Sunday, March 31, 2013

Pregnancy and awareness, గర్భము మరియు అవగాహన

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pregnancy and awareness, గర్భము మరియు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంబరం
అమ్మాయి నెల తప్పిందనగానే మొదలవుతుంది.. సంబరం! ఇక వేవిళ్లు, మొక్కులు, సూడిదలు, సీమంతాల నుంచి.. నట్టింట పసిబిడ్డ కేరింతలు కొట్టే వరకూ ప్రతిదీ పండగే! ఇల్లంతా ఒకటే కోలాహలం. ఇదో ప్రకృతి పండుగ.
పునరుత్పత్తికి మూలమైన గర్భధారణ, ప్రసవాలు ప్రకృతి సహజమైన శారీరక ప్రక్రియలు. వీటి విషయంలో తరతరాలుగా, సంప్రదాయంగా వస్తున్న విజ్ఞానం అనంతరం. అయితే ఇప్పుడీ తరతరాల తీగలు తెగిపోతున్నాయి. కుటుంబాలు చిన్నవైపోతూ... అమ్మలు, బామ్మలు దగ్గరుండే పరిస్థితి లేదు. వెన్నుదన్నుగా ఉండేవారు కరవౌతున్నారు. దీంతో గర్భధారణ అనగానే గుండె నిండా సంబరంతో పాటే... నేటితరం తల్లులకు మనసులో ఏదో మూల చిన్నచిన్న సంకోచాలూ పీడించటం ఎక్కువవుతోంది. మరోవైపు సంప్రదాయ విజ్ఞానంతో పాటే బోలెడు అశాస్త్రీయమైన నమ్మకాలూ జనం నోళ్లలో నలుగుతున్నాయి.

ఆహారం
చాలామంది గర్భిణులు 'ఇద్దరి కోసం తినాలని' నమ్ముతూ దీన్నే ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవానికి అతిగా తినటం వల్లే సమస్యలు తలెత్తుతాయి. ఇష్టంగా తినటం, బిడ్డకు కావాల్సినంత పోషకాలను అందించేలా తినటం ముఖ్యం. గర్భిణి తీసుకునే ఆహారం వారికి పుట్టే పిల్లలనూ ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. గర్భిణులు కొవ్వు పదార్ధాలు, స్వీట్ల వంటివి ఎక్కువగా తినటం వల్ల వారికి పుట్టే పిల్లలు కూడా వాటి పట్ల ఇష్టాన్ని పెంచుకుంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి గర్భిణి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవటం తనకే కాదు, పుట్టే పిల్లలకూ మంచిది. దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశం ఇది. గర్భిణులు మాంసకృత్తులు దండిగా తీసుకోవాలి. అవసరమైతే ప్రోటీన్‌ సప్లిమెంట్‌ అయినా తీసుకోవాలి. గర్భిణులు ఉప్పు తగ్గించాల్సిన అవసరమూ లేదు.

సంతోషం
గర్భిణి బాధ, కోపం, దుఃఖం వంటి ప్రతికూల భావోద్వేగాలేవీలేకుండా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపటం బిడ్డ ఎదుగుదలపై ఎంతో మంచి ప్రభావం చూపిస్తుందని తాజా పరిశోధనలెన్నో గుర్తించాయి. తల్లిదండ్రులు బిడ్డలకు కేవలం జన్యువులు మాత్రమే అందిస్తారనుకోవటం పొరపాటు. తల్లి మనసులో ఏం జరుగుతోంది, తల్లి ఎటువంటి భావోద్వేగాలను అనుభవిస్తోందన్నది కడుపులోని బిడ్డకు తెలియకపోవచ్చు.. కానీ ప్రతి భావోద్వేగమూ తల్లిలో ఎన్నో శారీరక, రసాయనిక మార్పులు తెస్తుంటుంది. ఆగ్రహం, ఆందోళన, భయం వంటి ఉద్వేగాలు తల్లిలో రకరకాల రసాయనిక మార్పులు తెస్తాయి. తత్ఫలితంగా బిడ్డ ఎదుగుదల ప్రభావితమవుతుందని అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు. కాబట్టి గర్భిణి హాయిగా, విశ్రాంతిగా, ఉల్లాసంగా గడపటం చాలా ముఖ్యమని, కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఇటువంటి వాతావరణాన్ని కల్పించటం ముఖ్యమని గుర్తించాలి.

