే 'ట్రాన్సియెంట్ వీక్‌నెస్', 'ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ ఎటాక్' అంటారు. ఇలాంటి లక్షణం కనబడిన వారికి కెరోటెడ్ ధమనుల్లో పూడికల సమస్య ఉందని కచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది, వీరికి పరీక్ష అవసరం. విస్మరిస్తే మున్ముందు వీరికి పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
* ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించి, తర్వాత కోలుకోవటం (ట్రాన్సియెంట్ బ్లాక్‌అవుట్) కూడా కెరోటిడ్‌లలో పూడికలు వస్తున్నాయని చెప్పే ఒక సంకేతం. ఎందుకంటే కంటిలోని రెటీనా పొరకు రక్తాన్ని అందించే రక్తనాళం కూడా ఈ కెరోటిడ్ ధమని నుంచే వెళుతుంది. ఒకవేళ ఈ రక్తనాళం పూడుకుంటే రెటీనాకు రక్తసరఫరా తగ్గి, ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించవచ్చు.. తర్వాత కోలుకుంటారు. ఇటువంటి లక్షణాలు కనబడితే కెరోటిడ్ ధమనుల్లో ఎక్కడన్నా పూడికలు వచ్చాయేమోనని కచ్చితంగా అనుమానించి మరిన్ని పరీక్షలు చెయ్యాల్సిందే.
పైస్థాయి పరీక్షలు
* కెరోటిడ్ రక్తనాళాల్లో పూడికలు గుర్తించేందుకు కచ్చితమైన, తేలికైన మార్గం- కలర్ డాప్లర్ పరీక్ష. మెడ దగ్గర అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఉంచితే లోపల రక్తనాళంలో పరిస్థితి ఏమిటి? పూడిక ఉందా? ఉంటే అది ఏ స్థాయిలో ఉంది? ఎంత దూరం ఉంది? అది ఏ రకం? ఈ వివరాలన్నీ దానిలో తెలుస్తాయి.
దీనిలో సమస్యను గుర్తించిన తర్వాత మరింత స్పష్టత కోసం 'యాంజియోగ్రఫీ' చేస్తారు. తొడ దగ్గరి నుంచి రక్తనాళం ద్వారా సన్నటి తీగను మెడ వరకూ పంపి.. దాని ఆధారంగా రక్తనాళం లోపల పరిస్థితిని గుర్తించే సాధారణ యాంజియోగ్రామ్ పరీక్ష కావచ్చు, లేకపోతే సీటీస్కాన్ లేదా ఎమ్మారై స్కానింగుల సాయంతో చేసే సీటీయాంజియోగ్రఫీ, ఎమ్మార్ యాంజియోగ్రఫీ కావచ్చు.. వీటిలో ఏది చేసినా సమస్య ఆనుపానులను చూడటం సాధ్యపడుతుంది. సమస్య ఎంత విస్తరించింది, ఎంత దూరం ఉందన్నది గుర్తిచటం ముఖ్యం. ఒకసారి యాంజియోగ్రామ్ చేసి సమస్యను గుర్తిస్తే ఇక దానికి చికిత్స ఎలా చెయ్యాలన్నది ఆలోచించవచ్చు.
* ఒకసారి కెరోటిడ్ ధమనుల్లో సమస్య ఉందని గుర్తిస్తే... శరీరంలో ఇంకా ఇతరత్రా రక్తనాళాల్లో కూడా.. అంటే గుండెలోని రక్తనాళాల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా సమస్యలున్నాయేమో గుర్తించటం అవసరం. అందుకని అవసరాన్ని బట్టి వైద్యులు ఆ పరీక్షలూ సూచిస్తారు.
చికిత్సలు
1. మందులతో చికిత్స: పూడిక స్థాయిని బట్టి తొలిదశలో మందులతోనే చికిత్స చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కెరోటిడ్ ధమని లోపల పూడిక 70% కంటే తక్కువుంటే మందులు ఇవ్వటానికే ప్రయత్నిస్తారు. ఇందుకోసం రక్తం చిక్కబడకుండా చూసే క్లోపిడోగ్రెల్, ఆస్పిరిన్ వంటి మందులతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే అటార్వోస్టాటిన్ వంటి మందులు ఇస్తారు. పూడిక 70% కంటే ఎక్కువ ఉండి, కొన్ని లక్షణాలు కూడా కనబడుతుంటే మాత్రం కెరోటిడ్ ధమనుల్లోని పూడిక తొలగించేందుకు స్టెంట్ పెట్టటమో, లేక సర్జరీ చెయ్యటమో అవసరమవుతుంది.