విశ్రాంతి
అమ్మాయి నెల తప్పిందంటే చాలు.. ఇక కాలు కింద పెట్టకుండా, మంచం దిగకుండా చూడాలన్న ధోరణి చాలా కుటుంబాల్లో కనబడుతుంటుంది. ఇది సమర్థనీయం కానేకాదు. అస్సలేమాత్రం శారీరక శ్రమ లేకుండా ఎప్పుడూ తిని పడుకోవటం వల్ల 'గర్భిణీ మధుమేహం', కాళ్లలో రక్తం గడ్డలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. గర్భిణులకు 8 గంటల రాత్రి విశ్రాంతి అవసరం. పక్కకు తిరిగి పడుకోవటం, కాళ్ల మధ్య దిండు పెట్టుకోవటం వల్ల సౌకర్యవంతంగా ఉండి, నిద్ర హాయిగా పడుతుంది. ఇక పగటిపూట మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకున్నా చురుకుగా తిరుగుతూ, శరీరానికి  ఎంతోకొంత వ్యాయామం ఉండేలా చూసుకోవటం ముఖ్యం. రోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చెయ్యటం మరీ మంచిది. నిజానికి వ్యాయామం వల్ల నడుము నొప్పి, అలసట, కాళ్ల వాపుల వంటివి కొంత తగ్గుతాయి కూడా. నడక, ఈత, యోగ.. గర్భిణులకు ఇవెంతో మేలు చేస్తాయి.

బొప్పాయి, అనాస
చాలామంది గర్భిణులు బొప్పాయి, అనాస పండ్లు తినకూడదనీ, తింటే గర్భస్రావాలు అవుతాయని నమ్ముతుంటారుగానీ దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవు. ఇటువంటి నమ్మకాలు విదేశాల్లో ఎక్కడా కనబడవు, అక్కడి గర్భిణులు వీటిని నిశ్చింతగా తింటూనే ఉన్నారు. కాకపోతే మన సమాజంలో, సంస్కృతిలో ఈ నమ్మకం బలంగా ఉంది కాబట్టి వీటిని తిని, ఆ తర్వాత మనసులో లేనిపోని భయాలు పెట్టుకోవటం వృధా. గర్భిణులు ఆందోళనలకు గురికాకుండా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. నిజానికి మనకు ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి కాబట్టి గర్భిణులు తమకు ఇష్టమైన రకరకాల పండ్లు తినొచ్చు. ఏవైనా గానీ పండ్లు దండిగా తినటం మాత్రం అవసరం. పండ్ల నుంచి రకరకాల పోషకాలతో పాటు పీచు కూడా లభిస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలూ తగ్గుతాయి.

ఉద్యోగం
సాధారణంగా శారీరకంగా శ్రమ, ఒత్తిడి లేని ఉద్యోగాలైతే నెలలు నిండే వరకూ చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చోవటం, ఎత్తుమడాలు లేని చెప్పులు వేసుకోవటం, వారానికి 40 గంటలకు మించి పని చెయ్యకపోవటం, ప్రతి 4 గంటలకూ ఓ పావు గంట పని నుంచి విశ్రాంతి తీసుకుని నాలుగు అడుగులు వేసి రావటం మంచిది. గర్భిణులకు రసాయనాలు, రేడియేషన్‌ వంటివాటి మధ్య, లేదా వేడిగా ఉండే వాతావరణంలో ఉద్యోగాలు మంచిది కాదు. పని గురించీ, అక్కడి వాతావరణం గురించీ వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. నిలబడి చేసే ఉద్యోగాలైతే 24 వారాల నుంచీ మానెయ్యటం మేలు. రాత్రి షిఫ్టుల వల్ల నెలలు నిండకుండానే కాన్పయ్యే అవకాశం పెరుగుతున్నట్టు గుర్తించారు. కాబట్టి రాత్రి షిఫ్టు ఉద్యోగులు ముందుగానే వైద్యులతో చర్చించి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

దంత శ్రద్ధ
గర్భిణికి చిగుళ్ల వ్యాధి వంటివి ఉంటే నెలలు నిండక ముందే కాన్పు వచ్చే ముప్పు ఎక్కువని పరిశోధకులు శాస్త్రీయంగా నిర్ధారించారు. చాలామంది స్త్రీలు అసలు దంత వైద్యుల వద్దకు వెళ్లటానికే ఇష్టపడరు. తల్లి ఆరోగ్యానికీ, గర్భం సజావుగా సాగటానికీ.. రెంటికీ దంత సమస్యలేవీ లేకుండా చూసుకోవటం ముఖ్యమని గుర్తించాలి. వీలైతే గర్భం ధరించటానికి ముందే దంత పరీక్షకు వెళ్లటం ఉత్తమం. లేదంటే కనీసం గర్భం దాల్చిన వెంటనే అన్నా వెళ్లాలి. కారణం దంత చికిత్సలేమైనా అవసరమైతే (ఉదా|| యాంటీబయాటిక్స్‌, ఎక్స్‌రేల వంటివి) నాలుగో నెల వచ్చేలోపే పూర్తి చేసుకోవటం మంచిది. ముఖ్యంగా నెలలు నిండకుండానే కాన్పు అయ్యే రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లకు (ఉదా. కవలలు ఉన్నవాళ్లు, సర్విక్స్‌ బిగుతుగా లేనివాళ్లు మొ||) ఇది మరీ అవసరం.

నీరు
నీరు ఎక్కువగా తాగటం ఎవరికైనా మంచిది, గర్భిణులకు మరీ మంచిది. ఎందుకంటే ఒంట్లో నీరు తగ్గితే కండరాలు బిగుసుకోవటం పెరుగుతుంది. గర్భాశయం కూడా ఒక రకమైన కండరమే. కాబట్టి గర్భిణులకు 'డీహైడ్రేషన్‌' మంచిది కాదు. అందుకే వీరు రోజుకు కనీసం 1.5 నుంచి 2 లీటర్ల నీరైనా తాగాలి. నీళ్లు ఎక్కువ తాగటం వల్ల తరచుగా టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది, ఈ రూపేణా శరీరానికి కొంత కదలిక, నడక ఉంటాయి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి.. ఆ పని నుంచి ఇదో రకమైన తప్పనిసరి విరామంగా పనికొస్తుంది.

కుంకుమ పువ్వు
మంచి చాయగల తెల్లటి పిల్లలు పుడతారన్న నమ్మకంతో కుంకుమ పువ్వు తీసుకునే గర్భిణులు ఎంతోమంది. ఇదెంత వరకూ నిజమో ఎవరికీ తెలియదు. కుంకుమ పువ్వు అనేది ఓ రకమైన సుగంధ ద్రవ్యం. సాధారణ వంటకాల్లో కూడా దీన్ని చాలా కొద్ది మోతాదులోనే వాడతారు. కానీ శ్రీలంక వంటి దేశాల్లో గర్భిణులు దీన్ని రోజూ స్పూనుకు పైగా తింటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని అదీ మితంగా తీసుకుంటే నష్టం ఉండకపోవచ్చు గానీ ఎక్కువ మొత్తంలో, అదీ ఆరేడు నెల్ల పాటు రోజూ తీసుకోవటం ఎంత వరకూ సురక్షితమో తెలియదు. కాబట్టి ఏదీ అతిగా తినకుండా ఉండటం మంచిది.