2. స్టెంట్ అమర్చటం: కెరోటిడ్ ధమనుల్లో పూడిక వచ్చిన చోట.. ఒక స్ప్రింగు వంటి స్టెంట్‌ను అమర్చి.. పూడిక రక్తప్రవాహానికి అవరోధంగా తయారవ్వకుండా చూడటం 'కెరోటిడ్ ఆర్ట్రీ స్టెంటింగ్' ప్రక్రియ లక్ష్యం. తొడ దగ్గరి నుంచి తీగ మెడలోని రక్తనాళం వరకూ పంపించి.. ముందు- పూడిక పైభాగాన ఒక సున్నితమైన జల్లెడ వంటి 'ఫిల్టర్' అమరుస్తారు. ఎందుకంటే స్టెంట్ అమర్చే సమయంలో కొన్నిసార్లు అక్కడి కొవ్వు ముద్దలు కొన్ని విడివడి, అవి రక్తప్రవాహంలో కలిసి మెదడులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా జగరకుండా నివారించేందుకు ముందే పైభాగాన ఫిల్టర్ అమర్చి, అప్పుడు పూడిక వద్ద బెలూన్‌ను ఉబ్బించి, స్టెంట్ అమర్చి, తర్వాతఫిల్టర్‌నూ, బెలూన్‌నూ తీసేస్తారు. స్టెంట్ అమర్చటంతో అవరోధం తగ్గి.. రక్తనాళంలో రక్తప్రవాహం మెరుగవుతుంది.
3. సర్జరీ చేసి శుభ్రం చెయ్యటం: మెడ దగ్గర చర్మంపై గాటు పెట్టటం ద్వారా కెరోటెడ్ ధమనిని చేరుకుని.. పూడికకు కిందాపైనా ఆ నాళాన్ని మూసేసి.. ఆ మధ్య భాగంలో పేరుకొని ఉన్న కొవ్వు ముద్దను తొలగించి.. రక్తనాళాన్ని తిరిగి కుట్టేయటం సర్జరీ విధానం. దీన్నే 'కెరోటిడ్ ఎండార్ట్రెక్టమీ' అంటారు. దీంతో నాళంలో పూడిక తొలగిపోతుంది. ఆపరేషన్ సమయంలో మెదడుకు రక్తసరఫరా ఆగకుండా చూసేందుకు కొన్నిసార్లు ప్రత్యామ్నాయంగా మరో గొట్టం (షంట్) అమర్చి.. సర్జరీ చేసి.. తర్వాత షంట్ తీసేస్తారు.
కొన్నిసార్లు స్టెంట్ అమర్చే సమయంలోనే పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో స్టెంటింగ్ చెయ్యటం మంచిదా? సర్జరీ మంచిదా? అన్న మీమాంస చాలాకాలం నడిచిందిగానీ క్రమేపీ దీర్ఘకాలిక ఫలితాలను అధ్యయనం చేస్తే- మన్నికైన ఫలితాలను, ఈ ప్రక్రియల సమయంలో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సర్జరీనే మేలని ఇప్పుడు గుర్తించారు. సర్జరీలో కూడా చాలా నైపుణ్యం చాలా ముఖ్యం.
సర్జరీ తర్వాత...
సర్జరీతో పేరుకున్న కొవ్వును తొలగిస్తారుగానీ ఆ తర్వాత మళ్లీ పేరుకోకుండా చూసుకోవటం ముఖ్యం. కాబట్టి హైబీపీ ఉన్నవారు దాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. స్టాటిన్స్, రక్తం చిక్కబడకుండా చూసే యాంటీప్లేట్‌లెట్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. అలాగే పొగతాగే అలవాటున్నవారు మానెయ్యటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, నిత్యం వ్యాయామం చెయ్యటం వంటి జాగ్రత్తలూ అవసరం.
సాధారణంగా బైపాస్ ఆపరేషన్ చేయించుకునే వాళ్లందరికీ మెడ దగ్గరి కెరోటిడ్ ధమనులు ఎలా ఉన్నాయన్నది పరీక్షిస్తారు. చాలామందిలో 30, 40 శాతం పూడికలే ఉంటాయి. వీరికి చాలావరకూ మందులతోనే చికిత్స సరిపోతుంది. అయితే కొద్దిమందిలో 70% మించి ఉంటుంది, వీరికి బైపాస్ ఆపరేషన్ సమయంలోనే... ఈ కెరోటిడ్ ధమనులను శుభ్రం చేసే ఆపరేషన్ కూడా పూర్తిచేసేస్తారు. దీనివల్ల రోగికి ఖర్చు తగ్గుతుంది, పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుంది.