వ్యసనాలు
సాధారణంగా స్త్రీలు పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉంటారని అందరం భావిస్తుంటాంగానీ ఈ ఆధునిక కాలంలో ఈ నమ్మకం పూర్తి నిజం కాదనీ.. ఇటీవలి కాలంలో ఆడపిల్లల్లోనూ ఈ అలవాట్లు మెండుగానే ఉంటున్నాయని వెల్లడవుతోంది. పైగా నానాటికీ ఇది పెరుగుతోంది కూడా. చాలామంది తమకు తెలియకుండానే దానికి బానిస అయిపోతుంటారు. గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటివాటి జోలికి వెళ్లకూడదు.

బీపీ, వాపు
తల్లీబిడ్డల శ్రేయస్సు దృష్ట్యా గర్భిణులు క్రమం తప్పకుండా.. ఆర్నెల్లు నిండే వరకూ నెలకోసారి, 28 నుంచి 36 వారాల వరకూ రెండు వారాలకోసారి, 36 వారాల తర్వాత కాన్పయ్యే వరకూ వారంవారం గైనకాలజిస్ట్‌ను కలిసి చూపించుకోవాలి. వైద్యుని వద్దకు వెళ్లిన ప్రతి సారీ బరువు, బీపీ రెండూ చూస్తారు. కాళ్ల వాపు ఉందేమో గమనిస్తుంటారు. గర్భిణులకు కాళ్ల వాపు కొంత సహజమేగానీ బీపీ పెరగకుండా కేవలం కాళ్ల వాపు ఉంటే పెద్ద సమస్య కాదు. కాళ్ల కింద ఎత్తుగా దిండుపెట్టుకు పడుకోవటం, కాళ్లు మెలికేసుకుని కూర్చోకుండా ఉండటం అవసరం. అయితే బీపీ పెరుగుతూ, కాళ్ల వాపులూ పెరుగుతుంటే మాత్రం దానిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. ముఖం ఉబ్బరించినా, కళ్ల చుట్టూ వాపు వచ్చినా, చేతులు వాచినా, కాళ్లు చీలమండలు మరీ ఎక్కువగా వాచిపోయినా, ఒక కాలు ఎక్కువగా వాచి నొప్పిగా ఉన్నా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

ప్రయాణాలు
చాలామంది నెలలు నిండుతున్న సమయంలో సీమంతానికి, పుట్టింటికి.. అంటూ ప్రయాణాలు కడుతుంటారు. వాస్తవానికి మొదటి మూడు నెలలూ, ఆఖరి మూడు నెలలూ దూర ప్రయాణాలు అంత మంచిది కాదు. 3-6 నెలల మధ్య ప్రయాణాల వల్ల ఇబ్బందేం ఉండదు. 6-9 నెలల మధ్య (ఆఖరి త్రైమాసికం) మాత్రం ప్రయాణాలు చెయ్యకపోవటం ఉత్తమం. మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టే సుదూర ప్రయాణాలకు రైళ్లు, విమానాలు సురక్షితం. రైళ్లలో లేచి కాస్త నడవచ్చు, టాయ్‌లెట్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది కాబట్టి రైలు సురక్షితమైనదే. కాకపోతే ఆఖరి నెలల్లో రైల్లో దూర ప్రయాణాల వల్ల మధ్యలో ఏదైనా వైద్య సహాయం అవసరమైతే కష్టమవుతుంది. గర్భిణులు పుట్టింటికి వెళుతుంటే మొత్తం వైద్యపరమైన రికార్డులన్నీ వెంట తీసుకువెళ్లాలి. ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటే మధ్యమధ్యలో లేచి నాలుగు అడుగులు వేయటం, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవటం మంచిది. బయట అమ్మే ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి బయట ఏమీ తీసుకోకుండా ఉండటం, తమతో నీరు ఆహారం తీసుకువెళ్లటం చాలా ముఖ్యం.

జుట్టు శ్రద్ధ
గర్భధారణ తర్వాత శారీరకంగా చాలా మార్పులు సహజం. జుట్టు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. నిజానికి గర్భిణుల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను స్థాయులు బాగా పెరుగుతాయి. ఇవి సహజంగా రాలిపోతుండే వెంట్రుకలను కూడా రాలనివ్వకుండా, మరింత కాలం అలాగే కొనసాగేలా చేస్తాయి. దీనివల్ల గర్భిణులకు జుట్టు పెరుగుతుండటమేగానీ రాలిపోవటమన్నది చాలా అరుదు. అయితే కాన్పు తర్వాత ఈ హార్మోన్ల స్థాయి తగ్గి, ఒక్కసారిగా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. దీంతో అప్పుడు వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. సాధారణంగా కాన్పు తర్వాత మూడు నెలలకు వెంట్రుకలు రాలిపోవటం మొదలై.. క్రమేపీ సద్దుకుంటుంది. గర్భిణులు జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం వైద్యులకు చూపించుకుని పోషకాహార లోపం, థైరాయిడ్‌ సమస్యల వంటివేమైనా ఉన్నాయేమో చూపించుకోవటం మంచిది.

స్కానింగులు
గర్భిణులకు స్కానింగులు చేస్తుంటారుగానీ చాలామందికి వీటి ప్రాధాన్యం ఏమిటో తెలియదు. గర్భం దాల్చిన తర్వాత వివిధ దశల్లో మొత్తం మూడు స్కానింగులు చెయ్యటం ముఖ్యం. ఇవన్నీ ఆల్ట్రాసౌండ్‌ స్కానింగులే. వీటిని చేసే విధానం ఒకటేగానీ.. వీటిలో ప్రతి స్కానింగుకూ ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. ఒక్కో స్కానింగులో ఒక్కో అంశం మీద దృష్టిపెట్టి చూస్తారు. 3వ నెల చివర్లో ఒకసారి (పిల్లల్లో జన్యు సమస్యలేమైనా ఉన్నాయేమో చూసే ఎన్‌టీ స్కాన్‌), 18-20 వారాలప్పుడు రెండోసారి స్కానింగ్‌ (బిడ్డకు శరీరం మీద నిర్మాణపరమైన లోపాలేమైనా వస్తున్నాయేమో చూసే అనామలీ స్కాన్‌), 7వ నెల చివర్లో మరో స్కానింగ్‌ (బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో చూసేందుకు చేసే గ్రోత్‌ స్కాన్‌) చేస్తారు. గర్భిణికి ఈ మూడు స్కానింగులూ ముఖ్యమైనవే.

మూడు మందులు
ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు గర్భం దాల్చిన దగ్గరి నుంచీ (వీలైతే అసలు గర్భం దాల్చక ముందు నుంచే) ఆరంభించి కాన్పు అయ్యే వరకూ కూడా తీసుకోవాలి. తొలినాళ్లలో వికారంగా ఉంటుంది కాబట్టి ఐరన్‌ మాత్రలు ఆ దశలో ఇవ్వకపోయినా మూడో నెలలో ఆరంభించి కాన్పు తర్వాత మూడు నెలల వరకూ కొనసాగించాలి. ఇక క్యాల్షియం మాత్రలు ఐదో నెల చివర్లో ఆరంభించి.. కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చినంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. ఇవి వేసుకోవాల్సిన మందులు. ఇక గర్భిణులకు మధ్యలో నొప్పుల వంటి బాధలు తలెత్తితే అత్యవసరంగా 'ప్యారాసెటమాల్‌' మాత్ర తీసుకోవచ్చు. దానితో బాధలు తగ్గకపోతే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలిగానీ సొంత వైద్యాలు కూడదు. ప్యారాసెటమాల్‌ మించి మరే మందునూ సొంతగా వేసుకోకూడదు. ముఖ్యంగా శక్తిమంతమైన నొప్పి నివారిణి మందులైన ఐబూప్రోఫెన్‌, కాంబిఫ్లామ్‌, నిముసులైడ్‌, ఓవరాన్‌ వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడిఎస్‌' రకాలను దూరంగా ఉంచాలి. గర్భిణులు నొప్పి ఏదైనా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటమే మంచిది.