* సాధారణంగా ఒక వైపు కెరోటెడ్ ధమనికే పూడికలు ఉంటాయి. అరుదుగానే రెండు వైపులా ఉండొచ్చు. అలాంటి వారికి ముందు ఒకటి చేసి, తర్వాత మరోవైపు చేస్తారు. మొత్తానికి కెరోటిడ్ ధమనుల్లో పూడికలను ముందే అనుమానించటం ద్వారాగానీ, కాలుచెయ్యి బలహీనపడటం వంటి స్వల్పస్థాయి పక్షవాతం లక్షణాల ద్వారాగానీ.. ఈ కెరోటిడ్ ధమనుల సమస్యను ముందే గుర్తించి.. దీనికి చికిత్స అందించటం ద్వారా పక్షవాతం రాకుండా నివారించుకోవటం ముఖ్యం.
కెరోటిడ్ ధమనులు: వీటిలో ఏమవుతుంది?
గుండె నుంచి రక్తాన్ని బయటకు తెచ్చే అతిపెద్ద రక్తనాళం బృహద్ధమని నుంచి మొదలై... మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రెండు ప్రధాన రక్తనాళాలు ఈ కెరోటిడ్ ధమనులు. ఇవి మెడకు రెండువైపులా ఉంటాయి. మెదడుకు రక్తసరఫరా అందించటానికి మరో రెండు ధమనులు (వెర్టిబ్రల్) కూడా ఉన్నాయిగానీ ఈ కెరోటిడ్ ధమనులు రెంటిదీ ప్రధాన పాత్ర. ఇవి కింది నుంచి పెద్ద గొట్టాల్లా వచ్చి.. మెడ దగ్గర రెండుగా చీలతాయి. వీటిలో 'ఇంటర్నల్ కెరోటిడ్' అన్నది మెదడుకు సరఫరా అందిస్తుండగా.. 'ఎక్స్‌టర్నల్ కెరోటిడ్' ధమని తల, మెడ తదితర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. కీలకమైన విషయం ఏమంటే- కింది నుంచి వచ్చే ప్రధాన నాళం ఇలా మెడ దగ్గర రెండుగా చీలుతుంది కాబట్టి ఇక్కడ రక్త ప్రవాహ వేగాల్లో, పీడనాల్లో తేడా ఉంటుంది. దీనివల్ల రక్తనాళం లోపల ఇక్కడ కొవ్వు ముద్దలు పేరుకుని, పూడికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వు ముద్దనే 'అథెరోమా' అంటారు. ఇలా కొలెస్ట్రాల్ ముద్ద ఏర్పడి.. అక్కడ పూడిక రావటం వల్ల రక్తప్రవాహ మార్గం సన్నబడిపోయి రక్తసరఫరా తగ్గటం ఒక సమస్య. రెండోది ఈ ముద్ద నుంచి చిన్నచిన్న పలుకులు, ముక్కలు విడిపోయి, అవి రక్తప్రవాహంలో కలసి మెదడులోకి చేరి, మెదడులోని చిన్నచిన్న రక్తనాళాల్లో అడ్డుపడి.. అక్కడ రక్తసరఫరాకు అవరోధంగా మారతాయి. దీంతో మెదడులోని ఆ ప్రాంతానికి రక్తసరఫరా నిలిచిపోయి.. పక్షవాతం ముంచుకువస్తుంది. కెరోటిడ్ ధమనుల్లో పూడికల కారణంగా ముంచుకొచ్చే పక్షవాతం సమస్య ఇది!
కెరోటిడ్‌లలో పూడిక ముప్పు: ఎవరికి ఎక్కువ?
రక్తనాళాల్లో పూడికలు రావటాన్ని 'అథెరోస్ల్కెరోసిస్' అంటారు. ఈ పూడికలన్నవి గుండెలో, కాళ్లలో, కెరోటిడ్ ధమనుల్లో ఎక్కడైనా రావచ్చు. ఇలా పూడికలు వచ్చే ముప్పు-
* మధుమేహుల్లో * హైబీపీ ఉన్నవారిలో, * పొగతాగే వారిలో,
* రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువుండే వారిలో, * పెద్ద వయసు వారిలో,
... వీరందరిలోనూ ఎక్కువ. కాబట్టి వీరంతా జాగ్రత్తగా ఉండటం అవసరం. గుండెలోగానీ, కాళ్లలోగానీ పూడికలు వస్తున్న లక్షణాలున్నా, అలాగే ఒకసారి స్వల్పస్థాయి పక్షవాతం బారినపడినా- వాళ్లు కెరోటిడ్ ధమనుల పరిస్థితి ఎలా ఉందన్నది కచ్చితంగా పరీక్ష చేయించుకోవటం అవసరం.
డా.పి.సి.గుప్త ,వాస్క్యులార్ సర్జన్ , కేర్ హాస్పిటల్ ,హైదరాబాద్@ ఈనాడు సుఖీభవ.
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.