వేవిళ్లు
హార్మోన్ల మార్పుల కారణంగా కొందరికి గర్భం దాలుస్తూనే వాంతులు, వికారంతో వేవిళ్లు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఒంట్లో నీరు తగ్గిపోవటం, విపరీతమైన నీరసం వంటి సమస్యల్లోకి జారిపోతుంటారు. ఈ వేవిళ్ల బాధలు సాధారంగా రెండు లేదా మూడు నెలలకల్లా సర్దుకుంటాయి. కాకపోతే పిండం ఎదుగుదలలో ఈ మొదటి 3 నెలలూ కీలకమైనవి కాబట్టి ఈ సమయంలో తల్లి తీవ్రమైన పోషకాహార లోపంలోకి వెళితే ఏమవుతుందోనన్న భయం చాలామందిని వేధిస్తుంటుంది. ఈ వేవిళ్ల బాధల నుంచి ఉపశమనానికి కొన్ని చిట్కాలు పాటించొచ్చు. పొట్ట ఖాళీగా ఉంటే వికారం పెరుగుతుంది కాబట్టి తరచూ ఏదో ఒకటి తింటుండాలి. ఉదయం పడక మీదే ఒక బ్రెడ్డు ముక్కో, బిస్కట్టో తిని, కొద్దిసేపాగి లేవటం మంచిది. ఆహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకుంటే కడుపులో ఆమ్లం ఉత్పత్తి తగ్గి, వికారం తగ్గుతుంది. వికారంగా అనిపిస్తే నిమ్మ, ఉసిరి, అల్లం వంటి పుల్లటి ముక్కలను బుగ్గన పెట్టుకోవచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సలహాతో సురక్షితమైన మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

రుగ్మతలు
మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్‌, ఆస్థమా, అలర్జీ వంటి సమస్యలున్నా నిశ్చింతగా పిల్లలను కనొచ్చు.. కాకపోతే వీరు ముందే వైద్యులతో చర్చించి, అప్పుడు గర్భం దాల్చటం మంచిది. ఎందుకంటే గర్భిణులు వీటికి వాడే కొన్ని రకాల మందులు తీసుకోకూడదు. కాబట్టి అవసరమైతే వైద్యులు మందులు మారుస్తారు. గర్భం సమయంలో వ్యాధులు ఉద్ధృతం కాకుండా ముందుగానే కచ్చితమైన నియంత్రణ చికిత్స అందిస్తారు. ముఖ్యమైన విషయం- గర్భిణులెవరూ తాము ఎప్పుడూ వాడుకునే మందులను వైద్యులను సంప్రదించకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. చాలామంది మందులు వేసుకుంటే కడుపులోని బిడ్డకు హాని జరుగుతుందని మానేస్తుంటారుగానీ నిజానికి మానేస్తేనే ఆయా వ్యాధులు ఉద్ధృతమై, వాటిని నియంత్రించటం కూడా కష్టంగా తయారవుతుంది. దీనివల్ల బిడ్డకు హాని జరిగే అవకాశాలు ఎక్కువ. పైగా థైరాయిడ్‌ వంటి సమస్యల్లో నెలలు నిండుతూ, బరువు పెరుగుతున్న కొద్దీ క్రమేపీ మందుల మోతాదు పెంచాల్సి కూడా వస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా గర్భం దాల్చినప్పుడూ, కాన్పు తర్వాతా కూడా వైద్యులను సంప్రదించటం కీలకం.

నడుము నొప్పి
గర్భిణులకు నెలలు నిండుతూ, బిడ్డ పెరుగుతున్న కొద్దీ పొత్తికడుపు కండరాలు సాగుతూ.. పొట్టపెరుగుతుండటం వల్ల వెన్ను మీద భారం పెరిగి నడుము నొప్పి సహజం. కాన్పుకు అవసరమైన కడి ఎముకలు విశ్రాంతిగా ఉండేందుకు సహకరించే రిలాక్సిన్‌ వంటి హార్మోన్లు వెన్ను లిగమెంట్ల మీదా పని చేసి నొప్పిని పెంచుతాయి. కాబట్టి భుజాలు కొద్దిగా వెనక్కిపెట్టుకుని నిటారుగా నిలబడటం, కూర్చునేటప్పుడు వెనక ఒక మెత్తటి దిండు పెట్టుకోటం, అలాగే కాళ్లు వేళ్లాడేసుకోవటం కాకుండా పాదాల కింద ఎత్తు పెట్టుకోవటం, ఎక్కువసేపు కూర్చుని లేదా నిలబడి ఉండిపోకుండా కదలుతుండటం, వెల్లికిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవటం, హీల్‌ లేని చెప్పులు వాడటం, వస్తువులు కింది నుంచి ఎత్తేటప్పుడు వంగకుండా జాగ్రత్త వహించటం, నడుముకు వేడినీటి కాపడం పెట్టుకోవటం, మసాజ్‌, యోగా వంటివి చెయ్యటం ముఖ్యం.

పరీక్షలు
తల్లీబిడ్డల శ్రేయస్సు కోసం గర్భిణులకు వైద్యులు కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. ఇవి చాలా ముఖ్యం. గర్భం రాగానే- సంపూర్ణ రక్త పరీక్ష(సీబీపీ), మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్‌ పరీక్ష, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, వీడీఆర్‌ఎల్‌ పరీక్షలు, రక్తంలో షుగర్‌, థైరాయిడ్‌ పరీక్షలు.. ఇవి ముఖ్యం. అప్పటికే గర్భిణికి రక్తహీనత, మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలుగానీ, పైకి తెలియని ఇన్ఫెక్షన్లుగానీ ఉంటే వీటిలో తెలుస్తాయి. వాటితో తల్లీబిడ్డలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా వైద్యులు వెంటనే చికిత్స అందిస్తారు. ఇక ఆ తర్వాత: 26-28 వారాలప్పుడు గర్భిణి మధుమేహం వస్తోందేమో చూసేందుకు గ్లూకోజు తాగించి చేసే రక్త పరీక్ష(జీసీటీ), 32 వారాలప్పుడు మరోసారి సంపూర్ణ రక్తపరీక్ష, 36 వారాలప్పుడు మరోసారి సుగర్‌ పరీక్ష చేయిస్తారు. ఇవి చాలా ముఖ్యం.

శృంగారం
గర్భం దాల్చిన తర్వాత శృంగారం వల్ల గర్భస్రావాలు అవుతాయేమో, ఇన్ఫెక్షన్లు వస్తాయేమో, లోపల పెరుగుతున్న బిడ్డకు హాని జరుగుతుందేమోనన్న అనుమానాలు తరచుగా వినిపిస్తుంటాయి. సహజంగా గర్భం దాల్చిన వారి విషయంలో ఇటువంటి సందేహాలు అక్కరలేదు. లోపల పిండం దృఢమైన గర్భాశయ కండరాల నడుమ, అదీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి సెక్స్‌ వల్ల సమస్యలేవీ తలెత్తవు. గర్భాశయ ముఖద్వారం కూడా చిక్కటి జిగురుతో మూసుకుపోయి ఉంటుంది కాబట్టి లోపలికి ఇన్ఫెక్షన్లేవీ చేరలేవు. నెలలు నిండే వరకూ కూడా శృంగారంలో పాల్గొనచ్చు. అయితే గర్భం దాల్చిన తర్వాత స్త్రీల వాంఛల్లో తేడాలు రావచ్చు. కాబట్టి వీటి గురించి దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవటం ఉత్తమం. తరచుగా గర్భస్రావాలు అవుతున్నవారు, యోని నుంచి రక్తస్రావం, మాయ ముందుకుండటం, నొప్పుల వంటి ఇతరత్రా సమస్యలున్నవారు మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

Courtesy with Dr.Pranithi Reddy , Hyd@Eenadu sukhibhava(30 Dec 2012)
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. My wife was pregnent now she is in 8th month.in this month also she has vamtings.every morning green color liquid vamting came.pls send me solution

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.